
ఒక యోగి ప్రేమలో పడితే ఏమవుతుంది? ఆ ప్రేమానుభవాన్ని అతడెట్లా అర్థం చేసుకుంటాడు? దాన్నేవిధంగా నిభాయించుకుంటాడు? ఆ అనుభవం అతని వ్యక్తి అనుభవంగా మిగిలిపోతుందా లేకపోతే తక్కిన సమాజానికి కూడా దాన్నుంచి ఏదైనా నేర్చుకోదగ్గ విషయం లభిస్తుందా?
మామూలుగా యోగులకీ సాధువులకీ అటువంటి అనుభవాలు సంభవిస్తాయో లేదో మనకు తెలీదు. సంభవించినా కూడా వారు వాటిని బయటపెట్టకపోవచ్చు. ఆ అనుభవాన్ని తమకై తామే ఎట్లానో ఎదుర్కుని దాన్ని తమ అత్యంత వ్యక్తిగత విషయంగా భావించి తమలోనే పదిలపరుచుకుని ఉండిపోవచ్చు. కాని, థిచ్ నాట్ హన్ అందుకు భిన్నంగా, తాను సన్న్యాస దీక్ష స్వీకరించిన తరువాత ప్రేమలో పడటమే కాదు, ఆ ప్రేమానుభవాన్ని తానెట్లా గుర్తుపట్టిందీ, దాన్నెట్లా నిభాయించుకోగలిగిందీ తన శిష్యులతో, తక్కిన ప్రపంచంతో సంతోషంగా పంచుకున్నాడు కూడా.
తన అరవై ఆరవ ఏట, ఫ్రాన్సులో తమ ప్లమ్ విలేజి కేంద్రంలో నిర్వహించిన ఒక శిక్షణా శిబిరంలో ఆయన అప్పటికి నలభై ఏళ్ళ కిందట తన తలుపు తట్టిన ప్రేమానుభవాన్ని తన శిష్యుల ముందు విప్పి పరవడమే కాక, అది తననెట్లా ఒక మనిషిగా మార్చిందో, ఆ అనుభవం నుంచి తాను ఆధ్యాత్మికంగా ఎంత బలపడ్డాడో కూడా సవివరంగా ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని Cultivating the Mind of Love(1996) పేరిట వెలువరించాడు కూడా.
ఆ ప్రసంగాన్ని ‘ఒక యోగి ప్రేమ కథ’ అనవచ్చు. ఇంత స్ఫూర్తిదాయకమైన పుస్తకం గత పదేళ్ళలో నేను మరొకటి చదవలేదని చెప్పగలను. నా జీవితంలో నేనింతదాకా చదివిన మహిమాన్వితమైన పుస్తకాల్లో మొదటి ఇరవై పుస్తకాల్లో ఇది కూడా ఒకటని చెప్పగలను. అన్నిటికన్నా ముఖ్యంగా, ఇటువంటి పుస్తకం నా ఇరవయ్యవ ఏట నా చేతుల్లోకి వచ్చి ఉంటే నా జీవితాన్ని మరింత ప్రయోజనకరంగానూ, మరింత సార్థకంగానూ, మరింత సంతోషప్రదంగానూ, మరింత శాంతిమయంగానూ జీవించి ఉండేవాణ్ణని చెప్పగలను.
తన ప్రేమానుభవాన్ని మనతో పంచుకోవడం ఆ యోగీశ్వరుడి ఔదార్యం. ఇంకా చెప్పాలంటే కృపామయ ఉపాదానం. అది ఒక వ్యక్తి ప్రేమ కథ కాదు. ఒక యోగి తన అసంగశస్త్రంతో తనలోని మారుణ్ణి సంహరించి తనలోని బుద్ధుణ్ణి బతికించుకున్న కథ. ఒక్కమాటలో చెప్పాలంటే మరొక బోధిసత్త్వ జాతకకథ.
వంద పేజీల ఈ చిన్న పుస్తకం నా ఆత్మ మీద ప్రసరించిన వెలుతురు అసామాన్యం. ఒక గీతాంజలి, ఒక ప్రొఫెట్, ఒక ఎరిక్ ఫ్రామ్, ఒక కబీరు లాగా ఈ పుస్తకం కూడా ఒక నిర్మల గంగా ప్రవాహం లాగా నాలోపల మాలిన్యాల్ని ప్రక్షాళన చేస్తూన్నదని నాకు అర్థమవుతూ ఉన్నది.
తన తొలియవ్వనప్రాయంలో ప్రేమ తన తలుపు తట్టేటప్పటికే థిచ్ నాట్ హన్ సన్న్యాస దీక్ష స్వీకరించాడు. తన వంటి మరొక సన్న్యాసినిని చూసినప్పుడు ఆయన్ని ప్రేమ ఒక తుపానులాగా చుట్టుముట్టింది. ఆ సమయంలో ఆయన ఎదట రెండు మార్గాలున్నాయి. ఒకటి, దీక్ష వదిలి గృహస్థు కావడం, లేదా, ఆ ప్రేమని అణచుకుని, మరింత కఠోర దీక్ష కొనసాగించడం. ఆ రెండు మార్గాలూ మనం ఊహించగలిగినవే. కాని, ఆయన తన ప్రేమను వదులుకోలేదు, తన దీక్షనూ వదులుకోలేదు. అందుకు బదులుగా, ఆ ప్రేమ వెలుగులో తాను నమ్మిన బౌద్ధ దర్శనాన్ని మరింత గాఢంగా అధ్యయనం చేసాడు. మరింత నిజాయితీతో అనుష్ఠించాడు. ఒక మనిషి పట్ల తనలో అంకురించిన ప్రేమని మొత్తం ప్రపంచానికే విస్తరింపచేసుకోగలిగాడు.
జీవితంలో చూడవలసిన యుద్ధాలు, లోపలా, బయటా కూడా చూసిన తరువాత, పూర్తిగా వికసించిన వ్యక్తిత్వంతో, తన అరవై ఏళ్ళ వయసులో ఆయన తన ప్రేమానుభవం ఆధారంగా మహాయాన బౌద్ధాన్ని తన శిష్యులకు వివరించిన తీరు నన్ను నివ్వెరపరిచింది. ఆ పుస్తకం పూర్తిచెయ్యగానే నేనున్నచోటినుంచే ఆ గురువుకొక సాష్టాంగ నమస్కారం చెయ్యకుండా ఉండలేకపోయాను.
బుద్ధుడి అనంతరం ఆయన బోధల్ని అనుసరించడంలో మూడు మార్గాలు ముందుకొచ్చాయి. వాటిని శ్రావకయానం, ప్రత్యేక బుద్ధ యానం, బోధిసత్త్వ యానం అని అంటారు. మన పాఠ్యపుస్తకాల్లో వాటిని హీనయానం, మహాయానం అని మనకు పరిచయం చేసారు. కాని హీనయానం అనేది నిజానికి శ్రావకయానం. దాన్నే స్థవిరవాదం, థేరవాదం అని కూడా అంటారు. బుద్ధుడి బోధల్ని యథాతథంగా నమ్మి అనుష్ఠించడం ద్వారా తమ విముక్తి కోరుకున్న బౌద్ధసన్యాసుల మార్గం అది. ఆ మార్గాన్ని అనుసరించగలినవారు చాలా కొద్దిమంది మాత్రమే అనే ఆ నమ్మకం మీద తిరుగుబాటుగా మహాయానం ముందుకొచ్చింది.
సాధారణప్రజలకి కూడా బుద్ధుడి దారిని అనుసరించగలిగే సామర్థ్యం ఉందనీ, తగిన సాధన చేస్తే వారు కూడా బుద్ధులు కాగలరనీ మహాయానం భావించింది. బుద్ధుడు తన విముక్తి తాను చూసుకోలేదనీ, లోకంలోని చివరి ప్రాణి కూడా దుఃఖం నుంచి విముక్తి చెందేదాకా, తన విముక్తిని వాయిదా వేసుకున్న పరమకారుణ్యమూర్తి అనీ చెప్తూ, బోధిసత్త్వ భావనను మహాయానం ముందుకు తీసుకొచ్చింది. అటువంటి కృపామూర్తి అయిన బుద్ధుణ్ణి మహాయానులు అవలోకితేశ్వర బోధిసత్త్వుడని పిలిచారు.
థేరవాదుల వ్యక్తిగత విముక్తి మీద తిరుగుబాటుగా మొదటి మహాయానులు కొన్ని సూత్రాలు రచించారు. వాటిని పారమిత సూత్రాలు అంటారు. పారమితలు ఈ దుఃఖం నుంచి మనల్ని దాటించే విద్యలు. వాటిలో ఉత్కృష్టమైన సూత్రం ‘వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత’. ఆ తర్వాత మరికొన్నేళ్ళకు, తొలితరం మహాయానుల ఆందోళన సద్దుమణిగాక, థేరవాద, మహాయాన లక్ష్యాల్ని సమన్వయపరుస్తూ మరొక సూత్రం వెలువడింది. ‘సద్ధర్మ పుండరీక సూత్రం ‘గా ప్రసిద్ధి చెందిన ఆ సూత్రం మహాయాన బౌద్ధ వాజ్ఞ్మయానికంతటికీ తలమానికం లాంటిది. వ్యక్తి అనీ, సంఘం అనీ రెండు వేరువేరుగా ఉండవనీ, వ్యక్తిలో సంఘం, సంఘంలో వ్యక్తీ కలిసే ఉన్నారనీ, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వభావన నుంచి విడుదల కాగలితే అది మొత్తం సంఘానికే విముక్తి కాగలదనీ, ఒక సంఘం విముక్తి చెందగలిగితే, అందులో ఉన్న వ్యక్తులంతా కూడా విముక్తి చెందగలరనీ ఆ సూత్రం వివరిస్తుంది.
థిచ్ నాట్ హన్ తన ప్రేమానుభవం ఒక ఉదాహరణగా ఆ మహాయాన సూత్రాల్ని ఈ పుస్తకంలో వివరించిన తీరు నిజంగా అద్భుతం. ఎప్పుడో ఎమ్మే కోసం మహాయాన సూత్రాలు ఏదో అరకొరగా చదివి, ఆ పరీక్షల్లో ఏదో రాసానుగాని, ఆ సూత్రాలు ఏం చెప్తున్నాయో నిజంగా నాకు బోధపడింది ఇప్పుడే.
అన్నిటికన్నా ముఖ్యం, ఈ ప్రసంగం చేసింది ఒక యోగి మాత్రమే కాదు, ఒక కవి కూడా. హృదయమూ, వివేకమూ సమంగా వికసించిన ఒక మానవుడు తన జీవితానుభవాన్ని వివరిస్తుంటే వినడం నిజంగా ఒక అనుభవం. ఆ కథనం ఎలా ఉందో రూచి చూపడానికి ఇదిగో, ఒక అధ్యాయం తెలుగులో, మీ కోసం:
వసంత సౌందర్యం
నేనామెని చూసినప్పుడు అదే మేము మొదటిసారి కలుసుకున్నట్టు అని చెప్పలేను. లేకపోతే మేం ఒకరికొకరం అంత సునాయాసంగా ఎట్లా తారసపడిఉండేవాళ్ళం? నేను ఒక పత్రిక ముఖచిత్రంమీద బుద్ధుడి బొమ్మ చూసి ఉండకపోతే ఆ రోజు మేం కలుసుకుని ఉండేవాళ్ళం కానే కాము. ఆమె సన్న్యాసిని కాకపోయుంటే నేనామెని కలుసుకోగలిగి ఉండేవాణ్ణి కాను, ఆమెని ప్రేమించి ఉండేవాణ్ణి కాను. గొప్ప శాంతి, తక్కినవాళ్ళల్లో కనిపించనిది, కనిపించింది ఆమెలో. ఎంతో నిజాయితీగా సాధనచేసిన ఫలితమది.. నేనంతదాకా దేన్ని అభిలషిస్తూ ఉన్నానో దాన్ని నేనామెని చూసిన మొదటిక్షణమే గుర్తుపట్టగలిగాను.
ఆమె కుటుంబం కూడా దగ్గర్లోనే నివసిస్తున్నారు కాని, ఆమె, ఒక సన్న్యాసిని కాబట్టి, మఠంలోనే ఉండాలనుకుంది. నేను బౌద్ధ ధర్మం గురించి బోధిస్తున్నానని విని నన్ను చూడాలనుకుంది. కాని నేనామె గురించి విని ఉండలేదు. ఆమెని ఆరోజు మెట్ల మీద చూసినప్పుడు నేనామెకి తలవంచి నమస్కరించి ఆమె పేరు అడిగాను. ఆ తర్వాత మరింత పరిచయం చేసుకోవడం కోసం మందిరంలో అడుగుపెట్టాం. ప్రతి బౌద్ధదేవాలయంలోనూ మఠాధిపతికోసం ప్రత్యేకంగా ఒక ఆసనం ఉంటుంది. మా మఠాధిపతి కొన్నాళ్ళు మఠం నుంచి ఎక్కడికో దూరప్రాంతం వెళ్తూ, నాకు ఆయన బాధ్యతలు అప్పగించాడు కాబట్టి, నేను ఆ ఆసనం మీద కూచోవలసి ఉండింది. నేనామెను నా ఎదట కూచోమన్నానుగాని,ఆమె ఒక పక్కగా కూచున్నది. మఠంలో సాధువులు సాధారణంగా మఠాధిపతికి ఎదట కూచోరు. నాకు ఆమె ఆకృతి మటుకే తెలుస్తున్నది. ఒకరినొకరం చూసుకోవాలంటే మేమిద్దరం తల తిప్పి చూసుకోవలసి ఉంటుంది.
ఒక సన్న్యాసినిగా ఆమె ప్రవర్తన సువిధేయంగా ఉంది-ఆమె కదిలే తీరు, చూపులు, ఆమె మాట్లాడే పద్ధతి, ప్రతి ఒక్కటీ. ఆమె మౌనంగానే కూచుంది. ఆమెని అడిగితే తప్ప ఏదీ తనంతతానుగా మాట్లాడేది కాదు. కళ్ళు కిందకు వాల్చి కూచున్నది. నేను కూడా బిడియంగానే ఉన్నాను. నేను కూడా కళ్ళెత్తి ఆమె వైపు ఒకటిరెండు క్షణాల కన్నా ఎక్కువసేపు చూసే సాహసం చెయ్యలేకపోయాను. మరుక్షణంలోనే నా చూపులు నేలకు దింపేసాను. కొన్ని క్షణాల తర్వాత, నేను ఆమెనుంచి సెలవుతీసుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఏం జరిగిందో తెలీదుగానీ, నాలో అలజడి మొదలయ్యింది. నేనొక కవిత రాద్దామని కూచున్నానుగాని, ఒక్క వాక్యం కూడా రాయలేకపోయాను! మరేమీ చెయ్యలేక, నా మనసు శాంతిస్తుందేమో చూద్దామని తక్కిన కవుల కవిత్వం చేతుల్లోకి తీసుకున్నాను.
ప్రసిద్ధ వియత్నమీస్ కవి గుయెన్ బిన్హ్ రాసిన కవితలు చదవడం మొదలుపెట్టాను. చాలా కవితలే చదువుకున్నాను. ఆ కవితల్లో ఆయన తన తల్లికోసం, సోదరి కోసం బెంగపెట్టుకున్నాడు. నాక్కూడా అట్లాంటిదే ఏదో బెంగ తోచింది. నువ్వు చిన్నప్పుడే సన్న్యాస దీక్ష స్వీకరించినప్పుడు నీ కుటుంబానికి దూరంకాక తప్పదు. వియత్నాంలో ఇట్లాంటి కవిత్వం చదివేముందు, దీపం వెలిగించి, ధూపం అర్పించి, అప్పుడు పఠనం మొదలుపెట్టడం ఆచారం. ముఖ్యంగా ఈ ప్రాచీన చీనాభాషలోని ఈ కవిత చదివినప్పుడు నా కళ్ళల్లో అశ్రువులు కదలాడటం నాకు బాగా గుర్తుంది:
ఇక్కడ రాత్రయింది
వసంతం రాబోతున్నదని
గాలీ, వానా గుర్తుచేస్తున్నాయి
ఇంకా నేను నిద్రపోతూనే ఉన్నాను,
నా కల ఇంకా నిజం కాలేదు.
పూలరేకలు రాలిపడుతున్నాయి
నా కలలూ, కోరికలూ వాటికి తెలిసినట్టే ఉంది.
వసంతం వాలిన భూమిని అవి
నిశ్శబ్దంగా ముద్దాడుతున్నాయి.
ఆ అపరాహ్ణం,ఆ సాయంత్రం కూడా నేనట్లా కవిత్వం చదువుకుంటోనే ఉన్నాను. నా కుటుంబాన్ని తలుచుకుంటో ఆ కవిత్వం మరింత బిగ్గరగా పఠిస్తోన్నాను. నాకే అర్థం కాకుండా నా మనసులో కదలాడుతున్న భావావేశాలనుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సాయంకాలం ఆరింటికి, నా శిష్యుడొకతను తలుపు తట్టి సాయంకాల భోజనానికి వేళయ్యిందని గుర్తుచేసాడు.
మా మఠాధిపతి తాను వెళ్ళబోయే ముందు ఆమెని రోజూ మా మఠానికి వచ్చి మాకోసం అన్నం వండిపెట్టమని చెప్పాడు.
ఆ యువసన్న్యాసినీ నేనూ మౌనంగానే భోజనం ముగించాం. అప్పుడు కలిసి తేనీరు తాగుతూ నెమ్మదిగా మాట్లాడుకున్నాం. ఆమె తానెట్లా సన్న్యాసదీక్ష స్వీకరించిందీ, ‘హుయే’ బౌద్ధవిద్యాలయంలో చేరకముందు ఎక్కడ చదువుకున్నదీ, ఏమి చదువుకున్నదీ చెప్పుకొచ్చింది.ఆమె తన చూపులు నేలకు వాల్చి, నేనేదైనా ప్రశ్న అడిగినప్పుడే, కళ్ళు పైకెత్తుతూ ఉన్నది. ఆమె నిజంగానే అవలోకితేశ్వర బుద్ధమూర్తిలాగా ఉండింది-అందంగా, ప్రశాంతంగా, దయార్ద్రభరితంగా. నేను పదే పదే ఆమెనే చూస్తూ ఉన్నాను, కాని ఒకటిరెండు క్షణాల పాటు మాత్రమే. నేనామెని చూస్తున్నట్టు ఆమె గమనిస్తే బాగుండదని నాకు తెలుసు. పది పదిహేను నిమిషాల తర్వాత నేనామెనుంచి సెలవు తీసుకుని బుద్ధమందిరంలో ప్రవేశించి, నా జపతపాలు మొదలుపెట్టాను.
మర్నాడు పొద్దున్నే నేను మళ్ళా ఆ మందిరంలో కూచుని జపం, ధ్యానం మొదలుపెట్టిన కొంతసేపటికి,నా వెనక ఆమె కంఠస్వరం వినిపించింది. మా జపం పూర్తయ్యాక, పొద్దుటి అల్పాహారానికి ముందు మరికొంతసేపు కూచుని మాటాడుకున్నాం. ఆ తర్వాత ఆమె తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళింది. మందిరంలో నేనొక్కణ్ణే మిగిలిపోయాను. ఆ మధ్యాహ్నం నేను గ్రామంలోకి వెళ్ళి అక్కడి యువతతో ఏదో పనిలో గడిపాను. తిరిగిమళ్ళా వెనక్కి వచ్చాక, మెట్లు ఎక్కుతుంటే, ఆ మందిరం ఎదట ఆమె మళ్ళా కనబడింది. దూరంగా కొండలమీద ఉన్న తేయాకుతోటల్ని చూస్తూ ఉంది. మేం రాత్రి భోజనం కలిసే చేసాం. ఆ తర్వాత నేనామెకి నా కవిత్వం కొంత వినిపించాను. ఆ తర్వాత నా గదిలోకి వెళ్ళి నేనొక్కణ్ణే కవిత్వం చదువుకుంటో ఉండిపోయాను. ఆ ముందురోజుతో పోలిస్తే,ఆ రోజు కూడా నా దినచర్యలో మార్పేమీ లేదుగానీ, నా లోపల మాత్రం ఏదో జరిగిందని నాకు అర్థమయింది. నేనామెతో ప్రేమలో పడ్డానని గ్రహించాను. ఆమెతోటే గడపాలనీ-ఆమె దగ్గరే కూచోవాలనీ, ఆమె గురించే తలచుకుంటూ ఉండాలనీ అనిపించడం మొదలయ్యింది.
ఆ రాత్రి నాకంతగా నిద్రపట్టలేదు. ఆ మర్నాడు ధ్యానం తర్వాత, వంటగదిలోకి వెళ్ళి చలి కాచుకోడానికి పొయ్యి వెలిగిద్దామన్నాను ఆమెతో. ఆమె కూడా నా వెనకే నడిచింది. మేం కలిసి టీ తాగేం. నేనామెని ప్రేమిస్తున్నానని ఎట్లానో చెప్పడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఏదేదో మాట్లాడేనుగానీ, ఆ ఒక్క మాటా చెప్పలేకపోయాను. మరేవేవో సంగతులు మాట్లాడుతూ ఉన్నాను, నేను చెప్పాలనుకున్నది ఆమె గ్రహిస్తుందనుకున్నాను. ఆమె చాలా శ్రద్ధగా, ప్రసన్నంగా నా మాటలు వింది. అంతా విన్నాక ‘మీరేం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు’ అంది మృదువుగా.
కాని ఆ మర్నాడు ఆమె తనకి అంతా అర్థమయిందని చెప్పింది. ఆ క్షణాన్ని నిభాయించడం నాకు కష్టంగా ఉండింది. ఆమెకి మరింత కష్టంగా ఉందని కూడా తెలుస్తోంది. నా ప్రేమ ఒక తుపానులాగా ఉంది. ఆ ఈదురుగాలీ, ఆ గాలివానా ఆమెను బలంగా నెట్టివేస్తున్నాయి. ఆమె తన శక్తినంతటినీ కూడదీసుకుని మరీ ప్రతిఘటించబోతున్నదికాని, ఆమెకి చాతకావడం లేదు. చివరికి ఆమె ఆ తుపాను తన కన్నా బలమైందని గుర్తించింది. ఆ క్షణాన మాకిద్దరికీ ఒక దయాపూరితమైన ఆలంబన అవసరమనిపించింది. మేమిద్దరం చిన్నవాళ్ళం, ఆ జడిలో పడి కొట్టుకుపోతున్నాం. కాని మా ఇద్దరిలోనూ కూడా సన్న్యాసజీవితం గురించిన ఆకాంక్ష మహాప్రబలంగా ఉంది. మేమెంతోకాలంగా కంటున్న కల అది-కాని మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమలో చిక్కుకుపోయాం.
ఆ రాత్రి నేనొక కవిత రాసాను:
వసంతం నెమ్మదిగా, నిశ్శబ్దంగా
అడుగుపెడుతున్నది
నెమ్మదిగా, నిశ్శబ్దంగా శిశిరం
వీడిపోడానికి తావిస్తూ.
ఈ మధ్యాహ్నం కొండమీద
బెంగ రంగు అలముకుంది.
భయానక యుద్ధ పుష్పం
తన అడుగుజాడలు వదిలిపెట్టింది
ఎటుచూసినా ఎడబాటు, చావు
పూలరేకల్లాగా పడి ఉన్నవి
తెల్లగా, ఊదాగా.
నా గుండెలోతుల్లోంచీ
గాయం తెరుచుకుంటున్నది
మెత్తగా.
దాని రంగు రక్తం రంగు.
దాని స్వభావం వియోగస్వభావం
వసంత సౌందర్యం నా దారిని అడ్డగిస్తున్నది.
కొండ ఎక్కడానికి మరోదారి
ఎక్కడ వెతుక్కోను?
అది నా వేదన. నా ఆత్మ గడ్డకట్టింది.
ఒక తుపాను రాత్రి వెలువడ్డ
వేణుస్వరంలాగా నా గుండె కొట్టుకుంటోంది
అవును, అదక్కడే ఉంది, వసంతం నిజంగానే అడుగుపెట్టింది.
విషాదసంగీతం కూడా వినిపిస్తోంది
పక్షుల అపురూపమైన కిలకిలల్లో,
స్పష్టంగా, సందేహం లేకుండా.
ప్రత్యూషహిమం అప్పుడే ఆవరించింది
వసంత సమీరం తన పాటలో
నా ప్రేమనీ, నిరాశనీ కూడా పలికిస్తున్నది.
సమస్తవిశ్వం ఉదాసీనత వహించింది, ఎందుకని?
రేవులో ఒంటరిగా అడుగుపెట్టాను,
మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోక తప్పదు.
నా స్వదేశానికి చేరుకోడానికి ఎన్నో దారులు
అవన్ని నాతో మౌనంగా మాటాడుతున్నాయి
నేను పరమసత్యాన్ని ఆశ్రయించాను.
పదిదిక్కుల్లోనూ ప్రతి ఒక్క మూలనా
వసంతం అడుగుపెట్టేసింది
కాని, అయ్యో, అది పాడే పాట మాత్రం
ఎడబాటు పాట.
నా అలజడినుంచి బయటపడటం కోసం నేనీ కవిత రాసుకున్నాను. మేమిద్దరం ఒక సన్న్యాసి, సన్న్యాసినిగా జీవిస్తూ కూడా మా ప్రేమనెట్లా పదిలంగా కాపాడుకోగలం?
సన్న్యాసులు సాధారణంగా ఇటువంటి అనుభవాలు నలుగురితో పంచుకోరు. కాని ఇటువంటి నలుగురికీ తెలియడం అవసరమనుకుంటాను. లేకపోతే ఇటువంటి అనుభవాలు తటస్థించినప్పుడు పిల్లలు వాటినెట్లా నిభాయించుకోగలుగుతారు? ఒక సన్న్యాసిగా నువ్వు ప్రేమలో పడకూడదు, నిజమే, కాని, కొన్నిసార్లు ప్రేమ నీ సన్న్యాసదీక్షకన్నా బలంగా సంభవిస్తుంది. అందుకే ఈ కథ అటువంటి ప్రేమతో బాటు, ధ్యానసూత్రాలు, స్పృహ, సంఘం, బోధిచిత్తం, సమూల పరివర్తనలకు సంబంధించిన కథ కూడా.
14-12-2018