ఒక్క రాముడు తప్ప

సంజీవ అభయంకర్

ఒక హిందుస్తానీ సంగీత కచేరిని ఆరుబయట వినడం నిజంగా ఒక అనుభవం. అందుకనే దర్బార్ ఫెస్టివల్ వాళ్ళు ఆరుబయట పాడించి ఆ కచేరీలు యూ ట్యూబ్ లో విడుదల చేస్తుంటారు. హిందుస్తానీ అనే కాదు, ఏ సంగీతమైనా, గానమైనా ఆరుబయట, అకాశం కిందనో, ఒక నది ఒడ్డునో, ఒక మైదానం అంచునో వినడం ఒక విమోచనానుభవం. అందుకని, పండిట్ మోతీరామ్ మణిరామ్ సంగీత సమారోహంలో భాగంగా సంజీవ్ అభయంకర్ గానం వుంది వింటారా అని విజయప్రతాప్ గారు మెసేజి పంపగానే, ఆ రాత్రి తొమ్మిదింటికి మాదాపూర్ సి.సి.ఆర్.టి ఓపెన్ ఆడిటోరియానికి పరుగెత్తాను.

పండిట్ సంజీవ్ అభయంకర్ మేవాతి ఘరానాకి చెందిన గాయకుడు. పండిట్ జస్రాజ్ శిష్యుడు. ఎప్పుడో గ్వాలియర్ ఘరానానుంచి విడివడ్డ మేవాతి ఘరానా కోమలమైన భక్తిసంగీతానికి, హిందూ, మహ్మదీయ ప్రార్థనాసంగీతాల సంగమానికి ప్రసిద్ధి చెందింది. గాయకుడి హృదయార్తిని ప్రతిబింబించే ఒక సుమధుర నాదమాధురిగా ఆ ఘరానాని పండిట్ జస్ రాజ్ ప్రపంచానికి పరిచయం చేసారు. ఆ పాదులో ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని మరింత ముందుకి తీసుకువెళ్తున్నవాడిగా సంజీవ అభయంకర్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

మనకి ఒక పద్యాన్ని అర్థం చేసుకుని దానిలో ఉన్న స్వారస్యాన్ని ఆస్వాదించడమెలానో చెప్పేవాళ్ళు లేనట్టే, ఒక చిత్రలేఖనాన్ని ప్రశంసించడ మెలానో నేర్పే వాళ్ళు లేనట్టే, ఒక సంప్రదాయ సంగీత కచేరీని ఆనందించడమెట్లానో చెప్పేవాళ్ళు కూడా లేరు. అది వినడానికి కావలసిన చెవి ఆ కుటుంబాల్లోనో, ఆ గానశాలల్లోనో పుట్టిపెరిగినవారికే లభ్యంగా ఉంటుందనీ, మనలాంటి వాళ్ళకి అది సుదూరమైన విషయమనీ వదిలిపెట్టేస్తాం. సంగీతం వింటున్నప్పుడు మనమేదో ఒక ఆనందం పొందుతున్నట్టు మనకు తెలుస్తున్నప్పటికీ, ఆ ఆనందమేమిటో మనకై మనం వివరించి చెప్పుకోవడమెలానో తెలియదు మనకి. దానికి శాస్త్రపరిచయం, వివిధ రకాల శైలుల తులనాత్మక అధ్యయనం అవసరమవుతుంది. అందుకొకటే మార్గం, అటువంటి ఒక చర్చ, గోష్టి నిరంతరాయంగా జరుగుతూ ఉంటే, మనం కూడా అందులో భాగంగా కొనసాగుతూఉంటే, కొన్నాళ్ళకు మనకి కూడా ఆ విద్య పట్టుబడుతుంది.

తెలుగు లో ఒకప్పుడు సామల సదాశివ గారు ఈ పని చేసారు. ఇప్పుడు ‘ఎలనాగ’ గా ప్రసిద్ధి చెందిన నాగరాజు సురేంద్ర ఈ పనిమొదలుపెట్టారు. సంగీతం వింటున్నపుడు శ్రోతలో కలిగే వివిధ రకాల మానసికావస్థలను ఆయన కవిత్వంగా రాస్తున్నారు కూడా.

‘సంగీతమంటే శిల్పాలు ఊపిరి తియ్యడం, చిత్రలేఖనాల నిశ్శబ్దం, అన్ని భాషలూ ముగిసిపొయ్యే భాష’ అన్నాడు ప్రసిద్ధ జర్మన్ కవీంద్రుడు రేనర్ మేరియా రిల్క. భాషాతీత అనుభవాన్ని భాషలో వివరించడానికి పూనుకోవడం ఒక విఫల ప్రయత్నమే అయినప్పటికీ, ఆ వీగిపోయే ప్రయత్నం చెయ్యడంలోనే ఒక సాఫల్యం కూడా ఉంది.

ఉదాహరణకి, ఆ రాత్రి, సంజీవ అభయంకర్ తన గానకచేరీ మొదలుపెడుతూ కౌశీ కానాడ రాగంలో ఒక తులసీ కృతి ఆలపించాడు. సుమారు నలభై నిమిషాలు పాటు సాగిన ఆ ఖయాల్ వినడం ఒక అనుభవం. అందులో సంప్రదాయం ఉంది, ప్రయోగం ఉంది. ఒక పరంపర ఉంది, ఒక కొత్త మలుపు ఉంది. ప్రతిభ ఉంది, అభ్యాసం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రోతల్ని రంజింపచేస్తూనే తన అన్వేషణ తనకు తానుగా కొనసాగించడమూ ఉంది.

దాన్నెట్లా అర్థం చేసుకోవడం? వివరించడం? ఉదాహరణకి ఆయన తీసుకున్న రాగం చూద్దాం. అది కౌశీ కానాడ. దాన్ని రెండు అంగాల్లో, భాగేశ్రీ పద్ధతిలోనూ, మాల్కౌన్స్ పద్ధతిలోనూ కూడా పాడతారు. మాల్కౌన్స్ పద్ధతిలో పాడే రాగాన్ని పండితులు ఒక్క వాక్యంలో వివరించమంటే ‘ఆరోహణలో మాల్కౌన్స్, అవరోహణలో దర్బారీ’ అనీ చెప్తారు.

మామూలుగా అది రాత్రి మూడవ జాము రాగం. అంటే అర్థరాత్రి పన్నెండుగంటలనుంచి తెల్లవారు జాము మూడింటిదాకా పాడే రాగం. కాని మనం మరింతలోతుకి పోయి చూస్తే మనకొక సంగతి అర్థమవుతుంది. అది మాల్కౌన్స్ లక్షణాలతో మొదలై దర్బారీ గా వికసించే రాగమని. మాల్కౌన్స్ అనేది అర్థరాత్రి రాగంగా ప్రసిద్ధి చెందింది గాని, నిజానికి అది సాయంసంధ్యారాగం. ఒకప్పుడు దాన్ని మాళవకైశికి అనేవారు. మొదట్లో అది వీరరస ప్రధానరాగం. తర్వాతిరోజుల్లో ధీరత్వమే వీరత్వమనే స్ఫురణ కలిగి, అది ధీరత్వాన్ని స్ఫురింపచేసే రాగమైంది. కాలక్రమంలో, శాంతమే నిజమైన ధీరత్వమనే ఎరుక కలగడంతో, ఇప్పుడు శాంతరసప్రధానరాగంగా నిలిచిపోయింది. దర్బారీ మొదట్లో కర్ణాటక సంగీతానికి చెందిన కానాడ రాగం. అది అత్యంత ప్రగాఢ, ప్రౌఢ రాగం. ఒక మనిషి తాను రోజంతా లోనైన అనుభవాల్ని రాత్రి కూచుని మననం చేసుకుంటూ, తనలోకి తాను చూపు సారించుకుని, తనను తాను కనుగొనే వేళకీ, తలపోతకీ సంబంధించిన రాగం. కౌశీ కానాడ ఆ రెండు రాగధర్మాల మేళవింపు అని మనం గుర్తు చేసుకుంటే, ఆ రాగం మనకి ఎటువంటి అనుభవాన్ని అందచేయగలదో బోధపడుతుంది. అందుకనే ఒక రసజ్ఞుడు కౌశీ కానాడ రాగాన్ని ‘అర్థరాత్రి సంభాషణ’ అన్నాడు. అంతర్ముఖుడూ, గంభీరుడూ, తన గతం గురించీ, భవిష్యత్తుగురించీ స్పష్టమైన అవగాహన ఉన్నవాడూ అయిన ఒక మనిషితో అర్థరాత్రిదాకా మనమొక సంభాషణ సాగిస్తే ఎలా ఉంటుందో కౌశీ కానాడ రాగం వినడం అలా ఉంటుందన్నాడు ఆ రసజ్ఞుడు.

అటువంటి ఒక మనిషిని మనకు పరిచయం చెయ్యడానికి ఆ రాత్రి సంజీవ్ అభయంకర్ ఆ రాగాలాపన చేయడానికి పూనుకోవడం ఒక విశిష్టత అయితే, అందుకు తులసీ దాస్ కీర్తనని ఎంచుకోవడంతో ఆ గాయకుడు మరింత విజ్ఞత కనపరిచాడు. ఎందుకంటే, రాముడికన్నా అంత ప్రగాఢమైన మనిషి మరొకెరెవరుంటారు? ఆ కీర్తన (వినయపత్రిక:162) చూడండి :

ఐసో కో ఉదార్ జగ్ మాహిఁ

ఐసో కో ఉదార్ జగ్ మాహిఁ
బిను సేవా జో ద్రవై దీన్ పర్ రామ్ సరిస్ కోఉ నాహి.

జో గతి జోగ్ బిరాగ్ జతన్ కరి నహి పావత ముని జ్ఞానీ
సో గతి దేత్ గీధ సబరీ కహఁ ప్రభు న బహుత జియ జానీ.

జో సంపతి దస్ సీస్ అరప కరి రావన సివ పహఁ లిన్హీ
సో సంపదా విభీషణ కహఁ అతి సకుచ్ సహిత హరి దీన్హీ

తులసీదాస సబ భాఁతి సకల సుఖ జో చాహసి మన్ మేరో
తో భజు రామ్ కామ సబ పూరన్ కరహి కృపానిధి తేరో

ఒక్క రాముడు తప్ప

ఈ ప్రపంచంలో దీనజనుల పట్ల హృదయం ద్రవించనివాడు, వారి సేవలో విసుగుచెందనివాడు ఎవరున్నారు? ఒక్క రాముడు తప్ప.

యుగాలుగా తపిస్తున్నా కూడా జ్ఞానవైరాగ్యాల వల్ల జ్ఞానులూ, మునులూ కూడా పొందలేని స్థితి అది.

అటువంటి స్థితిని రాముడు జటాయువుకీ, శబరికీ అనుగ్రహించాడు అయినా ఆయన మనసు తృప్తి చెందలేదు.

తన దశశిరాలూ అర్పించి మరీ రావణుడు శివుడినుంచి పొందిన సమస్త సంపదనీ కూడా అది చాలదేమో అన్న సంకోచంతోనే ఆయన విభీషణుడి చేతుల్లో పెట్టాడు.

తులసీ దాస్ అంటున్నాడు: మనసా, నీకు సకల సుఖాలూ కావలసి ఉంటే, రామగుణాగానం చెయ్యి. ఆ కృపానిధి ఒక్కడే నీ కోరికలు కడతేర్చగలుగుతాడు

ఆ గీతాన్ని ఆ గాయకుడూ, అతడి శిష్యురాలూ ఆలపిస్తున్నంతసేపూ అక్కడొక సుగంధం ఊరుతున్నట్టే ఉంది. అది నిజంగానే ఒక అర్థరాత్రి సంభాషణ. ధన్య ప్రసంగం. పండిట్ జస్ రాజ్ కుమార్తె దుర్గా జస్ రాజ్ అభివర్ణించినట్టుగా, అది దివ్య దర్శనం.

అపురూపమైన ఆ శ్రవణానుభవాన్ని అందించినందుకు, విజయప్రతాప్ గారూ, మీకు మరొకమారు నా నమస్సులు.

3-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading