థిచ్ నాట్ హన్-5

ప్రేమ చాలాసార్లు మన ప్రమేయం లేకుండానే సంభవిస్తుంది. యవ్వనప్రాయం లోనే కాదు, జీవితంలో ఏ అవస్థలోనైనా ఎప్పుడయినా సంభవించగల గాఢాతిగాఢమైన సంవేదన అది. కాని ఆ భావావేశం మనలో అంకురించినప్పుడూ, అది మనల్ని విచలితుల్ని చేస్తున్నప్పుడూ మనం దాన్నెట్లా నిభాయించుకోవాలో మనకెవరూ చెప్పలేదు. ‘ప్రేమ పెన్నిధి కాని, ఇంటను నేర్పరీ కళ, ఒజ్జలెవ్వరు లేరు దీనికి, శాస్త్రము లిందు గూరిచి తాలిచె మౌనము’ అని మహాకవి ఊరికినే అనలేదు.

సాధారణంగా సుందర ప్రాకృతికస్థలాలకి విహారయాత్రలకోసం వెళ్ళేవాళ్ళని చూడండి. లేదా మనమేనా సరే, ఒక నదీతీరానికో, ఒక జలపాతం ఎదటకో వెళ్ళినప్పుడు, ఆ అపారమైన సౌందర్యదర్శనం సంభవించగానే మనకేం చెయ్యాలో తెలీక, మనం చేసే పని, ఏదో ఒకటి తినడం మొదలుపెట్టడం లేదా బిగ్గరగా ఒకళ్ళతో ఒకళ్ళం హాస్యాలాడుకోవడం. గొప్ప సౌందర్యం మనిషిలో రేకెత్తించే సంవేదనలు తుపానులాంటివి. వాటిపట్ల తెలీకుండానే మనకెంతో భయం. ఆ sublime మనలో మృత్యుభీతిలాంటిదాన్ని కలిగిస్తుంది. అందుకని సున్నితమైన సౌందర్యం ఎదట నిలబడగానే ముందు మనకి తెలీకుండానే మనలోంచి పశుప్రాయ సంవేదనలు బయటికి రావడం మొదలుపెడతాయి.

ఇద్దరు స్త్రీ పురుషులు లేదా ఇద్దరు మనుషులు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళల్లో గొప్ప శక్తిపాతం సంభవిస్తుంది. కాని దాన్నెట్లా ఎదుర్కోవాలో, ఆ శక్తిని, తమ శ్రేయానికీ, చుట్టూ ఉన్న లోక శ్రేయానికీ ఎట్లా వినియోగించుకోవాలో వాళ్ళకి తెలీదు. వినియోగించుకోవచ్చని చెప్పేవాళ్ళూ లేరు, చెప్పినా ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాళ్ళూ లేరు. కనీసం నా వరకూ నాకు నా యవ్వనకాలంలో నాకట్లా చెప్పేవారెవరూ తారసపడనే లేదు. ఇద్దరు మనుషుల మధ్య సంభవించే ప్రేమకి ఎదురు కాగల ఏకైక అవరోధం, ఆ ఇద్దరు మనుషుల్లోనూ ఆ క్షణాన రేకెత్తగల పశుప్రాయ సంవేదనలే. కాని, సాహిత్యకారులు, ప్రేమ కథలు రాసినప్పుడు ఆ ప్రేమకి అవరోధం సామాజికంగా ఎదురవుతుందని చెప్పడానికే అలవాటు పడ్డారు. ఆ కథలు విని కన్నీళ్ళు పెట్టుకోడానికి మనం కూడా అలవాటు పడిపోయాం. కాని ఏ ఒక్కరి ప్రేమా కూడా కన్నీటి కథకాదని మన రచయితలకి తెలీదు. అర్థంచేసుకోగలిగితే, ఆ భావావేశాలు మనలో అంకురింపచేయగల శక్తినెట్లా ఛానలైజ్ చేసుకోవాలో తెలుసుకోగలిగితే, ఏ ఒక్కరి ప్రేమానుభవమైనా కూడా మొత్తం సమాజానికే మేలు చేసేదిగా పరిణమిస్తుందని వాళ్ళకి కూడా ఎవరూ చెప్పినట్టు లేదు.

ప్రేమ అనే కాదు, జీవితంలో మనకి తటస్థించే ప్రతి ఒక్కటీ, చదువు, పని, కార్యాలయం, దాంపత్యం, పిల్లలు, ప్రతి ఒక్కటీ కూడా మనలో అపారమైన శక్తిని విడుదల చేసే అవకాశాలే. కాని ఆ అనుభవాలో, ఆ అనుబంధాలో తటస్థించేదాకా ఉన్న ఆతృత మనకి ఒకసారి అవి చేతికందాక ఇంకెంత మాత్రం ఉండదు. పైగా అవి మనకి నిస్సారంగా కనిపించడం కూడా మొదలవుతుంది. ఉద్యోగమే తీసుకోండి. మనం ఉద్యోగంలో చేరిన ఆ తొలినాళ్ళ ఉద్వేగం, సదాశయం మనలో ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్నాయా?

మన మనోచైతన్యంలో రెండు పొరలున్నాయంటారు బౌద్ధులు, అందులో పైకి కనిపించేదీ, మనకి స్పష్టంగా తెలిసేదీ మనోవిజ్ఞానము. దానిలోపల నిగూఢంగా ఉండేదీ, మనకి ఏమాత్రం అంతుపట్టనిదీ, ఆలయ విజ్ఞానము. అది ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు ప్రతిపాదించిన unconscious లాంటిది. బౌద్ధుల విశ్లేషణ ప్రకారం మనమే కొత్త అనుభవానికి లోనైనప్పుడైనా అది మన వ్యక్త చైతన్యాన్నే కాక, మన ఆలయవిజ్ఞానాన్ని కూడా బలంగా తాకుతుంది. అక్కడ ఎన్నో ఏళ్ళుగా గూడుకట్టుకున్న, గుణాత్మక, ఋణాత్మక భావనలన్నీ ఒక్కసారిగా కందిరీగల తుట్టని కదిపినట్టు మేల్కొంటాయి. అట్లా మేల్కొన్నప్పుడు, సాధారణంగా మనలోని ఋణాత్మకభావనలే మరింత బలంగా పనిచేసి, మన నూతనానుభవాన్ని మలినపరుస్తాయి, కలత పరుస్తాయి.

తన ప్రేమానుభవం ఉదాహరణగా తిచ్ నాట్ హన్ చెప్తున్నదేమంటే, సరిగ్గా, ఆ క్షణంలోనే మీరు మరింత మెలకువగా ఉండండని. ఆ నూతనానుభవం, ఆ ప్రేమానుభవం, దాన్ని మనం అణచిపెట్టుకోవలసిన పనిలేదు. అలాగని మనకు లభిస్తున్న సౌందర్యదర్శనాన్ని అత్యాశతోనో, భయంతోనో, ప్రలోభంతోనో చేజిక్కించుకోడానికి ఆతృత పడనవసరం కూడా లేదు. మనం చెయ్యవలసిందల్లా మరింత జాగరూకతతో, మరింత చైతన్యంతో ఆ అనుభవాన్ని స్వీకరించండమే. అది మనలో విడుదల చేస్తున్న శక్తిని దయగా, సేవగా, సృజనగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించడమే.

Cultivating the Mind of Love లో ఆయన ఈ అంశాన్నే మరింత లోతుగా, మరింత ప్రగాఢంగా వివరిస్తాడు. అవతంసక సూత్రం, వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం, సద్ధర్మ పుండరీక సూత్రాలు ఆసరాగా ఆయన మనకు చెప్పేదేమంటే, ప్రేమానుభవం సంభవించినప్పుడు, అది అశాశ్వతమవుతుందనే భయంతోనో, ప్రలోభంతోనో మీరు కలవరపడి, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కలవర పరచకండి. మీరు ఓపిగ్గా, శ్రద్ధగా ఆ ప్రేమానుభవాన్ని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి. ఆ ప్రేమ తటస్థించిన తరువాత జీవితాన్ని మరింత వికాసశీలంగా, మరింత ఉదాత్తంగా, మరింత ఉత్సాహకరంగా తీర్చిదిద్దుకోండి అనే.

శాశ్వతమైంది ఏదీ లేదు, నిజమే, కాని, impermanence is good news అంటాడాయన. మీకు సంభవించింది నిజంగా ప్రేమనే అయితే, అది ఒక్క వ్యక్తి దగ్గరా, ఒక్క స్థలం దగ్గరా, ఏదో ఒక సమయానికి మాత్రమే పరిమితంగా ఉండిపోవడం సాధ్యం కాదంటాడు.

నిజంగానే ఒక సువార్త. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. ముఖ్యంగా మీ ఇంట్లో టీనేజ్ పిల్లలున్నట్లయితే వాళ్ళతో తప్పకుండా చదివించవలసిన పుస్తకం. ఉద్యోగం సంతృప్తినివ్వడం లేదనేవారూ, స్నేహితుల వల్ల మోసపోయామనుకునేవారూ, జీవితానికి అర్థానిచ్చే ఏ ఆదర్శాలూ తమకి మిగల్లేదనుకునేవాళ్ళూ మరీ మరీ చదవ వలసిన పుస్తకం.

ఆ పుస్తకంలోంచి మరొక అధ్యాయం మీ కోసం.

వీడ్కోలు

కొత్తసంవత్సరం మొదటిరోజు సుప్రభాతవేళ. మేము కలిసి కూచుని జపం, ధ్యానం పూర్తిచేసుకునేటప్పటికి, గ్రామస్థులు కొందరు దేవాలయానికి వచ్చారు. కొత్త సంవత్సరం వేడుకకోసం పళ్ళూ, పూలూ, ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తెచ్చారు. వాళ్ళు వాటితో మందిరం అలంకరించడంలో నేను సాయపడ్డాను. ఆమె వంటగది పని చూసుకుంది. అప్పుడు మా మఠాధిపతి మఠానికి తిరిగివచ్చాడు. అప్పటిదాకా అక్కడ ఏమి జరిగిందో వాళ్లెవరూ గమనించినట్టు లేదు. మా కోసం వంట వండిపెడుతున్న యువతికి కూడా ఏమీ అర్థమయినట్టు లేదు. కొత్త సంవత్సరం రెండో రోజు నేను తిరిగి నా దేవాలయానికి వెళ్ళిపోయాను. ఇక ఆమెను మళ్ళీ చూడగలనన్న ఆశ నాలో అడుగంటి పోయింది.

నేను నా మఠానికి తిరిగి వచ్చేటప్పటికి పూర్వపు మనిషిని కాను. పూర్తిగా వేరే మనిషిని. కాని నా సోదర సాధువులు నాలో వచ్చిన మార్పుని గుర్తుపట్టలేకపోయారు. నా రోజువారీ జీవితం కూడా పైకి మామూలుగానే నడుస్తున్నది. కానీ నేను తక్కినవాళ్ళతో మాట్లాడటం తగ్గిపోయింది. ఎక్కువసేపు ఏకాంతంలోనే గడపడం మొదలుపెట్టాను. ఒక్కొక్క సారి ఆమె లేని లోటుని తట్టుకోవడం కోసం అమె పేరు నెమ్మదిగా నాకోసం నేను ఉచ్చరించుకునేవాణ్ణి. నేను చెయ్యగలిగిందల్లా నా అధ్యయనం, నా సాధన కొనసాగిస్తూ ఉండటమే.

ఒకరోజు నేను మఠానికి తిరిగివచ్చేటప్పటికి, ఆమె అక్కడ కనిపించింది. నేనంతకుముందు సేవాకార్యక్రమం కొనసాగించడంకోసం ఆమె ముందుంచిన ప్రతిపాదనని ఆమె జయప్రదంగా నెరవేర్చింది. ఆమె మరొక సన్న్యాసిని తో కలిసి, మా మఠానికి దగ్గర్లోనే ఒక శిథిలదేవాలయంలో, ఒక చిన్న అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసింది. వారిద్దరూ ఆ కేంద్రం ఆసరాగా తోటి సన్న్యాసినులు చదువుకోవడానికీ, సాధనచేసుకోవడానికీ, సాంఘికసేవా కార్యక్రమం కొనసాగించడానికీ తోడ్పాటు అందించడం మొదలుపెట్టారు. మా మఠంలో ఉంటున్న ఆరుగురు సన్న్యాసులం ఆ సంగతి తెలిసి చాలా సంతోషించాం. మాకున్న ఆశయాల్లాంటి ఆశయాలతో సోదర సన్న్యాసినులు మాకు సమీపంలోనే అటువంటి కార్యక్రమం కొనసాగించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ళు కూడా మాకు దగ్గర్లోనే ఉన్నారు కాబట్టి మేమంతా కలిసి బౌద్ధ ధర్మ గ్రంథాలు చదువుకుంటే బావుంటుందన్నాను వాళ్ళతో.

