
కురుశ్రేష్టుడా, నా దివ్యవైభవాలకు అంతం లేదు. కొన్ని ముఖ్యమైనవి, నీ కోసం, వివరిస్తాను.
గుడాకేశుడా, ప్రతి హృదయంలోనూ ప్రతిష్ఠితుణ్ణై ఉన్న ఆత్మని నేనే. ప్రతి అస్తిత్వానికీ మొదలు నేనే, కొననేనే, మధ్య కూడా నేనే.
ఆదిత్యుల్లో విష్ణువుని, వెలుగుల్లో అంశుమంతుడైన సూర్యుణ్ణి, మరుత్తుల్లో మరీచిని, నక్షత్రసముదాయాల్లో చంద్రుణ్ణి.
వేదాల్లో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుణ్ణి, ఇంద్రియాల్లో మనసుని, ప్రాణుల్లో చైతన్యాన్ని.
రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షరాక్షసుల్లో కుబేరుణ్ణి, వసువుల్లో అగ్నిని, పర్వతాల్లో మేరువుని.
పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతిని, సేనాధీశుల్లో కార్తికేయుణ్ణి, జలాల్లో సముద్రాన్ని.
మహర్షుల్లో భృగువుని, శబ్దాల్లో ఏకాక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరాల్లో హిమాలయాన్ని.
వృక్షాల్లో అశ్వత్థాన్ని, దేవర్షుల్లో నారదుణ్ణి, స్వర్గ గాయకుల్లో చిత్రరథుణ్ణి, సిద్ధపురుషుల్లో కపిలమునిని.
అశ్వాల్లో అమృతంతో పుట్టిన ఉచ్చైః శ్రవాన్ని నేనేనని తెలుసుకో. గజేంద్రుల్లో ఐరావతాన్ని, నరుల్లో నరేంద్రుణ్ణి.
ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, ధేనువుల్లో కామధేనువిని, ప్రజననకారకుడైన కందర్పుణ్ణి, సర్పాల్లో వాసుకినీ నేనే.
త్రాచుల్లో అనంతుణ్ణి. జలచరాల్లో వరుణుణ్ణి, పితృదేవతల్లో ఆర్యముణ్ణి, సంయముల్లో యముణ్ణి.
దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి, లెక్కించేవాళ్ళల్లో కాలాన్ని, మృగాల్లో సింహాన్ని, పక్షుల్లో గరుడుణ్ణి.
పునీతమొనర్చేవాటిలో వాయువుని, శస్త్రధారుల్లో రాముణ్ణి, మత్స్యాల్లో మొసలినీ, నదుల్లో గంగనీ నేనే.
అర్జునా, సృష్టికి ఆదిమధ్యాంతాలు నేనే. విద్యల్లో ఆధ్యాత్మవిద్యనీ, వాదించేవారిలో వాదాన్నీ నేనే.
అక్షరాల్లో అకారాన్ని, సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని, అక్షయమైన కాలాన్ని, అన్నిముఖాల్లో కనిపించే సృష్టికర్తనీ నేనే.
పుట్టినవారందరినీ అంతమొందించేవాణ్ణీ,రేపు రానున్నవారిని పుట్టించేవాణ్ణీ నేనే, స్త్రీలలో కీర్తిని, శ్రీని, వాక్కుని, స్మృతిని, ధృతిని, మేధని, క్షమని కూడా నేనే.
సామగీతాల్లో బృహత్సామగీతాన్ని, ఛందస్సుల్లో గాయత్రిని, మాసాల్లో మార్గశిరాన్ని, ఋతువుల్లో వసంతాన్ని.
మోసగించేవాళ్ళల్లో జూదరిని, తేజశ్శాలుల తేజస్సుని, నేను విజయాన్ని, వ్యవసాయాన్ని, సాత్త్వికుల సత్త్వాన్నీ నేనే.
వృష్ణుల్లో వాసుదేవుణ్ణి, పాండవుల్లో ధనంజయుణ్ణి, తాపసుల్లో వ్యాసుణ్ణి, కవుల్లో శుక్రుణ్ణి.
శిక్షించేవారిలో దండాన్ని, జయాన్నికోరుకునేవాళ్ళల్లో నీతిని, రహస్యాల్లో మౌనాన్ని, జ్ఞానవంతుల జ్ఞానాన్నీ నేనే.
ప్రాణులన్నిటికీ అస్తిత్వబీజాన్ని, కదిలేవాటిలోనూ కదలనివాటిలోనూ కూడా, నేను లేకుండా, ఏ ఒక్కటీ లేదని తెలుసుకో.
నా దివ్యవిభూతులకు అంతం లేదు. ఇదంతా నీ కోసం సంగ్రహంగా వర్ణించానంతే.
ఎక్కడెక్కడ వెలుగు, ఉత్సాహం, వైభవం కనిపిస్తాయో అదంతా నా తేజస్సు లోని చిన్న తునకలోంచి పుట్టిందేనని తెలుసుకో.
అర్జునా, ఇంతకుమించి విస్తారంగా తెలుసుకునేదేముంది?నాలోని ఒక చిన్న అంశతోనే నేనీ సమస్తవిశ్వాన్నీ నిలబెడుతున్నాను.
(భగవద్గీత (10:19-42)
18-12-2018
ఈ అనువాదం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు