నా చంపారన్ యాత్ర-3

Reading Time: 7 minutes

గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన కాలంలో చంపారన్ లో మోతీహారితో పాటు బేతియా కూడా భాగంగా ఉండేది. ఇప్పుడది పశ్చిమ చంపారన్ జిల్లాకు ముఖ్యకేంద్రంగా ఉంది.అప్పట్లొ అక్క్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు ఆఫీసు ఉండేది. గాంధీజీ పోరాటం మోతీహారీ జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయంతో మొదలయినప్పటికీ, తర్వాతరోజుల్లో అదంతా బేతియాలోనే అధికభాగం కొనసాగింది. నీలిమందుతోటలూ, నీలిమందు కొటార్లూ బేతియా చుట్టుపక్కలనే అత్యధికంగా ఉండటమే అందుకు కారణం.

మొదణ్ణుంచీ కూడా బేతియా మోతీహారీ కన్నా పెద్ద పట్టణంగానే ఉంటూ వచ్చింది. అది నిజానికి ఒక చిన్న స్వదేశీ సంస్థానం. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తుల సామంతులుగా వివిధ రాజవంశాలు ఆ ప్రాంతాన్ని పాలించాయి.  ఈస్టిండియా కంపెనీ పాలన మొదలయ్యాక, కంపెనీ తో జరిగిన యుద్ధంలో అప్పటి రాజు  ఓడిపోయి అక్కణ్ణుంచి పారిపోయాడు. కాని అంత మారుమూల ప్రాంతాన్ని తాము స్వయంగా పరిపాలించలేమని తెలుసుకున్న కంపెనీ మళ్ళా ఆ రాజుని ఒప్పించి తిరిగి తీసుకువచ్చి తమ జమీందారుగా నియమించుకున్నారు. 1857 స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఆ జమీందారు కంపెనీకి పూర్తి సహాయసహకారాలు అందించాడు. ఇక గాంధీజీ సత్యాగ్రహ కాలం నాటికి, ఆ రాజవంశానికి వారసులు లేకపోడంతో ఆ జమీందారీ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ సంరక్షణలో ఉండేది. ఒక సివిల్ సర్వీసు అధికారి దానికి మేనేజరుగా ఉండేవాడు. గతించిన జమీందారు చిన్నభార్య మహారాణీగా పిలవబడుతూ మర్యాదలందుకునేదిగాని, ఆమెకి ఆ ఎస్టేటు నిర్వహణలో ఏ మాత్రం నిర్ణయాధికారం ఉండేది కాదు.

19 వ శతాబ్దం చివరిరోజుల్లో, బేతియా రాజ్ గా పిలవబడే ఆ ఎస్టేటు పెద్ద మొత్తంలో అప్పులు పాలవడంతో, ఆ ఋణభారం నుంచి బయటపడటానికి తన భూముల్ని పెద్ద ఎత్తున   బ్రిటిష్, యూరోపియన్ ప్లాంటర్లకు దీర్ఘకాలప్రాతిపదికన లీజుకి ఇచ్చేసింది. ఆ ప్లాంటర్లు  ఆ భూముల్లో కొంత స్వయంగానూ, చాలా భాగం స్థానిక రైతులతో కౌలుపద్ధతిలోనూ నీలిమందుతోటలు పెంపకం చేపట్టారు. ఆ కౌలు ఒప్పందాలు బెంగాల్ కౌలుదారీ చట్టం ప్రకారం నడిచేవి. కాని, కలకత్తా కి చాలా దూరంలో ఉన్నందువల్లా, మారుమూల ప్రాంతమయినందువల్లా, ఆ నీలిమందు పెంపకం అనతికాలంలోనే రైతుపీడక వ్యవసాయంగా మారిపోయింది. తమ మీద నానాటికీ పెరుగుతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ రైతులు ఎప్పటికప్పుడు తిరగబడుతూనే ఉన్నారు. ఆ తిరుగుబాట్లు ప్రధానంగా బేతియా చుట్టుపక్కల గ్రామాల్లోనే సంభవించాయి. కాని ఆ హింసాత్మక ప్రతిఘటన ఆ రైతుల్ని మరింత కుంగదీస్తోవచ్చింది. ఆ నేపథ్యంలో గాంధీజీని చంపారన్ కి రమ్మని పట్టుబట్టిన రాజ్ కుమార్ శుక్లా అనే రైతు  బేతియా సమీపంలోని మురళీ బర్హార్వా గ్రామానికి చెందిన రైతునే.

అందుకని నేను నా సందర్శనలో కనీసం రెండు రోజులేనా బేతియా లో గడపాలనుకున్నాను.  కాని, నేను కేటాయించుకున్న నాలుగురోజుల్లోనూ ఇంక రెండు రోజులే మిగిలినందువల్ల, బేతియాలో ఒక్కరోజు మాత్రమే తిరగాలనీ, మరీ ముఖ్యమైన స్థలాలు మాత్రమే చూడాలనీ అనుకున్నాను.

సోమవారం, అంటే ఆగస్టు 27 వ తేదీ పొద్దున్నే మేం మోతీహారీనుంచి బయలుదేరి బేతియా వెళ్ళేటప్పటికే పదకొండుగంటలు కావొస్తూంది. బేతియా జిల్లా విద్యాశాఖాధికారి తరఫున మనోజ్ కుమార్ అనే ఒక ప్రధానోపాధ్యాయుడు మా కోసం బేతియాలో ఎదురుచూస్తూ ఉన్నాడు. మేమతణ్ణి కలుసుకోగానే నా ఉద్దేశ్యం వివరించి, సమయం తక్కువుంది కాబట్టి, మేమేమి చూస్తే బాగుంటుందో అతడి నిర్ణయానికే వదిలేసాను. అప్పుడతడు మమ్మల్ని మొదటగా బృందావన్ అనే గ్రామానికి తీసుకువెళ్ళాడు.

2

బేతియా నుంచి బృందావన్ పదికిలోమీటర్ల దూరంలో ఉంది.  బేతియా కి చెందిన ప్రజాపతి మిశ్ర అనే ఒక జాతీయోద్యమ నాయకుడు  గాంధీజీ ప్రభావానికి లోనై గాంధీ సేవా సంఘ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. విద్య గురించి గాంధీజీ ప్రకటిస్తూ వచ్చిన అభిప్రాయాలపట్లా, చేపట్టిన ప్రయోగాలపట్లా ఆకర్షితుడై, 1939 లో బృందావన్ లో ఒక వారం రోజుల పాటు జాతీయ స్థాయి విద్యా సదస్సు నిర్వహించాడు.  మనోజ్ కుమార్ మాకు దారిపొడుగున్నా, ఆ చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్టు చెప్తూనే ఉన్నాడు. ఆ సదస్సుకి హాజైరైనప్పుడు, గాంధీజీ, బృందావన్ రైల్వే స్టేషన్ దగ్గర రైలు దిగి అక్కణ్ణుంచి  దాదాపు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పాఠశాలదాకా  కాలినడకన వెళ్ళారనీ, ఆ రోజు ఆ దారిపొడుగునా ప్రజలు ఆ దారిపొడుగునా పూలు జల్లుతూ స్వాగతం పలికారనీ చెప్పాడు. వారం రోజులపాటు జరిగిన ఆ సదస్సులో డా.రాజేంద్రప్రసాద్, కృపలానీలతో పాటు ఎందరో హాజరయ్యారనీ, ఆ చర్చలు మొత్తం గాంధీజీ అధ్యక్షతనే జరిగాయనీ కూడా చెప్పాడు.

ఆ సదస్సు జరిగిన చోటు ఇప్పుడు అనేక విద్యాలయాల సముదాయంగా విలసిల్లుతోంది. ఆ సదస్సుకి తనను రమ్మని ఆహ్వానించినప్పుడు గాంధీజీ అంగీకరిస్తూ, తాను అక్కడికి వచ్చెటప్పటికే అక్కడేదన్నా కొంత కృషి కార్యరూపం ధరించి ఉండాలని షరతు విధించారు. అందుకని, ప్రజాపతి మిశ్ర ఆ సదస్సు ప్రారంభం కావడానికి ముందే అక్కడొక పాఠశాల తెరిచారు. గాంధీజీ ప్రతిపాదించిన నయీ తాలీం ప్రకారం ఏర్పాటు చేసిన ఆ పాఠశాలల్ని బునియాదీ పాఠశాలలని పిలుస్తారు.  ఆ రోజు తెరిచిన అక్కడ తెరిచిన ఆ మొట్టమొదటి బునియాదీ  పాఠశాల ఇప్పటికీ పనిచేస్తూ ఉంది.

ఆ పాఠశాల చుట్టూ చెరకుతోటలు. 1939 లో ప్రారంభించిన ఆ పాఠశాల ఎన్నో ఒడిదుడుకులు చవి చూసింది. పదేళ్ళ కిందట, దాదాపుగా మూసివేత అంచులకు చేరుకున్న ఆ పాఠశాలని కొందరు యువకులు స్వచ్ఛంధంగా భుజాలకెత్తుకుని మళ్ళా పునరుద్ధరించారు. నాలుగైదేళ్ళ కిందట బేతియా జిల్లా కలెక్టరు అనుకోకుండా ఆ పాఠశాల సందర్శించినప్పుడు, ఆ కృషి అతడి కంటపడింది. అతడు దాన్ని  ప్రోత్సహించడం కోసం అక్కడొక కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయం మంజూరు చేసాడు. దాంతో ఇప్పుడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 400 పైన దాటింది. కాని, ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులెవరూ లేరు. స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఆ కార్యకర్తలకి న్యూఢిల్లీకి చెందిన గాంధీ స్మృతి సమితి వారు ఒక్కొక్కరికి నెలకి 6500 వేతనం చెల్లిస్తున్నారు.

ఇప్పుడు ఆ పాఠశాల పూర్తిస్థాయి బునియాదీ పాఠశాలగా పనిచేయకపోయినప్పటికీ, రెండు విషిష్ఠమైన అంశాల్లో తక్కిన పాఠశాలలకన్నా ప్రత్యేకంగా ఉంది. మొదటిది, ఇప్పుడక్కడ బోధిస్తున్న ఉపాధ్యాయులందరూ ఒకప్పుడు ఆ పాఠశాల విద్యార్థులే. మరొకటి, వాళ్ళంతా తమ పిల్లల్ని తమ పాఠశాలలోనే చేర్పించి చదువుచెప్తున్నారు.

ఆ పాఠశాలలో నన్ను గాఢంగా ఆకట్టుకున్నది ఆ పాఠశాల సందర్శకుల రిజిస్టరు. ఆ పుస్తకంలో మొదటి సంతకం, మహాత్మా గాంధీజీది! 8-5-1939 న ఆయన ఆ పాఠశాలలో అడుగుపెట్టారు. తదాదిగా ఆ పాఠశాలను సందర్శించి తమ అభిప్రాయాలు రాసినవాళ్ళల్లో గవర్నర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులున్నారు, కలెక్టర్లు ఉన్నారు. డా.రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అందులో 1939 నుంచి 2018 దాకా సందర్శకులు ఆ పాఠశాల పనితీరు మీద ప్రకటించిన సవివరమైన అభిప్రాయాలున్నాయి.

ga1

‘మీకు తెలుసునా, ఇది వట్టి రిజిస్టరు కాదు, ఒక చారిత్రిక పత్రం’ అన్నాను ఆ ఉపాధ్యాయులతో. ‘దీన్ని స్కాన్ చేయించండి. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఇది ఒక విద్యాప్రయోగం తాలుకు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ‘ అని కూడా చెప్పాను వాళ్ళకి.

వాళ్ళు నన్ను కూడా ఆ పుస్తకంలో నా అభిప్రాయం రాయమన్నారు. గాంధీజీ, నేనూ కూడా ఆ పాఠశాలని సందర్శించామనీ, ఆయన సంతకంతో మొదలైన ఆ రిజిస్టరులో నేను కూడా సంతకం చేయబోతున్నానని అనిపించగానే నా వళ్ళంతా జలదరించింది.

b5

మరొక సంగతి కూడా నాకు స్ఫురించింది. ఒక ప్రాథమిక పాఠశాల పట్ల ఇంత మక్కువ, ఇంత శ్రద్ధ ఈ రోజు మనం ఊహించగలమా? ఇప్పటి మన నాయకులు, మన విద్యావేత్తలు మెగలో మానియాక్స్. వీళ్ళకి వెయ్యి ఎకరాల స్థలంలో వేలాదిమంది విద్యార్థులకోసం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు మాత్రమే విద్యాలయాలుగా కనిపిస్తాయి. ఒక ప్రాథమిక పాఠశాలను సందర్శించడంలో ఉండే ఉద్వేగం ఎటువంటిదో వీళ్ళకు తెలియనే తెలియదు.

ఆ పాఠశాల అంతా కలయతిరిగాను. అక్కడ గాంధీజీ ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఉంది. అక్కడ మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీ మీద వెళ్ళిపోవడంతో ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నభోజనం అందడం లేదు. పిల్లలు వృత్తివిద్యలో భాగంగా ఖాదీ సంచులు తయారు చేస్తున్నారు కాని, వాటిని కొనేవాళ్ళు లేరు. పైగా వృత్తిపని సామగ్రి గదిలో దొంగలు పడటంతో, మిగిలిన సామగ్రిని బీరువాలో దాచేసారు.

తిరిగివచ్చాక, ఆ పాఠశాలను ఒక జాతీయస్థాయి ప్రతిభాపాఠశాలగా తీర్చిదిద్దే ఆలోచన చెయ్యమనీ, అన్నిటికన్నా ముందు మధ్యాహ్నభోజనం పునరుద్ధరించమనీ బీహార్ విద్యాశాఖకు లేఖలు రాసాను.

3

బృందావన్ నుంచి తరువాతి గ్రామానికి బయల్దేరి మధ్యలో  నహర్ కట్ గంజ్ లో భోజనం చేసాం. అదొక చిన్నపట్టణం. ఇప్పుడు చక్కెర పరిశ్రమ కేంద్రంగా ఉంది. నహర్ కట్ గంజ్ నుంచి బయల్దేరాక  మధ్యలో మనోజ్ మమ్మల్ని సాత్వరియా గ్రామం దగ్గర ఆపాడు. రాజ్ కుమార్ శుక్ల స్వగ్రామమైన మురళీ బర్హార్వా అక్కడికి దగ్గర్లోనే ఉంది. శుక్ల సాత్వరియాలో కూడా కొంత వ్యవసాయం చేసేవాడు. మేము ఆగినచోట, అతడి పేరుమీద ఒక కళాశాల నెలకొల్పి ఉంది. ఆ ప్రాంగణంలో రాజ్ కుమార్ శుక్ల విగ్రహం, అతడికి తోడుగా నిలిచిన సంత్ రౌత్ అనే మరొక స్వాతంత్ర్య యోధుడి విగ్రహం కూడా ఉన్నాయి.

మనోజ్ కుమార్ ని కలుసుకున్న ఆ మొదటి రెండు మూడు గంటల్లోనే అతడికి చంపారన్ చరిత్ర కరతలామలకం అని అర్థమయిపోయింది.

‘చంపారన్ సత్యాగ్రహం వల్ల తీన్ కతియా రద్దయింది గానీ, రైతు ఋణ భారం ఏమీ తగ్గలేదనీ, ఆ పోరాటం వల్ల నిజంగా ఒనగూడింది ఏమీ లేదనీ కొన్ని విమర్శలు చదివాను, మీరేమంటారు? ‘ అనడిగాతణ్ణి.

‘సార్,చంపారన్ అంటే తీన్ కతియా ఒక్కటే కాదు. అసలు అది చాలా చిన్న దోపిడీ. ఆ రోజుల్లో రైతులు రకరకాల లంచాలు, మామూళ్ళు ముట్టచెప్పవలసి ఉండేది. మొత్తం 52 రకాల పన్నులు. ఉదాహరణకి, రాజ్ కుమార్ శుక్ల సంగతే తీసుకోండి. అతడు పానీ కర్చా అని ఇరిగేషన్ పన్ను కట్టవలసి వచ్చేది. అతడి పొలాలకి ఒక్క చుక్క నీరుపారకపోయినా ఆ పన్ను కట్టకతప్పేదికాదు, ఎందుకు కట్టాలి అని అడిగితే అతడి ఇంటినీ, పొలాన్నీ నేలమట్టం చేసేసారు. గాంధీజీ వచ్చినదాకా ఇదే పరిస్థితి. చంపారన్ సత్యాగ్రహం వల్ల నిజంగా ఏమి మేలు జరిగిందో తెలియాలంటే మీరు వందేళ్ళ కిందటి చంపారన్ ఎలాంటిదో తెలుసుకుని తీరాలి ‘ అన్నాడు.

అప్పుడతడు మమ్మల్ని భీతిహర్వా తీసుకువెళ్ళాడు. నహర్ కటియా గంజ్ నుంచి నేపాల్ సరిహద్దుల్లో ఉన్న భికనీ తోరీ రైలు మార్గం మీద ఉన్న చిన్న గ్రామం అది. బేతియా నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కణ్ణుంచి 20 కిలోమీటర్ల దూరంలో నేపాల్ సరిహద్దు. హిమాలయాల బాహ్య కక్ష్యలోని సివాలిక్ పర్వతశ్రేణి అక్కణ్ణుంచి కనిపిస్తూ ఉంది.

ఆ మారుమూల పల్లెటూరు గాంధీజీని కట్టిపడేసింది. ఆయన అక్కడొక పాఠశాల తెరిచారు. చంపారన్ ఉద్యమంలో భాగంగా ఆయన ప్రారంభించిన మూడు పాఠశాలల్లో అదొకటి. కాని, హిమాలయాల అంచుల్లోని ఆ సౌందర్యానికి ఆకర్షితుడై ఆయన ఆ పాఠశాల తెరవలేదు. అప్పట్లో అక్కడికి దగ్గరలో ఉన్న అమోల్వా లోని నీలిమందు ఫాక్టరీ యజమాని అమ్మోన్  అత్యంత క్రూరత్వానికి పేరుపెడ్డవాడు. రాజ్ కుమార్ శుక్ల లాంటివాడినే అతడు భయభ్రాంతుణ్ణి చేసాడంటే, తక్కినవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆ ప్రజల్ని భయరహితుల్ని చేయాలంటే, వాళ్ళని చైతన్య్వంతుల్ని చేయాలంటే, ఒకే ఒక్క మార్గం అక్కడ పాఠశాల తెరవడమే అనుకున్నారు గాంధీజీ. భీతిహర్వా అంటే భయాన్ని పోగొట్టేది అనే అర్థం ఎలానూ ఉంది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి చెందిన సోమాని, అవంతికాబాయి గోఖలే, మహదేవ్ దేశాయి వంటి వారు అక్కడ ఉండి ఆ పాఠశాల నడిపారు. నిజానికి ఆ పాఠశాల ఒక నాన్ ఫార్మల్ విద్యాలయం. పిల్లలు, స్త్రీలు, వయోవృద్ధులు అందరికీ అక్కడ చదువు చెప్పేవారు.

మనోజ్ మమ్మల్ని మొదట భీతిహర్వాలోని గాంధీ ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ప్రాచీన తపోవనాల్ని తలపించే విధంగా పెద్ద పెద్ద చెట్లనీడల్లో నెలకొన్న ఆ ఆశ్రమం నన్ను సబర్మతి ఆశ్రమం కన్నా ఎక్కువ ఆకట్టుకుంది. అక్కడొక అనిర్వచనీయమైన ప్రశాంతత అలముకుని ఉంది.

b9

సోమవారం ఆ ఆశ్రమానికి సెలవు కావడంతో ముందు మాకు ప్రవేశం దొరకలేదు. కాని మనోజ్ ఎవరెవరినో పట్టుకుని ఆ ఆశ్రమం, అందులో కుటీరం తాళాలు తెరిపించాడు. వందేళ్ళుగా సంరక్షించుకుంటూ వస్తూన్న ఆ  కుటీరం మొదట్లో ఒక పర్ణశాల. దాన్ని నీలిమందు ఫాక్టరీ యజమాని అమ్మోన్ ఒక రాత్రి తగలబెట్టేయడంటో దాన్ని తిరిగి పక్కా కట్టడంగా  నిర్మించారు. ఆ కుటీరంలో గాంధీ వాడిన వస్తువులతో పాటు అరుదైన ఫొటోలు కూడా ఉన్నాయి. జాతీ యోద్యమానికి చెందిన unsung heroes లో ఒకరైన అయిన అవంతికబాయి గోఖలే ఫొటోని అక్కడే మొదటిసారి చూడగలిగాను.

b8

ఆ ఆశ్రమం అసత్యాన్ని సహించదనీ, చంద్రశేఖర్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు, అక్కడ చేసిన వాగ్దానాలను మర్చిపోయాడనీ, అందుకే చరిత్ర అతణ్ణి పక్కకు నెట్టేసిందనీ చెప్పాడు మనోజ్. అదే పరిస్థితి ప్రస్తుతం లల్లూ ప్రసాద్ కి కూడా ఎదురయిందన్నాడు.

4

భీతిహర్వా ఆశ్రమం నుంచి మనోజ్ మమ్మల్ని భీతిహర్వా పాఠశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఇప్పుడు ఎనిమిదో తరగతిదాకా నడుస్తున్నది.ఎనిమిది మంది ఉపాధ్యాయులూ, 350 మందికి పైగా పిల్లలూ ఉన్నారు. పాఠశాల గోడల మీద గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు చిత్రించి ఉన్నాయి. ఆ పాఠశాలకు అనుబంధంగా బాలికల కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నెలకొల్పారు. బహుశా కస్తూర్బా గాంధీ పేరుమీద దేశమంతటా స్థాపించిన కె.జి.బి.విల్లో ఇటువంటి పాఠశాల ఇదొక్కటే కదా అనుకున్నాను. ఎందుకంటే, సత్యాగ్రహంలో భాగంగా కస్తూర్బా కూడా ఈ గ్రామంలో ఉండటమే కాకుండా, ఈ పాఠశాలలో మహిళలకీ, పిల్లలకీ శుచిశుభ్రతలగురించి పాఠాలు చెప్పారు కూడా.

b10

మనోజ్ ప్రస్తుతం ఆ పాఠశాలలోనే డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో థారూ అనే ఒక గిరిజన తెగ నివసిస్తూ ఉన్నారని, అందుకని ఆ ప్రాంతాన్ని థారూ హాట్ అంటారనీ మనోజ్ చెప్పాడు. ఆ పాఠశాలలో ఎనభై శాతం మంది థారూ బాలికలు, మిగిలినవాళ్ళు మూష్ హారి కుటుంబాలకు చెందిన బాలికలు! వెనకబడ్డ కులాలనీ, తెగలనీ విద్యాగంధం ఎట్లా మార్చగలదో మరొకసారి అక్కడ నిరూపణ అయ్యింది. నేనా ముందు రోజు చంద్రాహియాలో చూసినా ఆ అనాథ బాలికకి కూడా ఇటువంటి పాఠశాలలో ప్రవేశం దొరికి ఉంటే, ఆమె జీవితమే మారిపోగలదు కదా.

b12

అదేమిటో తెలీదుగానీ, ఈ దేశంలో నేనిప్పటిదాకా వెళ్ళిన ప్రతిచోటా, సహ్యాద్రినుంచి నీలగిరులదాకా నేనూహించకుండానే గిరిజనులు నాకు తారసపడుతూనే ఉన్నారు, చివరికి, ఇక్కడ, ఈ హిమాలయ పర్వతప్రాంతంలో  కూడా. నేనా పిల్లలతో మాట్లాడేను. భవిష్యత్తు గురించిన వాళ్ళ ఆశయాలు, కలలు, కల్పనలు అడిగి మరీ చెప్పించుకున్నాను. అప్పుడు కొందరు పిల్లలు తమ గిరిజన భాషలో, మూష్ హారీ భాషలో పాటలు పాడారు. ఆ తర్వాత పిల్లలంతా కలిసి ఒక భోజ్ పురీ జానపద గీతం పాడారు. నాకు ఆ క్షణాన మా తాళ్ళపాలెంలోనో, బోయపాడులోనో ఒక గిరిజన ఆశ్రమపాఠశాలకు వెళ్ళినట్టే అనిపించింది. హిమాలయాల అంచులదాకా వెళ్ళి నేను చూసింది మళ్ళా నా స్వజనాన్నే, నా స్వగ్రామాన్నే.

5

మేము తిరిగి బేతియా కి బయల్దేరాం. భిఖనీ తోరీ నుంచి బేతియా కి వెళ్ళే దారి. ఆ దారిలో మనోజ్ భిఖనీ థోరీ గురించి చెప్తూ, దాని అసలు పేరు భిక్షు స్థావరం అని చెప్పాడు. సిద్ధార్థ గౌతముడు  కపిలవస్తు నుంచి సత్యాన్ని అన్వేషించుకుంటో ఆ దారమ్మటే వస్తూ భిఖనీ తోరీ దగ్గరే తన రాజవస్త్రాల్ని పరిత్యజించాడనీ, తిరిగి మళ్ళా గాంధీజీ జీవితంలో కూడా ఇక్కడే అటువంటి సంఘటన జరిగిందనీ చెప్పాడు.

ఒకరోజు గాంధీ,కస్తుర్బా శుచి శుభ్రతల గురించి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నప్పుడు ఒక ఇంటిదగ్గర ఒక అత్తా, కోడలూ కనబడ్డారని, కాని, వారిద్దరికీ కట్టుకోడానికి చీర ఒకటే ఉన్నందువల్ల, ఒకరు బయటికొస్తే, మరొకరు లోపలే ఉండిపోయారనీ, ఆ సంగతి తెలిసిన గాంధీజీకి చెప్పలేని అశాంతికి లోనయ్యారనీ, అట్లాంటి మనుషులందరికీ, వంటినిండా కట్టుకోడానికి వస్త్రం లభించేదాకా, తాను కూడా సగం గుడ్డ మటుకే ధరించాలని ఆ రోజే నిర్ణయించుకున్నారనీ చెప్పాడు.

నేను పాట్నాలో అడుగుపెట్టినప్పటినుంచే గాంధీ నడిచిన దారి, బుద్ధుడు నడిచిన దారి నా ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాని, ఈ సారికి గాంధీపథం లో పయనిద్దామనీ, మరోసారి బుద్ధుడు తిరిగిన తావుల్లో సంచరిద్దామనీ అనుకున్నాను. కాని, ఇక్కడికి వచ్చేటప్పటికి, గాంధీదారీ, బుద్ధుడి దారీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.

‘ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ ఊరెంతదూరంలో ఉన్నా సరే, వెళ్ళి చూడాలని ఉంది’ అన్నాను అతనితో.

మనోజ్ చిరునవ్వాడు. ‘ఏ ఊరని చెప్పను? మొత్తం పశ్చిమ చంపారన్ లోని ప్రతి ఊళ్ళోనూ ఈ కథ వినిపిస్తుంది’ అన్నాడు.

‘ప్రజలు చెప్పుకుంటున్నారా ఈ విషయాలు? ఇప్పుడు కూడానా?’ అనడిగాను.

‘సార్,ఇటువంటివి ఒకటి కాదు, వందలాది కథలు చెప్పుకుంటూ ఉంటారు గాంధీజీ గురించి. అటువంటివి ముప్పై దాకా కథలు సేకరించి ప్రభుత్వానికి అందచేసాను, త్వరలో పుస్తకరూపంలో రాబోతున్నాయి కూడా’ అన్నాడతడు.

5-10-2018

arrow

photos: Ashish Choragudi

 

 

 

Leave a Reply

%d bloggers like this: