కామరూప-6

విష్ణు ప్రసాద్ రాభా

అసాం గవర్నరు బంగళాకి వెళ్ళేటప్పుడు దారిలో ఒక విగ్రహం కనిపించింది. ‘అదెవరు? బెజ్బరువా నా?’ అనడిగాను నాతో పాటు ప్రయాణిస్తున్న అస్సామీ యువకుడు జ్యోతిర్మొయి శర్మని. ‘కాదు, రాభా ‘ అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఆ ఊళ్ళో ప్రధాన రహదారి జి.ఎస్ రోడ్ మీద రాభా పేరిట ఒక ఫ్లై ఓవర్ కూడా ఉందని.

‘ఎవరాయన?’ అని అడిగాను.

ఆ యువకుడు ఒక్క మాటలో జవాబివ్వలేదు.

‘మామూలుగా మనం ఒక కవినో, గాయకుణ్ణో, చిత్రకారుణ్ణో చూస్తాం. కొంతమంది కవిత్వం రాస్తారు, పాటలు పాడతారు కూడా. కొంతమంది కవిత్వం రాసి పాటలు పాడి నాట్యం కూడా చేస్తారు. కొంతమంది స్వాతంత్ర్యం కోసం పోరాడతారు. కొంతమంది విప్లవం కోసం జైలుకి వెళ్తారు. కాని ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తిలో కనిపిస్తే అతణ్ణే విష్ణు ప్రసాద్ రాభా అంటారు’ అన్నాడు. ‘అందుకనే అస్సామీయులు ఆయన్ని కళాగురు అని పిలుస్తారు’ అని కూడా అన్నాడు.

విష్ణు ప్రసాద్ రాభా!

ఈ పేరింతదాకా వినలేదే. నాకు సిగ్గనిపించింది. భారతీయ సాహిత్యం గురించీ, సంస్కృతి గురించీ ఎంతో కొంత తెలుసనుకునే నేను ఇంత బహుముఖ ప్రజ్ఞావంతుడి గురించి, ఇంత గొప్ప ఉద్యమకారుడిగురించి ఇంతదాకా వినలేదే. బహుశా జీవితకాలం పర్యటిస్తున్నా కూడా నా డిస్కవరీ ఆఫ్ ఇండియా పూర్తికాదేమో అనిపించింది.

ఆ తర్వాత రాభా గురించి తెలుసుకునేకొద్దీ నా ఆశ్చర్యానికి అంతులేదు. రాభా (1909-1969) అరవై ఏళ్ళ జీవితంలో ఎన్నో జీవితకాలాల కృషి చేసి వెళ్ళిపోయాడు. అతడు కవి, గాయకుడు. తాను రాసిన దాదాపు వందగీతాలకు తానే స్వరకల్పన చేసుకున్నాడు. అది రాభా సంగీత్ గా ప్రసిద్ధి చెందింది. భూపేన్ హజారికా కి అతడే స్ఫూర్తి. రాభా ‘వన థియేటర్’ పేరిట నాట్యబృందాన్ని ఏర్పాటు చేసాడు. ‘తాండవ నృత్యం’ పేరిట రూపకల్పనచేసి అభినయించిన నాట్యాన్ని చూసి ఉదయశంకర్ వంటివాడే ఆయనదగ్గర నాట్యం నేర్చుకోడానికి ఉత్సాహపడ్డాడు. రాభా రచయిత కూడా. అతడు గిరిజనుల మీద రాసిన పుస్తకాల వల్ల ఇప్పుడతణ్ణి అసాంకి చెందిన మొదటి యాంత్రొపాలజిస్టుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తూ, అతడు చలన చిత్ర రంగంలో చేసిన కృషి మరొక ఎత్తూ. జ్యోతి ప్రసాద్ అగర్వాలా స్ఫూర్తితో ఆయన చలనచిత్రాల్లో నటించాడు, సంగీతం సమకూర్చాడు, పాటలు పాడాడు, దర్శకత్వం వహించాడు. తన యవ్వనకాలంలో జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర నిర్వహించాడు. దేశానికి 1947 లో వచ్చిన స్వాతంత్ర్యం అసాం కి ఎటువంటి మేలూ చేసేది కాదని పోరాటం కొనసాగించడంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాభాకి ప్రవాసం, జైలు తప్పలేదు. తర్వాత రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసి తేజ్ పూర్ నుంచి ఎమ్మేల్యే గా ఎన్నికయ్యాడు. తన ఆస్తిపాస్తులు బీద రైతులకీ, తేజ్ పూర్ విశ్వవిద్యాలయానికీ పంచేసాడు.

అన్నట్టు మర్చిపోయాను, రాభా చిత్రకారుడు కూడా.

కళలూ, పాండిత్యం, ఉద్యమం, త్యాగం ఇట్లా ఒక్క చోట పోగుపడ్డ మనిషి ఆధునిక తెలుగు సాంస్కృతిక రంగంలో ఎవరేనా ఉన్నారా? నాకైతే కనిపించడం లేదు.

ఆలోచించగా నాకేమితోచిందంటే, ఇటువంటి బహుముఖ ప్రజ్ఞావంతుల పరంపర ఒకటి అసామీ సంస్కృతిలో తొలినాళ్ళనుంచీ కొనసాగుతూ వస్తున్నదని. అసామీ కవిత్వం గురించి నాకు పరిచయం చేసిన ఆ ఉన్నతాధికారి ఆధునిక అస్సామీ కవిత్వంలోని వచన కవిత్వధోరణులకు చెందిన కవుల్నే పరిచయం చేసాడుగాని, వారి పక్కనే, వారి కన్నా ఎన్నో ఏళ్ళ ముందునుంచీ ఒక పదకర్తల, వాగ్గేయకారుల పరంపర కూడా కొనసాగుతూ వస్తున్నదని ఆయన చెప్పకపోయినా నేను గ్రహించగలిగాను.

నేనింతకాలం టాగోర్ ఒక్కడే బహుముఖీనమైన సృజన సాగించిన కళాకారుడని భావిస్తూ వచ్చాను.కాని ఇరవయ్యవ శతాబ్ది అసాంలో జ్యోతి ప్రసాద్ అగర్వాలా, విష్ణు ప్రసాద్ రాభా, భూపేన్ హజారికా లతో పాటు ఇప్పుడు మన సమకాలికులైన జుబీన్ గర్గ్, అంగరాగ్ మహంతిలదాకా సాగిస్తూ వస్తున్న సృజన నన్ను నివ్వెరపరిచింది. టాగోర్ కవి, సంగీతకారుడు, నాట్యశిల్పి, విద్యావేత్త, చిత్రకారుడు, నిజమే కాని, చలనచిత్రకళ ఒకటి ఆయనకు దూరంగా ఉండిపోయింది. స్వయంగా రాజకీయ పోరాటం చేసి, జైలుకి వెళ్ళిన అనుభవం ఆయన జీవితంలో లేదు. విష్ణు ప్రసాద్ రాభా ఒక్క జీవితకాలంలో చేసిన కృషి వంటిది చేయడానికి కనీసం ముగ్గురు టాగోర్ లు అవసరమవుతారు.

2

ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలురు ఆధునిక భారతదేశంలో మరే భాషలోనైనా ప్రభవించారా? కోట శివరామకారంత, ఎం. టి. వాసుదేవన్ నాయర్ లు కొంత వరకూ సమీపంగా రాగలరు గాని, కారంత సంగీతకారుడు కాడు, నాయర్ చిత్రకారుడు కాడు. అసలు ఇటువంటి ఉజ్జ్వల మూర్తిమత్వం కలిగిన కళాకారులు అసాంలో మటుకే ప్రభవించడానికీ, తక్కిన భారతదేశంలో కనిపించకపోడానికీ కారణమేమై ఉంటుంది?

ఆలోచించిన కొద్దీ నాకు స్ఫురింస్తున్నదొకటే, ఈ ఘనత మొత్తం అస్సాం సంస్కృతీ నిర్మాత శంకరదేవ కే చెందుతుందని. శంకరదేవ కళద్వారా సామాజిక సంస్కరణకు పూనుకున్నాడు. ఆయన నవ్యవైష్ణవంలో వ్రతాలూ, పూజలూ, తీర్థయాత్రలూ లేవు. ఉన్నదల్లా నామఘోష ఒక్కటే. భగవంతుణ్ణి కీర్తనం ద్వారానే సమీపించగలమని నమ్మాడు. అందుకోసం నామ ఘర్ లు ఏర్పాటు చేసాడు. భగవంతుడి సన్నిధిని అనుభవంలోకి తెచ్చుకోడానికి అక్కడ ఆయన ఏర్పాటుచేసుకున్న సామగ్రి పాటలు, నాటకాలు, నాట్యాలూ, సంగీతమూను. ఆయన అసామీలో మొదటి నాటక రచయిత. మొదటి లలిత గీత రచయిత. మొదటి నాట్యశిల్పి. మొదటి కాస్ట్యూంస్ డిజైనర్. రంగస్థల శిల్పి.

ప్రజల హృదయాల్ని మెత్తబరచాలంటే, ఒకరిపట్ల ఒకరికి ఆత్మీయత అంకురించాలంటే, లలితకళలకన్నా మరొక దగ్గరదారిలేదని గ్రహించడమే శంకరదేవను తక్కిన భక్తికవుల నుంచీ, భారతీయ ఆధ్యాత్మిక ఆచార్యుల నుంచీ ప్రత్యేకంగా నిలబెడుతున్నది.

శంకరదేవ కు భాగవతమతాన్ని ప్రచారం చేయడం ప్రధాన ధ్యేయం కాదు. ఆయన తన మతాన్ని ప్రచారం చెయ్యదలచుకుంటే అంత కష్టపడవలసిన అవసరం లేకుండా అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న ప్రజాకళారూపాలతో సునాయాసంగా చెయ్యగలిగి ఉండేవాడని ఒక విమర్శకుడు రాసిన మాటల్తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మతాన్ని కాదు, మానవత్వాన్ని పెంపొందించాలనుకున్నాడు కాబట్టే శంకరదేవ అంత సుకోమలమైన లలితకళా సృష్టికి పూనుకోవలసి వచ్చింది.

ఆయన తన సాహిత్య సృష్టికోసం ప్రత్యేకంగా ఒక భాషని రూపొందించుకున్నాడు. అస్సామి, మైథిలి, హిందీ, సంస్కృతాలతో కూడిన ఆ భాషని ‘బ్రజ్ బులి’ అని పిలిచాడు. ఆ పదాలూ, ఆ పదసంయోజనం ప్రజల్లో ఒక సంస్కారాన్ని అలవరచడం కోసం రూపొందించుకున్నవి. ఆ భాష ఎలా ఉంటుందో చూడాలంటే, ఆయన బోర్ గీత్ లు వినాలి. ఈ గీతం చూడండి:

మధుర మూరుతి మురారు
మన దేఖో హృదయె హమారు
రూపె అనంగ సంగ తులనా
తను కోటి సురుజ ఉఝియారు.

మకరకుండల గండమండిత ఖండిత
చందరుచి స్మితహాస
కనక కిరిట జడిత రచనా నవ
నీరజ నయన బికాస.

చతుర ఉజ్జ్వలకర కంకణ కెయుర
భుజ మహ మొతిమ హారు
లీలా బినోది కంబు కౌముది
చక్ర కెరి కంజధారు.

శ్యామ శరిర రచిత పితాంబర
ఉరె బన మాలా లోలె
కౌస్తుభ శొభిత కంఠ కటి కాంచి
కింకిణి కనయా డోలె.

అరవింద నింది పావ నవ పల్లవ
రతన నూపుర పరకాసా
భకత పరమ ధన రాహే మజొక మన
శంకర ఏహు అభిలాసా.

మనసా, మధురం ఆ మురారి రూపు చూడు

మనసా, మధురం ఆ మురారి రూపు చూడు,
మన్మథుడు, కోటి సూర్యుల్లాగా వెలుగుతున్నాడు.

చెక్కుల్ని అలంకరిస్తున్న ఆ కుండలాలు
చంద్రవంకలాగా మెరుస్తున్న చిరునవ్వు.
రత్నాలు పొదిగిన బంగారు కిరీటం ధరించాడు
ఆ నయనాలు, అప్పుడే విరిసిన కమలాలు.

నాలుగు చేతుల్నీ అలంకరించిన కంకణాలు
ఆ భుజాల నడుమ ముత్యాల పేరు.
ఆ లీలావినోది ఒక చేత శంఖం,
ఒకచేత గద, మరొక చేత చక్రం,పద్మం.

ఆ శ్యామశరీరం మీద పరిచిన పీతాంబరం,
ఉరాన వనమాల, కౌస్తుభశోభితకంఠం.
నడుం చుట్టూ బంగారు మొలనూలు, 
సన్నగా మోగుతున్న చిన్నిచిన్నిగంటలు.

అప్పుడే పూసిన తామరపూలు కూడా సిగ్గుపడే
సౌందర్యంతో అలరారే రత్ననూపుర ప్రకాశం.
భక్తుల పాలిట పరమనిధి, ఆ చరణాల మ్రోల
మనసు నిల్పడమొక్కటే ఈ శంకరుడి అభిలాష.

ప్రతి భాషా సాహిత్యభాషగా మారేటప్పుడు ఆదికవులు, తొలినాళ్ళ మహాకవులు ఇటువంటి ప్రయోగాలే చేసారని మనకు తెలుసు. వాల్మీకి, నన్నయ, ఛాసర్, డాంటే, పుష్కిన్, తులసీ చేసిన ప్రయోగాలు ఇటువంటివే. వాళ్ళు పదాల్నీ, పదబంధాల్నీ, వాక్యనిర్మాణాన్నీ, ఛందస్సుల్నీ అన్వేషిస్తున్నప్పుడు, వాళ్ళ అన్వేషణ కేవలం కావ్యభాషాన్వేషణ కాదు. అదొక సంస్కృతికోసం అన్వేషణ. మనుషుల్ని కలిపి ఉంచగల ఒక సిద్ధాంజనం కోసం, జాతిని బతికించగల ఒక సంజీవని కోసం అన్వేషణ.

వాల్మీకి కూడా తన రామాయణకావ్యం తంత్రీవాద్యాలమీద గానయోగ్యంగా ఉండేటట్టు రూపొందించానని చెప్పుకున్నాడు. ఆ మహాకవుల వారసుడిగా శంకరదేవ కూడా తన గీతాల్ని సంగీత,నాట్య, సంస్కృతీ వాహికలుగా రూపొందించాడు. ఎన్నడో ఏ తాంత్రిక ఆరాధనల్లోనో వజ్రయాన బౌద్ధులు పాడుకున్న చర్యాగీతులనుంచి ప్రభవించిన అసామీ భాషని, మాధవకందళి రామాయణంద్వారా కావ్యభాషగా మారిస్తే, శంకరదేవ దాన్నొక శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమంగా బలపరుచుకున్నాడు. ఆ రాసాయనిక ప్రక్రియకి ఆయనముందున్నవి జయదేవుడి గీతగోవిందమూ, మాధవకందళి రామాయణమూ, అసామీ గిరిజనుల జానపద గీతాలూ మాత్రమే. కాని, ఆ మూలద్రవ్యాలనుంచే ఆయన రూపొందించిన మూసల నుంచే ఇప్పటికీ మహాకళాకారులు ప్రభవిస్తూనే ఉన్నారు. కేవలం పాటలు రాయడం, బాణీలు కట్టుకోవడం కాదు, ఆ పాటలు పాడి ప్రజల్ని మేల్కొల్పుతున్నారు.

విష్ణు ప్రసాద్ రాభా గీతం ఒకటి మచ్చుకి వినాలంటే, భూపేన్ హజారికా గానం చేసిన ఈ ‘సూరారే దెవులారే’ అనే ఈ గీతం వినొచ్చు.

17-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: