
ఆ మధ్యాహ్నం అట్లా గౌహతిలో బ్రహ్మపుత్ర దక్షిణతీరాన, ఖర్గూలి హిల్స్ మీద నెలకొన్న గవర్నరు సెక్రటేరియట్ లో, అసామీ కావ్యపఠనం సాగుతూ ఉంది. గొహోయిన్లు పూర్వకాలపు అహోము రాజవంశీకుల వారసులు కావడం వల్ల సంజీవ్ గొహాయిన్ బారువా పాలనాధికారిగా ఉండటమయితే ఉన్నాడు గాని, ఆయనవంట్లో, ఆ రక్తంకన్నా, బ్రహ్మపుత్ర జలాలే ఎక్కువ చిక్కగా ఉన్నాయని అర్థమవుతూ ఉంది.
కార్యాలయ సిబ్బంది తపాలు తెచ్చి ఆయన బల్ల మీద పెట్టారు. అర్జెంటుగా సంతకం పెట్టవలసిన కాగితాలు లెటర్ హెడ్ మీద ఫెయిర్ కాపీ చేసి ఆయనముందు పెట్టారు. కాని ఆయన దృష్టి వాటిమీద లేదు. నవకాంత్ బారువా కవితలు ఏవి వినిపిస్తే తాను తన గురువుకి న్యాయం చెయ్యగలనా అన్నదానిమీదనే ఆయన సతమత మవుతున్నాడు. ఎట్టకేలకు బారువాది మరొక కవిత, ‘కొలతలు’ అనే కవిత, వినిపించాడు.
కొలతలు
సాయంకాలమైంది
పద పోదాం, దర్జీకి కొలతలిచ్చి వద్దాం.
మెడ, ఛాతీ, భుజాలు, చేతులు
బొటనవేలి కొలతలు.
అరచేతివీ, హృదయానివీ కూడా కొలతలిద్దాం.
పేగులు, ప్లీహం, కాలేయం
ఎన్ని హార్మోన్లున్నాయో, ఎంత ప్రేమ ఉందో లెక్కచెప్దాం.
జీవితానికీ, దానికీ, దీనికీ
రకరకాల వాటన్నిటికీ కొలతలిద్దాం.
మనపని కొలతలివ్వడం వరకే.
దుస్తులు కుట్టించుకోడం సంగతి తర్వాత చూసుకుందాం.
ప్రస్తుతానికి కొలతలిద్దాం, చాలు.
మనం చేయగలిగిందల్లా కొలతలివ్వడమే
లెక్కలు సరిచూసుకోడమే
ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందని
నమోదు చేసుకోవడమే.
ఒక ప్రసంగంలో ఎన్ని అక్షరాలు దొర్లాయో లెక్కచూపడమే.
అరేబియాలో క్రైస్తవులెంతమంది ఉన్నారో లెక్కకట్టడమే.
కొలతలివ్వడం మటుకే
దుస్తులు కుట్టించుకోడం సంగతి తర్వాత ఆలోచిద్దాం
అప్పుడు కూడా ఆలోచించడం మటుకే.
మన తర్వాత మళ్ళా ఎవరో
మన లెక్కలన్నీ తప్పని చెప్తూ
మళ్ళా కొత్తగా లెక్కలు సరిచూస్తారు.
కొత్తగా మళ్ళా కొలతలు తీసుకుంటారు.
ఇంతకీ మనిషికి సరిపోయేటట్టు
కొత్తవస్త్రాలెవరన్నా కుట్టిపెట్టేదెప్పుడని!
‘అసలు ఆధునిక అసామీ సాహిత్యంలో కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళిన ఘనత హీరేంద్ర నాథ్ భట్టాచార్యది’ అంటో మరొక కవితాసంపుటి తన చేతుల్లోకి తీసుకున్నాడు సంజీవ్ బారువా. ‘అసాంలో హీరేన్ దా కవిత్వం చదివి ఉండని మనిషి ఎవరూ కనిపించరు మీకు, ఆయన కవిత్వాన్ని ఒక పాపులర్ ఆర్ట్ ఫామ్ గా మార్చేసాడు’ అన్నాడు. తన చేతుల్లో ఉన్న అసామీ కవితాసంపుటిలోంచి హీరేన్ దా వి ఒకటి రెండు కవితలు చదివి వినిపించాడు. కాని, వాటికి అర్థం చెప్పలేదు. అందుకు బదులు, హీరేన్ దా కవిత్వానికి Ancient Gongs: Selected Poems of Hiren Bhattacarya అనే పేరిట ప్రదీప్ ఆచార్య అనే ఆయన చేసిన అనువాదసంపుటి మా ముందు పెట్టాడు. అప్పుడు హీరేన్ రాసిన అసామీ కవిత ఒకటి చదివి, దానికి ప్రదీప్ ఆచార్య ఇంగ్లీషు అనువాదం వినిపించాడు. అలా రెండు మూడు కవితలు వినిపించాక, ‘ఈ అనువాదకుడు హీరేన్ దా ని ఎంత చక్కగా అనువదించాడో మీకు తెలియాలంటే, మీరీ కవిత చూడాలి ‘అంటో ‘అసంభవ అనువాద్’ అనే ఒక కవిత వినిపించాడు. ఆ అనువాదకుడు, ప్రదీప్ ఆచార్య దాన్ని Untranslatable అని అనువదించాడు. ఆ ఇంగ్లీషు అనువాదం ఇలా ఉంది:
Untranslatable
give an excuse, I can go away,
whenever I want, I will go
on the enticing night of your nearness,
given any excuse-
opening the way to genius,
and this your presence
that leans on solitude,-
it is impossible to translate.
I will go through this chequered moonlight,
on tiptoes.
(some redolent night…)
ఆయన హీరేన్ దా రాసిన ఒక కవిత చదవడం మొదలుపెట్టగానే నాతో వచ్చిన యువకుడు జ్యోతిర్మొయి ఆ తర్వాతి పంక్తులు అప్పగించడం మొదలుపెట్టాడు. ఆయన ఆ కవిత చదవడం ఆపి, అతణ్ణే మురిపెంగా చూస్తూ ‘మొత్తం కవిత చెప్పు’ అన్నాడు. ఆ యువకుడు ఆ కవిత మొత్తం చెప్పగానే ఆయన ముఖంలో గొప్ప రిలీఫ్ కనిపించింది. అసామీ కవిత్వాన్ని యువతరం పట్టించుకోవట్లేదనే ఒక వేదన నుంచి ఆయన కనీసం కొంతసేపేనా బయటపడ్డట్టే కనిపించాడు.
ఇంతలో టీ, స్నాక్స్ వచ్చాయి. ఎక్కణ్ణుంచో ప్రొటోకాల్ కి సంబంధించి అర్జెంటు ఫోన్ ఒకటి వచ్చింది. ఆ కాల్ ఆన్సరు చేస్తూనే మా వైపు తిరిగి ‘హీరేన్ దా తర్వాత 70ల్లో కొత్త కవులు వచ్చారు. వాళ్ళల్లో గిరిజన కవులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మిషింగ్ తెగకి చెందిన కవులు. వాళ్ళు తమ గిరిజన భాషల పదబంధాల్నీ, తమ ఎమోషన్స్ నీ అసామీలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎనభైల కవులు. ఇక తొంభైలనుంచీ అసామీ కవిత్వం రూపురేఖలు మారిపోయాయి’ అంటో ఆయన నిలిం కుమార్ అనే కవి కవితలు నాలుగైదు వినిపించాడు. అవన్నీ చిన్న చిన్న కవితలు. యాభైల కవిత్వంలోని అమాయికత్వం, అనురాగం ఆ కవితల్లో కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో ఒక ఐరనీ, శీతలవ్యంగ్యం వచ్చి చేరాయి.
‘ఇక సమకాలిక కవుల్లో చెప్పదగ్గవాడు ప్రభాత కుమార్ బర్మన్’ అంటో అతడు రాసిన ‘ఒక సూయిసైడ్ నోట్’ అనే కవితను పఠించడం మొదలుపెట్టాడు. ఆ కవితలో అసామీ కన్నా ఇంగ్లీషు పదజాలమే ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన అనువదించి చెప్పనవసరం లేకుండానే ఆ కవిత అర్థమవుతూ ఉన్నది. అది ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకునేముందు రాసిన నోట్ కి కవితా రూపం. చాలా హృదయవిదారకంగా ఉన్న ఆ కవిత ఆయన పూర్తిగా చదివి ఉంటే నేను అక్కడే భోరున ఏడ్చేసి ఉండేవాడినేమో. కాని ఆయన కూడా ఆ కవిత పక్కన పెట్టేసి ‘ఇంతసేపూ నేనే మాట్లాడేను, మీ గురించి చెప్పండి’ అన్నాడు. కాని నేను ‘ఇప్పుడు మీ కవిత్వం వినిపించండి సార్ ‘ అన్నాను.
‘నేను కవిని కానని చెప్పాను కదా ‘ అన్నాడాయన.
‘ఆ మాట మీరింతకుముందు చెప్పినప్పుడు నమ్మాను. ఇప్పుడు నమ్మలేను. ఇటువంటి కావ్యపిపాసి కవిత్వం రాయకుండా ఉంటాడంటే నమ్మలేను’ అన్నాను.
అప్పుడాయన లేచి మళ్ళా తన వెనక ఉన్న రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న తన బాగ్ లోంచి ఒక బొత్తి బయటకు తీసాడు. ‘ఆహా, కవి ఎక్కడైనా సరే కవి కాకుండా పోతాడా’ అనుకున్నాను. ఆయన ఆ కాగితాల కట్ట తీసుకొచ్చి మళ్ళా కుర్చీలో కూచుని, ఒక కవిత తీసి వినిపించడానికి ముందు, ఆయన ఆ కవితకు పెట్టిన శీర్షిక గురించి చిన్న ఉపోద్ఘాతమే చెప్పాడు. కవులంతా చేసే పనే అది. కాని, ఆ కవిత బహురమ్యంగా ఉంది. స్థూలంగా ఆ భావం ఇదీ: కవి ఒకామెని ప్రేమించాడు. కాని ఆమె అతణ్ణి తిరిగి ప్రేమించలేదు. కవి స్వాభిమానం దెబ్బతింది. అతడు తన ప్రేమను ఆమెకి అప్పగించేయాలనుకుని ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. అడవులు, కొండలు, నది, నగరం, సూపర్ బజారు, బ్యూటీ పార్లరు ప్రతి ఒక్కచోటా ఆమె కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆమె ఎక్కడుందో కనుక్కోగలిగాడు. ఆమె తన ఇంట్లో ఉన్న ప్రేమకవిత్వంలో దాగి ఉందని గ్రహించాడు. ఇంటికొచ్చి ఆ ప్రేమకవిత్వం తిరగేయడం మొదలుపెట్టాడు.
‘కాని నేను నిజానికి ఫొటోగ్రాఫర్ ని. కలం కన్నా కెమేరానే నాకు ఎక్కువ దగ్గర. నేను కజిరంగ అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ ని పట్టుకోవడంతో నా సాధన మొదలుపెట్టాను. కాని ఇప్పుడు ఎక్కువ నగర జీవిత దృశ్యాలే చిత్రిస్తూ ఉంటాను. నాకో ఫేస్ బుక్ పేజి ఉంది (https://www.facebook.com/sanjib.gohainboruah) రోజూ ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ఉంటాను. సోలో ఎగ్జిబిషన్లు పెట్టడం కన్నా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే ఎక్కువ సౌకర్యంగా ఉంది నాకు’ అని చెప్పాడాయన. ‘మనం తియ్యాలనుకున్న ఫొటో మనకెప్పుడు ఎదురవుతుందో చెప్పలేం. అందుకని ఎప్పుడూ కెమేరా నా బాగ్ లో పెట్టుకునే ఉంటాను’ అని కూడా అన్నాడు.
నేనాయనకి Venu Challa గురించీ, Jayati Lohithakshan గురించీ చెప్పాను. వాళ్ళ కి తన గురించి చెప్పి వాళ్ళ పేజీల లింక్ పంపించమని అడిగాడాయన.
అప్పుడు చూసాను సమయం. అయిదు దాటిపోయింది. కాని ఆయనలో ఏదో బెంగ కనిపిస్తూ ఉంది. అప్పుడే మేం వెళ్ళిపోక తప్పదా అన్నట్టున్నాయి ఆ చూపులు. ‘రండి, మళ్ళీ గౌహతి కి రండి, అసాం చాలా అందమైన ప్రాంతం. మళ్ళీ మళ్ళీ రండి’ అన్నాడాయన. ఆ మాటలు మర్యాదాపూర్వకంగా మాటాడినవి కావని అర్థమవుతోంది.
నేను రెండు చేతులూ జోడించి నమస్కరించాను. ‘మీరు కవిత్వం వినిపించినందుకు సంతోషం. కాని అంతకన్నా కూడా మీ వ్యక్తిత్వం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. మీరొక వేళ తెలుగు కవిత్వం గురించి తెలుసుకోడానికి నా దగ్గరకి వచ్చి ఉంటే కూడా నేనింత శ్రద్ధగా, ఇంత ఆత్మీయంగా, ఇంత వినయంగా మీతో కవిత్వం గురించి ముచ్చటించి ఉండేవాణ్ణి కాను’ అన్నాను.
‘అసామీయులంతా ఇలానే ఉంటారు’ అంటున్నాడు జ్యోతిర్మొయి.
బయటికొచ్చాం. సంధ్యవేళ ఆ కొండమీద ఏ చెట్లు నిండుగా పూసి ఉన్నాయోగాని మత్తెక్కించే పరిమళం ఒకటి ఆ గాలంతా చిక్కగా అల్లుకుపోయింది. మేం గుట్ట దిగేటప్పటికి ఎదురుగా బ్రహ్మపుత్ర మీద సాయంసంధ్య దిగంతలలాటం మీద కుంకుమధరిస్తోంది. అటువంటి సంధ్యవేళ నది ఒడ్డునుండే నగరాకాశాన్ని ఎటువంటి ప్రశాంతభావం ఆవరిస్తుందో నాకు నాకు చిరపరిచితమే. గోదావరి ఒడ్డున ఎన్నో సంధ్యలు గడిపినవాణ్ణి. ఆ వేళల్లోమనం చెయ్యవలసిందల్లా తక్కిన ఆలోచనలన్నిటినీ పక్కనపెట్టి ప్రార్థనాపూర్వకంగా మన చూపు మనలోపలకి తిప్పుకోవడమే.
16-11-2018