అసలైన ప్రేమ ఏదో

Reading Time: 3 minutes

g1

కాకినాడలో ఒక సాయంకాలం. ఇంజనీరింగ్ కాలేజి గెస్టు హవుసులో మిత్రులంతా జమకూడారు. తెలుగులో యాత్రాసాహిత్యాల మీద సెమినార్ కోసం వచ్చిన రచయితలు, కవులు, భాషా ప్రేమికులు. మాటలు, మాటల మధ్యలో పాటలు, పాటల మధ్యలో మళ్ళా మాటలు.

ఇంతలో ఎవరో ‘రాజు గారు, రాజుగారేరీ, రాజుగారు గజల్ పాడతారు’ అంటున్నారు.

ఆ రాజుగారు ఒక పక్కన ఒదిగి కూచున్నారు. ఆయన సామ్రాజ్యమేదో ఆయన గళం విప్పేదాకా ఎవరికీ తెలియలేదు. వినయంగా గొంతు సవరించుకుని సాదాసీదా వేషంలోని ఆ రాజుగారు, కొద్దిగా మత్తుగానూ, సాధారణంగా పాటలు పాడేవాళ్ళు తమ గొంతు శ్రుతిచేసుకునేటట్టుగానూ, చిన్నగా కూనిరాగమేదో తీసి ‘అసలైన ప్రేమ ఏదో తెలిసున్నవారు లేరు..’అంటో తన గజల్ ఎత్తుకున్నారు.

చెప్పొద్దూ, తెలుగు గజల్ మీద నాకు నమ్మకం తక్కువ. శేషేంద్ర, సామల సదాశివ వంటి రసజ్ఞులు గజల్ మీద రాసినది చదివాక, తెలుగు భాష, గజల్ కి అంత అనుకూలమైన భాష కాదనే నాకనిపించింది. మామూలుగా తెలుగు కవి బిగ్గరగానూ, బాహాటంగానూ గానం చేస్తాడు. ‘అల్లసానివారు అల్లిబిల్లిగా ఏడ్చారు, ముక్కు తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’ అనే నానుడిలో ఎంతో నిజముంది. తెలుగు కవి బావురుమంటూ ఏడుస్తాడు. తెలుగు దేశి ఛందస్సులూ, వృత్తాలూ, గేయఫణితులూ కూడా విస్పష్టంగానూ, మిన్నూ, మన్నూ ఏకమయ్యేలాగు కవి హృదయార్తిని ప్రకటించడానికే బాగా పనికొస్తాయి.

కాని గజల్ చాలా సున్నితమైన సంభాషణ. ప్రేమైక హృదయాల గుసగుస. కన్నులు తెలిపే కథల్ని ‘రెప్పలార్పి ఏమార్చే’ ఒక తహతహ. చెవి కిర్రుమనే మాటలేవీ అందులో ఉండవు. అసలు మరొకరు ఉన్నారనే, మరొకరు వింటారనే తలపు ఏదీ లేని మనఃస్థితి అది. ఒక్క మాటలో చెప్పాలంటే గజల్ తెలుగు జాతి లక్షణానికి తగ్గ ప్రక్రియ కాదు.

ఆ మాటకొస్తే హైకూ కూడా కాదు.

కాని, తెలుగు కవి హైకూని సాధన చేయకుండా ఉండలేడు, గజల్ కట్టకుండానూ ఉండలేడు. ఏది తనది కాదో దానిమీద మక్కువ సహజం. తానేది కాదో అటుగా సాగాలనే తపన సహజం. అందుకనే తెలుగు గజల్ రాసేవాళ్ళంటే నాకు ఆదరం. వాళ్ళు ఎంత విస్తారంగా రాస్తే, ఎంత సాధన చేస్తే, తెలుగు కవిత్వం అంత సున్నితంగానూ, సుకుమారంగానూ మారుతుందని. బోలుగానూ,బిగ్గరగానూ వినిపించే కవుల గొంతు ఒకింత మార్దవంగానూ, నమ్మదగ్గది గానూ, అక్కున చేర్చుకోదగ్గదిగానూ వినిపిస్తుందని.

అయితే, అది కేవలం ఛందస్సుని పాటిస్తే సాధ్యమయ్యే రసాయనం కాదు. ఖాపియాలూ, రదీఫులూ సరిచూసుకుంటూ మత్లా, మక్తాలు పాటిస్తూ తన పేరునొక తఖల్లుస్ గా మార్చినంత మాత్రాన గజల్ రూపొందదు. తెలుగులో విస్తారంగా వస్తున్న గజళ్ళు నిర్మాణ రీత్యా సౌష్టవంగానే ఉంటాయి. కాని చక్కటి రబ్బరు బొమ్మల్లాగా వాటిలో ప్రాణం ఉండదు.

ఏమిటి లోపిస్తోంది వాటిల్లో?

ఆ రాత్రి ఏబెల్ రాజు గారి గజల్ విన్నప్పుడు నాకు అర్థమయింది, నిజమైన తెలుగు గజల్ ఎలా ఉండాలో. నిర్మాణం ప్రకారం చూస్తే,ఆ గజల్లో మక్తా లేదు, తఖల్లుస్ లేదు. కాని ఆ గీతం పొడుగునా ఆ ప్రేమికుడి గుండె నెత్తుటితో చేసిన సంతకం కనిపిస్తూనే ఉంది.

నేననుకుంటాను, గజల్ రాసేవాళ్ళు ముందు తమ హృదయాల్ని ఆ గులాబీల అత్తరులో ముంచి తేల్చుకోవాలని. ‘గజల్ ఒక సంస్కృతి’ అన్నాడు శేషేంద్ర. అది మబ్బు కరిగి చినుకుగా మారినట్టు నీ గుండె కరిగి పాటగా మారడం. ముందు అటువంటి ప్రేమానుభవమేదో నీకుండాలి, లేదా అటువంటి ప్రేమరంపానికి తెగిన హృదయాల్నైనా నువ్వు చూసి ఉండాలి. అది నీ గుండెలో పొగబెట్టాలి. ఊపిరాడక నలిగిపోతూ, నీ హృదయానికి నువ్వు ఊపిరు లూదుకుంటూ ఉంటే, ఎప్పుడో, ఏ అరుదైన క్షణాన్నో, ఆ పొగలోంచి ఒక జ్వాల లాగా ఒక వాక్యం తలెత్తాలి.

మీర్ తకీ మీర్ వాక్యంలాగా, అటువంటి ఒక్క వాక్యం, ఒక్క పదప్రయోగం చాలు, మనలో ఒక అరణ్యాన్ని నిద్రలేపడానికి. ఒక చంద్రవంకని నావగా చేసి మనల్నొక వెన్నెలప్రవాహంలోకి తీసుకుపోవడానికి. ఒకింత పన్నీరు మనమీద చిలకరించి, ఒక పెళ్ళి సంరంభాన్ని మనముంగిట నిలబెట్టడానికి.

గజల్ దానికదే పూసే ఒక పువ్వు కాదు, తోటనంతా వసంతం ఆవహించినప్పుడు మటుకే, ఈ కొమ్మ కూడా చిగురిస్తుంది, పూస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మటుకే ఇటువంటి వాక్యం నీలో చిగురిస్తుంది. అదొక అద్వితీయ భావావేశం. వట్టి మాటల కూర్పు చాలదు దానికి. ‘మొత్తం ప్రపంచమంతా తిప్పి చూసాను, నా హృదయం ఒక చెల్లని కాసు’ అని మీర్ అన్నాడంటే, ఆ మాట వెనక, ఒక జీవితకాలపు వేదన ఉందని గుర్తుపెట్టుకోవాలి.

‘నా కన్నీటికథ ఏ పుటమీద లిఖించానో
ఆ కాగితమట్లా కలకాలం తడిసే ఉంది ‘

అన్నా

‘ప్రేమ ఒక బండరాయి, మీర్
దాన్నెత్తడానికి నీ బలం చాలదు’

అనుకున్నా, ఆ ఒక్క వాక్యంలోనే ఒక టాగోర్ ‘శిథిల కుటీరం’ లాంటి కథ వినిపిస్తుంది నాకు. అటువంటి వాక్యం, ఒక్క షేర్ చెప్పినా చాలు, నువ్వు కలకాలం ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని నిలిచిపోతావు.

ఇదిగో, రాజు గారి గజల్ అటువంటి కవిత. గుండె గుసగుస. చదవండి, వినండి, వినండి, చదవండి.

అసలైన ప్రేమ ఏదో తెలిసున్న వారు లేరు

అసలైన ప్రేమ ఏదో తెలిసున్న వారు లేరు
సిసలైన ప్రేమ తెలిసీ బ్రతికున్నవారు లేరు.

విరహాన వేగిపోయీ బలి అయిన జీవులెన్నో
పొరపాటు ఎచట ఉందో కనుగొన్నవారు లేరు.

ప్రేమతత్త్వమేమోగానీ అంతుదొరకదెంతవరకూ
అంతులేని ప్రేమలో పడకున్నవారు లేరు.

జగమంత ప్రేమమయమే కాదన్నవారు ఎవరు
విలువైన ప్రేమనెరిగీ తోడున్నవారు లేరు.

12-10-2018

arrow

Painting: Ghazal poster by M.F.Hussain

Leave a Reply

%d bloggers like this: