
మా సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ తరఫున అసాం స్టాఫ్ కాలేజి తో కలిసి ఒక శిక్షణా శిబిరం సంయుక్తం నిర్వహించడంకోసం గౌహతిలో దిగగానే నాకొక పులకింత కలిగింది. అసాం చూడాలన్న కోరిక ఇన్నాళ్ళకు తీరింది. నా చిన్నతనంలో మా తాడికొండ లైబ్రరీలో రజనీకాంత బార్డొలాయి నవల ‘మీరీ బాల’ చదివినప్పణ్ణుంచీ అసాం అంటే నాకొక అస్పష్ట ఊహా చిత్రం. నీలపర్వతశ్రేణి, బ్రహ్మపుత్ర లోయ, తేయాకు తోటలు, గిరిజన నృత్యాలు, కామాఖ్య దేవాలయం, ఎస్.డి.బర్మన్ ‘సున్ మేరే బంధూ’, నిర్మలప్రభ బార్డొలాయి కవిత్వం.. అసాం అంటే నాకొక సుదూరమేఘమండలం. ఇప్పుడు నాలుగు రోజులు గొహతిలో గడిపి వచ్చాక, కామరూప జిల్లాలో కొంత దూరం ప్రయాణించేక, అసాం చరిత్ర గురించీ, సంస్కృతి గురించీ ఎంతో కొంత తెలుసుకున్నాక, అసాం పట్ల గొప్ప గౌరవం కలిగింది. నేను గిరిజన ప్రాంతాల్లో జీవించినప్పుడు ఎటువంటి ఆత్మీయతనీ, అభిమానాన్ని చవిచూసానో అటువంటిదే అసాంలోనూ కనిపించింది. ఆ మనుషులూ, ఆ ప్రాంతమూ నా హృదయానికి చాలా చేరువగా తోచారు.
మేము ఈ ఏడాది ఏప్రిల్లో ఇన్నొవేషన్ మీదా, సుపరిపాలన మీదా ఒక జాతీయస్థాయి గోష్ఠి నిర్వహించినప్పుడు, అసాం స్టాఫ్ కాలేజి నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. అసాం స్టాఫ్ కాలేజిలో భాగంగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్నొవేషన్ అండ్ ఫ్యూచర్ పాలిసీ అనే ఒక కేంద్రం పనిచేస్తూ ఉంది. 2016 నుంచీ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సెంటర్ అసాం రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక రూపొందించింది. ఇంకా తక్కిన రాష్ట్రాలు ఆ గమ్యాల్నీ, ఆ లక్ష్యాల్నీ అర్థం చేసుకునే క్రమంలోనే ఉండగా, వాటికి అనుగుణంగా ఇంత త్వరగా ఒక రాష్ట్రస్థాయి ప్రణాళిక రూపొందించడం చిన్న విషయం కాదు. అది ఆ రాష్ట్ర పాలనాసామర్థ్యాన్ని పట్టిచ్చే అంశం.
ప్రభుత్వ వ్యవస్థలు తమ పాలనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికీ, నూతన ప్రయోగాలు చేపట్టేలా ప్రోత్సహించడానికీ తమ రాష్ట్రంలో కూడా ఒక శిక్షణా శిబిరం నిర్వహించమని అ కేంద్రం వారు మమ్మల్ని అడిగారు. ఆ ఆలోచనకు కార్యరూపంగా ఏర్పాటు చేసిందే ఆ శిబిరం. అందులో ముప్పై మందికి పైగా ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, పోలీసు, ప్లానింగ్ వంటి శాఖలతో పాటు విద్య, వ్యవసాయం, విద్యుత్తు, పట్టుపరిశ్రమ, ఉపాధికల్పన మొదలైన రంగాలకు చెందిన అధికారులు ఉన్నారందులో.
మొదటిరోజు నేను చాలాసేపు ఆ ప్రభుత్వాధికారుల్ని ఒక్కొక్కర్నీ మాటాడించేను. వాళ్ళ వాళ్ళ కార్యక్షేత్రాల్లో వాళ్ళు లోనవుతున్న అనుభవాలు ఏమిటి, వాళ్ళు చేపడుతున్న ప్రయోగాలు ఏమిటి, ఎదుర్కొంటున్న సమస్యలేమిటి వివరంగా చెప్పించాను. వారంతా అస్సాంలోని వివిధ జిల్లాలనుంచి వచ్చినవారు కావడంతో, వారి మాటలు విన్నాక, అసాం మరింత వివరంగా నా కళ్ళముందు సాక్షాత్కరించింది. ఉత్తర అసాంలో తీన్ సుకియా, డిబ్రూగర్, జోర్హట్ జిల్లాలు మొదలుకుని పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న కోక్రజార్ జిల్లా దాకా, కజిరంగ అభయారణ్యం మొదలుకుని కామరూప దాకా అసాం ప్రజల జీవనవిధానం, అభివృద్ధి వ్యూహాలు, ఎదుర్కొంటున్న సమస్యలు ఎంతో కొంత నాకు పరిచయమయ్యాయి.
మానవాభివృద్ధి సూచికల ప్రకారం అసాం దక్షిణ, పశ్చిమ భారతరాష్ట్రాల కన్నా వెనకబడి ఉన్నా, ఉత్తర, మధ్యభారత రాష్ట్రాల కన్నా ముందే ఉంది. ఒక విధంగా చెపాలంటే అభివృద్ధిలో అసాం స్థానం మధ్యస్థంగా ఉంది,కాని ప్రగతిగురించిన తపన ఇప్పుడిప్పుడే మొదలయ్యిందని తెలుస్తోంది.
2
గౌహతిలో నాకున్నవి మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు. శిక్షణా శిబిరం నిర్వహిస్తూనే, ఆ మధ్యలోనే ఎంతో కొంత వీలు చిక్కించుకుని అసాం సాహిత్యం, కళలు, సంస్కృతి గురించి తెలుసు కోవాలనుకున్నాను. అందుకని అక్కడి స్టాఫ్ కాలేజిలో జాయింట్ డైరక్టరు ఋతుపర్ణా చక్రవర్తిని తనకెవరేనా కవులు, గాయకులు తెలిసిఉంటే పరిచయం చెయ్యమని అడిగాను.
మొదటిరోజు సాయంకాలం శిక్షణాకార్యక్రమం పూర్తవగానే బ్రహ్మపుత్ర చూడాలనుకున్నాంగాని, ఆరింటికే చిమ్మచీకటి ఆవరించింది. కనీసం ఊరెలావుంటుందో చూద్దామనుకున్నాం. నేనూ, నా కొలీగ్స్ కాబ్ పట్టుకుని ఫాన్సీ బజార్ లో అడుగుపెట్టాం. అక్కడ ‘మేఘాలి’ అనే దుకాణంలో ఈశాన్యసంగీతం దొరుకుతుందని ఋతుపర్ణ చెప్పింది. ఈశాన్య భారతసంగీతమంటే నాకు తెలిసినపేర్లు ఎస్.డి.బర్మన్, భూపేన్ హజారికాలు మాత్రమే. కాని, ఆ మూజిక్ షాపులో కొందరు అద్భుతమైన గాయనీ గాయకుల పేర్లు మొదటిసారిగా విన్నాను.
వాళ్ళల్లో అందరికన్నా ముందు చెప్పవలసిన పేరు జుబీన్ గర్గ్. అసాంలో జోర్హట్ జిల్లాలో కళాకారుల కుటుంబంలో జన్మించిన గర్గ్ ప్రసిద్ధ సంగీతకారుడు జుబిన్ మెహతా మీద అభిమానంతో తన పేరులో జుబిన్ చేర్చుకున్నాడు. అసామీస్, బెంగాలీ, హిందీలోనే కాక, దక్షిణ భారతదేశ భాషల్లో కూడా ఫిల్మ్, పాప్, భక్తి సంగీతాలకు చెందిన ఆల్బంస్ ఎన్నో విడుదల చేసాడు. భూపేన్ హజారికా తరువాత మళ్ళా అసాం ను మంత్రముగ్ధుణ్ణి చేస్తున్న కంఠస్వరం ఆయనదే. అతడిది ఒక గోల్డెన్ కలెక్షన్ తో పాటు, జుబ్లీ బారువా అనే గాయనితో కలిసి పాడిన జానపద బాణీ ఆల్బం కూడా ఒకటి కొనుక్కున్నాను.
ఆ తరువాత చెప్పవలసిన గాయకుడు పాపోన్ గా ప్రసిద్ధి చెందిన అంగరాగ్ మహంతా. మహంతా కూడా కళాకారుల కుటుంబంలోనే జన్మించాడు. నాగావ్ జిల్లాకు చెందిన మహంతా సంప్రదాయ, జానపద సంగీత రహస్యాల్ని తన తల్లిదండ్రులనుంచే ఆకళింపు చేసుకున్నాడు. ‘పాపోన్’ పేరు మీద ఒక ఫ్యూజన్ బాండ్ ఏర్పాటు చేసి ప్రపంచమంతా సంగీత పర్యటన మొదలుపెట్టాడు. మధుస్మిత భట్టాచార్య అనే గాయనితో కలిసి అతడు విడుదల చేసిన ‘ఆకాషోర్ నీలాఖిని’ అనే ఆల్బం కూడా అక్కడ దొరికింది. (ఈ గాయకుడంటే తమకెంతో ఇష్టమని పద్మవల్లిగారు, పరేశ్ దోశి గారు రాసుకున్నది చదివాను. అదేమిటో, ఈ రసజ్ఞులెప్పుడూ నాకంటే ఒకడుగు ముందే ఉంటారు!)
ఈ వర్తమాన కళాకారులు అసామీయ సంగీతంలోని రెండు ప్రధాన శాఖలు భక్తి సంగీతం, గిరిజన-జానపద సంగీతాల్ని పాశ్చాత్య సంగీతవాద్యాలతో మేళవించి సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ళే పాటలు రాసుకుంటున్నారు. స్వరకల్పన చేసుకుంటున్నారు. కాని, ఆ వాద్యప్రయోగాలకన్నా కూడా మిన్నగా, ఆ గళాల్లో ఈశాన్యభారతదేశానికి చెందిన ప్రశాంతీ, అశాంతీ కూడా మంద్రతారస్థాయిల్లో పలుకుతో మనకొక చెప్పలేని వ్యాకులతను కలిగిస్తుంటాయి. ఆ గానం మనలో రేకెత్తించే ఆ సమ్మోహనీయ విదళితవేదన ఎలా ఉంటుందో, జుబిన్ గర్గ్ ఆలపించిన ఈ భక్తిగీతంలో చూడండి. ‘మహాపురుష వైష్ణవాని’కి చెందిన మాధవదేవుడి ఈ సుప్రభాత కీర్తన లో ప్రాచీన అసాం దిగంతం మళ్ళా కొత్తగా ఎలా కనిపిస్తున్నదో చూడండి.
త్యజించు నీ నిద్రని కమలాపతి, మేలుకో,
సుప్రభాతమవుతున్నది గోవిందా, నిద్ర లే,
నీ సుందరచంద్రముఖాన్ని చూడనివ్వు
పూర్వదిగంతం రజనివిదూరమవుతున్నది
రవికిరణాలు తిమిరాలను చీలుస్తున్నవి.
భ్రమరాన్వితంగా శతపత్రం వికసిస్తున్నది
బ్రజవధువులు దధి చిలుకుతూ నీ గానం చేస్తున్నారు
దాముడూ, సుదాముడూ నిన్ను పిలుస్తున్నారు
చూడు, నీ అన్న బలరాముడు కూడా మేల్కొన్నాడు.
ఆవుల్ని మేతకుపంపడానికి నందుడు కొట్టం తెరిచాడు
సురభిని మేతకు తోలుకుపోవాలి, గోపాలా, మేల్కోరా,
వెన్న, మీగడ, వెదురు, వేణువు ఎదురుచూస్తున్నాయి
లేగని కట్టు విప్పాలి, ఆవు అంబారవం చేస్తున్నది.
మాధవుడంటున్నాడు, ‘అమ్మా ఎట్లాంటి భక్తి నీది
ముల్లోకాలకీ ప్రభువు నీకు రక్షకుడయ్యాడు ‘
10-11-2018