కామరూప-3

ఆ పొద్దున్నే బ్రహ్మపుత్ర నది ఒడ్డునే అట్లా మరికొంతదూరం నడిచాం. అక్కడొక పెద్ద శిల్పం మమ్మల్ని ఆకర్షించింది. ఆ శిల్పం ఒక యోధుల బృందం. ఆ యోధులు యుద్ధమధ్యంలో ఉన్నట్టుగా, వాళ్ళు తమ ప్రాణాలు తృణప్రాయంగా త్యజించడానికి సంసిద్ధులైనట్టుగా, ఏమైనా సరే తమకి సంబంధించిందేదో అమూల్యమైనదాన్ని కాపాడుకోవడమే తమ ధ్యేయంగా కనిపిస్తున్నారు. తాము కాపాడుకోవాలనుకుంటున్నది ఏదో ప్రాంతమో, రాజ్యమో అన్నట్టుగా లేరు వాళ్ళు. తమకి అత్యంత ప్రాణప్రదమయింది, ఇంకా చెప్పాలంటే,ప్రాణాలకన్నా కూడా విలువైనదేదో ఉన్నదనీ, దాన్ని కాపాడుకోడమే తమ కర్తవ్యంగా కనిపిస్తున్నారు వాళ్ళు.

ఆ శిల్పాన్ని నదిలో ఒక పెద్ద స్తంభం మీద ప్రతిష్టించారు. మేము దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ శిల్పం, ఆ మూర్తిసమూహం, ఆ భంగిమ మరింత భావస్ఫోరకంగా కనిపించాయి. అక్కడొక యువకుడు క్రూయిజు శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. అతడికి దగ్గరికి వెళ్ళి ఆ శిల్పంలో ఉన్నదెవరని అడిగాను. వాళ్ళు యుద్ధం చేస్తున్నారని చెప్పాడు. ఏ యుద్ధమని అడిగాను. ‘ఫస్ట్ వరల్డ్ వార్’ అన్నాడు. నాకెందుకో ఆ సమాధానం సంతృప్తికరంగా అనిపించలేదు. కాని, ఆ తర్వాత, ఆ వీరుల గురించి సాకల్యంగా తెలుసుకున్నాక, ఆ యువకుడిమీదనే కాదు, అసలు యువతరం మొత్తం మీద జాలి కలిగింది.

ఆ శిల్పంలో ఉన్నది అసాం జాతికి స్మరణీయుడైన మహావీరుడు లచిత్ బర్ ఫుకాన్. అతడు 17 వ శతాబ్దంలో అహోం రాజ్యానికి సేనాధిపతిగా పనిచేసాడు. ఆ కాలంలో మొఘల్ సైన్యాలు అసాం మీద దండెత్తాయి. వాళ్ళనుంచి అహోం రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఫుకాన్ మీద పడింది. అతడు ఆ సైన్యాలనుంచి గుహావాటిని విడిపించుకోడమే కాక, 1671 లో సరాయిఘాట్ దగ్గర జరిగిన యుద్ధంలో మొఘల్ సైన్యాల్ని పూర్తిగా తిప్పికొట్టాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తరఫున అసాం మీద దండెత్తిన రాజా రాం సింగ్ లచిత్ బర్ ఫుకాన్ యుద్ధతంత్రాన్నీ, నైపుణ్యాన్నీ, విన్యాసాన్ని చూసి అతడిముందు మోకరిల్లకుండా ఉండలేకపోయాడట. ఆ యుద్ధం జరగడానికి ముందురోజు మొఘల్ సైన్యాల్ని నిరోధించడానికి ఒక పెద్ద గోడ కట్టమని ఫుకాన్ తన సైన్యాన్ని ఆదేశించాడట. ఆ పనిని పర్యవేక్షించే పని తన సొంత మేనమామకి అప్పగించాడట. ఒక రాత్రి వేళ వెళ్ళి చూస్తే, అతడి మేనమామతో సహా సైన్యమంతా నిద్రపోతూ కనిపించారట. అతడు మేనమామని నిద్రలేపితే అతడేదో సంజాయిషీ ఇవ్వడం మొదలుపెట్టాడుట. కాని సంజాయిషీలు వినడానికి సమయం లేదు, ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ సైన్యం మేలుకోరనిపించింది ఫుకాన్ కి. అతడు, తన మేనమామకి మరొక మాట కూడా మాట్లాడే అవకాశమివ్వకుండా, అక్కడికక్కడే అతని తల నరికేసాడట. అంతే, ఆ రాత్రికి రాత్రి గోడ పూర్తయిపోయిందని ఐతిహ్యం.

తన రాజ్యాన్నీ, ప్రజల్నీ కాపాడుకోవడం ముందు తన ప్రాణం,తన బంధుత్వం, తన సౌఖ్యం పక్కన పెట్టేయగల వీరత్వానికీ, రాజభక్తికీ, దేశభక్తికీ లచిత్ బర్ ఫుకాన్ ఒక ప్రతీకగా అసాం జనస్మృతిలో నిలిచిపోయాడు. అటువంటి స్ఫూర్తి జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్క సైనికుడికీ అందవలసిందేనన్న భావనతో నేషనల్ డిఫెన్సు అకాడెమీ 1999 నుంచీ ఉత్తమ కేడెట్ కు లచిత్ బర్ ఫుకాన్ స్వర్ణపతకాన్ని బహూకరించడం మొదలుపెట్టింది.

ఆ ప్రత్యూష పవనాల్లో కొంతసేపు నదిమీద ఏదైనా పడవలోనో, లాంచిలోనో విహరిద్దామనుకున్నాంగాని, మేము ఆ వివరాలు తెలుసుకునేలోపలే ఒక క్రూయిజ్ అవతలి వడ్డుకి సాగిపోయింది.

2

కాని ఆ నదిపైన విహరించే అవకాశం మాకు ఆ రాత్రి కలిగింది. అక్కడ ప్రతి రోజూ సాయంకాలం సంధ్యవేళ, రాత్రివేళ కూడా క్రూయిజులు బయల్దేరతాయి. వాటిల్లో సుమారు రెండుగంటల పాటు నదిమీద విహరించవచ్చు. స్టాఫ్ కాలేజి నిర్వాహకులు మా కోసం ఆ రాత్రి డిన్నర్ క్రూయిజులో సీట్లు రిజర్వ్ చేసారు.

ఎనిమిదింటికల్లా మేము ఆ క్రూయిజులో అడుగుపెట్టాం. అది ఆల్ ఫ్రెస్కో కంపెనీ వాళ్ళ డిన్నర్ క్రూయిజు. ఆ పడవకి మూడు అంతస్తులున్నాయి. కింద అంతస్తు నిజానికి ఒక మాళిగ. అందులో డిన్నర్ ఏర్పాటు చేసారు. పై అంతస్తు డెక్. దాని మీద ఒక కప్పు వేసి చుట్టూ దోమతెరలాగా ఒక మెష్ ఏర్పాటు చేసారు. మధ్యలో రెస్టరెంటులాగా బల్లలు, కుర్చీలు అమర్చిపెట్టారు. ఎదురుగా ఒక వేదిక. ఆ వేదిక వెనక గ్రీన్ రూం. మేము వెళ్ళి కూర్చోగానే ఏదో జ్యూస్ లాంటిది సర్వ్ చేసారు. నెమ్మదిగా పడవ కదిలింది.

ఆ తర్వాత సుమారు గంటసేపు ఆ వేదిక మీద అసాం సంస్కృతిని పరిచయం చేసే సంగీత, నృత్య కార్యక్రమం కొంతసేపు సాగాక, ఒక గాయకుడితో ఫిల్మ్ గీతాలు పాడించారు. ఆ గీతాలు పాడుతుండగానే కింద డిన్నర్ సర్వ్ చేయడం మొదలయ్యింది.

ఆ వేదిక మీద ఆ రాత్రి చూపించిన సాంస్కృతిక కార్యక్రమాలు అసాం సంస్కృతి గురించి స్థూలపరిచయాలే అయినప్పటికీ, నాలాంటి ప్రారంభవిద్యార్థికి ఎంతో విలువైనవే అనిపించింది. అన్నిటికన్నా మొదట వారు లచిత్ బర్ ఫుకాన్ జీవితం, సరాయి ఘాట్ యుద్ధం, అతడి సాహసం మొదలైన అంశాల్ని వివరించే ఒక లఘుచిత్రాన్ని చూపించారు. ఆ చిత్రమంతటా ఆ కథని చిత్రలేఖనాలతో వివరించారు. గువాహాటికి చెందిన రబిన్ బర్ అనే చిత్రకారుడు రెండుచేతుల్తోనూ వేగవంతంగా చిత్రలేఖనాల్ని అలవోకగా గీస్తూంటే, ఆ చిత్రలేఖనాల ఆధారంగా కథనం నడుస్తుంటుంది. ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, రోమాంచకంగానూ నడిచిన ఆ లఘుచిత్రంతో ఆ కార్యక్రమాలు మొదలుపెట్టడంలో గొప్ప ఔచిత్యం కనిపించింది.

ఆ తర్వాత అసాం సంస్కృతీ నిర్మాత శ్రీమంత శంకరదేవ రూపకల్పన చేసిన సంగీత, నృత్య శైలిని వివరిస్తూ కొన్ని ప్రదర్శనలు చూపించారు. నవ్యవైష్ణవానికి సంబంధించిన ఆ ప్రదర్శనలు చూపిస్తున్నంతసేపూ ఎటువంటి మద్యపానీయాల్నీ తాము సర్వ్ చేయలేమని నిర్వాహకులు ముందే ప్రకటించారు. అయిదువందల ఏళ్ళకిందట రూపకల్పన చేసిన ఆ కళారూపాలు ఆ జాతిసంస్కృతిలో ఎంతగా భాగమైపోయాయో, వారి సంస్కారాన్ని ఎంతగా తీర్చిదిద్దాయో, ఆ నిర్వాహకులు, గౌరవసూచకంగా, ఆ చిన్న మర్యాదను పాటించడంలో నాకెంతో బోధపడింది.

ఆ ప్రదర్శనల్లో మొదటి అంశం, ‘గాయన్-బాయన్’ పేరిట వాద్యకళాకారుల వాద్యం, నృత్తం. మొత్తం ఐదుమంది కళాకారులు. అందులో ముగ్గురు కోల్ అనే మద్దెల వాయిస్తూ, మరొక ఇద్దరు కళాకారులు పెద్ద పెద్ద తాళాలు వాయిస్తూ నృత్తం అభినయించారు. ఆ కళాకారుల ఆహార్యాన్నీ, ఆ వాద్యాల ఆకృతినీ, వారి నృత్తభంగిమల్నీ శంకరదేవనే స్వయంగా కంపోజ్ చేసాడట. ముఖ్యంగా, తాళానుగుణంగానూ, లయబద్ధంగానూ సాగిన ఆ చరణతాడనంలో గొప్ప కళాసౌకుమార్యం కనిపించింది. అది ప్రేక్షకుల మనసుల్లో అంతదాకా ఉండే రకరకాల ఆలోచనల్ని పక్కకు నెట్టి, పూర్తిగా తమవైపే ఉన్ముఖం చేసుకునేలాంటి ప్రణాళిక. ఆ నృత్త ప్రణాళిక ఒక్కదానికే శంకరదేవను మనం గొప్ప సంస్కృతీనిర్మాతల్లో ఒకడిగా కీర్తించవచ్చు.

ఆ వాద్య బృంద గోష్ఠి తర్వాత, సత్త్రియా నృత్యం మొదలయ్యింది. సత్త్రియా అంటే సత్త్రాలకు సంబంధించింది అని అర్థం. సత్త్రాలు శంకరదేవ్ నెలకొల్పిన మఠాలు. అవి నాలుగు రకాలు. కొన్ని పూర్తిగ సన్యాసుల మఠాలు, కొన్ని గృహస్థులవీ, కొన్నీ మిశ్రమాలు. ఆ మఠాలకు ఉండే ఆస్తి ఉమ్మడి ఆస్తి. అందులో ఏ ఒక్కరికీ వ్యక్తిగత ఆస్తి ఉండదు. ప్రతి మఠాన్నీ ఒక సత్త్రాధికారి పర్యవేక్షిస్తూ ఉంటాడు. మనుషులు తమ ముక్తికోసం వ్రతాలూ, యాగాలూ, తీర్థయాత్రలూ చెయ్యనక్కర్లేదనీ, కీర్తనమొక్కటి చేస్తే చాలనీ శంకరదేవ ప్రతిపాదించాడు. అటువంటి కీర్తనానికి కులమూ, మతమూ అడ్డుకావని ప్రబోధించాడు. తద్వారా, అతడు ప్రతిపాదించిన నవ్యవైష్ణవంలో గిరిజనులు, మైదానాప్రాంతాలవారూ, అంతదాకా వర్ణాశ్రమవ్యవస్థలో ఉన్న హిందువులూ, తురుష్కులూ అందరూ చేరారు. అక్కడ ఉచ్చనీచ భేదం లేదు. అస్పృశ్యత లేదు. ప్రతి ఒక్కరికీ భగవన్నామ సంకీర్తనమొక్కటే విధి. ఆ సంకీర్తనం ఉత్సాహకరంగా ఉండటానికీ, నలుగుర్నీ ఉత్తేజపరచడానికీ, శంకరదేవ సంగీతాన్నీ, నృత్యాన్నీ ముందుకు తీసుకొచ్చాడు. తానే పాటలు రాసి, స్వరకల్పన చేసి, నృత్యాలు కంపోజ్ చేసి, ఒక సంగీత-సాహిత్య-నృత్యమయ రసప్రపంచాన్ని నిర్మించాడు.

తమిళదేశంలో ఆళ్వారులు నామసంకీర్తనం చేసారుగాని, అందులో నృత్యానికి తావులేదు. అన్నమయ్య సంకీర్తనాచార్యుడేగాని, ఒక నృత్యసంప్రదాయాన్ని నెలకొల్పినవాడు కాడు. మహారాష్ట్ర సంత్ కవులు భగవన్నామ గుణగానమే సర్వస్వంగా జీవించారుగాని, ఇటువంటి ఒక సంస్థాగత నిర్మాణానికి పూనుకోలేదు. కన్నడ వీరశైవ వచనకవులు జాతికీ, కులానికీ అతీతంగా ఒక అనుభవ మంటపాన్ని ప్రతిష్టించారుగాని, అక్కడ సంగీతం, నృత్యం లేవు. క్షేత్రయ్యపదాల చుట్టూ సంగీతమూ,నాట్యమూ వర్ధిల్లాయిగాని, కులాలకతీతమైన సామాజిక సంస్కరణ లేదక్కడ. ఎలా చూసినా, శంకరదేవ తన నవ్యవైష్ణవం ద్వారా అసాంలో చేపట్టిన ఈ ప్రయోగం అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక-సామాజిక-సృజనాత్మక ప్రయోగం. కొంతవరకూ శిఖ్ఖు గురువుల, ముఖ్యంగా గురుగోవింద సింగ్ ప్రయోగాలు, మటుకే ఈ ప్రయోగంతో పోల్చదగ్గవి.

శంకరదేవ తాను స్థాపించిన మఠాల్లో భగవన్నామ సంకీర్తనంకోసం రూపకల్పనచేసిన ఆ నృత్యాలు ఇప్పటికీ అసాం సంస్కృతిలో సజీవంగా ఉన్నాయి. అటువంటి ఒక నృత్యం నమూనా ఆ రాత్రి మాముందు ప్రదర్శించారు. అందులో నర్తకుల ఆహార్యాన్ని కూడా శంకరదేవనే స్వయంగా డిజైన్ చేసాడుట. ఆ నృత్యం తరువాత, ఒక నర్తకి, శంకరదేవ రచించిన ఒక బొర్ గీత్ ను అభినయిస్తూ ఒక సోలో చేసింది. ఆ గీతమేమిటో నేను ఆ పల్లవి ఏమిటో ఆ కార్యక్రమం అయ్యాక వాళ్ళని అడిగి తెలుసుకుందామనుకున్నాను గాని, కాని, అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. కాని, ఆ తర్వాత నాకు ఆ గీతమేమిటో తెలుసుకోకపోడమే మంచిదనిపించింది. ఎందుకంటే, ఇప్పుడు, నాకు గుర్తున్నది ఆ సాహిత్యంకాదు, ఆ నాట్యంకాదు. ఆ పాట వినిపిస్తున్నప్పుడు బ్రహ్మపుత్రమీంచి నామీద ప్రసరించిన సన్నని తీయతెమ్మెర, దూరంగా ఒడ్డున గౌహతి నగరదీపాలు, ఒకవైపు దూరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న కామాఖ్యదేవాలయం. ఆ పాట పాడిన గాయకి ఎవరోగాని, ఆ స్వరం, ఆ ఈశాన్యభూమిలోని ఏ అడవుల్లోనో చందనతరువులమీద గూడుకట్టుకున్న తేనెపట్టుల తీపిదనాన్ని ఆ గాలుల్లోంచి తీసుకొచ్చి నా మీద కుమ్మరించిందనిపించింది. నా చిన్నప్పుడు, కాకరపాడులో జరిగే రామనవమి పండగలో నాటకాలు చూడటానికి రెండెడ్ల బండిమీద అడవిలో వెన్నెలరాత్రి ప్రయాణిస్తుంటే, దూరంగా నాటకపద్యాల రాగాలు వినిపించిన జ్ఞాపకం గుర్తొచ్చింది. గౌహతి కాకరపాడుగా మారిపోయింది.

ఆ తర్వాత అసాం సాంప్రదాయిక నృత్యం బిహుని అభినయించారు. బిహు ఒక ఏడాదిలో మూడు సార్లు జరిగే పండగ. ఒక సారి మాఘమాసంలో. అది పంటకోతకొచ్చే సమయం. మరొకటి బిహోగ్, అది వసంతవేళ జరిగే రంగులపండగ. మూడవది కార్తి. కార్తీకమాసంలో జరిగే పండగ. ఏ అతీతకాలంలోనో గిరిజనజీవితంలో ప్రభవించిన ఆ పండగలు ఒకవైపు ఆగ్నేయాసియా సంస్కృతితోనూ, మరొక వైపు సీనో-టిబెటన్ సంస్కృతితోనూ మేళవించి, నవ్యవైష్ణవం వల్ల కృష్ణలీలా ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. భిన్నసంస్కృతీప్రవాహాలు అంతగా సంగమించిన సాంస్కృతిక ఉత్సవం భారతీయ సంస్కృతిలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో.

బిహు నాట్యంతో అసాం మా కళ్ళముందు పూర్తిగా దర్శనమిచ్చింది. ఆ నాట్యం ముగిసిన తర్వాత, ఆ కళాకారుల వాద్యవిశేషాల్నీ, ఆహార్యాన్నీ, అలంకరణల్నీ పేరుపేరునా పరిచయం చేసారు. ఒక ప్రాంతంలో సంస్కృతి నీకు ఆ ప్రాంతంలోని వేషధారణలోనే పూర్తిగా కనిపిస్తుందని రవీంద్రకుమార శర్మగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

ఆ తర్వాత ఒక గాయకుడు వచ్చి ఫిల్మ్ గీతాలు పాడటం మొదలుపెట్టాడు. అతడేమైనా అస్సామీ గీతాలు పాడతాడేమోనని ఆశగా చూస్తున్నాను గాని, అక్కడ ఉన్న టూరిస్టులు అతడితో పాతవీ, కొత్తవీ హిందీపాటలు పాడిస్తున్నారు. ఇంక ఉండబట్టలేక ఒక అస్సామీ పాట పాడమని అరిచాను. ఇక్కడ అసామీలు ఎవరూ లేరా అనడిగాడతడు. ఆశ్చర్యం. ఆ రాత్రి, ఆ డెక్ మీద కూర్చున్నవాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అస్సామీలు లేరు. కాని, అతడు నా కోరిక మన్నించి ఒక పాడాడు. ‘దిన్ జ్వొలే, రాతి జ్వొలే’ అనే ఆ పాట, మిషన్ చైనా అనే సినిమా కోసం, జుబిన్ గర్గ్, జుబిలీ బరువా పాడారని చెప్పాడు.

అప్పటికే టూరిస్టులు ఒకరూ ఒకరూ డిన్నర్ కోసం లేవడం మొదలుపెట్టారు. కాని, నాకు ఆకలి కాదు, దాహం మేల్కొంది. నాకింకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంది. ఒక రసజ్వరం తగులుకుంది. బహుశా, ఉత్తర అసాంలోని ఏదైనా ఒక సత్త్రానికి వెళ్ళి ఒక రాత్రంతా సత్త్రియా నృత్యం పూర్తిగా చూస్తేనో లేదా ఏ గ్రామీణ అసాంలోనో ఒక బిహోగ్ ఋతువులో బిహు నృత్యంలో నా అడుగులు కూడా కలిపితేనోగాని, ఆ అసంతృప్తి చల్లారదని అనిపించింది.

14-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d