చైనీస్ భాషలో మరింత ప్రావీణ్యం సంపాదించడం కోసం ఏదైనా ఒక పుస్తకం అనువాదం మొదలుపెట్టమని ఆమె తోటి సన్న్యాసినికి చెప్పాను. బౌద్ధధర్మాన్ని అధ్యయనం చేసిన ఒక చైనా శాస్త్రవేత్త రాసిన ఒక గ్రంథాన్ని వియత్నమీస్ లోకి అనువదించమని ఆమె సహచరికి ఇచ్చాను. ఆ అనువాదాన్ని చదువుతూ ఎక్కడికక్కడ కొన్ని అధ్యాయాలు దిద్దిపెట్టేవాణ్ణి. ఆ సాధుసోదరి మూల గ్రంథంలోని చైనీస్ అని అంతగా అర్థం చేసుకోలేకపోయేది. ఇక నా మిత్రురాలు తన ఫ్రెంచి ప్రావీణ్యం మరింత మెరుగుపర్చుకోడం కోసం ఆమెని కూడా ఒక పుస్తకం అనువాదం మొదలుపెట్టమని చెప్పాను. ఒక బౌద్ధగ్రంథాన్ని ఫ్రెంచినుంచి చైనీస్ లోకి అనువదించమన్నాను. దానివల్ల ఆమెకి ఫ్రెంచి, చైనీస్ భాషల మీద పట్టు దొరకడమే కాక, బౌద్ధ ధర్మం గురించిన అవగాహన కూడా మెరుగవుతుందని చెప్పాను. కాని ఆమెకి నేను పాఠం చెప్తున్న ప్రతిసారీ మేం అవసరమైన దానికన్నా కొద్దిగా ఎక్కువసేపే కలిపి గడిపే వాళ్ళం. రెండు మూడు వారాల్లోనే నా సోదర సాధువులు మేమిద్దరం ప్రేమలో పడ్డామని గమనించారు. (అలా గమనించకుండా ఉండటం కూడా కష్టం.) కాని వాళ్ళు నన్ను విమర్శించకుండా నా ప్రేమావస్థను అంగీకరించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు వారట్లా నా ప్రేమను మౌనంగా అంగీకరించినందుకు వారిపట్ల నేనిప్పటికీ కృతజ్ణుణ్ణయి ఉన్నాను.

కాని ఆమె తోటి సాధుసోదరి మాత్రం మా ప్రేమని అంగీకరించలేకపోయింది. ఒకరోజు నా మిత్రురాలి నేత్రాల్లో ఒక అశ్రుబిందువు కనిపించగానే నాకు సంగతి అర్థమైపోయింది. మా సమస్యను పరిష్కరించుకోక తప్పదనీ, ఆ బాధ్యత నాదేనని నాకు అర్థమయింది.

ఆ మర్నాడు, పాఠం పూర్తవగానే, నేను ‘నా చిన్నారి సోదరీ, ఇక మీరు హనోయి లో బౌద్ధ విద్యాలయానికి వెళ్ళి అక్కడ అధ్యయనం కొనసాగించవలసిన సమయం ఆసన్నమైంది. మనమందరం మన అధ్యయనం, సాధన, సత్యాన్వేషణ కొనసాగిద్దాం. ఏదో ఒకరోజు మన అన్వేషణ ఫలించి తీరుతుంది’ అని చెప్పాను. హనోయి లోని ఆ బౌద్ధవిద్యాలయాన్ని విశాల దృక్పథం కలిగిన ఒక సాధుసోదరి నిర్వహిస్తూ ఉంది. ఈమె ఆ విద్యాలయంలో చేరినట్లయితే, ఆ కేంద్రం ద్వారా తోటి సన్న్యాసినుల్ని కూడా ప్రబోధపరిచి మేము సంభావిస్తున్న సంస్కరణల్నీ, సేవాకార్యక్రమాల్ని కొనసాగిస్తుందని నా ఆశ. కాని నేను తీసుకున్న ఆ నిర్ణయం మాకిద్దరికీ భరించరానిదని నాకు తెలుసు. ఎందుకంటే, ఆ కేంద్రం దేశానికి ఆ మూల ఉంటే, మేమీ మూల ఉంటాం. కాని మరోదారి లేదు.

ఆమె వినయంగా శిరసు వంచి అభివాదం చేసి ‘తప్పకుండా’ అని ఒకే ఒక్క మాట పలకగలిగింది. ఆమె నా పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్నీ, నమ్మకాన్నీ పెట్టుకున్న తరువాత నేనామెగురించి బాధ్యత పడకుండా ఎలా ఉండగలను?

కానీ ఒక్కసారిగా అపారమైన దిగులు కమ్మేసింది నన్ను. నాలోపల ఒక మమకారం అంకురించిందని నాకు తెలుస్తూనే ఉంది. కాని మరోవైపు వివేకం కూడా బలంగానే పనిచేస్తూ ఉన్నది. మేము మేముగా కొనసాగాలంటే, మా సాధనలో, సాక్షాత్కారంలో సఫలీకృతులం కావాలంటే, అదొక్కటే మార్గం. మరోదారి లేదు.

మేము విడిపోయిన ఆ క్షణం నాకెప్పటికీ గుర్తే. మేము ఒకరికొకరం ఎదురెదురుగా కూచున్నాం. ఆమె కూడా చెప్పలేనంత నిస్పృహలో కూరుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె లేచి నిల్చుని నా దగ్గరగా వచ్చి, నా శిరసును తన హస్తాల్లోకి తీసుకుని, అత్యంత స్వాభావికంగా, నన్ను తన దగ్గరికీ లాక్కుంది. నేనట్లా ఆమె కౌగిలిలో ఇమిడిపోయాను. మా మధ్య శారీరిక స్పర్శ ఏదైనా ఉందంటే, అదే మొదటిసారీ, అదే చివరి సారీ. ఆ మరుక్షణం మేమిరువురం ఒకరికొకరం అభివాదం చేసుకుని విడిపోయాం…

…ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకుంటే, మీలోకి మీరులోతుగా చూసుకోండి. ఆ తర్వాత జరిగిందేదో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మందహాసంతోనో, గాఢంగా ఉచ్ఛ్వాసనిశ్వాసాలు తీస్తున్నప్పుడో, మీకు నేను చెప్తున్న మాటలు అర్థమవుతాయి. అలాకాకుండా, ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ప్రాణి, ఒక జీవితకాలం అనే సంకుచిత భావనల్లో మీరు కూరుకుపోయి ఉంటే మీకు నా ప్రేమానుభవం ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమంటే నా దృష్టిలో ఒక గౌరవం, ఒక విశ్వాసం, ఒక అనుష్ఠానం. మా ప్రేమకి మద్దతు పలకాలంటే మీరు చెయ్యవలసిందల్లా మీరు మీరుగా ఉండటం, మరింత ఎదగడం, మిమ్మల్ని మీరు మరింత గౌరవించుకోవడం. మీకై మీరు పొందగల అపారమైన ఆత్మసంతృప్తి వల్ల మాత్రమే మీరు ఆమెకీ, నాకూ కూడా తోడుగా నిలబడగలుగుతారు. నా వరకూ ఆమె ఇక్కడే మన మధ్యే ఉన్నది.

మీ జీవితంలోకి మీరు తొంగిచూసుకోండి. మీ జీవనప్రవాహంలో మిమ్మల్ని పెంచిపోషిస్తూ ఎన్ని పాయలు మీలోకి ప్రవహిస్తున్నాయో పరికించండి. ప్రజ్ఞాపారమిత సూత్రాన్ని అధ్యయనం చేసి మీరు ఆత్మకన్నా ఆవల ఉన్న ఆత్మనీ, వ్యక్తి కన్నా ఆవల ఉన్న వ్యక్తినీ, జీవరాశికన్నా ఆవల ఉన్న జీవరాశినీ, ఒక జీవితప్రమాణంకన్నా మించిన జీవితప్రమాణాన్నీ చూడగలిగితే, మీకు మీరే నేనని అర్థమవుతుంది. ఆమె కూడా మీరేనని మీకు బోధపడుతుంది. మీ మొదటి ప్రేమానుభవాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి, మీ మొదటి ప్రేమ నిజంగా ఏదో ఒక క్షణాన మొదలయ్యింది కాదనీ, దానికి ముగింపు లేదనీ కూడా మీకు బోధపడుతుంది. ఉన్నదల్లా రూపపరివర్తన మాత్రమే.

15-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s