ప్రతి ప్రాంతం లోనూ ఒక చరిత్రకారుడుంటాడు. అతడు చరిత్ర పుస్తకాలు రాయడు. చారిత్రిక సిద్ధాంతాలు చదివి ఉండకపోవచ్చు కూడా. గతంలో సంభవించిన సంఘటనల్లో వివిధ పాత్రలు నిర్వహించినవాళ్ళల్లో అతడు ఎవరి పక్షమూ వహించడు. కాని, అతడి ద్వారా మటుకే ఆ ప్రాంత చరిత్ర గురించిన సత్యం మనకు బోధపడుతుంది. అతణ్ణి కలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతం, ఆ ప్రజానీకం గతంలో ఎటువంటి చరిత్రను రూపొందించుకున్నారో మనకు తేటతెల్లమవుతుంది. బేతియాలో నేను కలుసుకున్న ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్ అటువంటి చరిత్రకారుడు.
అతడికి చాలా చిన్న చిన్న వివరాలు కూడా తెలుసు. అవి గత వందేళ్ళుగా బీహార్ ఎటువంటి సామాజిక-రాజకీయ పరిణామాలకి లోనవుతూ ఉన్నదీ, ఆ పరిణామాల వెనక ఎక్కడో సుదూరంగా వందేళ్ళ కిందట గాంధీజీ ఇక్కడ సంచరించిన అనుభవాల ముద్రలెలా ఉన్నాయో అతడు తనకై తాను వెతుక్కుంటున్నాడు, పోల్చుకుంటున్నాడు.
మేము భీతిహర్వానుండి బేతియా బయల్దేరేప్పటికే బాగా పొద్దుపోయింది. మేము మరెక్కడా ఆగి చూడటానికి సమయం కూడా లేదు. అందుకని అతడు మేమొస్తున్న దారిలోనే వివిధ స్థలాల్నీ, గ్రామాల్నీ చూపిస్తూ, వాటి చరిత్ర చెప్పు కొచ్చాడు. అతడు వివరించిన వాటిల్లో మూడు గ్రామాల గురించి ప్రస్తావించాలి.
మొదటిది, పరసా కోటీకి చెందిన మఠియా గ్రామం. శీతల్ రాయి స్వగ్రామం. చంపారన్ లో గాంధీజీ అడుగుపెట్టడానికి తొమ్మిదేళ్ళ ముందు అంటే 1908 లో బేతియా చుట్టుపక్కల రైతులు నీలిమందు నిర్బంధంగా పెంచవలసి రావడానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. అందుకు వాళ్ళకి ధైర్యం నూరిపోసి ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించినవాడు. నీలిమందు పెంపకానికి వ్యతిరేకంగా అతడు రైతుల్ని సంఘటితపరిచినందుకు గాను , ప్రభుత్వం అతడికి రెండున్నరేళ్ళు కారాగారశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
రెండవ గ్రామం సాఠీ కోఠీకి చెందిన చాంద్ బరవా. ఆ గ్రామానికి చెందిన గులాబ్ షేక్ నీలిమందు ఫాక్టరీ యజమానులమీద తిరరగబడ్డందుకు బ్రిటిష్ ప్రభుత్వం అరెష్టు చేసిజైల్లో చిత్రహింసలకి గురిచేసింది.అయినా కూడా అతడు తన పోరాటం ఆపలేదు. 1911 లో అయిదవ జార్జి పట్టాభిషేకం తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు వినోదానికి వేటాడటానికి చంపారన్ వచ్చాడు. ఆయన ప్రయాణిస్తున్న రైలు నహర్ కటియా గంజ్ స్టేషన్లో ఆగినప్పుడు నీలీమందు తోటలు పెంచుతున్న రైతులు తమ కష్టాలు చెప్పుకోడం కోసం వారికి గులాబ్ షేక్ ఒక విజ్ఞప్తి పత్రం రాసిచ్చాడు. కాని ఆ రైతులు జార్జి చక్రవర్తిని కలవకుండా పోలీసులు ఆపేసారు. దాంతో ఆ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆ అరుపులు చక్రవర్తికి వినిపించాయి, అవేమిటని అడిగాడు. ‘ఇక్కడి ప్రజలు మీకు జయజయధ్వానాలు పలుకుతున్నారు’ అని చెప్పారు ప్రభుత్వాధికారులు ఆయనతో! ప్రతిఘటనలు, విజ్ఞప్తులు, హింస విఫలమయ్యాకనే చంపారన్ రైతులు గాంధీజీ వైపు చూసారు. అలా చూసినవాళ్ళల్లో గులాబ్ షేక్ కూడా ఉన్నాడు!
ఇక మూడవ గ్రామం సిరిస్వా. అక్కడ కపిల్ దేవ్ రాయ్ అనే ఒక స్థానిక జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ కి కొన్నాళ్ళు ఆశ్రయమిచ్చాడు. అక్కడుండగానే భగత్ సింగ్ యుద్ధం చేయడంలో మెలకువలు నేర్చుకున్నాడు. ‘అందుకనే చంపారన్ కి మహాత్మాగాంధీతో పాటు భగత్ సింగ్ పేరు కూడా సమానంగా గుర్తుండిపోయింది. మా బేతియాలో చూడండి, ప్రతి కూడలినీ అయితే భగత్ సింగ్ చౌక్ అంటారు లేదా బాపూ చౌక్ అంటారు ‘ అన్నాడు మనోజ్ కుమార్.
2
సమయం ఉండి ఉంటే ఆ మూడు గ్రామాలూ కూడా చూసి ఉండేవాణ్ణి. కాని, మనోజ్ దృష్టి వేరే చోట ఉంది. అతడు మాకు ఆ చీకట్లోనే లౌరియా నందన్ ఘర్ చూపించడానికి ఉత్సాహపడుతున్నాడు.
లౌరియా నందన్ ఘర్ బేతియా నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. అక్కడ అశోకుడు నిలబెట్టిన ఒక శాసన స్తంభం ఉంది. బుద్దుడి జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్య స్థలంలోనూ అశోకుడు శిలాస్తంభాలు ప్రతిష్టించాడు. అటువంటి గ్రామాలకి ‘లౌరియా’ (స్తంభం కలిగిన) అనే ఒక విశేషణం చేరి ఉంటుంది. మనోజ్ మమ్మల్ని ఆ చీకట్లోనే నందన్ ఘర్ అశోక శిలాస్తంభం దగ్గరకు తీసుకువెళ్ళాడు.
అప్పుడే శ్రావణ చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. తొలి జాము చంద్రికలు ఆ స్తంభం మీద పడుతూ ఉన్నాయి. ఆ మసక వెన్నెల వెలుగులో మనోజ్ మాకు ఆ స్తంభం మీద అలంకరణనీ, బ్రాహ్మీ లిపి శాసననాన్నీ చూపించాడు. వాటితో పాటు ఆ స్తంభం మీద 18 వ శతాబ్దంలో ఎవరో పోకిరీలు రాసుకున్న తమ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ స్తంభం చుట్టూ దాదాపు ముప్పై నలభయ్యో స్తూపాలు బయటపడ్డాయనీ, అదంతా ఒక ప్రార్థనాస్థలంగా ఉండి ఉండేదనీ మనోజ్ చెప్పాడు.
ఆ తర్వాత అతడు మమ్మల్ని ఆ ఊళ్ళోనే మరొక వైపు నెలకొన్న ఒక బౌద్ధ స్తూపానికి తీసుకువెళ్ళాడు. అది స్తూపమే కనుక అయ్యుంటే ప్రపంచంలోని బౌద్ధ స్తూపాలన్నింటిలో అత్యంత ఎత్తైన స్తూపం అదే అయి ఉంటుంది. కానీ, ఆ స్తూపం చుట్టూ పెద్ద కందకం, ఆ స్తూపాన్ని తవ్వినప్పుడు కనబడ్డ అవశేషాల్ని బట్టి కొందరు చరిత్రకారులు దాన్నొక కోటగానూ, చాణక్యుడు అడుగుపెట్టిన మహాపద్మనందుడి కోట అదే అయి ఉంటుందనీ భావిస్తున్నారని మనోజ్ చెప్పాడు. ఏమైనప్పటికీ, లౌరియా నందన్ ఘర్ లో బుద్ధుడి స్మృతికన్నా మౌర్య వంశానికి చెందిన చరిత్ర నే ఎక్కువ పోగుపడి ఉందనిపించింది.
3
బేతియా వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది. ఆ ఊళ్ళో చాలా స్థలాలే చూడాలని ముందనుకున్నానుగానీ, ఇక ఆ రాత్రి వేళ హజారీ మల్ ధర్మశాల ఒకటీ చూపిస్తే చాలన్నాను మా మార్గదర్శితో. గాంధీజీ బేతియా లో ఉన్నన్నాళ్ళూ హజారీ మల్ ధర్మశాలలోనే నివాసమున్నారు. అప్పట్లో అది రెండంతస్తుల భవనం. పై అంతస్తుకి చేరే మెట్ల మలుపులో ఒకింత ఖాళీస్థలముంటే గాంధీజీ దాన్నే తన కార్యాలయంగా మార్చుకుని పనిచేసుకునేవారని రాజేంద్ర ప్రసాద్ రాసాడు. ఆ భవనమూ, ఆ మెట్లూ, ఆ కార్యాలయమూ ఎలా ఉంటాయో చూద్దామని ఆతృతగా వెళ్ళిన నాకు ఒక శిథిలభవనమూ, చుట్టూ అసంఖ్యాకమైన షాపింగ్ కాంప్లెక్సులూ కనిపించాయి.
ఇప్పుడు ఆ ధర్మశాల స్థలం ఏదో కోర్టు కేసులో చిక్కుకుందనీ, అందుకని దాన్ని పూర్తిగా మూసేసారనీ మనోజ్ చెప్పాడు. ఆ కోర్టు కేసే లేకపోయుంటే, ఆ శిథిలం కూడా మిగిలి ఉండేది కాదు, అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్సులు వచ్చేసి ఉండేవి. ఒకప్పుడు ఆ ధర్మశాల ఎదట ఒక చెరువు ఉండేదనీ, తాను ఆ చెరువులో స్నానం చేసి, గాంధీజీని కలుసుకునేవాణ్ణనీ రాజ్ కుమార్ శుక్ల తన డైరీలో రాసుకున్నాడని మనోజ్ చెప్పాడు. నేనింతదాకా చూసిన ఆ ధర్మశాల ఏ ఫోటొని బట్టి కూడా అక్కడ ఒక చెరువుండేదని తెలియనే తెలియదు. అందుకనే ఒక ప్రాంతం గురించి తెలియాలంటే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఫొటోలు చూసినా సరిపోదు. స్వయంగా అక్కడకి వెళ్ళాలి, ఆ స్థానికులతో మాట్లాడాలి, మరో దారి లేదు.
ఆ ధర్మశాల చూసేటప్పటికే రాత్రి తొమ్మిది గంటలు కావొస్తూంది. ప్రయాణంలో మాటల మధ్యలొ నేను ‘నీల్ దర్పణ్ ‘నాటకం గురించి అతడితో ప్రస్తావించాను. బెంగాల్లో నీలిమందు రైతులు అనుభవించిన కడగండ్ల మీద దీన బంధు మైత్ర రాసిన ‘నీల్ దర్పణ్ ‘ (1860) గురించీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆ నాటకం చూస్తూ అందులో లీనమైపోయి స్టేజీ మీద ఫాక్టరీ యజమాని పాత్ర పోషిస్తున్న నటుడిమీదకి తన కాలిచెప్పు విసరడం గురించీ ప్రస్తావించాను. కాని, మనోజ్ నాకన్నా ఒక శతాబ్దం ముందున్నాడు. నీల్ దర్పణ్ పందొమ్మిదో శతాబ్ది నాటకమనీ, ఇప్పుడు తన మిత్రుడైన ఒక సహాయోపాధ్యాయుడు దివాకర్ రాయ్ అనే అతడు చంపారన్ సత్యాగ్రహం గురించి ‘నీలీ ఆగ్’ (2018) అనే నాటకమొకటి రాసాడనీ చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఆ మిత్రుడికి పోన్ చేసి మరీ పిలిపించి మాకు పరిచయం చేసాడు. అతడి చేతులమీదనే ఆ నాటకం ప్రతి ఒకటి నాకు బహూకరించాడు.
4
మేం ధర్మశాలనుండి బయల్దేరి మనోజ్ ని అతడి ఇంటిదగ్గర దింపడానికి వెళ్తుండగా, ఒక కూడలిదగ్గర ఒక కాంస్యవిగ్రహం విద్యుద్దీపపు వెలుతుర్లో తళతళలాడుతూ కనిపించింది. ‘అదెవరి విగ్రహం?’ అనడిగాను మనోజ్ ని.
‘గోపాల్ సింగ్ నేపాలీ’ అన్నాడు.
‘కవి కదా’ అన్నాను. నా చిన్నప్పుడు హైస్కూల్లో హిందీ పాఠ్యపుస్తకంలో అతడి కవిత చదివినట్టు గుర్తొచ్చింది.
‘వట్టి కవి కాదు , గీతోం కా రాజ్ కుమార్’ అన్నాడు. ‘కాని బతికినంతకాలం దుర్భరమైన పేదరికం చవిచూసాడు. ఇక్కడే బేతియాలోనే పుట్టాడు. కాని పాట్నాలో ఒక కవిసమ్మేళనంలో పాల్గొనడానికి వెళ్ళి అక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని తీసుకురావడం కోసం బేతియాలో పెద్దమనుషులు చందాలు వేసుకోవలసి వచ్చింది’ అని కూడా చెప్పాడు.
‘కాని అద్భుతమైన కవి, సినిమాల్లో కూడా పాటలు రాసాడు’ అని చెప్పాడు. ‘అతడు నిజంగానే గీతోం కా రాజ్ కుమార్’ అని మరోసారి చెప్పాడు మనోజ్ తన ఇంటిదగ్గర దిగుతూ.
తిరిగి వచ్చాక గుర్తుపెట్టుకుని మరీ గోపాల్ సింగ్ నేపాలీ సినిమా పాటల్తో సహా అతడి కవిత్వం చదివాను. అతడు రాసిన ఒక సినిమా పాటని ‘స్లం డాగ్ మిలీయనీర్’ సినిమాలో సూర్ దాస్ గీతంగా పేర్కొన్నారని గోపాల్ సింగ్ కుమారుడు కోర్టులో కేసు వేసాడని కూడా చదివాను. కాని, ఆ గీతం చదివిన తర్వాత, ఆ పాటని సూర్ దాస్ గీతంగా పొరపడటం గోపాల్ సింగ్ నేపాలీకి చిత్రప్రపంచం తెలియకుండా అర్పించిన నివాళి అనిపించింది. నిజంగానే సూర్ దాస్ వాణి స్థాయిని అందుకున్న గీతమది అనిపించింది. చూడండి:
దర్శన్ దో ఘనశ్యామ్ నాథ్ మోరీ ఆంఖియా ప్యాసీ రే..
మందిర్-మందిర్ మూరత్ తేరీ, ఫిర్ భీ న దీఖే సూరత్ తేరీ
యుగ్ బీతే, నా ఆయీ మిలన్ కీ పూరనమాసీ రే ..
దర్శన్ దో ఘనశ్యామ్ నాథ్ మోరీ ఆంఖియా ప్యాసీ రే..
ద్వార్ దయా కా జబ్ తూ ఖొలే, పంచం సుర్ మేఁ గూంగా బోలే
అంధా దేఖే, లంగడా చల్ కర్ పహుఁచే కాశీ రే ..
దర్శన్ దో ఘనశ్యామ్ నాథ్ మోరీ ఆంఖియా ప్యాసీ రే..
పానీ పీ కర్ ప్యాస్ బుఝావూఁ, నైనన్ కో కైసే సమఝావూఁ .
ఆంఖ్ మిచౌలీ ఛోడో అబ్ తో, ఘట్-ఘట్ వాసీ రే ..
దర్శన్ దో ఘనశ్యామ్ నాథ్ మోరీ ఆంఖియా ప్యాసీ రే..
7-10-2018