కామరూప-4

నేను గౌహతి వెళ్ళిన రోజునే అక్కడి స్టాఫ్ కాలేజి జాయింట్ డైరక్టరు ఋతుపర్ణని తనకి ఎవరేనా అసామీ కవులు, రచయితలు తెలిసిఉంటే పరిచయం చెయ్యమని అడిగాను. ఆమె ఆ మర్నాడు పొద్దున్న తనకి ఇద్దరు ముగ్గురు కవులు గుర్తొచ్చారుగానీ, అసాం గవర్నరు కార్యదర్శి మంచి సాహిత్యాభిమాని అనీ, ఆయన్ని కలవగలరా అనీ అడిగింది. గవర్నరు కార్యదర్శి అంటే సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి అయి ఉంటాడు, అతడితో సాహిత్యచర్చ ఏమి చెయ్యగలను అనుకున్నాను. కాని, ఎవరో ఒకరు, కనీసం ఆయన ద్వారానైనా మరెవరైనా కవుల పరిచయం లభించకపోతుందా అని సరేనన్నాను. కాని ఆ సెక్రటరీని సాయంకాలం అయిదింటిలోపే కలవవలసి ఉంటుందని చెప్పడంతో, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వెళ్తానని చెప్పాను. ఆయన్ని కలవడానికి అనుమతులు తీసుకోడానికి నాకూడా ఒక ఆఫీసు ఉద్యోగిని తోడు ఇచ్చి పంపించింది. అతడి పేరు జ్యోతిర్మొయి శర్మ. పాతికేళ్ళ యువకుడు. ఈ మధ్యే ఉద్యోగంలో చేరాడు.

అసాం గవర్నరు కార్యాలయం బ్రహ్మపుత్ర ఒడ్డున ఒక కొండ మీద ఉంది. చెట్లమధ్యనుంచి ఆ కొండమీదకు ఎక్కుతుంటే ప్రతి మలుపులోనూ పక్కనే ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర మరింత అందంగా కనిపిస్తూ ఉంది. నాతో వచ్చిన యువకుడు నేను కార్యాలయంలో ప్రవేశించడానికి సంబంధించిన అనుమతులన్నీ పూర్తిచేసుకున్నాక ఆఫీసు గుమ్మం ముందు నించుని ‘మీ సమావేశం ఎంత సేపు పట్టొచ్చు’ అని అడిగాడు. ‘ఏమో చెప్పలేను, నువ్వు కూడా రాకూడదా’ అన్నాను. ఇద్దరం లోపల అడుగుపెట్టాం. అక్కడ, ఆ సెక్రటరీ ఛాంబరు ముందు డెప్యూటీ సెక్రటరీ ఒకాయన మా కోసం ఎదురుచూస్తున్నాడు. మమ్మల్ని చూస్తూనే సాదరంగా సెక్రటరీ ఛాంబర్ లోకి తీసుకువెళ్ళాడు. మేము ఆ గదిలో అడుగుపెడుతూండగానే, ఆ కార్యదర్శి లేచి నుంచుని మా ఇద్దర్నీ ప్రేమపూర్వకంగా స్వాగతించాడు.

ఆయన పేరు సంజీబ్ గొహాయిన్ బొరువా. స్టేట్ సివిల్ సర్వీసు లో చేరి 2005 లో ఐ ఏ ఎస్ గా పదోన్నతి పొందాడు. రాష్ట్రప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం అసాం గవర్నరు సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన ఛాంబరు నిరాడంబరంగా ఉంది. ఒక పక్క పెద్ద పెద్ద గాజు అద్దాల్లోంచి బ్రహ్మపుత్ర కనిపిస్తోంది, ఇక్కడ సెక్రటేరియట్ లోంచి హుసేన్ సాగర్ కనిపించేటట్టే. కాని అంతకన్నా అందంగా కనిపిస్తోంది.

నేను నా గురించి రెండు మూడు పరిచయ వాక్యాలు చెప్పుకోబోయానుగాని, ఆయన అప్పటికే నా బయో డాటా తెప్పించుకుని చదివిపెట్టుకున్నాడని అర్థమయింది. మరొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, ఆయన తన సంభాషణ మొదలుపెట్టేసాడు.

‘నేను కవిని కాను. కాని మీరు నన్ను కలుస్తానంటే ఒప్పుకోడానికి కారణం ఉంది. అదేమంటే, మీరు అసాం కవిత్వం గురించి తెలుసుకోవాలను కుంటున్నారు. అందుగ్గాను మీరేవరేనా కవిని కలిసారనుకోండి, అతడేమి చెప్తాడు? తన కవిత్వం గురించే చెప్పుకుంటాడు. అప్పుడు మీకేమి తెలుస్తుంది? అసాం కవిత్వమంటే ఆ కవి కవిత్వం లాంటిదే అనుకుని వెళ్ళిపోతారు. అదే నాలాంటి వాణ్ణి కలిసారనుకోండి. నేను కవిని కాదు కాబట్టి వీలయినంతమంది కవుల్ని పరిచయం చేస్తాను. పది రకాల ధోరణులకి చెందిన కవిత్వాలు వినిపిస్తాను. మీకు అసాం కవిత్వం ఎంత విస్తృతమైందో, ఎంత విభిన్నమైందో, ఎంత సుసంపన్నమైందో తెలుస్తుంది’ అన్నాడు.

బాగానే ఉందే అనుకున్నాన్నేను. ‘మీకు కవిత్వం మీద ఎందుకు ఆసక్తి కలిగింది?’ అనడిగాను.

‘నాకు నవకాంత బారువా కాలేజిలో గురువు. వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు తన సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని పంచాడు. ఆయన వల్ల నాకు అసామీ కవిత్వం పట్ల ప్రేమ కలిగింది. ఆయన తన కాలేజిరోజుల్లో ఇంగ్లీషులో కవిత్వం రాసేవాడు. ఒకరోజు ఆయన గురువు ఆ కవిత్వం చూసి ‘నవకాంత్, మరో భాషలో కవిత్వం రాయడం అర్థం లేని పని. కవిత్వం అంటే కలలుగనడం. మనమెప్పుడూ మన మాతృభాషలోనే కలలు కంటాం. పరాయి భాషలో కనం కదా. కవిత్వం రాయడం కూడా అట్లాంటిదే’ అన్నాడట. ఆ మాటలు నవకాంత్ బారువా నేనాయన్ను కలిసిన మొదటి రోజునే చెప్పాడు. అంతే, ఆయనకు అతుక్కుపోయాను’ అన్నాడు.

‘కవిత్వమంటే ఏమిటి? ఎమోషన్స్. నేను తీన్ సుకియా నుంచి వచ్చాను. అక్కడి అడవులు, కొండలు, ఆ పల్లెలు, ఆ మనుషులు వాళ్ళంతా ఎమోషన్స్ రూపంలో నాతోపాటే ఉంటారు. నా భాషద్వారా ఆ ఎమోషన్స్ ని నాలో ఏది నిద్రలేపితే అదే నాకు కవిత్వం’ అని కూడా అన్నాడు.

అప్పుడు లేచి తన కుర్చీ వెనక ఉన్న షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి ఏడెనిమిది పుస్తకాల దొంతి తెచ్చి తన బల్లమీద పెట్టాడు. ఆ పుస్తకాలు చూస్తుంటే కవిత్వ సంపుటాలని అర్థమవుతూనే ఉంది. కొన్ని పుస్తకాల్లో పేజీల మధ్య పచ్చటి స్లిప్పులు కనిపిస్తున్నాయి. నేనొక క్షణం చెప్పలేనంత సంభ్రమానికి లోనయ్యాను. మై గాడ్! ఈయన నాతో అసామీ కవిత్వం గురించి ఏదో కాలక్షేపానికి నాలుగు మాటలు చెప్తాడనుకున్నానుగానీ, ఇంతగా సంసిద్ధుడై, పుస్తకాలు తెచ్చుకుని, వాటిల్లో కొన్ని కవితలకి ఫ్లాగులు పెట్టుకుని మరీ సిద్ధంగా ఉంటాడని ఊహించలేదు.

‘అసామీ కవిత్వంలో పందొమ్మిదో శతాబ్దంలోనూ, ఇరవయ్యవ శతాబ్దం మొదట్లోనూ వచ్చిన గొప్ప కవిత్వం నేను చదివానుగాని, దాని గురించి నీకు సాధికారికంగా చెప్పలేను. మేము ఆధునిక అసామీ కవిత్వంలో ఇలియట్ ప్రభావానికి ముందూ, వెనకా అని ఒక గీత గీసుకుని చూసుకుంటాం. నేను నీకు ఈ రోజు పరిచయం చేయగలిగేది పోస్ట్-ఇలియట్ కవిత్వం గురించే’ అన్నాడాయన.

‘అంటే, నలభైలనుంచి ఇప్పటిదాకా. చాలా గొప్ప కవిత్వం. కానీ ఏం లాభం? ఇప్పుడెవరికీ అసామీ కవిత్వం పట్టదు. ఇదుగో, ఈయన్ని చూడు’ అని తన డెప్యూటీ సెక్రటరీని చూపిస్తూ ‘ఈయన అసామీనే. అయితే ఏమిటి? మొత్తం చదువంతా ఇంగ్లీషు మీడియం లోనే చదివాడు. అసామీ కవిత్వం ఎలా ఉంటుందో తెలియదు ఇతనికి’ అన్నాడు. ‘అలాగని ఇంగ్లీషు కవిత్వం తెలుసా అంటే అది కూడా తెలియదు’ అని కూడా అన్నాడు.

‘ఇలియట్ ప్రభావానికి లోనైన తర్వాత అసామీలో వచ్చిన మొదటి గొప్ప కవి దేవ్ కాంత్ బారువా’ అంటో ఆ పుస్తకాల్లోంచి ఒక పుస్తకం తన చేతుల్లోకి తీసుకున్నాడు.

‘దేవ్ కాంత్ బారువా! అంటే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా..’

‘అవును. అతడే, ఆ మాటల వల్ల ప్రసిద్ధినే పొందాడో, అప్రసిద్ధినే పొందాడో గాని, అతడే. అతడు రాజకీయాల్లోకి పోకపోయి ఉంటే మహాకవి అయి ఉండేవాడు. ఇప్పుడు కూడా ఆధునిక అసామీ కవుల్లో అగ్రశ్రేణికి చెందిన కవిగానే మేమతన్ని లెక్కిస్తాం. ఇదుగో, ఈ ఒకే ఒక్క కవితాసంపుటి. చిన్న సంపుటి. మొత్తం 44 కవితలు. అయితేనేం, అజరామరమైన కవిత్వం మిగిల్చి వెళ్ళిపోయాడు’ అని, ‘సాగర్ దేఖిసా’ (సముద్రాన్ని చూసావా) అనే ఆ కవితాసంపుటినుంచి ఆ పేరుగల కవిత తీసి పఠించడం మొదలుపెట్టాడు.

మొదటి వాక్యం దగ్గర ఆగి నాకు వివరించబోతే, వద్దన్నాను. ‘ఆగకండి, వివరించకండి,అట్లానే చదవుకుంటూ పొండి, ఆ నాదమాధుర్యం వల్ల నాకెంతో కొంత అర్థం కాకుండా ఉండదు’ అన్నాను. మరుక్షణం లోనే ఆయన ఆ కవితలో లీనమైపోయాడు. బహుశా ఆ సంపుటిని ఆయన తన విద్యార్థిదశనుండీ ఎన్ని వందలసార్లు చదివిఉంటాడో, ఆ గడిచిన జీవితమంతా, ఆ జ్ఞాపకాలన్నిటితోటీ మరోమారు జీవిస్తున్నంత ఆదరంగా, శ్రద్ధగా, ప్రేమగా ఆయన ఆ కవిత పఠించసాగాడు. నాకు అర్థమయింది, అదొక డ్రమటిక్ మోనోలాగ్. ఇలియట్ ప్రభావం వల్ల మాత్రమే రాయగల కవిత. కాని ఇంతలో ఆయన ఆ కవిత పూర్తిగా చదవకుండా ఆగి ‘రెండు మూడు ముఖ్యమైన పంక్తులున్నాయి’ అంటోంటే, నాతో వచ్చిన యువకుడు ఆ పంక్తులేవో ఊహించే ప్రయత్నం చేసాడు. ఆయన ఆ యువకుడి వైపు నమ్మలేనట్టుగా చూసాడు.

‘దేవ్ కాంత్ బారువా తర్వాత చెప్పదగ్గ మరొక గొప్ప కవి హేమ్ బారువా ‘ అంటో మరొక పుస్తకం తీసి ఒక కవిత వినిపించడం మొదలుపెట్టాడు. ‘మమొతేర్ చిట్టి’ అనే ఆ కవిత ఆధునిక అసామీయ కవితల్లో సుప్రసిద్ధ కవిత అని తర్వాత తెలిసింది. ఆయన ఆ కవితని చదివినతీరులో మాధుర్యాన్ని నేను మాటల్లో పెట్టలేనుగాని, ఆ కవితని ఇట్లా తెలుగు చేయగలిగాను:


మమత రాసిన ఉత్తరం

If you are coming down through the narrows of the river Kiang,
Please let me know beforehand,
And I will come out to meet you
As far as Cho-Fusa
Ezra Pound

ప్రియా, ఈ కొవ్వొత్తి వెలిగిస్తున్నాను, 
చాలారోజుల తర్వాత
నీకు ఉత్తరం .. బయట చల్లటిగాలి దీపం మీద విరుచుకుపడుతోంది..
ఆగు, ఈ కిటికీ మూసేనివ్వు.

గుర్తున్నాయా , పదేళ్ళ కిందటి ఆ విషయాలు?
మనం కలిసి మన జీవితానికి ఉపోద్ఘాతం రాసుకున్న ఆ క్షణాలు,
..నన్నో విచిత్రమైకం ఆవహించిన రోజులవి.

ఆ ఉదయం..ఆ హేమంత కోమల ప్రభాతం
గుమ్మం దగ్గర తివాసీలాగా పరుచుకున్న శేఫాలికా పుష్పరాశి
ఆ సాయంకాలం మొదటిసారి
నేను నీ ఇంటికొచ్చాను. గుర్తుందా-
ఆ పసుపువన్నె చంద్రవంక మననెట్లా పలకరించిందో?

ఆ రోజు నువ్వెందుకట్లా నన్ను చూస్తూండిపోయావు
నా నడుముకి చుట్టుకున్న ఆ రంగుల వస్త్రాన్ని?
నీకు తెలుసా అప్పుడు నాకేమినిపించిందో? 
నువ్వేదో అపరిచితతీరాలనుండి అడుగుపెట్టిన స్వప్నలోకకిరణానివనీ
నేనేమో ఒక రాలిపడ్డ పారిజాత పుష్పాన్ననీ.
ఆ రోజు నా హృదయసాగరం మీద వెయ్యి కెరటాలు 
ఎగిసిపడ్డాయి, జారిపోయాయి
ఆ రోజులు గుర్తు లేవూ నీకు? మా నాన్న ఉత్తరం రాసేడు:
‘చిరంజీవీ, మీరా కొత్త ఇంట్లో సంతోషంగా ఉన్నారు కదా.’

అదంతా ఏడేళ్ళ కిందటి మాట. నాకేమో పురాణకాలం లాగా అనిపిస్తోంది.
కిందటి వసంతానికి మా నాన్న పోయి ఏడాది.
మన బాబుల్ పెద్దవాడవుతున్నాడు. 
వాడికప్పుడే దానిమ్మగింజల్లాంటి దంతాలు.
వాడొక్కక్షణమేనా నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు
(కొన్ని సార్లు నాకు పిచ్చెక్కేది నువ్వు పక్కన లేనందుకు)
వాడెందుకట్లా ఎప్పుడూ నా తెల్లటి దుస్తులకేసే చూస్తుంటాడు?
బహుశా పుట్టినప్పణ్ణుంచీ నన్నా వస్త్రాల్లోనే చూస్తున్నాడు, అందుకనేనా?
బాబుల్ నిజంగా పెరిగి పెద్దవాడయ్యాడు, తెలుసా.
(మరి రెణ్ణాళ్ళు గడిస్తే వాణ్ణి బళ్ళో చేర్పిస్తాను. వాడు బడికి వెళ్తే నేను మరింత ఒంటరిదాన్నయిపోతాను తెలుసా)

ఇంకేమి రాయను? ఇంతే, మరేమీ లేదు, ఒక్క మాట,
నువ్వొచ్చేముందు నాకు కబురు పంపిస్తావు కదూ
అప్పుడు నేను ఈ పురాతన లోహిత తీరం నుంచి
బొగ్డోయి నదిమీద నీకోసం ఎదురొస్తాను. ఎలుగెత్తి పిలుస్తూ నీకు ఎదురొస్తాను
నువ్వు తిరిగొచ్చే రోజు నాకు ముందే చెప్పడం మర్చిపోకు.

ప్రేమతో 
నీ 
మమత

తాజాకలం: ఈ ఏడాది మాఘమాసం బిహుకి పెద్ద మంట వేసారు. నానమ్మ నల్లమేక రెండు పిల్లలు పెట్టింది. ఒకటి తెల్లదీ, మరొకటి రంగుదీ.

*

ప్రాచీన చీనా కవిశ్రేష్టుడు లి-బాయి రాసిన కవితవల్ల ప్రేరణ పొంది ఎజ్రాపౌండ్ రాసిన The River Merchant’s Wife అనే కవిత కలిగించిన ప్రేరణతో హేమ్ బారువా రాసిన కవిత ఇది. ఆ రోజు ఆ సాహిత్యాభిమాని ఆ కవిత చదువుతున్నప్పుడు, మంచుకమ్మిన హేమంత ప్రభాతాలూ, పారిజాత పుష్పరాశులూ, పురాతనలోహితనదీమైదానమూ నా ముందు నిజంగానే సాక్షాత్కరించేయి.

‘హేమ్ బారువా తర్వాత చెప్పవలసిన కవి నవకాంత్ బారువా’ అంటో మరొక కవితాసంపుటి ఆయన తనచేతుల్లోకి తీసుకున్నాడు. కాని, ఈ సారి ఆయన తన అత్యంత ఆత్మీయుడూ, తన గురువూ, స్నేహితుడూ, మార్గదర్శీ అయిన కవి కవిత్వం చదవవలసి ఉంటుందన్న స్ఫురణతో కంపిస్తూ ఉన్నాడు. ఏ కవిత ఎంచుకోవాలో వెంటనే తేల్చుకోలేకపోయాడు. ఆ సంపుటి పక్కన పెట్టి నవకాంత్ బారువా సమగ్రకవితా సంపుటి చేతుల్లోకి తీసుకున్నాడు. నాలుగైదు పేజీలు తిరగేసి దాన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ముందు తీసుకున్న పుస్తకమే తీసుకున్నాడు. ‘ఇదిగో, ఈ కవిత వినండి’ అంటోమొత్తం కవిత వినిపించాడు. ‘ఏటి ప్రేమార్ పద్య'(ఒక ప్రేమ పద్యం) అనే ఈ కవిత బహుశా ఆ ధోరణి కవిత్వానికంతటికీ ప్రతినిధి అని చెప్పవచ్చు:

ఒక ప్రేమ పద్యం

Do you remember an inn, Miranda?
Hilaire Belloc

వానాకాలపు రాత్రుల్లో, నీకు గుర్తొస్తాడా
నీ కవి, అరుంధతీ?
సాయంకాలపు పలచని వెలుతురు
వెలిగించే నీ సిగలో 
గూడుకట్టుకున్నఅపరాహ్ణసుగంధం 
గుర్తొస్తుందా, నీకు గుర్తొస్తుందా
అరుంధతీ?

వెన్నెల, మబ్బుపింజ, అనురాగం, ఆవేదన
అర్థంకాని కవిత్వం
మనమధ్య పగిలిపోయిన కలల్లో చిక్కుపడ్డ ప్రేమ
ఇవి, ఇవి నీకు తలపుకొస్తుంటాయా
అరుంధతీ?

నీకు గుర్తొస్తాయా
పచ్చికలో మెరిసే ముత్యాలు
మబ్బులాంటి ఆ కేశరాశిలో
దోగాడే సుకోమలమైన ఆ చేతివేళ్ళు
(కెరటమందామా అంటే అది సముద్రం కాదే)
ఆ హిమతుల్య శీతలస్పర్శలో కూడా
ఏమి ప్రశాంతత
ఎటువంటి ప్రశాంతత
అరుంధతీ!

అరుంధతీ,
అసంఖ్యాక గగనాలు దాటి
చేరుకున్న ఆ తుపాను విహంగానికి
క్షణకాలపు మజిలీ,
అగణిత స్వప్నసీమల దారిన
కళ్ళు మూతలు పడిపోయే ఆ వేలాది రాత్రుల మధ్య 
నిద్రలేని ఆ ఒకే ఒక్క రాత్రి,
అది గుర్తొస్తుందా నీకు
అరుంధతీ?

ఆ వానాకాలపు రాత్రి నీకు గుర్తొస్తోందా
అరుంధతీ?

15-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు.

*

Leave a Reply

%d bloggers like this: