థిచ్ నాట్ హన్-3

థిచ్ నాట్ హన్ ప్రధానంగా కవి. ఆ తర్వాతే యోగి. టాగోర్ తన చిన్నతనంలో లోనైన ఆధ్యాత్మిక అనుభవం ఆయన్ను కవిని చేసిందని మనకి తెలుసు. కాని, థిచ్ నాట్ హన్ కవిత్వానుభవం ఆయన్ను యోగిని చేసింది. ఆయనది ప్రధానంగా కవిదృష్టి. ఒక తెల్లకాగితం మీద అతడొక కారుమబ్బుని చూడగలడు. ఏ అడవిమీదనో కారుమబ్బు కురిసిపోతే పుట్టిపెరిగిన చెట్లే ఇప్పుడు తనముందు కాగితాలుగా ప్రత్యక్షమయ్యాయని అతడికి తెలుసు. తన చేతుల్లో ఉన్న నారింజపండు ఆయనకి వట్టి పండుకాదు, ఘనీభవించిన సూర్యరశ్మి. బుద్ధుడు బోధించిన ‘ప్రతీత్యసముత్పాద’ దర్శనాన్ని ఆయన అనుక్షణం ఈ విధంగా తన జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటూనే ఉన్నాడు.

ఆ మాటకొస్తే బుద్ధుడు కూడా ముందు కవి. ఆయన సంభాషణల్లో ఎన్నెన్ని ఉపమానాలు! తాను చూసిన సత్యాల్ని మనుషులకు చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా ముందు ఆయనకి ఒక ఉపమానం, ఒక రూపకం స్ఫురించి, ఆ తర్వాతనే ఆ సత్యం ఒక వాక్యంగా బయటికొస్తుంది. ఈ ప్రపంచంలో జననమరణాలంటూ లేవనీ, ఉన్నదల్లా పంచస్కంధాలు మాత్రమేననీ, అవే నిరంతరం రూపురేఖలు మార్చుకుంటూ ఉంటాయనీ బుద్ధుడు పదేపదే చెప్తూ వచ్చాడు. ఇప్పుడు నీ కళ్ళ ముందు విరిసిన పద్మం రెండువారాల కిందట వట్టి పంకం, మళ్ళా రెండువారాల్లో పంకంగా మారబోతున్నది. పద్మమూ, పంకమూ పంచస్కంధాల కలయికలోని రెండు అవస్థలు మాత్రమే. రెండు పేర్లు మాత్రమే.

తర్వాతి రోజుల్లో మాధ్యమిక బౌద్ధులు వీటిని సూచించడానికి ‘సంవృతి’, ‘పరమార్థం’ అనే రెండు పదాలు వాడారు. అద్వైతులు ఆ పదాల్నే వ్యావహారిక సత్యమనీ, పారమార్థిక సత్యమనీ పిలిచారు. థిచ్ నాట్ హన్ ఆ రెండింటినీ, historical dimension అనీ, ultimate dimension అనీ వ్యవహరిస్తాడు.

సముద్రం మీద ఒక కెరటం ఎగిసి పడిందనుకోండి. ఆ కెరటాన్ని ఆయన సముద్రం తాలూకు చారిత్రిక పరిమాణంగా అభివర్ణిస్తాడు. ఆ కెరటానికి ఒక ఆకృతి ఉన్నమాట నిజమేగాని, అంతిమంగా అది సముద్రజలమే. కెరటం పైకి లేవడానికి ముందూ, లేచిన తర్వాతా, పడిపోయిన తర్వాతా కూడా అది సాగరజలమే అన్నదాన్ని ఆయన ultimate dimension గా పేర్కొంటాడు.

ఈ దృష్టితోనే ఆయన తన సమకాలిక వియత్నాం దుఖాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆయన పుట్టినప్పుడు వియత్నాం ఒకటే దేశం. మధ్యలో రెండు ముక్కలైంది, మళ్ళా ఒక్కటైంది. వియత్నాం రెండు ముక్కలై అన్నదమ్ములు ఒకర్నికొకరు చంపుకోవడం కళ్ళారా చూసినా కూడా ఆయన తన ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి కారణం, చారిత్రిక పరిమాణాలే అంతిమ సత్యం కాదనే ఎరుక ఆయనకు ఉండటమే.

ఈ దర్శనాన్నే ఆయన మానవస్వభావం పట్ల కూడా చూపిస్తాడు. ఒక మనిషి క్రూరంగా ప్రవర్తించడం తన కళ్ళారా చూసినప్పటికీ అది అంతిమసత్యం కాదనీ, మనిషి, పశుపక్ష్యాదులు, చరాచరాలన్నీ బుద్ధస్వభావం కలిగినవేనని నమ్ముతాడు, అదే అంతిమసత్యమని భావిస్తాడు.

గంభీరమైన ఈ దర్శనంతో ఆయన రాసిన కవితలు విశ్వాసప్రకటనలుగానూ, ప్రార్థనలుగానూ వినిపించడంలో ఆశ్చర్యమేముంది? ఆయన 1960-70 మధ్య దశాబ్దకాలంలో రాసిన కవితలన్నిటినీ Call me by my True Names(1993) పేరిట సంపుటంగా తీసుకొచ్చాడు. ఆ సంపుటంలో కవితల్ని historical dimension, ultimate dimension అని రెండు భాగాలుగా పొందుపరిచాడు. థిచ్ నాట్ హన్ మరేమీ రాయకపోయినా, మరే విధంగానూ మనకు తెలియకపోయినా, ఈ ఒక్క కవితాసంపుటిచాలు, ఆయన్ని అత్యంత చైతన్యమయ వ్యక్తిత్వాల్లో ఒకటిగా గుర్తుపెట్టుకోడానికి.

ఆ సంపుటిలోంచి కొన్ని కవితలు మీకోసం:

అర్థమయింది

మేం ద్వేషంతో తలపడుతున్నాం కాబట్టి
నువ్వు మాతో తలపడుతున్నావు.
ద్వేషం నుంచీ, హింసనుంచీ
బలం పుంజుకుంటున్నావు.

మేం మనిషికో పేరు పెట్టి 
అతడి మీద తుపాకి ఎక్కుపెట్టడం లేదని
నువ్వు మమ్మల్ని శపిస్తున్నావు.

నీ అత్యాశా ఋణాన్ని తీర్చుకోడానికి
మేం మా రక్తాన్నివ్వడంలేదని
మమ్మల్ని ఖండిస్తున్నావు
మేం మనిషిపక్కన నిలబడి
జీవితాంతం అతణ్ణి కాపాడుతున్నందుకు
మమ్మల్ని పక్కకి నెట్టేయలేకపోతున్నావని
నీకు అక్కసు.

మనిషి ప్రేమముందూ, జ్ఞానమ్ముందూ
మేం తలవంచుతాం కాబట్టి,
మేమతణ్ణి తోడేళ్ళపాలు 
చెయ్యడంలేదు కాబట్టి,
నువ్వు మమ్మల్ని హత్య చేస్తూనే ఉన్నావు.

వెచ్చదనం

నా ముఖాన్ని నా రెండుచేతుల్తోనూ కప్పుకున్నాను
లేదు, నేను ఏడవడం లేదు
నేను నా ఒంటరితనాన్ని 
ఒకింత వెచ్చబరుచుకోడం కోసం
నా రెండుచేతుల్తోనూ నా
ముఖాన్ని కప్పుకున్నాను,
రెండు చేతుల్తోనూ కాచిరక్షించుకుంటున్నాను,
రెండు చేతుల్తోనూ పెంచిపోషించుకుంటున్నాను,
ఎక్కడ నా ఆత్మ కోపోద్రిక్తమై 
నన్ను వదిలిపెట్టిపోతుందో అని
రెండు చేతుల్తోనూ నిలిపిపట్టుకుంటున్నాను.

ముద్ర

కవిని వినొద్దు
అతడు పొద్దున్నే తాగే కాఫీలో ఒక కన్నీటి చుక్క పడింది

నా మాటలు వినొద్దు
దయచేసి వినొద్దు.
పొద్దున్నే తాగే కాఫీలో ఒక రక్తం చుక్క.
తమ్ముడూ, నేనీ ద్రవాలు తాగలేకపోతున్నానని
నా మీద కోపం తెచ్చుకోకు,
నా ఊపిరితిత్తుల్లో గాలి ఘనీభవించింది.

‘నాకింక కళ్ళు లేవు కాబట్టి
నీ కళ్ళతో కన్నీళ్ళు కార్చనివ్వు
నాకింక పాదాలు లేవుకాబట్టి
నీ చరణాలతో నడవనివ్వు’
అంటున్నాడతడు.
నా చేతుల్తో నీ పీడకలని
తాకిచూస్తున్నాను
‘అమ్మయ్య, నన్ను రక్షించావు
నాకింక వేరే విముక్తి అక్కర్లేదు ‘
అన్నాడతడు.
విముక్తి మనందరిదీను.

బల్లమీద నా చేయి.
సమస్తవిశ్వం నిశ్శబ్దంగా ఉంది
మహాసముద్రం వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది
పంచమహాశైలాలూ
భూమ్యాకాశాల గతిని నిలబెడుతున్నాయి.

సముద్రం ఒడ్డున సగం నిలబడ్డ
నత్తగుల్లలాగా
నా చేయి ఆ బల్లమీద అట్లానే నిలబడి ఉంది
బుల్లెటు దెబ్బకి కూలిపోయిన మనిషి శవంలాగా.
నదులూ, కొండలూ తల్లకిందులయ్యాయి
ఆకాశలోకాలు పక్కకి తప్పుకున్నాయి
మహాసముద్రం సణుగుడు ఆపేసింది.
కాని నా చేయి ఇంకా బల్లమీదే ఉంది,
పంచమహాశైలాలూ నిలిచే ఉన్నాయి.
ఆ రహస్యమేమిటో ఇంకా తెలియరాలేదు.
ఆకాశలోకాలు ఒకదానితో ఒకటి
సంభాషిస్తున్నాయి.
నా చేయి ఇంకా బల్లమీదనే ఉంది,
భూమ్యాకాశాల గతిని మార్చే
క్షణం కోసం ఎదురుచూస్తూ
నా చేయి
చిన్న చేయి,
ఒక మహాపర్వతం లాంటి చేయి.

శాంతి

వాళ్ళు ఈ రోజు పొద్దున్నే నన్ను నిద్రలేపారు
నా తమ్ముడు యుద్ధంలో మరణించాడని చెప్పడానికి.
అయినా తోటలో
తేమరేకలింకా విడీవిడకుండా
గులాబి విప్పారుతూనే ఉంది.
నేను బతికే ఉన్నాను
ఇంకా గులాబీల సువాసనా, గడ్డివాసనా ఆఘ్రాణిస్తో,
తింటో, ధ్యానం చేసుకుంటో, నిద్రపోతో.
ఎప్పుడు బద్దలవుతుంది నా సుదీర్ఘమౌనం?
ఎప్పుడు వెలువడతాయి నా మాటలు
నా రుద్ధకంఠం పెగుల్చుకుంటూ

విన్నపం

నాకు మాటివ్వు
ఈ రోజు నాకు మాటివ్వు
సూర్యుడు నడినెత్తిమీద
ప్రకాశిస్తున్న ఈ వేళ
ఇప్పుడే నాకు మాటివ్వు

వాళ్ళు పర్వతమంత
ద్వేషంతో, హింసతో
నిన్ను మొదలంటా నరికినా
నీ మీద కాళ్ళు మోపి
నిన్నొక పురుగులాగా నలిపేసినా
నిన్ను ఖండఖండాలుగా
నరికి పోగులుపెట్టినా
గుర్తుంచుకో, తమ్ముడూ
గుర్తుంచుకో
మనిషెన్నటికీ మన శత్రువు కాడు.

అజేయం, అనంతం, అపరిమితం
దయ, దయ చూపించడమొక్కటే
నీకు శిరోధార్యం
వాళ్ళ ద్వేషం చూసి 
నువ్వు మనిషిలో పశువుని వెతక్కు.

ఏదో ఒకరోజు, నీకు ఆ పశువు
ముఖాముఖి ఎదురయినప్పుడు
కించిత్తు కూడా చలించకుండా
(ఎవరు చూడనీ చూడకపోనీ)
ధైర్యం చిక్కబట్టుకుని, 
దయతొణికిసలాడే నేత్రాల్తో
నువ్వు చిరుమందహాసం చేసినప్పుడు
ఒక పువ్వు విప్పారుతుంది.
చావుపుట్టుకల పదివేల ప్రపంచాల మధ్య
ఒకేఒకడుగా
కనిపిస్తావు నిన్ను ప్రేమించేవాళ్ళందరికీ.

ప్రేమ మరొకసారి అజరం, అమరం అయిందని
గుర్తుపట్టి 
శిరసు వంచి 
ముందుకు నడుస్తాను
ఈ సుదీర్ఘకంటక పథం మీద
సూర్యచంద్రులు
మరింత వెలుగు విరజిమ్ముతారు.

నన్ను నా అసలు పేర్లతో పిలవండి

నేను రేపు వెళ్ళిపోతున్నానని అనకండి-
ఇవాళ కూడా నేనిక్కడికి చేరుకుంటూనే ఉన్నాను

పరీక్షగాచూడండి: ప్రతి క్షణం నేనిక్కడికి వస్తూనే ఉన్నాను,
వాసంతపుష్పశాఖమీద ఒక చిరుమొగ్గలాగా.
పలచటి రెక్కల చిన్ని పిట్టలాగా
నా కొత్తగూటిలో పాటలు పాడటం నేర్చుకుంటూనే ఉన్నాను.
పువ్వులో గొంగళిపురుగులాగా.
రాతిలో దాగి ఉన్న వజ్రంలాగా.

నేను రాబోతూనే ఉన్నాను, నవ్వడానికీ, ఏడవడానికీ
భీతిల్లడానికీ, ప్రణమిల్లడానికీ.
మనందరం బతికే ఉన్నామన్న
జననమరణవలయ లయనే నా హృదయధ్వని.

నదీప్రవాహం మీద రూపుమార్చుకుంటున్న జోరీగని నేను
ఆ జోరీగని పడవేసుకుపోడానికి 
కిందకి దూకుతున్న పక్షిని కూడా నేనే.

నేను ఉగండాలో ఒక పసిపాపని, 
నా ఒళ్ళంతా వట్టి చర్మం, ఎముకలు,
పుల్లల్లాంటి కాళ్ళు. 
ఆ ఉగాండాకి మారణాయుధాలు అమ్ముతున్న
ఆయుధవ్యాపారినీ నేనే.

ప్రాణాలరచేతపెట్టుకుని చిన్న పడవమీద
తప్పించుకుపోతున్న పన్నెండేళ్ళ పిల్లని నేను
సముద్రం మీద ఒక దొంగ చేతుల్లో మానభంగమై
దూకి చనిపోయిన ఆ పసిపిల్లని నేనే,
ఆ సముద్రపు దొంగనీ నేనే.
మనిషిని మనిషిలా చూడటానికీ, ప్రేమించడానికీ
ఇంకా హృదయం ఎదగని 
ఆ కిరాతకుడు నేనే.

నేను పోలిట్ బ్యూర్ సభ్యుణ్ణి కూడా
అపారమైన అధికారం నా చేతుల్లో.
ప్రజలకి తాను పడ్డ రక్తఋణాన్ని
తీర్చుకోడానికి నిర్బంధ శిబిరంలో
నెమ్మదిగా మరణిస్తున్న ప్రవాసినీ నేనే.

నా సంతోషంలో వసంత ఋతువులోని నునువెచ్చదనముంది.
అది ఈ నేల మీద పూలు పూయిస్తుంది.
నా వేదన ఒక అశ్రు ప్రవాహం,
అది నాలుగుసముద్రాల్నీ దహిస్తుంది.

నన్ను నా అసలు పేర్లతోనే పిలవండి
అప్పుడు మటుకే నేను నా 
అన్ని నవ్వుల్నీ, ఏడ్పుల్నీ 
ఒక్కసారే వినగలుగుతాను
నా సుఖం, దుఃఖం ఒక్కటేనని తెలుసుకుంటాను

దయచేసి నన్ను నా అసలు పేర్లతో పిలవండి
అప్పుడు నాకు మెలకువొస్తుంది,
దయార్ద్రహృదయద్వారం 
నా గుండె తలుపు తెరిచిపెట్టగలుగుతాను.

శాంతిగీతం

పుండరీకపుష్పం మీద స్థిరంగా, ప్రశాంతంగా
పరమసుందరమూర్తి బుద్ధుడు.
అనుంగు శిష్యుడు
నీ ఎదట నిలబడ్డాడు
ప్రశాంత పవిత్రచిత్తంతో
తన చేతులొక తామరమొగ్గలా ముడిచి
ప్రార్థిస్తో, ప్రణమిల్లుతో.

దశదిశాంతస్థులైన బుద్ధులందరికీ ప్రార్థనలు
మీ కృపామయదృక్కులకోసం ప్రార్థనలు.
ఇరవయ్యేళ్ళుగా మా నేల యుద్ధంలో కూరుకుపోయింది
రెండు ముక్కలై, కన్నీటికడలిగా మారిపోయింది
ఎక్కడ చూసినా నెత్తురు, బొమికెలు పిన్నలవీ, పెద్దలవీ.
పిల్లలు దూరభూముల్లో నేలకొరుగుతున్నారు,
కన్నీళ్ళు ఎండిపోయేదాకా తల్లులు ఏడుస్తోనే ఉన్నారు.
నా నేల అందం చెదిరిపోయింది
ఇప్పుడక్కడ ప్రవహిస్తున్నవి నెత్తురూ, కన్నీళ్ళూ.
బయటివాళ్ళ మాటలు నమ్మి
అన్నదమ్ములు ఒకర్నికొకరు చంపుకుంటున్నారు.

దశదిశల్లోనూ సుప్రతిష్టులైన కృపామూర్తులు
బుద్ధులందరికీ ప్రార్థనలు
మా మీద దయచూపించండి.
ఉత్తరాన ఉన్నా, దక్షిణాన ఉన్నా
మేమంతా ఒకటే కుటుంబమని మాకు గుర్తుచేయండి.
మాలో సౌభ్రాతృత్వ దీపం వెలిగించండి
మా భిన్నభిన్న ప్రయోజనాలు
ప్రేమైక చిత్తంగా వికసించేలా చూడండి
మీ దయతో, సహానుభూతితో 
మమ్మల్ని మా ద్వేషం నుంచి బయటపడెయ్యండి.
అవలోకితేశ్వరబోధిసత్త్వుడి ప్రేమతో
మా నేలమీద మళ్ళా పూలు పుయ్యాలి.
మేము మా హృదయాలు విప్పి మీ ముందు పెడుతున్నాం,
మా కర్మనుంచి మమ్మల్ని విడుదల చెయ్యండి
మా ఆత్మపుష్పాలు వికసించేలా నీళ్ళుపొయ్యండి
మీ ప్రజ్ఞాంతరంగంతో
మా హృదయాలకు వెలుగు చూపించండి.

శాక్యముని బుద్ధునికి ప్రార్థన
ఆయన వాగ్దానాలు, కరుణ: అవే మనని బతికించేవి.
నేనొకటే నిర్ణయించుకున్నాను:
నమ్మకానికీ, ప్రేమకీ తప్ప
నా తలపుల్లో మరి దేనికీ చోటివ్వకూడదనుకుంటున్నాను
మనుషుల్ని కుటుంబంలాగా నిలబెట్టే
పనులకు తప్ప మరివేటికీ 
నా చేతులు కలపకూడదనుకుంటున్నాను.
నలుగురినీ దగ్గరచేర్చే మాటలు తప్ప
మరో మాట మాటాడకూడదనుకుంటున్నాను.

నా ఈ ప్రార్థన
వియత్నాం నేలమీద శాంతిగీతంకావాలి
ప్రతి ఒక్కరం వినగలిగే
హృదయాశయ సంగీతం కాగలగాలి.

12-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: