నా చంపారన్ యాత్ర-5

చంపారన్ యాత్రలో చివరిరోజు. మోతీహారీ చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలు చూడాలనీ,ముఖ్యంగా బర్హార్వా లఖన్ సేన్ లో గాంధీజీ నెలకొల్పిన పాఠశాల చూడాలనీ అనుకున్నాను. కానీ నాతో వచ్చిన నా సహోద్యోగి ఆశిష్ వైశాలి చూడాలని మనసుపడ్డాడు. దాంతో తెల్లవారుజామునే లేచి ప్రయాణం మొదలుపెట్టేం.

మా ప్రయాణంలో మొదట మేం కేసరియా సందర్శించేం. కేసరియా గురించి మాకు మొదటిరోజునే మోతీహారిలో సంజయ్ సత్యార్థి చెప్పిపెట్టాడు. ఇప్పుడున్నవాటిలో అదే అతిపెద్ద బౌద్ధ స్తూపమని చెప్పాడు.

కేసరియా ఒకప్పుడు కేసపుత్తమనే పట్టణం. దానికదే ఒక చిన్న గణతంత్రం కానీ, తర్వాతి రోజుల్లో కోసల జనపదం ఆ గణతంత్రాన్ని ఆక్రమించుకుంది. సిద్ధార్థ గౌతముడు ఇల్లు విడిచిపెట్టి తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల గురువుల్ని అన్వేషిస్తో కేసపుత్త పట్టణానికి చేరినప్పుడు అలార కాలాముడనే గురువు దొరికాడు. బుద్ధుడి ఇద్దరు గురువుల్లో అతడొకడు, మరొకరు ఉద్దక రామపుత్తుడు. సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత మరలా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆ ప్రాంతంతో బుద్ధుడికున్న అనుబంధం పూర్వజన్మలనుంచీ కొనసాగుతున్నదనీ ఒక జన్మలో ఆయన అక్కడ చక్రవర్తి గా జీవించాడనీ కూడా జాతకకథలు చెప్తున్నాయి. కాని, కేసపుత్త పట్టణాన్ని బౌద్ధ సాహిత్యంలో చిరస్మరణీయం చేసింది మాత్రం కేసపుత్త సుత్త (అంగుత్తర నికాయం, 3:65). కేసముత్తియ సుత్త (కేశమౌక్తిక సూత్రం) అని కూడా ప్రసిద్ధి చెందింది. కేసముత్తమంటే నెత్తిన ఉన్న ముత్యం. మనం ముంజేతి కంకణానికి అద్దమేల అంటామే, అట్లానే నీ కేశాన్ని అలంకరించిన ముత్యం గురించి నీకు వివరించడానికి మరొకరి అవసరమేమిటని దాని అర్థం. కాలామ సుత్త గా కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ సుత్తాన్ని చదువుతుంటే, మనకు జిడ్డు కృష్ణమూర్తి సంభాషణ చదువుతున్నంత నవీనంగానూ, సత్యవిశదీకరణంగానూ వినిపిస్తుంది.

కేసపుత్త పట్టణంలో బుద్ధుడు సంచరిస్తున్నప్పుడు కాలాములనే వాళ్ళు బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఇట్లా చెప్పుకొచ్చారు

‘అయ్యా, ఇక్కడికి కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు వచ్చి తమ సిధాంతాల్ని మాకు వివరిస్తున్నప్పుడు, ఎదటివాళ్ళ అభిప్రాఉయాల్ని విమర్శిస్తూ, అవహేళన చేస్తూ, నిందిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక మరికొందరు శ్రమణులు, బ్రాహ్మణులు వచ్చి వాళ్ళు కూడా తమ సిద్ధాంతాలే గొప్పవని చెప్తూ తక్కినవాళ్ళ భావాల్నీ, ఆలోచనల్నీ తక్కువ చేస్తో మాట్లాడతారు. ఆ రెండు రకాల వారిలోనూ ఎవరు చెప్పేది సత్యమో మేం తేల్చుకోలేకుండా ఉన్నాం. ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో తెలియకుండా ఉంది ‘ అని.

వారి మాటలు విని బుద్ధుడిలా అన్నాడు:

‘కాలాములారా, మీకీ సందేహం కలగడం సమంజసమే. ఎందుకంటే మీరు అనిశ్చయంలో ఉన్నారు. ఏదీ నిశ్చయంగా తెలీనప్పుడు సందేహం కలగడం సహజమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకెవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఆ చెప్పినవాళ్ళ అధికారాన్ని బట్టో, సంప్రదాయాన్ని బట్టో, అది ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరించి ఉందన్నదాన్నిబట్టో, హేతువునో, తర్కాన్నో, విశ్లేషణనో, లేదా సూత్రీకరణనో ఆధారం చేసుకుందనో, లేదా ఆ మాట్లాడుతున్న వక్త రూపాన్ని బట్టో, లేదా అతడు మీ గురువయినందువల్లనో మీరు దాన్ని విన్నది విన్నట్టుగా ఒప్పేసుకోవలసిన పని లేదు. ఫలానా గుణగణాలు మొత్తం మీద నిందార్హాలనో, వివేకవంతులు అంగీకరించేవి కావనో, లేదా వాటికి అంటిపెట్టుకోడం వల్ల మీకు దుఃఖమూ,క్లేశమూ కలుగుతుందనో మీకై మీకు మీఅంతట మీకు స్పష్టమైనప్పుడు మటుకే వాటిని వదిలిపెట్టండి’ అని.

ఇది బుద్ధుడి సత్యాన్వేషణా పద్ధతి. కేవలం ఒకరు చెప్పారని కాక, ఏదైనా తనంతట తనుగా వివేచించి గ్రహించుకునేది మాత్రమే సత్యమని చెప్తున్న ఈ సుత్తం విద్య గురించిన మహనీయమైన ఆలోచనల్లో ఒకటిగా చెప్పదగ్గ చింతన.

కాని, ఇప్పుడు కేసపుత్త పట్టణాన్ని సందర్శనీయ స్థలంగా మార్చిన స్తూపానికీ, ఈ సుత్తానికీ ఏమీ సంబంధం లేదు. ఆ స్తూపం కూడా బుద్ధుడి జీవితంలోని ఒక స్మరణీయ క్షణానికి గుర్తుగానే అక్కడ నిలిచి ఉంది. ఆయన తన మహాపరినిర్వాణక్రమంలో వైశాలినుండి బయలుదేరినప్పుడు లిఛ్ఛవులంతా ఆయన్ని వదల్లేక వెంట నడిచారట. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి, ఆయన వాళ్ళని వెనక్కి వెళ్ళిపొమ్మని బుజ్జగించి, తన గుర్తుగా తన భిక్షాపాత్ర వాళ్ళకి అప్పగించేసాడట. ఆ భిక్షాపాత్ర కు స్మారకంగా నిర్మించిన స్తూపం అది.

k1

అంత విశేష ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కేసరియా స్తూపానికి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నట్టు కనిపించలేదు. ఆ స్తూపంచుట్టూ చాలా భాగం పిచ్చిమొక్కలు పెరిగి ఉన్నాయి. పురావస్తు శాఖవారు కొంతమేరకు మాత్రమే శుభ్రం చేసి ఉన్నారు. కాని కేసరియా ఇప్పుడే కాదు, హ్యుయాన్ త్సాంగ్ సందర్శించినప్పుడు కూడా ఇలానే నిర్జనంగానూ, నిరాదరణీయంగానూ ఉందని చరిత్ర చెప్తోంది.

కాని, ఆ తొలిసంజవేళ ఆ స్తూపం మాత్రం శతాబ్దాల కాలప్రమాణాన్ని మాత్రమే పట్టించుకునేదిగా, మౌనంగా, గంభీరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ వివిక్త సత్యనిష్ఠ నన్ను నిలబడనివ్వలేదు. నేనా గుట్ట ఎక్కి, ఆ శిథిల స్తూపాన్ని తాకకుండా ఉండలేకపోయాను.

2

అక్కణ్ణుంచి వైశాలికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం. మరొక గంటలో  మేం వైశాలి చేరుకున్నాం. మా డ్రైవరు ఇంతకుముందు ఆ ప్రాంతాలు చూసినవాడు కావడంతో నేరుగా విశ్వశాంతి పగోడా దగ్గర మా కారు ఆపి ‘ఇదే, వైశాలి,దిగండి ‘ అన్నాడు.

వైశాలి! ఎప్పటి పేరు ఇది! నా పసితనం నుంచీ నా మనసును మధురరాగ రంజితం చేస్తూ వస్తున్న పదాల్లో వైశాలి ఒకటి. బింబిసారుడు, ప్రసేనజిత్తు, అజాత శత్రువు,  శాక్యులు, లిచ్ఛవులు లాంటి పదాలతో పాటు వైశాలీనగర వధువు ఆమ్రపాలి కూడా నా పసితనం నుంచీ నా భావనాలోకంలో నాకు పరిచయమైన పాత్రలే. కాని, ఈ ప్రాచీన నగరాన్ని  చూడగలగని కలలో కూడా ఊహించలేదు నేను.

కార్లోంచి ఆ నేలమీద పాదం మోపుతూనే ప్రపంచ చరిత్రలోనే అతి ప్రాచీనమైన మొదటి రిపబ్లిక్, వజ్జి గణతంత్రం, నేలమీద అడుగుపెడుతున్నానని స్ఫురించింది నాకు.

బుద్ధుడి జీవితంలో ముఖ్య పాత్ర వహించిన పట్టణాలు మొదట నాలుగు, అదనంగా మరొక నాలుగు, మొత్తం అష్ట మహాస్థానాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి ఎనిమిది కలిపి ఇప్పుడు యాత్రీకులకీ,తీర్థయాత్రీకులకి కూడా  Buddha Circuit గా ఏర్పడ్డాయి. మొదటి నాలుగు: బుద్ధుడు జన్మించిన లుంబిని, జ్ఞానోదయం పొందిన బోధ్ గయ, మొదటి సందేశం వినిపించిన సారనాథ్, మహాపరినిర్వాణం చెందిన కుశీనగర్. మిగిలిన నాలుగు పట్టణాలూ శ్రావస్తి, సంకాసియా, రాజ్ గిర్, వైశాలి. ఈ నాలుగుచోట్లా ప్రతి పట్టణంలోనూ బుద్ధుడు ఏదో ఒక మహిమ చేసిచూపినట్టుగా బౌద్ధ సాహిత్యం చెప్తూ ఉంది.

బౌద్ధ పురాణగాథలు చెప్తున్న మహిమలు అలా ఉంచి, బుద్ధుడు వైశాలి పట్ల గొప్ప గౌరవం చూపించాడనడానికి దీఘనికాయం లోనే ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. మొదటి గణతంత్రమయిన వజ్జి గణతంత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడని ‘మహాపరినిబ్బాణ సుత్త‘ ఎలుగెత్తి చాటుతోంది. ఆయన జ్ఞానోదయం  పొందిన తరువాత అయిదవ ఏడాది వైశాలిలో వచ్చి ఒక వర్షాకాలం గడిపినప్పణ్ణుంచీ, తిరిగి తన మహాపరినిర్వాణందాకా ఎన్ని సార్లు వైశాలిలో నివసించాడో లెక్కలేదు. బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు వైశాలితో పెనవేసుకుని ఉన్నాయి. బౌద్ధ సంఘానికి సంబంధించిన ప్రధాన నియమాలు వైశాలిలోనే రూపుదిద్దుకున్నాయి. తర్వాతి రోజుల్లో వాటినే వినయపిటకంగా సంగ్రహించారు. ఇక్కడే ఆయన మొదటిసారి తన తల్లి మహాప్రజాపతి గోతమితో కలిపి అయిదువందల మంది స్త్రీలని సంఘంలోకి అనుమతించాడు. ఇక్కడే, ఆయన నిర్వాణ యాత్రకి ముందు ఆమ్రపాలి ఆయన గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసింది. ఆ విందు బౌద్ధ సాహిత్యంలో ఒక రసమయ ఘట్టం. ఎందుకంటే భగవానుడు ఆమె విందు స్వీకరించబోతున్నాడని విని లిచ్ఛవులు ఆమెదగ్గరకు వచ్చి లక్ష బంగారు నాణేలు ఇస్తాం, ఈ విందుని మా కోసం వదిలిపెట్టు అనడిగారు. ఆమె అందుకు అంగీకరించలేదు సరికదా, ఆ విందు పూర్తయ్యాక, తన సంపదనే బౌద్ధ సంఘానికి దానం చేసేసింది.

బుద్ధుడి జీవితంతోనూ, బోధల తోనూ ఇంతగా ముడిపడింది కనుకనే, ఆయన నిర్వాణానంతరం జరిగిన బుద్ధ సంగీతుల్లో రెండవ సంగీతి ఇక్కడే సమావేశమయ్యింది.  అసలు మొదటి సంగీతి అనేది చారిత్రికసత్యం కాదని కొందరు చరిత్రకారులు వాదిస్తూన్న మాట నిజమే అయితే, బుద్ధుడి బోధనలని సంగ్రహించే మొదటి ప్రయత్నం వైశాలిలోనే జరిగిందని చెప్పాలి.

బౌద్ధ నికాయాల్లోనూ, మహాభారతంలోనూ, బుద్ధఘోషుడి రచనల్లోనూ కనిపించే ఈ పట్టణం కాలక్రమంలో అదృశ్యమైపోయింది. తిరిగి పందొమ్మిదో శతాబ్దంలో అలెగ్జాండర్ కన్నింగ్ హాం, ఈ ప్రాంతాన్ని వెతికి, పోల్చుకుని ఇదే వైశాలి అయి ఉంటుందని తీర్మానించేడు. ఇప్పుడిది తిర్హౌత్ డివిజన్ లో ఒక జిల్లాగా, ప్రసిద్ధ దర్శనీయ స్థలంగా ఎదిగిపోయింది.

మేము దిగిన చోట, జపాన నిచిరేన్ బౌద్ధ శాఖకి వారు నిర్మించిన విశ్వశాంతి గోపురం ఉంది. రెండవప్రపంచ యుద్ధంలో హిరోషిమా విషాదాన్ని చూసి చలించిన బౌద్ధులు మరొక హిరోషిమా తలెత్తకూడదనే ప్రార్థనతో నిర్మించిన పగోడా అది. ఆ పూర్వాహ్ణ నీలాకాశం నేపథ్యంగా ఆ శ్వేత గోపురానికి నాలుగు వైపులా బుద్ధుడి జీవితంలోని నాలుగు ఘట్టాల్నీ చూపించే నాలుగు బుద్ధ ప్రతిమలు స్వర్ణకాంతిలో ప్రశాంతంగా దర్శనమిచ్చాయి.

k3

ఆ ప్రాగంణంలో అడుగుపెడుతుండగా నలుగురు బీదపిల్లలు, అప్పుడే చెరువుల్లోంచీ, దొరువుల్లోంచీ కోసితెచ్చిన నవజాతకమలాలు నా ముందు పెట్టారు. వాళ్ళల్లో ఒకడి వంటిన నిక్కరు తప్ప మరేమీ లేదు. వాడి ముక్కు చీమిడి కట్టి ఉంది. నెత్తినుంచి నీటిబిందువులు రాలుతూ ఉన్నాయి. నేనా పిల్లలందరిదగ్గర ఉన్న కమలాలన్నీ తీసేసుకున్నాను. కొనగోరు తాకితేనే కందిపోయేటట్టున్న ఆ తామరపూలను అట్లా పోగుపోసి మరీ  బుద్ధుడి ముందు సమర్పించాను.

k6

ఆ పగోడా పక్కనే అభిషేక పుష్కరిణి ఉంది. వజ్జి గణతంత్రం తన ప్రతినిధుల్ని ఎన్నుకున్నప్పుడు వారిని ఆ పుష్కరిణి జలాలతో అభిషేకించేవారట. పుష్కరిణికి అవతల వైపు బుద్ధుడి ధాతు చైత్యం ఉంది. మేమక్కడికి వెళ్ళాం. ఆ చైత్యం బుద్ధుడి అవశేషాల మీద నిర్మించిన మౌలిక చైత్యాల్లో ఒకటి. బుధుడి పరినిర్వాణం తర్వాత ఆయన అవశేషాల్ని ఎనిమిది భాగాలు చేసినప్పుడు లిచ్ఛవులకు కూడా ఒక భాగం దక్కింది. దానిమీద నిర్మించిన చైత్యం అది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి, ఆ చైత్యం దగ్గర శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ యాత్రీకుల సమూహం ఒకటి చుట్టూ చేరి ఉంది. ఒక బౌద్ధ సాధువు సింహళభాషలో కొన్ని సూత్రాలు వారందరికోసం పారాయణ చేస్తున్నాడు.

నేను కొంత సేపు అ చైత్యానికి ఇవతలి వైపు నిలబడి వారినే చూస్తో, ఆ పారాయణ విన్నాను. కొంతసేపయ్యాక, ఆ చైత్యం పక్కన ఒక చెట్టు నీడన కూచున్నాను. వానాకాలపు నేల మెత్తగా వికసించిన పచ్చికతో నిండి ఉంది. నేను కొంతసేపు మౌనంగా నా లోపలకి నా చూపు తిప్పుకోడానికి ప్రయత్నించాను. 2500 ఏళ్ళ కిందట ఒక వివేకవంతుడు, సత్త్వవంతుడు, సత్యవంతుడు, విముక్తుడు నడయాడిన నేలమీద, ఆయన ధాతుస్తూపం ఎదట కూచుని ఆయనేమిచెప్పాడో గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాను.

k20

తాను జ్ఞానోదయం పొందిన తర్వాత సుమారు అరవై ఏళ్ళ పాటు ఆయన ఈ మనుషుల మధ్య, ఈ పట్టణాల్లో, మామిడితోటల్లో, నదీతీరాల్లో తన మానసిక ప్రశాంతిని నలుగురికీ అయాచితంగా పంచుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా ఈ మనుషుల మధ్యనే జీవించాలనీ, ‘బహుజనుల మేలుకోసం, లోకం మీద దయతో, దేవమనుష్యుల మేలుకోసం, సుఖం కోసం’ కల్పాంతందాకా ఇక్కడే ఉండాలని అనుకున్నాడనీ, బహుశా ఆనందుడు పట్టుబట్టి మరో సారి అడిగిఉండే మహాపరినిర్వాణాన్ని వాయిదా వేసుకుని ఉండేవాడనీ ‘మహాపరినిబ్బాన సుత్త’ చెప్తోంది. ఈ ప్రపంచాన్ని ఆయన ఎందుకంతగా ప్రేమించాడు? తాను 120 ఏళ్ళు పూర్ణాయుర్దాయంతో జీవించాలని గాంధీజీ ఎందుకు కోరుకున్నాడు? ఆ తెలియవలసిందేదో తెలిసాక, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన ఆ విముక్తమానవులు, తిరిగి, ఈ మట్టిలో,ఈ దుమ్ములో, ఈ మనుషులకోసం పూర్తిజీవితం జీవించాలని ఎందుకు కోరుకున్నారు?

ఆ కొద్ది క్షణాలూ నాకు సుదీర్ఘమయిన ఒక రోజులాగా అనిపించాయి. నేనొక మహా ద్వారం దగ్గరకు చేరుకుని ఆ గడప దగ్గరే నిల్చుండిపోయినట్టుగా అనిపించింది. ఆ గడప దాటితే లోపల ప్రవేశించినట్టా? లేక బయటపడ్డట్టా?

మహాపరినిర్వాణ యాత్రలో భగవానుడు రాజగృహం లో మొదలుపెట్టి ఒక్కొక్క ఊరూ, ఒక్కొక్క పట్టణం దాటుకుంటూ కుసీనార దాకా పయనించాడు. కాని మరెక్కడా చూపని ఒక అనుతాపాన్ని ఆయన వైశాలిపట్ల చూపించాడు. ఆ పట్టణం నుంచి భండ గ్రామానికి బయల్దేరేముందు ఒక ఏనుగులాగా వైశాలిని చూస్తూ ‘ఆనందా, తథాగతుడు వైశాలిని చూడటం ఇదే చివరిసారి ‘ అన్నాడట.

ఒక ఏనుగులాగా చూడటమంటే ఏమిటి? ఏనుగులాగా చూసి శాశ్వతంగా వీడ్కోలు తీసుకోవడమంటే ఏమిటి? ఆ మానసిక స్థితి ఎటువంటిదో ఇప్పటిదాకా ఏ కవి కూడా సంభావించినట్టు కనిపించదు.

ఆ తర్వాత ఆ చైత్యం పక్కనే ఉన్న ఆర్కియలాజికల్ మూజియం చూసాం. పాతరాతియుగం కాలం నుంచీ సేకరించిన పురావస్తు ప్రదర్శన అది.

k13

ఆ మూజియం ఫొటో తీసి అమృతకి పంపిస్తే వెంటనే మెసేజి పెట్టింది. ‘వర్ధమాన మహావీరుడు జన్మించిన కుంద గ్రామం పక్కనే ఉంది, వెళ్తున్నావా?’ అని. అప్పటిదాకా, మహావీరుడు నా తలపులోనే లేడు. కుంద గ్రామం ఎంత దూరమని అక్కడవాళ్ళనడిగితే అయిదుకిలోమీటర్లన్నారు. ఒక క్షణం పాటు నేనెటూ తేల్చుకోలేకపోయాను. తీరా చేసి అక్కడికి వెళ్ళినా ఎక్కువ సేపు గడిపే సమయం లేదు. మహావీరుడి జన్మస్థలం అయిదునిమిషాల పాటు చూసి రావలసిన స్థలం కాదనిపించింది. మరొకసారి ఒక రోజంతా అక్కడ గడుపుదాం, ఈ సారికి, వైశాలి సమీపంలో ఉన్న కొలుహా చూసి వెళ్ళిపోదామనుకున్నాను.

3

కొలుహా వైశాలికి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం. బుద్ధుడు వైశాలికి వచ్చినప్పుడల్లా అక్కడే నివసిస్తూ ఉండేవాడట. ఒకసారి అక్కడ తోటలో ఉండే కోతులు కొన్నిఆయన భిక్షాపాత్ర పట్టుకుపోయి అందులో తేనె నింపి తీసుకొచ్చి ఆయనకు సమర్పించాయని ఐతిహ్యం. అందుకని ఆ స్థలంలో ఉన్న చెరువును ‘మర్కటహ్రదం’ అని పిలుస్తున్నారు. అక్కడ అశోకుడు నిలబెట్టిన ఏక శిలా స్తంభం ఒకటి ఉంది. పాటలీపుత్రం నుంచి లుంబిని దాక అశోకుడు నెలకొల్పిన శిలాస్తంభాల్లో నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న పూర్తిస్తంభం ఇదొక్కటే. ఆ స్తంభం పక్కనే అశోకుడు నిర్మించిన స్తూపం కూడా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఆకాశమంతా తెల్లటి మేఘాలు సూర్యకాంతిలో తడిసిపోయి నేలమీద నీడలు పరిచి ఉన్నాయి. ఉక్కులాంటి ఎండ ఒక మహాచక్రవర్తికి శ్వేతఛత్రం ఎత్తిపట్టినట్టుగా ఉంది.  పదమూడు శతాబ్దాల కిందట చైనా యాత్రీకుడు హ్యుయన్ త్సాంగ్ ఎక్కడ నిలబడి ఆ స్తూపాన్నీ, ఆ స్తంభాన్నీ చూసాడో అక్కడే నేను కూడా నిలబడి ఆ అవశేషాల్ని పరికిస్తూ ఉన్నాను. ఆ స్తంభం పైన సింహం శతాబ్దాలుగా దూరదిగంతాన్ని పర్యావలోకిస్తూ ఉంది.

k7

బుద్ధుడు నడయాడిన ప్రతి చోటూ మనకేదో చెప్తూనే ఉంటుంది. ఈసారి నాకు అర్థమయింది, బుద్ధుడికీ, వైశాలికీ మధ్య ఉన్న అనుబంధం లాంటిదే మళ్ళా గాంధీజీకి చంపారన్ కీ మధ్య ఏర్పడిందని.

4

చంపారన్ యాత్రలో మా చివరి మజిలీ పాట్నాలో గాంధీ మూజియం. 1965 లో ప్రారంభించిన ఈ సంగ్రహాలయాన్ని గాంధీ మైదాన్ ఎదురుగా ఉన్న స్థలంలోకి 1967 లో మార్చారు. 1971 నుంచీ ఇది స్వతంత్రప్రతిపత్తిగల మూజియంగా పనిచేస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా రెండు విభాగాలున్నాయి. ఒకటి గాంధీ జీవితాన్నీ, కృషినీ వివరించే ఫొటో ఎగ్జిబిషన్. కేవలం ఫొటోలే కాకుండా గాంధీ శతజయంతి సంవత్సరానికి సంబంధించిన అరుదైన పోస్టర్లు, కవర్లు, పోస్టలు స్టాంపులు, పుస్తకాలు కూడా ఉన్నాయి. ఫొటో ప్రదర్శన కూడా ఎంతో శ్రద్ధగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించి ఉంది. ఇప్పుడు గాంధీజి మీద ఒక ఫొటో ప్రదర్శన రూపొందించి ఊరూరా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న మా అన్నయ్యకు పోన్ చేసి ఈ ప్రదర్శన కూడా ఒకసారి చూడమని చెప్పాను. మూజియంలో రెండవవిభాగం బీహార్ చరిత్రకు సంబంధించిన ప్రదర్శన. ఆ ప్రాంగణంలో గాంధీ సాహిత్య విక్రయ కేంద్రం కూడా ఒకటి ఉంది. అక్కడ My Gandhi అని నారాయణ దేశాయి రాసిన పుస్తకం, My Religion అనే పేరిట గాంధీజీ భావాల సంకలనంతో పాటు, అరవింద మోహన్ అనే ఆయన రాసిన ‘చంపారన్ సత్యాగ్రహ్ కే సహయోగీ ‘, చంపారన్ సత్యాగ్రహ్ కీ కహానీ’ అనే పుస్తకాలు కొనుక్కున్నాను.

k10

ఈ దేశంలో ఇంకా గాంధీజీ పట్ల నమ్మకం కోల్పోని కొందరు హిందువులు, కొందరు ముస్లిములు లేకపోలేదు. ఆ మూజియం కార్యదర్శి డా.రజీ అహ్మద్ అటువంటి వారిలో ఒకరు. ఆయన్ని కలవకుండా పాట్నా వదిలిపెట్టొదని ముందురోజు మనోజ్ కుమార్ నాకు మరీ మరీ చెప్పాడు. డా. అహ్మద్  అత్యంత సాత్త్వికంగా, నిరాడంబరంగా దర్శనమిచ్చాడు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. నేను చంపారన్ గురించి తెలుసుకోడానికి వచ్చానని చెప్తే, తన బల్ల మీద ఉన్న ఒక పుస్తకం చూపిస్తూ ఇది మీరు చూసే ఉంటారు కదా అనడిగారు. ఆ పుస్తకం తీసి చూసాను. ‘నీల్ కే ఛబ్బే’ (నీలి మరక, 2018). బీహార్ ప్రభుత్వ ప్రచురణ. ‘అటువంటి పుస్తకం ఒకటి వచ్చిందనే నాకు తెలీదు’ అన్నాను. ‘ఇదొకటే ప్రతి నా దగ్గర ఉంది ‘అన్నాడాయన. కాని మరునిమిషంలో ఆ పుస్తకం సంతోషంగా నా చేతులో పెట్టేసాడు.

5

విమానాశ్రయానికి వెళ్ళేసమయానికి వర్షం మొదలయ్యింది. ఆ కొద్ది సేపట్లోనూ నా ఊహలు కూడగట్టుకునే ప్రయత్నం చేసాను. ఎందుకనో నా తలపులు పదే పదే ఆ పొద్దున్న విశ్వశాంతి గోపురం దగ్గర నేను చూసిన ఆ చీమిడిముక్కు పిల్లవాడిదగ్గరే ఆగిపోతూ ఉన్నాయి. వాడిలో  నాకు నేనే కనబడుతూ ఉన్నాను. ప్రయత్నించి ఎంత తుడిచెయ్యాలని చూసినా చిన్నప్పటి నా రూపం, వదులుగా జారిపోయే నిక్కరు పైగి ఎగలాక్కుంటూ ప్రపంచాన్ని విస్ఫారిత  వదనాల్తో చూస్తున్న ఆ ముఖమే, నా కళ్ళముందు పదేపదే కదలాడుతూ ఉంది.

7-10-2018

arrow

Photoes: Ashish Choragudi

 

 

 

 

3 Replies to “నా చంపారన్ యాత్ర-5”

  1. Walked in your footsteps which followed those of two individuals the Buddha and Gandhiji… They point to the path of righteousness through one Human ability… Right thought. Indeed indebted to your travelogue sir.

  2. ఈ కొత్త సంవత్సరం మీరు రాసింది చదవటంతో మొదలుపెట్టాలని….మీతో చంపారన్ యాత్ర చేసాను. ఎంత హృద్యంగా ఉందో..మీ రాత, భావాలు, భావావేశం….మనసంతా గాంధీ, బుద్దుడు నిండిపోయారు…..ధన్యోస్మి.

Leave a Reply

%d