అడవినుండి అడవికి

j1

నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా, పవన్ అప్పుడే ప్రెస్సునుంచి జయతి లోహితాక్షన్ పుస్తకం ‘అడవినుండి అడవికి’ ప్రతులు తీసుకొచ్చాడు. చెట్టుమీద మిగలముగ్గిన సీతాఫలాల్ని అప్పుడే కోసితీసుకొచ్చినట్టున్నాయవి. ఆ పుటల్లో తూర్పుకనుమల నుంచి పడమటికనుమలదాకా అడవులు, మబ్బులు, మేఘాలు, పక్షులు, ఆకాశమంత ఆకాశం ఉన్నాయి.

రాబోయే ఆదివారం అంటే 21 వ తేదీ సాయంకాలం రవీంద్రభారతి మొదటి అంతస్తు సమావేశమందిరంలో ఆవిష్కరణ కాబోతున్న ఈ పుస్తకం లాంటిది ఇంతదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. ఇది యాత్రాకథనాల సంపుటం కాదు, అలాగని కేవలం అనుభూతి చిత్రణా కాదు. ఈ రచన నన్నెందుకు ఆకట్టుకుందంటే, నేను నడచి వచ్చిన దారుల్లోకి వెనక్కి చూసుకోవలసి ఉంటుంది.

నా చిన్నప్పణ్ణుంచీ నాకు తీరని సౌందర్యదాహం. నేను పుట్టిన ఊరు ఒక కొండకిందపల్లె. చుట్టూ అడవి. ఏడాది పొడుగునా ఋతుపరిభ్రమణంలో సూర్యోదయాలు, అస్తమయాలు, వెన్నెల, వాన, పొగమంచు ప్రభాతాలు ఆ ఊళ్ళో ఒక సంగీత సమారోహం నడుపుతున్నట్టుండేవి. కాని నా తొమ్మిదేళ్ళప్పుడే నేను చదువుకోడం కోసం ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. నాకు చదువంటే కూడా ఇష్టం. కొత్త విషయాలు తెలుసుకోవాలనీ, ప్రపంచం గురించి మరింత పరిజ్ఞానం సంపాదించాలనీ ఉండేది. దాంతో నేనొక నలుగులాటకి లోనయ్యాను. నాకొక వేపు చదువు కావాలి, మరొకవేపు మా ఊరు కావాలి. కాని, జీవితం ఏదో ఒకటే ఇస్తుంది అని తెలిసేటప్పటికి, పై చదువులు వదిలేసుకున్నాను. కాని పరిస్థితులు మా ఊరిని కూడా నాకు కాకుండా చేసేసాయి.

నేను రాజమండ్రిలో ఉండగా నాకు అర్థమయిందేమంటే అప్పటి నా మానసిక స్థితి ఒక రొమాంటిక్ వైఖరి అని. రొమాంటిసిస్టు అందాన్ని ప్రేమిస్తాడు, ఆనందాన్ని అభిలషిస్తాడు. కాని,ఆ అందాన్నీ, ఆనందాన్నీ ఏదో ఒక రూపంలో మాత్రమే చూడగలుగుతాడు. ప్రకృతిలోనో, స్త్రీలోనో, దేశప్రేమలోనో లేదా తన కళాసృజనలోనో, ఏదో ఒక్కదాంట్లో మాత్రమే తన ఆనందాన్ని వెతుక్కోడం మొదలుపెట్టడంతో అతడికి తక్కిన జీవితమంతా శూన్యంగానూ, విషాదభరితంగానూ మారిపోతుంది. తన జీవితాన్ని వెలిగించే ఆ క్షణాల కోసం పరితపించడం మొదలుపెడతాడు. కాని, ఆ క్షణాలు అతడికి శాశ్వతంగా మిగిలిపోయేవి కావు. జీవితం అధికభాగం నిస్సారంగానూ, రొటీన్ గానూ, పూర్తి ప్రాపంచికంగానూ కనబడుతుంది. దాంతో మళ్ళా మరింత దుఃఖానికీ, ఏకాంతానికీ లోనవుతాడు. తాను కోరుకున్న సౌందర్యసన్నిధిలో తాను శాశ్వతంగా ఉండలేకపోతున్నానని తెలిసేకొద్దీ అతడికి అసహనం కలుగుతుంది, జివీతం పట్ల రోత కలుగుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల ద్వేషం పెరుగుతుంది.

ఈ వైఖరికి భిన్నమైన మరొక వైఖరి ఉంటుంది. అక్కడ ఏవో కొన్ని ఆనందమయ, సౌందర్యమయ క్షణాలంటూ విడిగా ఉండవనీ, నువ్వు జీవించే ప్రతి క్షణం అనుక్షణం అటువంటి సౌందర్యాన్ని దర్శించవచ్చుననీ, ప్రతి క్షణం ఆనందమయంగా గడపవచ్చుననీ భావించే ఒక ధోరణి.

నేను రాజమండ్రిలో శరభయ్యగారినీ,సుదర్శనంగారినీ ఎప్పుడు కలిసినా వాళ్ళు ఈ మానసిక వైఖరి గురించే చెప్పేవారు. శరభయ్యగారు గొప్ప ఉదాహరణ ఒకటి చెప్పేవారు కూడా. ఆయన తన కౌమారంలో శ్రీకృష్ణ కర్ణామృతం చదివి అదే ధ్యాసలో గడుపుతూండగా, ముట్నూరు కృష్ణారావుగారు ‘ఇప్పుడు నువ్వేం చదువుతునావు ?’ అని అడిగారట. తాను కర్ణామృతం తప్ప మరేమీ చదవడం లేదనీ, ఆ పుస్తకం తప్ప మరొకటేదీ తనకి సాహిత్యంగా గోచరించడం లేదనీ చెప్పారట. అప్పుడు కృష్ణారావుగారు ఎంతో లాలనగా ‘బాబూ, కర్ణామృతం గొప్ప కావ్యం, సందేహం లేదు. కానీ, లీలాశుకుడు శ్రీకృష్ణుడిలో మటుకే చూసిన సౌందర్యాన్ని కాళిదాసూ, భవభూతీ ఈ లోకమంతటిలోనూ, మనుషుల్లోనూ, మానవ జీవిత సంబంధాల్లోనూ చూసారు. పెద్దవాడివయ్యాక అర్థమవుతుంది అదేమిటో’ అన్నారట.

నాకు కూడా ఆ మాటలు అర్థం కావడానికి చాలా ఏళ్ళే పట్టింది. అర్థమయిన తర్వాత కూడా ఆ సత్యాన్ని అనుక్షణం అనుభవంలోకి తెచ్చుకోడానికే నిరంతర సాధన చేస్తూ ఉన్నాను. అంటే సౌందర్యం అనేది కొండల్లోనో, అడవుల్లోనో, వెన్నెలరాత్రుల్లోనో, రెల్లుపొదల్లోనో, పిల్లంగోవిపాటలోనో మటుకే లేదు. ఆనందమనేది లోకం నుంచి విడిగా ఎక్కడో బతకడంలో లేదు. అలాగని లోకంలో కూరుకుపోడంలోనూ లేదు. నిజానికి సౌందర్యం ఒక మానసిక స్థితి. జీవితానందం ఒక ఆత్మక్రమశిక్షణ. దాహం వేసినప్పుడు నీ చేతుల్లోకి తీసుకునే గ్లాసుడు నీళ్ళల్లో కూడా మహానందాన్ని చవిచూడవచ్చు. ఊహించుకో, నువ్వొక ఎడారిలో నడుస్తున్నావు, దప్పిగొని ఉన్నావు, ఒక్క నీటిచుక్క కోసం ప్రాణాలుగ్గబట్టి పరితపిస్తున్నావు. అప్పుడు నీ చేతుల్లో ఎవరో ఒక నీళ్ళ గ్లాసు పెట్టారు. నువ్వేం చేస్తావు? ప్రతి ఒక్క నీటిచుక్కనీ ప్రాణప్రదాతగా భావిస్తూ పెదాలు తడుపుకుంటావు, గుండెని దోసిటపడతావు. ఆ క్షణాన నీకు జీవితమంటే,ప్రాణమంటే, ప్రపంచమంటే ఆ గుక్కెడు నీళ్ళు తప్ప మరేమీ కాదు. యోచించు, అనుక్షణం అట్లా బతకడం. నీకు లభిస్తున్న ప్రతి క్షణాన్నీ ఇదే నీకు లభిస్తున్న మొదటి క్షణమన్నట్టు జీవించడం. పసిపాపలు చూస్తారే కనిపిస్తున్న ప్రతి ఒక్కదాన్నీ విభ్రాంతంగా, అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా, చూపులూ చిరునవ్వులూ ఒకటైపోయి చూస్తారే అట్లా చూడటం..

ఈ వైఖరి మిస్టిక్ ల వైఖరి. క్రైస్తవ సాధువులు, సూఫీ దర్వేషులు, భారతీయ భక్తికవులు, జెన్ సాధువులు, చీనా యోగులు నడిచిన దారి. అది పూర్తిగా ప్రపంచంలో కూరుకుపోనివ్వదు. అలాగని, ప్రపంచంనుంచి దూరంగానూ తీసుకుపోనివ్వదు. అది జీవితానందం గతంలోనే ఉందని గాని, భవిష్యత్తులో మటుకే సాధ్యపడుతుందని గాని నమ్మదు. అది మనుషుల్ని వదులుకోదు, అలాగని రాగద్వేషాల బరువు నెత్తిన మోయదు. ఆ వైఖరి అలవడ్డాక గొప్ప అనుభవాల కోసం పరితాపం ఉండదు. అందుకు బదులు లభిస్తున్న ప్రతి అనుభవమూ గొప్పగానే గోచరిస్తుంది. అవిలాకి చెందిన ప్రసిద్ధ క్రైస్తవ సాధువు థెరేసమ్మ రాసుకున్నట్టుగా, అటువంటివాళ్ళకి, వంటపాత్రలు కడుక్కుంటున్నప్పుడు కూడా భగవంతుడు తమ పక్కన కూచున్నట్టే ఉంటుంది.

ఇటువంటి మిస్టిక్ జీవనవైఖరిని తెలుగులో సాధన చేసినవారు ఆధునిక తెలుగు సాహిత్యంలో చలంగారు తప్ప మరెవరూ కనిపించలేదు నాకు. అరుణాచలం వెళ్ళకముందు చలంగారు రొమాంటిసిస్టు. జీవితానందం స్త్రీలో మటుకే కనిపిస్తుందని గాఢంగా నమ్మిన ప్రేమపిపాసి. స్త్రీ స్థానంలో రమణమహర్షి తనని పట్టిలాగడం ఆయనకి ముప్పైల చివరినుంచే అనుభవంలోకి వచ్చింది. ఆ నలుగులాట అంతా దీక్షితులు గారికి రాసిన ఉత్తరాల్లో కనిపిస్తుంది. కాని, జీవితానందాన్ని ఎవరో ఒక మనిషిసన్నిధిలో మటుకే, ఆ మనిషి రమణమహర్షినే కావచ్చు, కాని ఒక మనిషి లోనే వెతకడం కూడా రొమాంటిసిజమే, విగ్రహారాధనే. అది లీలాశుకుడు కృష్ణుడిలో మటుకే సౌందర్యం చూడటం లాంటిది. కాని చలంగారు అరుణాచలం వెళ్ళిన మొదటి రెండుమూడు సంవత్సరాల్లోనే ఆ మనఃస్థితిని దాటేసారు. ఆ తర్వాత దాదాపు పాతికేళ్ళ పాటు ఆయన పరిపూర్ణమైన మిస్టిక్ గా జీవించారు. ఆ అనుభవమెట్లాంటిదో తెలుసుకోవాలంటే ఆయన ఆ రోజులంతటా తన మిత్రులకి రాసిన లేఖల్లో చూడాలి, ముఖ్యంగా చిన్నారావుగారికి రాసిన ‘మహాస్థాన్’ లేఖల్లో. ఆయన ఆ స్థితిలో ఎంతదూరం ప్రయాణించారంటే, తన ఇంటికి వచ్చివాలిన ఒక పక్షి జీవితకథ రాసేటంతగా.

ఆ అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకనే ‘మహాస్థాన్’ కి పరిచయం రాస్తూ సంజీవ్ దేవ్ ఒక మాటన్నారు. ‘మామూలు మనిషికి కళాకారుడు అర్థం కానట్టే, కళాకారుడికి యోగి అర్థం కాడు’ అని. ఆ మాటకి అర్థం కళాకారుడు జీవితానందాన్ని ఏదో ఒక రూపంలో మటుకే చూస్తాడు. యోగి అన్నిట్లోనూ చూస్తాడు అని.

యోగం అనే మాట మనకి చాలా సంకుచితంగానూ, మతపరంగానూ లేదా శుష్క ఆధ్యాత్మికంగానూ మటుకే అర్థమయ్యే స్థితికి చేరుకున్నాం. కాని అది నిజానికి రూమీ, టాగోర్, జిబ్రాన్ ల వైఖరి. ‘వైరాగ్యంలోంచి లభించే మోక్షం నాకు అవసరం లేదు. సాతంత్ర్యం తన సహస్రబంధానాల్తో నన్ను కావిలించుకునే ఉంటుంది’ అని గీతాంజలి ప్రకటిస్తున్న వైఖరి అదే.

ఇదిగో, మళ్ళా అటువంటి దర్శనం నాకు ఈ ‘అడవినుండి అడవికి’ అనుభవాల్లో కనిపించింది. ఏదో ఒక సంకుచిత ప్రాతిపదిక మీద మటుకే జీవితానికి అర్థం వెతుక్కుంటున్న కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనకి ఇటువంటి మనుషులూ, ఇటువంటి రచనలూ చాలా అవసరం. రండి, వచ్చే ఆదివారం కొంచెం సేపు కలిసి కూచుని ఈ పుస్తకం గురించీ, ఇటువంటి జీవితం గురించీ మాట్లాడుకుందాం.

16-10-2018

One Reply to “అడవినుండి అడవికి”

  1. అయ్యా!మహాభక్తవిజయం పుస్తకం దొరుకుతుందా. pdf లింక్ ఉంటే పెట్టండి

Leave a Reply

%d bloggers like this: