కామరూప-7

మూడో రోజు పొద్దున్న కామాఖ్య దేవాలయం చూడటానికి వెళ్ళాం. పొద్దున్న ఎనిమిదిన్నరకి మాకు దర్శనానికి ఏర్పాటు చేసారు. మేము ఎనిమిదింటికే ఆలయప్రాంగణంలో అడుగుపెట్టాం. శరత్కాలపు ఉదయాన్నే ఆ నీలాచలం మీద అప్పుడప్పుడే తొలిసూర్యకాంతి ప్రసరిస్తూ ఉంది. సాధారణంగా ఆలయాల ప్రాంగణాల్లో సుప్రభాతవేళల్లో కనవచ్చే ఒక ఉత్తేజం, కొత్త రోజు మొదలయ్యేటప్పటి ఉత్సాహం అక్కడ కూడా వ్యాపించి ఉన్నాయి. ఆ మెట్లమీద అటూ ఇటూ ఉన్న పూజాసామగ్రి దుకాణాలనుంచి అగరుధూప పరిమళం వ్యాపిస్తూ ఉంది. అప్పుడే కోసి తెచ్చిన కలువపూల మీద తేనెటీగలు ఝుమ్మని ముసురుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గుడ్డపెట్టి తుడిచినంత పరిశుభ్రంగా ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే నాలో ఒక విద్యుత్ స్పందన మేల్కొనడం గుర్తించాను. నాతో పాటు వచ్చిన నా సహోద్యోగి, యువకుడు ఆశిష్ కూడా ‘ ఇక్కడేవో వైబ్స్ తెలుస్తున్నాయి సార్’ అంటున్నాడు.

ఆ అత్యంత ప్రాచీనమైన దేవాలయ శిఖరాలమీద సుప్రభాత సూర్యకాంతి. ఆ చెట్లమీద, ముఖ మంటపం మీద, స్తంభాలమీద, ద్వారాలమీద, ద్వారప్రతిమలమీద శుభ్రసూర్యరశ్మి, ఎక్కడ చూసినా స్వర్ణ సూర్యరశ్మి వర్షిస్తూ ఉంది. దేవాలయ శిఖరాల మీద పావురాలు వాలి ఉన్నాయి. వాటి నీడలు కాంతిమంతంగా కదుల్తున్నాయి.

ఏ అతీతకాలంలోనో ఏ ఖాసీ, గారో తెగల గిరిజనులో కొలిచిన ఈ అత్యంత పురాతన శక్తిస్థలి కాలక్రమంలో సహాజియా, వజ్రయాన బౌద్ధం, తంత్రం, శాక్తేయాలకు కేంద్రమై, ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పూజలందుకుంటున్నది. చారిత్రిక ఆధారాల ప్రకారం చూసినా ఈ దేవాలయం ఆరేడు శతాబ్దాల నాటికే నిర్మాణంలో ఉంది. ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. ఎన్నో తెగలు, జాతులు, సంస్కృతులు ఈ వేదిక ముందు ఒకరితో మరొకరు తలపడ్డారు, కలగలిసిపోయారు.

దర్శనానికి ఇంకా కొంత సమయం ఉండటంతో అక్కడొక మంటపంలో కూచున్నాను. కొంతసేపు ఆ కాంతిని చూస్తో ఖడ్గమాల చదువుకున్నాను. అమ్మవారు నన్ను ఎందుకు చూడాలనుకున్నదా అని ఆలోచనలో పడ్డాను. ఎవరో ఒక చిన్న మేకపిల్లను వెంటబెట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు.ఈ దేశంలో అనాదినుంచీ శక్తి ఆరాధనలో పూర్తి కుడివైపు పద్ధతులూ, పూర్తి ఎడమవైపు పద్ధతులూ కొనసాగుతూనే వస్తున్నాయి (ఇప్పుడు రాజకీయ శక్తి సముపార్జనలో కూడా అవే కుడి ఎడమ భేదాలు). సమయాచారంగానూ, వామాచారంగానూ పిలవబడే ఈ రెండు పద్ధతులకీ ఇంకా కామాఖ్య ఒక సమన్వయ స్థలిగా కొనసాగుతున్నది. రెండు పరస్పర విరుద్ధ ధోరణుల్నీ తనలో పొదువుకోగల ఈ శక్తినే లలితా సహస్రనామాలు ‘సవ్యాపసవ్య మార్గస్థా’ అని పిలిచాయి. ఎప్పుడో నా ఇరవయ్యేళ్ళప్పుడు పరిచయమయింది లలిత. అప్పణ్ణుంచీ ఆ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. భారతదేశ తాత్త్విక భావనలన్నిటీ సంగ్రహ పాఠం లలితాసహస్రనామాలు అని చెప్పవచ్చు. అందులో ప్రతి ఒక్క నామం వెనుకా ఒక ఆరాధనా సంప్రదాయముంది. ఆ నామాల్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎవడూ తనది మాత్రమే ఆరాధన అనీ, తాను కొలుస్తున్న దేవుడు మాత్రమే దేవుడనీ, తాను చూస్తున్న సత్యం మాత్రమే సత్యమనీ అనలేడు.

ఆ అంతరాలయంలో ఆమె ఎలా ఉంటుందో నేను వినలేదు, చదవలేదు. ఎటువంటి ఆకాంక్షా లేకుండా, మనసులో ఎటువంటి ఊహాగానాలూ చేసుకోకుండా నేనా గర్భాలయంలో అడుగుపెట్టాను. నా వంతు వచ్చేటప్పటికి, ఆ ప్రాచీన గుహాలయంలో ఒక్కొక్క మెట్టే దిగి కిందకు చేరుకునేటప్పటికి, నా ఎదట మందారపూల రాశి!

మందారమాలల్తో, కుంకుమతో సాక్షాత్కరించిన ఆ శక్తిపీఠం ఎదట మోకరిల్లాను. నా చేతుల్లో ఉన్న మందారమాల కూడా ఆమె చరణాల దగ్గర సమర్పించాను. అక్కడ ఉన్న అర్చకుడు, ఆ పాదాల దగ్గర స్రవిస్తున్న ఉదకాన్ని స్పృశించమన్నాడు. ఏ ప్రాచీన శిలాయుగాలనాటిదో, ఏ అతీత హిమానీ యుగాలనాటిదో ఆ నీటిబుగ్గ. ఎన్ని యుగాలుగా ఎందరు స్పృశిస్తూ వచ్చినా ఇంకిపోని, మలినపడని ఆ నిర్మల తోయాన్ని నా చేతుల్తో తీసుకుని నెత్తిన చల్లుకున్నాను. ‘అదిగో ఆ పక్కన లక్ష్మి ఆమెకి కూడా మొక్కు’ అన్నాడు అర్చకుడు. ఆ పక్కనొక అర్చామూర్తి. అక్కడ శిరసు వంచగానే మరొక అర్చకుడు నా వెన్ను మీద చరిచాడు. బయటకి వచ్చాను. మరొక అర్చకుడు ‘ఈమె అన్నపూర్ణ. నీ పేరు చెప్పు, నీ భార్యాబిడ్డల పేర్లు చెప్పు’ అన్నాడు. ‘నీది హాపీ ఫామిలీయేనా’ అన్నాడు. అవునన్నాను. ‘నోరు తెరు’ అన్నాడు. నోరు తెరిచాను. నాలుగు బియ్యం గింజలు నోట్లో వేసాడు.

ఆ ఆలయంలోనూ, చుట్టుపక్కలా దశమహావిద్యల దేవాలయాలున్నాయని అక్కడ రాసి ఉంది. వారందరికీ నమస్సులు అర్పించుకున్నాను. ఆ ప్రాంగణంలో నేను కూడా ఒక దీపం వెలిగించాను.

ఆ కొండమీంచి గౌహతి ఒక అపారనీలిమైదానంగా గోచరించింది. ఆ నీలి కాన్వాసుమీద గీసిన పలచటి నీటిపూతలాగా దూరంగా బ్రహ్మపుత్ర. ‘కామ’ అంటే నీలం, ఆకుపచ్చ అనే అర్థాలు కూడా ఉన్నాయనీ, కామాఖ్య అంటే ఒక నీలాకుపచ్చ సౌందర్యమని కూడా అర్థం చెప్పుకోవచ్చని సుప్రసిద్ధ కామాఖ్య చరిత్రకారుడు కాళీ ప్రసాద్ గోస్వామి రాసాడు (Kamakhya Temple, Past and Present, 1998, p.3)

నాకు మళ్ళా మరొకసారి ఆ ఆలయానికి రావాలనిపించింది. ఆ రోజు శిక్షణా కార్యక్రమం ముగిసేక, ఒక ఐ పి ఎస్ అధికారి తమ పోలీసు అధికారులకి కూడా శిక్షణ ఇవ్వడానికి మరొకసారి గౌహతి రాగలరా అని నన్నడిగింది. నేను కామాఖ్య దేవాలయం చూడటానికే మరొకసారి రావాలను కుంటున్నాను అంటే, స్థానిక ఐతిహ్యం ప్రకారం, ఒకసారి కాదు, కనీసం మూడు సార్లేనా అమ్మవారు తన దగ్గరికి రప్పించుకుంటుందని చెప్పింది.

2

గౌహతి లో ఉన్న స్టేట్ హాండి క్రాఫ్ట్స్ ఎంపొరియంలో ‘మూగ’ పట్టు చీరల మధ్య, తేయాకు పాకెట్ల మధ్య శంకరదేవ రాసిన ‘గుణమాల’ కు ఇంగ్లీషు అనువాదం దొరికింది. వేణుధర్ రాజ్ ఖొవా అనే అతడు 1924 లో చేసిన అనువాదం అది. గౌహతి స్టాఫ్ కాలేజిలో మరొక జాయింట్ డైరక్టరు పేరు కజోరి రాజ్ ఖోవా. ఆమెకి ఆ పుస్తకం చూపిస్తే, తన తండ్రి, మామగారు కూడా నవ్యవైష్ణవానికి చెందినవారేననీ, ఆ భావాల, సంప్రదాయాల పరిరక్షణకు అపారమైన కృషి చేసారనీ చెప్పింది. ముఖ్యంగా తమ మామగారు ఇలా రామదాస్ శంకర దేవ సంగీతాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేసారని చెప్తూ, ఆయన రాసిన పుస్తకాలు కూడా ఇచ్చింది.

శంకర దేవ స్థాపించిన ‘ఏక్ శరణ ధర్మాని’కి సంబంధించిన నామఘర్ ఒకటేనా చూడటానికి ఏర్పాటు చెయ్యగలరా అని ఆమెనడిగాను. కానీ నామఘర్ లు చూడటానికి నాకు సమయం చాలదని చెప్తూ, ఊళ్ళోనే ఉన్న శంకరదేవ కళాక్షేత్రానికి వెళ్ళమని చెప్పింది.

ఆ సాయంకాలం శంకరదేవ కళాక్షేత్రానికి వెళ్ళిన తరువాత ఆమె నాకు ఆ సలహా ఇచ్చి చాలా మేలు చేసిందనిపించింది. ఆ ప్రాంగణాన్ని మేము పూర్తిగా చూడలేకపోయాం కానీ చూసినంతలో చాలా విలువైన అంశాలే చూడగలిగాం. అందులో మొదట చెప్పదగ్గది లక్ష్మీనాథ బెజ్ బరూవ మీద ప్రదర్శన.

‘రసరాజు’, ‘సాహిత్య రథి’ లక్ష్మీనాథ బెజ్ బరూవ (1864-1938) ఆధునిక అస్సామీ సాహిత్య నిర్మాత, వైతాళికుడు, యుగకర్త. తెలుగుకి గురజాడ, బెంగాలీకి బంకిం బాబు, ఒరియాకి ఫకీర్ మోహన్ సేనాపతి ఎటువంటివారో అసామీకి బెజ్ బరూవ అటువంటివాడు. ఆయన మీద సాహిత్య అకాదెమీ ప్రచురించిన మోనోగ్రాఫుని ఎప్పుడో రాజమండ్రిలో ఉన్నప్పుడు చదివాను. కాని ఆ రోజు అక్కడ చూసిన ఎగ్జిబిషను ద్వారానే ఆయన జీవితకాల కృషి గురించిన నిజమైన అవగాహన కలిగిందని చెప్పవచ్చు.

పందొమ్మిదో శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ వల్లా, బ్రిటిష్ పాలనవల్లా అసాంని బెంగాలీ భాష, సంస్కృతి ఆక్రమించేసాయి. అస్సామీ భాషకి విలువలేకుండా పోయింది. బెంగాలీ అభిరుచినే అస్సామీయులు కూడా తలదాల్చవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి అంధకారం నుంచి బెజ్ బరూవ ఒంటిచేత్తో అస్సామీని ఒక సాహిత్యభాషగా రూపొందించి ఆధునిక భారతదేశ భాషగా గౌరవాన్ని సంతరించిపెట్టాడు. కవిత్వం, కథలు, నవలలు, వ్యాసాలు, బాలసాహిత్యం, నాటకాలు, ప్రహసనాలు, జీవితచరిత్రలు, ఆత్మకథ, పత్రికారచన-ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక తెలుగు వచనవాజ్ఞ్మయానికి వీరేశలింగం, గురజాడ ఎటువంటి కృషి చేసారో బెజ్ బరూవ ఒక్కటే, అసామీకి అటువంటి కృషి చేసాడు. చిత్రమేమిటంటే ఆయన టాగోర్ అన్న కూతురినే వివాహమాడాడు. టాగోర్లు బెజ్ బరూవాను ఒక బెంగాలీ సాహిత్యవేత్తగా మార్చాలనుకున్నారు. కాని రక్తం కన్నా నీళ్ళు మరింత చిక్కన అని బెజ్ బరూవ నిరూపించాడు. ‘జానకి’ అనే పత్రిక స్థాపించి అస్సామీని కూడా బెంగాలీ సరసన నిలబడగలిగే భాషగా రూపొందించడమే జీవితధ్యేయంగా మార్చుకున్నాడు.

కానీ జీవితం అతడికి నల్లేరు మీద బండినడక కాలేదు. అధికభాగం బెంగాల్లోనూ, ఒరిస్సాలోనూ ప్రవాసిగానే జీవించవలసి వచ్చింది. అరవై ఏళ్ళ వయసులో సంబల్ పూర్ లో కలప వ్యాపారం మొదలుపెట్టవలసి వచ్చింది. టీ ఎస్టేటు మేనేజరుగా పోట్టపోసుకోవలసి వచ్చింది. కాని అతడు బ్రహ్మపుత్రకి ప్రియమైన బిడ్డ కాబట్టి, చివరిరోజుల్లో డిబ్రూగర్ లో తన కూతురి ఇంటికి వచ్చినవాడు అక్కడే, అంటే బ్రహ్మపుత్ర ఒడ్డునే, అనూహ్యంగా తనువు చాలించాడు.

బెజ్ బరూవ మీద రూపొందించిన ఆ ఎగ్జిబిషను చాలా నిర్దుష్టమైన, విద్యాదాయకమైన డాక్యుమెంటేషను. అతిశయోక్తులు లేకుండా ఒక యుగపురుషుడి జీవితగమనాన్ని ఉన్నదున్నట్టుగా వివరించే చిత్రణ. ఆ హాలు చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి పందొమ్మిదో శతాబ్దినుంచి ఇరవయ్యవ శతాబ్ది తొలిరోజులదాకా బెంగాల్-అస్సాం యాత్ర చేసిన అనుభూతి కలుగుతుంది.

ఆ ప్రదర్శన చూస్తున్నంతసేపూ నా మదిలో మెదుల్తున్నదొకటే: ఇటువంటి ఒక డాక్యుమెంటేషన్ విజయనగరంలో గురజాడ మీద, రాజమండ్రిలో వీరేశలింగం మీద, ఖమ్మంలో దాశరథి మీద, వరంగల్ లో కాళోజీ మీద, పొద్దుటూరులో పుట్టపర్తి మీద ఎందుకుండదు? మన సమాజాన్ని నిర్మించిన వాళ్ళ మీద, మనకొక ఆధునిక సభ్యతనీ, సంస్కారాన్నీ అలవర్చిన వాళ్ళ పట్ల మనకి ఎందుకింత మరపు? మన పిల్లలకి మనం వాళ్ళ గురించి ఏ సమాచారం మిగిల్చి వెళ్ళబోతున్నాం?

3

శంకరదేవ కళాక్షేత్రం లో ప్రధానమైన ఎగ్జిబిషన్ శ్రీమంత శంకర దేవ కి సంబంధించిందే. అందులో శంకరదేవ రూపొందించిన సత్త్రియా నృత్యానికి, రంగస్థలానికీ సంబంధించిన దుస్తులు, సంగీత పరికరాలు, నాట్యసామగ్రి, చిత్రపటాలతో పాటు నాట్యభంగిమల ఫొటో ప్రదర్శన కూడా ఉంది. కింద శంకరదేవ సాహిత్య విక్రయ కేంద్రం కూడా ఉంది. ఆ ప్రదర్శన మొత్తం కలయదిరిగాను. ఆ విక్రయకేంద్రంలో శంకరదేవ్ రాసిన ‘పారిజాత హరణ్’ నాటకం ఇంగ్లీషు అనువాదంతో పాటు, The Blessed Island: A Selection of Writings on Majuli and the Neo-Vaishnavaite Movement in Assam (2013) అనే పుస్తకం కూడా కొనుక్కున్నాను.

ఆ పుస్తకం చదవడం దాదాపుగా పూర్తయింది. ఆ వ్యాసాలు చదివినకొద్దీ శంకరదేవ నాకు మరింత ఆరాధనీయంగా కనిపిస్తున్నాడు.

నిజమే, అయిదువందల ఏళ్ళ కిందట ఆయన చేపట్టిన ఒక సామాజిక-ధార్మిక ప్రయోగం ఇప్పటి అస్సాం కి కురచగా అనిపించవచ్చు. ఆయన స్థాపించిన సత్త్రాలు ఎటువంటి హీన స్థితికి దిగజారాయో, ఇందిరా గోస్వామి తన ‘విషాద కామరూప’ లో వివరించిందని మా అక్క, నేను అక్కడ ఉండగానే, ఆ కథ మొత్తం చెప్పుకొచ్చింది. శంకరదేవ పట్ల ఒక ఆధునిక అస్సామీ యువకుడి వైఖరి ఏమిటో బహుశా, ప్రణబ్ కుమార్ బర్మన్ రాసిన, ఈ కవిత బాగా వివరిస్తుందనుకుంటాను.

శంకరదేవ

మనం ప్రస్తుతానికి అతడు శంకరదేవ అనే అనుకుందాం
అతడు భూర్జపత్రాల మీద కీర్తనఘోష రాస్తున్నప్పటి కాలం,
ఆ ఫుట్ పాత్ నే అతడి సత్త్రం. 
అతడు ధ్యానిస్తున్నాడు,
బహుశా పానీ బజార్ బస్ స్టాపులో ఒక హోర్డింగు మీదకి
స్వర్గానెట్లా దింపాలా అని యోచిస్తూండొచ్చు.
‘అదేమిటది? అతడు శంకరదేవ ఏమిటి?’ అంటారేమో మీరు.
ఎండకి మాడిపోయిన ఆ దేహం, చిరిగిపీలికలైన అంగీ
ప్రాణంలేని చూపులు, జడలు కట్టిన జుత్తు, ఆ అంగోస్త్రం
‘నీ మాటలు నమ్మలేం’ అంటారు మీరు
ఉబ్బిన పొట్ట, తారునలుపు చర్మం
వంటిని కప్పుకున్న గోనెపట్ట
అట్టలు కట్టిన జుట్టు, మాసినగడ్డం
శరీర దుర్గంధం, పీక్కుపోయిన కళ్ళు
కాదు, అతడెప్పటికీ కాడు, థూ!

కానీ, ఊహించండి, శంకరదేవకిప్పుడు ఆరువందల ఏళ్ళ వయస్సు
అతడిప్పుడు కూచ్ బీహరునుంచి మనదగ్గరికి వస్తున్నాడు.
దారిలో యుద్ధాలు చూసాడు, జయాపజయాలు చూసాడు
రాజు కాందిశీకుడు కావడం చూసాడు, యండబూ ఒప్పందం చూసాడు
పత్తరిఘాట్ మారణహోమం చూసాడు, 
కుశాల్ కొన్వర్ ఉరికొయ్యకి వేలాడటం చూసాడు.
స్వాతంత్ర్య పోరాటం చూసాడు
జబ్బు లాగా నల్లమందు వ్యాపించడం చూసాడు
భాష మరణించడం చూసాడు, ‘జానకి’ ప్రభవించడం చూసాడు.
కవుల దాస్యం, భాషోద్యమం, గొప్ప డిప్రెషన్
మానభంగాలు, లాఠీ ఛార్జి, తుపాకుల మోతలు, దేశవిభజన చూసాడు.
అవినీతి చూసాడు, ఉద్యోగాలు అమ్ముకోడం, కొనుక్కోడం చూసాడు
న్యాయస్థానాల్లో మాటికిమాటికి మారిపోయే 
న్యాయదేవత ముఖాన్ని చూసాడు
రక్తమాంసాలు లేని వాళ్ళని, తమకంటూ తల్లివేరులేని వాళ్ళని చూసాడు
చివరికి ఫాషన్ షోలూ, బ్లూ ఫిలిమ్సూ కూడా చూసాడు.
ధోకువాఖానాలో ఆకలి ఎలా ఉంటుందో చూసాడు
అమరజీవుల అంతులేని జాబితాలు చూసాడు
అబద్ధాలు రాస్తున్న పాత్రికేయుల్ని చూసాడు.

ఇవన్నీ చూసి చూసి అతడికి మతిభ్రమించింది, మూగవాడైపోయాడు, చెవిటివాడయ్యాడు, గుడ్డివాడయ్యాడు.
ఫుట్ పాత్ మీద ప్రవాస జీవితం మొదలుపెట్టాడు.
ఇప్పుడతడు విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుడు.
ఆకలికీ, చలికీ, తిమ్మిరికీ అతీతుడు
నిద్రకీ, నొప్పికీ అతీతుడు, సంధిప్రేలాపన చేస్తున్నాడు
ఆరువందల ఏళ్ళ చరిత్ర అతణ్ణి దేవుణ్ణి చేసేసింది
ఇప్పుడతడు నిరుపేద దేవుడు, నపుంసక దేవుడు.
అతడు శంకరదేవ కాడని మీరనలేరు
మీకు ఒక జీవితకాలానికి సరిపడా నమ్మకాలిచ్చిందతడే.
ఇప్పుడు దయనీయ జీవితం జీవిస్తున్నందుకు మీరతణ్ణి విస్మరించలేరు
అతడే కదా అన్నాడు: ‘కుక్క, నక్క, గాడిద 
ప్రతి ఒక్కటీ రాముడి రూపమే’ నని.

ప్రస్తుతానికి మనం కొంతసేపు అతడు శంకరదేవ అనే అనుకుందాం
అలా అనుకుంటే ఎవరికీ వచ్చేదీ ఏమీ లేదు, పోయేదీ ఏమీ లేదు.

అపారమైన ఆవేదనతోనే తానీ కవిత రాసినట్టుగా ఆ కవి భావిస్తూండవచ్చు, ఎంత అణిచిపెట్టుకున్నా, శంకరదేవ పట్ల అతడి గౌరవం దాగకుండా బయట పడుతుండటం కూడా నిజమే కావొచ్చు. కానీ, నేనీ యువకవిని అభినందించ లేకపోతున్నాను. ఎందుకంటే, ఒక రాజ్యాంగం నీడన, ఆధునిక జీవితం సమకూరుస్తున్న ఎన్నో సదుపాయాల మధ్యన జీవిస్తున్నవాళ్ళం మనం. మనం తలపడుతున్న మన సమస్యల కన్నా ఆరువందల ఏళ్ళ కిందట శంకరదేవ తలపడ్డ సమస్యలు మరెంతో తీవ్రమైనవి. ఆ సమస్యలతో పోరాడటానికి ఆయన ముందు ఎటువంటి నమూనా లేదు. తానే ఏదో ఒక విధంగా ఒక ఉద్యమాన్ని రూపొందించుకున్నాడు, దాన్ని తన జీవితంగా మార్చుకున్నాడు. అంతే తప్ప, తాను చూస్తున్న సమస్యలకు పరిష్కారం చెప్పలేకపోతున్నారని, తన పూర్వకవుల మీద కవితలు రాయలేదు.

మనం అనుసరించవలసింది శంకరదేవ ఏమి చెప్పాడన్నది కాదు. అతడు తన దారి ఎలా వెతుక్కున్నాడన్నది, ఎలా తన జీవితాన్ని రసమయం చేసుకున్నాడన్నది, ఆ రసయాగాన్ని ఎలా ప్రజాయత్తం చేసాడన్నది. ఆ ప్రయత్నంలో అతడు జాతికి అందించిన సంస్కారం ఏదో ఒక రూపంలో ఆరువందల ఏళ్ళ తరువాత కూడా ఎలా బతికి ఉన్నదన్నది.

‘మీకు అస్సాం గురించి తెలుసునా?’ అనడిగాను నేను ఆ అసాం ప్రభుత్వ అధికారుల్ని, శిక్షణ ముగింపు సమావేశంలో. ఎంతో అడాసిటీతో కూడుకున్న ఆ ప్రశ్న ఎందుకడిగానో అర్థం కాక, వాళ్ళు నా వైపే చూస్తూంటే, నేనిట్లా చెప్పాను:

‘దేశంలో దళితుల మీద అత్యాచారాలు అతి తక్కువ నమోదయిన రాష్ట్రాల్లో అస్సాం కూడా ఒకటి. ఎందుకో తెలుసా? మీ మధ్య ఒకప్పుడు శంకరదేవ జీవించడం కూడా ఒక కారణం కాబట్టి. కులాలకీ, మతాలకీ అతీతమైన మానవత్వ సంస్కారాన్ని మీకు అలవర్చాడు కాబట్టి.’

18-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: