
అసాం ని ఒకప్పుడు కామరూప అని పిలిచేవారు. కాని, ఇప్పుడు కామరూప ఒక జిల్లా. గౌహతి ఆ జిల్లా కేంద్రం. ఆ నగరం వరకూ కామరూప మెట్రొపోలిటన్ జిల్లా అనీ, చుట్టూ ఉన్నదాన్ని గ్రామీణ కామరూప జిల్లా అనీ పిలుస్తున్నారు. మా ప్రయాణంలో చివరిరోజు గ్రామీణ కామరూపజిల్లాలో బాంబూ టెక్నాలజీ పార్కుతో పాటు ఏదైనా ఒక గ్రామం, ఒక అస్సామీయ కుటుంబం, వాళ్ళ ఇల్లు, జీవితం చూడాలనుకున్నాం.
మేం నగరం పొలిమేరలు దాటేముందే భూపేన్ హజారికా సమాధి దగ్గర కొద్దిసేపు ఆగేం. అక్కడొక స్మారక మందిరం, స్మారక శిల్పం కూడా ఉన్నాయి. ఆ ముందు రోజే గౌహతిలో ఒక బుక్ స్టోరులో Dr.Bhupen Hajarika: A Legend (2011) అనే ఒక అపురూపమైన పుస్తకం దొరికింది. అందులో డా.హజారికాకి నివాళి ఘటిస్తూ రాసిన వ్యాసాలు, స్మరణలతో పాటు, ఆయన జీవితకాలంలో రాసిన పాటలన్నీ అస్సామీలోనూ, ఇంగ్లీషు అనువాదాలతోనూ ఉన్నాయి. ప్రతి కవితనీ చక్కటి ప్రకృతి దృశ్యాలమీద ముద్రించడంతో, అస్సాం లాండ్ స్కేప్ గుండా, ఆ నదీమైదానాల్లోనూ, ఆ ఆకాశాలకిందా ప్రయాణిస్తో ఆ కవితలు చదివిన అనుభూతి కలుగుతుంది.
ఆ కవితల్లో అధికభాగం పాటలు, హజారికా రాసుకుని తానే స్వరపరుచుకున్న గీతాలు. కొన్ని వచన కవితలు. వాటిని దశలవారీగా విభజించారు. 1937-50, 1951-60,1961-70,1971-80, 1981-2005 అంటో వింగడించిన ఆ గీతాల ఇంగ్లీషు అనువాదాలు మొత్తం చదివాను. కొన్ని రెండుమూడు సార్లు, నాలుగైదు సార్లు కూడా చదివాను. వాటిని చదవడమంటే, హజారికా జీవితయాత్రను మాత్రమే కాదు, ఇరవయ్యవ శతాబ్ది అస్సాం చరిత్రను కూడా దగ్గరనుంచీ చూడటం.
హజారికా తక్కిన భారతీయులకు ఫిల్మ్ సంగీతం ద్వారానే ఎక్కువ సన్నిహితుడయ్యాడు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకత్వం పురస్కారాలు పొందినందువల్లా, దాదా సాహెబ్ పురస్కారం వల్లా ఆయన్ను ప్రధానంగా ఫిల్మ్ కళాకారుడిగానే చూడటానికి అలవాటు పడ్డాం కాని, ఈ పుస్తకం చదివినప్పుడు, అన్నిటికన్నా ముందు అతడు కవి అనీ, గ్రామీణ అస్సాంకి చెందిన వాగ్గేయకారుడనీ అర్థమవుతుంది. శంకరదేవ, మాధవదేవతో మొదలై, ఇరవయ్యవ శతాబ్దిలో జ్యోతి ప్రసాద్ అగర్వాలా, విష్ణు ప్రసాద్ రాభా వంటి పదకర్తల మీదుగా కొనసాగుతూ వస్తున్న ఒక సంప్రదాయానికి వారసుడని తేటతెల్లమవుతుంది.
ఆ పదకర్తల్లో మరొక విశిష్టత ఉంది. శంకరదేవ తన సాహిత్యం మొత్తం మీద ‘అస్సాం’ అనే పదం ఒకే ఒక్కసారి వాడాడనీ, ‘భారతవర్ష ‘ అనే పదాన్నే పదే పదే వాడాడనీ విమర్శకులు చెప్తున్నారు. ఒక స్థానిక సంస్కృతిని విస్తృత భారతీయ సంస్కృతిలో భాగంగా చూడటం శంకరదేవ విజ్ఞతకి నిదర్శనం. హజారికా మరింత ముందుకు వెళ్ళాడు. ఆయన అమెరికాలో చదువు కున్నందువల్లా, పాల్ రోబ్సన్ తో పరిచయం వల్లా, ఒక గ్రామీణ గానసంప్రదాయాన్ని, విశ్వసంగీతంలో మేళవించగలిగాడు. హజారికాని మనమింకెంతమాత్రం ఒక అస్సామీ కళాకారుడిగానో, భారతీయ ఫిల్మ్ కళాకారుడిగానో చూడలేం. అతడి కళాసృష్టి మొత్తం ప్రపంచానికి చెందింది.
ఈ గీతం చూడండి:
నేనొక సంచారిని
నేనొక సంచారిని
నాకంటూ ఒక ఇల్లు అక్కర్లేదు
ఈ భూమ్మీద సుదూర తీరాలదాకా నేనో సంచారిని
లోహితనుంచి మిసిసిపి దాకా సంచరించాను
ఓల్గా సౌందర్యం చూసాను
ఆస్ట్రియా గుండా ఒట్టావా దాకా పయనమై
పారిస్ నొక బిగికౌగిలింతలో బంధించాను.
ఎల్లోరా ప్రాచీన వర్ణఛాయల్ని షికాగోకి తీసుకుపోయాను
దుషంబె మీనార్లలో గాలిబ్ గీతాలు విన్నాను
మార్ట్ ట్వేన్ సమాధి దగ్గర చతికిలబడి గోర్కి గురించి మాట్లాడేను
ప్రతి ఒక్కసారీ నా ప్రయాణంలో
ప్రపంచప్రజలు నన్ను తమ అక్కున చేర్చుకున్నారు
కనుకనే నేనో సంచారిని.
సంచారులు చాలామంది వట్టి దిమ్మరులు,
కాని నేనో స్వప్నాన్ని మోసుకు తిరిగాను.
నేనెక్కడ సంతోషాన్ని చూసినా
ఆ వసంతాన్ని నలుగురితో పంచుకున్నాను.
ఆకాశహర్మ్యాల వరసలు చూసాను
వాటినీడల్లో నిరాశ్రయుల సమూహాలు కనుగొన్నాను
సుందరోద్యానాలతో అలరారే భవంతులు చూసాను
తొందరగా నేలరాలిపోతున్న పూలరేకల్నీ చూసాను
అనేక భూముల్లో ఊడిగం చేస్తోన్న మనుషులు నన్ను దుఃఖపరిచారు
నాకెంతో ప్రియమైన వాళ్ళు తమ ఇళ్ళల్లో
తామే అపరిచితులుగా మారడం చూసాను
అందుకే నేనో సంచారిగా మారిపోయేను.
హజారికా గీతాల్లో నదీనదాలూ, కొండలూ, ఆకాశాలూ, పువ్వులూ, రంగులూ ఉన్నాయి. ప్రజలున్నారు, కష్టసుఖాలున్నాయి, ఉద్యమాలున్నాయి, వేదన ఉంది, వేసట ఉంది. ఆ కవిత్వం చదివాక నాకు పదే పదే స్ఫురిస్తూ ఉన్నది, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇటువంటి పాటకాడు పుట్టలేదని. మనకి గీతకర్తలు, సంగీతకర్తలు, విప్లవగీత రచయితలు లేకపోలేదు. కాని, మన గీతకర్తల గీతాల్లో ప్రజలు కనిపించరు. ప్రజల గురించి గీతాలు రాసినవాళ్ళల్లో ప్రకృతి కనిపించదు. కొందరు పాటలు కట్టి పాడతారు కాని వాళ్లని సంగీతకారులనలేం. ఆ బాణీలు చాలా మొనాటనస్ గా ఉంటాయి. ఇక, మరీ ముఖ్యంగా, కృష్ణశాస్త్రినుంచి పెంచల దాస్ దాకా తెలుగులో ప్రతి ఒక్క గీత రచయితనీ సినిమా తన ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించివేస్తున్నది.
కాని, అస్సాం కి శంకరదేవ ఉంటే మనకి అన్నమయ్య ఉన్నాడు. వేమన ఉన్నాడు, క్షేత్రయ్య, వీరబ్రహ్మం, సారంగపాణి ఉన్నారు, యక్షగానం ఉంది, ప్రాజ్ఞన్నయ యుగం నుంచీ కొనసాగుతున్న వెన్నెల పదాలున్నాయి, తుమ్మెద పదాలున్నాయి. లేనిదల్లా ఈ పాటల్తో ప్రజల కష్టసుఖాల్ని జీవితం పొడుగునా గానం చెయ్యగలవారు. సినిమాలూ, రాజకీయాలూ కబళించని గాయకులు, వాగ్గేయకారులు. బహుశా, ఇప్పటి తెలుగు జీవితానికి అందరికన్నా ముందు అన్నమయ్య వంటి ఒక సంకీర్తనాచార్యుడు అత్యవసరం.
2
ఆ తర్వాత మేం దాగాఓన్ కటహి అనే గ్రామానికి వెళ్ళాం. కామరూప జిల్లాలో చాయ్ గావ్ అనే తాలూకా లో ఉన్న గ్రామం. ఇటీవల అసామీ సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ‘విలేజి రాక్ స్టార్స్’ సినిమాలో కొంత భాగం అక్కడే తీసారట. ఆ గ్రామం మన కృష్ణాతీరంలోనో, గోదావరీ తీరంలోనో కనబడే గ్రామాల్లాగా ఉంది. ఆ ఊరికి ఒక పక్క చిన్న నది ఒకటి ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో బ్రహ్మపుత్ర నుంచి వచ్చే ఒక చిన్నపాయ కూడా కలవడంతో చిన్న సంగమం కూడా ఏర్పడింది. ఆ రెండు ప్రవాహాల పరస్పర మిలనం వల్ల ఆ గ్రామంమీంచి ప్రయాణించేవాళ్ళు అక్కడొక క్షణమేనా ఆగకుండా ఉండలేరు.
మేం కూడా ఆ నదీజలాల్ని చూస్తూనే ఆగిపోయేం. అక్కడొక పడవ అటూ ఇటూ ప్రయాణీకుల్ని దాటిస్తూ ఉంది. మేం కూడా ఆ పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళాం. అక్కడొక గ్రామం ఉంది. అది బెంగాలీల గ్రామం. ఒక బెంగాలీ కుటుంబాన్ని చూసాం. బీద కుటుంబం. రెండు బీఘాల నేలని నమ్ముకున్న చిన్న కుటుంబం. ఆ ఇంట్లో సర్వజయనీ, అపూనీ చూసాను. తిరిగి మళ్ళా ఇవతలి వడ్డుకి వచ్చాం. అక్కడొక అస్సామీ కుటుంబం మా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారి ఇంటికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించేరు. అరటి, కొబ్బరి, పోక చెట్ల మధ్య వాళ్ళ ఇల్లు. ఆ కుటుంబంలో తండ్రి ఒకప్పుడు ఒక అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి మానుకుని ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆరేడు బీఘాల నేల ఉంది. కొంత భూమిలో వరి పండిస్తున్నాడు కానీ, ఇరిగేషన్ లేకపోవడంతో, పైరు కళతప్పి కనిపిస్తూ ఉంది. ఇంటి పెరట్లో రెండు చేపల చెరువులు తవ్వించాడు. కొద్దిగా పశుసంపద కూడా ఉంది. అతడి కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. అతడు కొద్దిపాటి హిందీ అర్థం చేసుకోగలడు కానీ తక్కినవాళ్ళకి అస్సామీ తప్ప మరేమీ అర్థం కాదు.
ఆ మధ్యాహ్నం వాళ్ళు మాకు చిన్న అల్పాహారం విందు ఏర్పాటు చేసారు. బియ్యంతో వండిన కుడుం లాంటిది పెట్టారు. పొంగడాలు కూడా పెట్టారు. మా సహోద్యోగి అవిక్ చక్రవర్తి బెంగాలీ. అతడా అల్పాహారం చూసి, అది బెంగాల్లో పండగ రోజుల్లో తినే పిండివంటలని చెప్పాడు. అంటే ఆ గ్రామీణ అస్సామీ కుటుంబం మేము వాళ్ళింటికి రావడాన్ని ఒక పండగలాగా భావించిందన్నమాట!
మాకు అక్కడే సమయం గడిచిపోవడంతో ఇక బాంబూ టెక్నాలజీ పార్కు కి వెళ్ళలేకపోయాం. తిరుగు ప్రయాణానికి గౌహతి బయల్దేరాం. మేము వెళ్ళేదారిలోనే చండికా దేవి ప్రాచీన ఆలయమొకటి ఉందనీ, చూసివెళ్ళమనీ చెప్పడంతో, ఆ గుడి దగ్గర కొంతసేపు ఆగి ఏర్ పోర్టుకి వెళ్ళిపోయాం.
3
నాలుగు రోజుల ప్రయాణంలో నువ్వో ప్రాంతాన్ని ఏ మేరకు చూడగలవు? ఒక సంస్కృతినీ, సాహిత్యాన్నీ, సంగీతాన్నీ ఏ మేరకు అర్థం చేసుకోగలవు? ఏమి వెంటతెచ్చుకోగలవు?
మనమొక సముద్రం దగ్గరకి వెళ్తాం. కొద్ది సేపు ఆ ఇసుకతిన్నెల మీద నడుస్తాం. కెరటాలు ఎగిసిపడటం చూస్తాం. దూరంగా ఏ తీరానికో పయనమయ్యే నౌకల్ని చూస్తాం. ఆ సముద్రాన్ని కొంగున కట్టుకుని తెచ్చుకోలేం కదా. కాని ఏదో వెంట తెచ్చుకోవాలని ఉంటుంది మనకి. అందుకని కొన్ని గవ్వలేరుకుంటాం. మూట కట్టుకుంటాం. ఇంటికి తెచ్చుకుంటాం. ఇంటికొచ్చేసాక, కొన్నాళ్ళు పోయేక వాటిల్లోంచి ఏ చిన్ని శంఖాన్ని తీసి పట్టుకున్నా ఆ సాయంకాలం మన ఎదుట ఘూర్ణిల్లిన ఆ చలదూర్మికాఘోష మన చెవుల్లో నినదించినట్టే ఉంటుంది.
అస్సాం గురించిన నా ఈ రాతలు కూడా అంతే.
19-11-2018