
1978. నలభయ్యేళ్ళ కిందటి మాట.
నాగార్జున సాగర్ లో గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సి యి సి మొదటి సంవత్సరంలో చేరిన మొదటి రోజులనాటి ఒక ముచ్చట. మా ఇకనమిక్స్ లెక్చెరర్ కాటన్న గారు, తన క్లాసు మొదలుపెట్టడానికి వచ్చిన మొదటి క్లాసులోనే పాఠం మొదలుపెట్టకుండా, మా అందరికీ తలో తెల్లకాగితం ఇచ్చి, భవిష్యత్తులో మేమేం కావాలను కుంటున్నామో రాయమన్నారు. ప్రతి ఒక్కరం ఏదో ఒకటి రాసేం. ఆయన ఆ కాగితాలన్నీ వెనక్కి తీసుకుని ఒక్కొక్కటే తనలోతాను చదువుకుంటూ, ఒక కాగితం దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయేరు.
‘ఎవర్రా ఇది? వి.వి.రావు? ఎవరు?’ అనడిగారు.
మా క్లాసు మేట్ ఒకడు లేచి నిలబడ్డాడు.
‘నువ్వేం రాసావు? అందరికీ చెప్పు’ అన్నారాయన.
వాడొక్కక్షణమేనా తటపటాయించకుండా ‘ఐ వాంట్ టు బికమ్ ఐ ఏ ఎస్ టాపర్ అని రాసాన్సార్ ‘ అన్నాడు.
‘ఐ -వాంట్ -టు -బికమ్ -ఐఏఎస్- టాపర్ ‘ అన్నాడు మళ్ళా మా అందరి వేపూ తిరిగి.
క్లాసంతా గొల్లుమంది.
అప్పుడే ఇంగ్లీషు నేర్చుకుంటున్నవాడిలాగా , అనకాపల్లి యాసలో, వాడా వాక్యాన్ని ఉచ్చరించిన తీరు కి మా ఉపాధ్యాయుడితో సహా ప్రతి ఒక్కరం నవ్వకుండా ఉండలేకపోయాం.
ఆ క్షణం నుంచీ టాపర్ వాడి నిక్ నేమ్ గా స్థిరపడిపోయింది. ‘టాపర్ కి జ్వరం వచ్చిందంట ‘, ‘టాపర్ ఇంకా బాత్ రూంలోనే ఉన్నాడు’, ‘టాపర్, ఇదిగో, నీ సివిక్సు నోట్సు ‘..మేం కాలేజి వదిలిపెట్టేదాకా వాడి పేరదే.
*
ఆరేడేళ్ళ తరువాత.
ఒకరోజు కాంపిటిషన్ సక్సెస్ రివ్యూ పత్రిక ఒకటి యాథాలాపంగా తిరగేస్తుంటే, అందులో టాపర్ ఫొటో. వాడు నిజంగానే సివిల్ సర్వీస్ లో మొదటి రాంకుల్లో ఉత్తీర్ణుడయ్యాడనీ, అయితే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంచుకున్నాడనీ, అభినందిస్తూ రాసిన వార్త అది.
మొదటి క్షణం చాలా ఆశ్చర్యం కలిగింది. మరుక్షణం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. ఆ విజయగాథ నేను చాలా దగ్గరనుంచే చూసాననిపించింది.
*
7 జూలై 2008.
ఆఫ్గనిస్తాన్ లో, ఒక ఆత్మాహుతి దళం కాబూల్ లోని భారతీయ దౌత్య కార్యాలయం మీద దాడి చేసిందనీ, మొత్తం 41 మంది మరణించారనీ, అందులో 44 ఏళ్ళ వయసుగల భారతీయ దౌత్యవేత్త వాడపల్లి వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడనీ వార్త.
మొదటి క్షణం చాలా దుఃఖం కలిగింది. మరుక్షణం చాలా గర్వం కలిగింది.
‘మా టాపర్ జీవితంలోనే కాదు, మరణంలో కూడా టాపరే’ అనిపించింది. ఆ మాట నలుగురూ వినేలా ఎలుగెత్తి చెప్పాలనిపించింది. ఎలా చెప్పాలో తెలీక, సాక్షి పత్రికకి ఉత్తరం రాసి పంపిస్తే, ఆ పత్రిక బాక్స్ కట్టి మరీ ప్రచురించింది.
*
నిన్న నా కాలేజి సహాధ్యాయి Kotnana Simhachalam Naidu నాకొక వాట్సప్ మెసేజి పంపించాడు.
అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించే వీరసైనికులకు అందించే కీర్తిచక్ర పురస్కారాన్ని భారతప్రభుత్వం మొదటిసారిగా ఒక సివిల్ సర్వీస్ ఉద్యోగికి, వాడపల్లి వెంకటేశ్వరరావుకి, మరణానంతరం అందచేసిందని. ఆఫ్గనిస్తాన్ దౌత్య కార్యాలయంలో ఏ దౌత్యాధికారీ పనిచేయడానికి సిద్ధపడని తరుణంలో, వెంకటేశ్వరరావు ఆ బాధ్యతను స్వీకరించాడనీ, అక్కడ పనిచేసిన మూడేళ్ళలో, ఆఫ్గన్ భాషలు నేర్చుకుని మరీ, రెండు దేశాల మధ్యా స్నేహవారధి నిర్మించడానికి ప్రయత్నించాడనీ ఆ వార్త సారాంశం.
ఈ పురస్కారం 2015 లోనే ప్రకటించారట. కాని నాకు తెలిసేటప్పటికి ఇన్నేళ్ళు పట్టింది.
వినగానే నాకు అనిపించిందొకటే:
మా టాపర్ జీవితంలోనూ, మరణంలోనూ మాత్రమే కాదు, మరణానంతరం కూడా టాపరేనని.
23-11-2018