నా చంపారన్ యాత్ర-1

g2

చంపారన్ అంటే సంపెంగ చెట్ల అడవి. స్థలపురాణం ప్రకారం అది విదేహ రాజు జనకుడు పాలించిన భూమి. శ్రీరాముడు విశ్వామిత్రుడి యాగసంరక్షణ తరువాత సీతను పరిణయమాడిన చోటు.చారిత్రికంగా అది బుద్ధుడు సంచరించిన చోటు. ఆ దారినే ఆయన మహాపరినిర్వాణ యాత్ర చేసాడు. బౌద్ధ, జైనాలతో పాటు కబీరు ప్రభావం కూడా ఆ నేలమీద సజీవంగా ఉంది. నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవహించే కోశీ, గండకీ అనే రెండు నదులు గంగానదిలో కలుస్తున్నాయి. ఆ మూడు నదుల మధ్యభాగాన్ని ‘తీర్థభుక్తి ‘అని పిలుస్తుంటారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో దాన్ని తిర్హౌట్ డివిజనుగా పరిపాలన సాగించారు. ఆ డివిజనులో చంపారన్ అతి పెద్ద జిల్లా. అందులో మోతీహారీ, బేతియా అనే రెండు పట్టణాలున్నాయి. ఈ మధ్యకాలంలో ఆ రెండు పట్టణాలూ ముఖ్యకేంద్రాలుగా చంపారన్ జిల్లాని పూర్వ చంపారన్ అనీ, పశ్చిమ చంపారన్ అనీ రెండు జిల్లాలుగా విడదీసారు.

19 వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ కోసం  బెంగాల్ తో పాటు, ఉత్తర బీహార్ లోని చంపారన్ కూడా నీలిమందు తోటలు పెంచింది. అక్కడ పెద్ద ఎత్తున ఫాక్టరీలు ఏర్పాటయ్యాయి. కాని, ఇరవయ్యవశతాబ్దం మొదలయ్యేటప్పటికి, రసాయన పద్ధతిలో నీలిమందు తయారు చెయ్యడం మొదలయ్యాక, భారతదేశంలో నీలిమందు ఉత్పత్తి తగ్గింది. కాని, 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలై, జర్మనీకీ, ఇంగ్లాండుకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాక, మళ్ళా నీలిమందుకి గిరాకీ మొదలయ్యింది. ఆ రోజుల్లో, చంపారన్ లో ప్రతి ఒక్క రైతూ తన భూమిలో తప్పనిసరిగా నీలిమందు మొక్కలు పెంచవలసి ఉండేది. ఒక ఎకరం 20 బీగాలు అంటే అందులో మూడు బీగాల నేలలో నీలీమందు పెంచవలసి ఉండేది. దాన్ని ‘తీన్ కతియా’ పద్ధతి అనేవారు. ఆ భూముల్లో చాలావరకు బేతియా సంస్థానానికి చెందినవి. వాటిని యూరపియన్ పెట్టుబడిదారులు కౌలుకి తీసుకుని తిరిగి మళ్ళా చంపారన్ రైతులకి కౌలుకిచ్చేవారు. ఆ ప్రక్రియ రానురాను మరింత సంక్లిష్టంగా మారి ఒక బీద కౌలు రైతు ఏడాదికి రకరకాల రూపాల్లో దాదాపు 52 రకాల పన్నులు చెల్లిస్తూ ఉండేవాడు.

ఆ పరిస్థితి మీద చంపారన్ రైతులు తిరగబడుతూనే వచ్చారు. 1908 లో అది హింసకీ, రక్తపాతానికీ దారితీసింది కూడా. బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని క్రూరంగా అణచివేసింది. తమమీద సాగుతున్న ఆ పీడననుంచి తమను బయటపడవెయ్యగల మనిషి కోసం చంపారన్ చాలామంది దేశనాయకుల వైపే చూసింది. చివరికి, రాజ్ కుమార్ శుక్ల అనే ఒక రైతు పట్టుదల మీద, ప్రార్థనల వల్ల గాంధీజీ 1917 ఏప్రిల్ 15 న చంపారన్ లో అడుగుపెట్టాడు. ఆ మర్నాడు జసౌలిపట్టి అనే ఒక గ్రామం చూడటానికి వెళ్తుంటే, దారిలో బ్రిటిష్ పోలీసులు ఆయన్ని ఆపి చంపారన్ వదిలిపెట్టి వెళ్ళిపొమ్మన్నారు. ఆయన ఆ ఆదేశాలను ధిక్కరించాడు. అప్రిల్ 18 న మేజిస్ట్రేటు ముందు నిలబడి తాను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమేకాని, చంపారన్ రైతుల్ని కలుసుకోకుండా వెళ్ళే ప్రసక్తి లేదన్నాడు. అది చారిత్రాత్మకమైన రోజు. భారతదేశంలో సత్యాగ్రహం ఒక రాజకీయ అస్త్రంగా ప్రభవించిన రోజు. ఆ తర్వాత చాలా పరిణమాలు సంభవించాయి. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ను నియమించింది. గాంధీజి ని కూడా అందులో సభ్యుడిగా నియమించింది. ఆ కమిషన్ తన నివేదిక సమర్పించాక,బ్రిటిష్ ప్రభుత్వం తీన్ కతియా పద్ధతిని రద్దుచేస్తూ చట్టం చేసింది.

2

101 ఏళ్ళ తరువాత, ఆ అడుగుజాడల్ని పోల్చుకుంటూ నేను చంపారన్ లో అడుగుపెట్టాను. పాట్నా విమానాశ్రయం నుంచే నేరుగా ఒక కారు తీసుకుని మోతీహారి బయల్దేరాం. మామూలుగా నాలుగు గంటలు పట్టవలసిన ప్రయాణం, ఆరుగంటలు పట్టింది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బెంగాల్ ప్రావిన్సులో ఉన్న రోజుల్లో కలకత్తా నుంచి మోతీహారీకి చేరడానికి తనకి ముప్పై అయిదు రోజులు పైనే పట్టిందని ఒక ఇంగ్లీషు అధికారి రాసుకున్నాడు.

గంగానది దాటి ఉత్తర బీహార్ గుండా ప్రయాణిస్తో, మేం మోతీహారీ చేరేటప్పటికి వాన మొదలయ్యింది. ఆ వానలోనే నేరుగా జిల్లా మేజిస్ట్రేటు ఆఫీసుకు వెళ్ళాం. కిందటేడు చంపారన్ సత్యాగ్రహం  వందేళ్ళు పూర్తయిన సందర్భంగా కట్టిన బానర్లు, చెక్కిన శిల్పాలు, రాసిన రాతలు ఆ ప్రాంగణమంతా కనిపిస్తూనే ఉన్నాయి. ‘సత్యాగ్రహం నుంచి స్వచ్ఛతాగ్రహం దాకా’ అనే నినాదాలూ, ప్రధానమంత్రి ఫ్లెక్సీల తోనూ ఆ ప్రాంగణం నిండిపోయి ఉంది.

నాకున్న నాలుగు రోజుల్లోనూ  మోతీహారి చేరడంలోనే ఒక రోజు గడిచిపోయిందనే ఆరాటం మొదలయ్యింది.రానున్న మూడురోజుల్లో వీలైనన్ని స్థలాలు చూడాలనుకున్నాను. కాని, వందేళ్ళ సత్యాగ్రహం ఉద్యమం తర్వాత కూడా ఆ కలెక్టరు ఆఫీసులో గాంధీ తిరుగాడిన స్థలాల గురించి చెప్పగలిగేవాళ్ళెవరూ కనిపించలేదు. నేను పదే పదే ప్రశ్నలడుగుతూంటే, కలెక్టరు ఓ ఎస్ డి ముఖంలో విసుగు కనిపించింది.ఏమనుకున్నాడో ఏమో, జిల్ల్లా విద్యాశాఖాధికారిని కలిస్తే  నాకు సాయం చేయగలడని చెప్పి, ఆయనతో మాటాడి, మమ్మల్ని అక్కడికి పంపించాడు. దాంతో పాటు, మాకు ఉండటానికి సర్క్యూటు హౌసులో రూము కూడా ఏర్పాటు చేసాడు.

అక్కడ మా కోసం ఇద్దరు స్థానిక యువకులు ఎదురుచూస్తూ ఉన్నారు. కాని, వాళ్ళకి కూడా గాంధీజీ చేసిన పోరాటం వివరాలు ఏమీ తెలిసినట్టు కనబడలేదు. మేమందరం జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసుకు వెళ్ళాం. ఆయన సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి. ‘స్వచ్ఛభారత్’ కోసం కలెక్టరు పెట్టిన టార్గెట్లలో బందీ అయిపోయి ఉన్నాడాయన. మర్నాడు రక్షాబంధన్ కాబట్టి మనుషులు దొరకరనీ, సోమవారం చుట్టుపక్కల ప్రాంతాలు చూడటానికి ఎవర్నేనా ఏర్పాటు చెయ్యగలననీ అన్నాడు.  బేతియా విద్యాశాఖాధికారికి ఫోన్ చేసి మర్నాడు మాకోసం ఎవర్నేనా స్థానిక ఉపాధ్యాయుడిని అప్పగించమని కోరాడు. మోతీహారీలో గాంధీ ఉద్యమం గురించి తెలిసిన పూర్వశాసనసభ్యుడొకాయనతో మమ్మల్ని కలపడానికి చాలాసేపే ప్రయత్నించాడుగానీ, ఫోన్ కలవలేదు.

అక్కణ్ణుంచి మేం స్థానికంగా ఉన్న గాంధీ మూజియానికి వెళ్ళేటప్పటికి వాన చాలా పెద్దదయింది. ఆ వానలో ఏం చూడాలో అనుకుంటూ ఆ మందిరంలో అడుగుపెట్టేటప్పటికి, అక్కడ ఖద్దరూ, గాంధీ టోపీలు ధరించి, గాంధేయవాదుల్లాంటి పెద్దమనుషులిద్దరు కనబడ్డారు. నేను నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు కలిపేసరికి వెదకబోయిన తీగ కాలికి దొరికిందని అర్థమయింది. వాళ్ళల్లో ఒకాయన పేరు సంజయ్ సత్యార్థి. ఆయన పూర్తికాలపు గాంధేయ కార్యకర్త. మోతీహారి వచ్చినవాళ్ళకి గాంధీ గురించి చెప్తూండటమే ఆయన పని. ‘నాకు ఈ చుట్టుపక్కల చూడవలసిన చోట్లకి ఎలా వెళ్ళాలో చెప్పగలరా’ అని అడిగాను. నేను అప్పటికే ఒక జాబితా, రూటుమాపు తయారు చేసుకున్నానుగాని, ఇలాంటి సందర్భా’, రేపు రక్షాబంధనం, మధ్యాహ్నం నుంచి మటుకే మీ కూడా రాగలను’ అన్నాడు.

g3

ఇంతలో వాన వెలిసింది. అప్పుడతను ముందు ఈ మూజియం చూద్దాం రండి అని చుట్టూ తిప్పి చూపించాడు. అక్కడ ఆ ప్రాంగణంలో గాంధీ మోతీహారీలో అడుగుపెట్టినప్పుడు ఏ కథియవాడీ వస్త్రధారణతో కనిపించాడో అదే రూపంలో ఒక విగ్రహం నిర్మించారు. మరొకవైపు, అప్పటి జిల్లా మేజిస్ట్రేటు కార్యాలయంలో ఏ స్థలంలో గాంధీ నిలబడి సత్యాగ్రహ ప్రకటన చేసాడో అక్కడొక స్మారక స్తూపం నెలకొల్పారు.  మోతీహారిలో అడుగుపెట్టినప్పుడు గాంధీ వయస్సు 48 ఏళ్ళు కాబట్టి, ప్రసిద్ధ చిత్రకారుడు నందలాల్ బోస్ రూపకల్పన చేసిన ఆ స్మారకస్తూపం కూడా 48 అడుగుల ఎత్తు ఉంది. అక్కడ రెండు నీలిమందు మొక్కలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చంపారన్ లో 95,970 ఎకరాలమేరకు విస్తరించిన నీలిమందుతోటలు  ఇప్పుడు రెండు నమూనా మొక్కలుగా మిగిలిపోయి, ‘పేదవాళ్ళ ఆగ్రహం’ ఎంత ప్రమాదకరమైందో ఎలుగెత్తి చాటుతున్నాయనిపించింది.

3

వానా పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు మమ్మల్ని సంజయ్ సత్యార్థి మోతీహారి రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్ళాడు. రిచర్డ్ అటెన్ బరో గాంధీ చిత్రం చూసినవాళ్ళకి మోతీహారీ స్టేషన్ లో గాంధీ దిగినప్పటి దృశ్యం గుర్తుండే ఉంటుంది. ఆ క్షణాన్ని మోతీహారీ ఇప్పటికీ ఎంతో పదిలంగా భద్రపరుచుకుంది అనడానికి ఆ రైల్వే స్టేషనే ఒక ఉదాహరణ. అది రైల్వే స్టేషన్ లా లేదు. గాంధీ మూజియం లా గా ఉంది. బాపూ ధాం గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంగణంలో అప్పటి మీటర్ గేజ్ రైలు పెట్టె నమూనా, దాంట్లోంచి నేలమీద అడుగుపెడుతున్న గాంధీ నమూనా ప్రతిష్టించారు. లోపల స్టేషన్ గోడలమీద మోతీహారీలో గాంధీ గడిపిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ పెద్ద ఎత్తున ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసారు.

g1

ఈ దేశంలో ఎన్ని రైల్వే స్టేషన్లలో ఎన్ని చారిత్రిక సంఘటనలు సంభవించలేదు! విశాఖపట్టణం నుంచి గుంతకల్ దాకా ఎందరు జాతీయనాయకులు, సంస్కర్తలు, ఎందరు ఉద్యమకారులు, కవులు ఎన్ని రైళ్ళు ఎక్కలేదు, దిగలేదు! కానీ, ఒక్క స్టేషన్నేనా అట్లా ఒక చారిత్రిక జ్ఞాపకంగా కుట్టిపెట్టుకోవచ్చని మనకెందుకు స్ఫురించలేదు?

4

ఇంకా పూర్తిగా చీకటి పడలేదు కాబట్టి గాంధీజీ మోతీహారిలో విడిదిచేసిన గోరఖ్ ప్రసాద్ బాబు ఇల్లు చూడొచ్చునా అని సత్యార్థిని అడిగాను. అతడు  మా బండిని ఏవేవో సందులు, గొందులు తిప్పి, ఆ చీకట్లో ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడంతా వాననీళ్ళు పడెలు కట్టి ఉన్నాయి. ఇదేనా ఆ ఇల్లు అనడిగాను. కాదు, లోపలకి రండి అన్నాడు. ఆ బురదలోంచే, అక్కడొక చీకటి ప్రాంగణం లోపల ప్రవేశించాక, మీ సెల్ పోన్ లో లైటు ఉంటే వెలిగించి ముందుకు చూడండి అన్నాడు.

నేను టార్చ్ ఫొకస్ చేసి చూస్తే, అక్కడొక పాతకాలపు ఇల్లు, దానిముందు ఒక విగ్రహం ఉన్నాయి. ఆ విగ్రహాన్ని పరీక్షగా చూస్తే ‘జార్జి ఆర్వెల్ ‘ అని రాసిఉంది!

నాకు అప్పటిదాకా తెలీదు, ఆర్వెల్ మోతీహారీలోనే పుట్టాడని. జార్జి ఆర్వెల్ గా ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యంగ్య రచయిత ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ 1903 లో మోతీహారీలో జన్మించాడు. అతడి తండ్రి ఇండియన్ సివిల్ సర్వీసు ఉద్యోగి. కానీ, ఆర్వెల్ పసితనంలోనే ఆ కుటుంబం ఇంగ్లాండుకి వెళ్ళిపోయింది.

ఆర్వెల్ పుట్టిన ఇంటిని బీహార్ ప్రభుత్వం ఒక స్మారకస్థలంగా ప్రకటించింది.కానీ ఆ ఇంటిని ఆనుకుని ఉన్న స్థలాన్ని సత్యాగ్రహ స్మారక స్థలంగా ప్రకటించడంలో జాప్యం కావడంతో కొందరు ఆందోళన చేసారట. కాని, ఆర్వెల్ ను ఇంగ్లీషువాడిగా చూడటం సమంజసం కాదు. గాంధీలానే అతడు కూడా అథారిటినీ ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించాలని పట్టుబట్టినవాడే. అడ్డులేని అధికారం మానవప్రపంచాన్ని ఒక పశువుల కొట్టంగా మార్చడానికి వెనుకాడదనే అతడు యానిమల్ ఫార్మ్ నవల్లో వాదించింది. అధికారాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడ్డ సత్యాగ్రహానికీ, అథారిటి ఒక అమానుష శక్తిగా  మారబోతున్నదని ప్రపంచాన్ని హెచ్చరించిన ఒక మహారచయితకీ కూడా మోతీహారి జన్మస్థలం కావడంలో ఆశ్చర్యం లేదనిపించింది.

5

ఇక అప్పుడు, ఆ రోజు ముగిసిపోబోయే ముందు, అతడు మమ్మల్ని గోరఖ్ బాబు ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లనాలా దాన్ని? కూలిపోతున్న ఒక శిథిలం. అందులో ఎవరో బీదలు కాపురముంటున్నారు. గాంధీజీ మోతీహారి రాగానే ఆ ఇంట్లోనే దిగారు. మొదట్లో అక్కడే రైతులు ఆయన్ని కలుసుకునేవారు. సత్యాగ్రహానికి ఊయెలతొట్టి లాంటి ఆ ఇంటిని, గోరఖ్ బాబు వారసుడు ఎవరికో అమ్మేసాడు. ఆయన ఒక ఐ.ఏ.ఎస్ అధికారి కూడానట!  ఒక్కసారి కాదు, మూడుసార్లు అమ్ముడుపోయిన ఆ భవనాన్ని ఒక మూజియంగా మారుస్తామని బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించి కూడా ఏడాది గడిచిపోయింది. కాని, చరిత్రతోనూ, ఆ భవనం చారిత్రిక ప్రాధాన్యతతోనూ సంబంధం లేని ఒక వర్తమానజీవితం అక్కడ తన దారిన తాను జీవిక కొనసాగిస్తూనే ఉంది.

3-10-2018

4 Replies to “నా చంపారన్ యాత్ర-1”

  1. You have made a live tour in your essay Bhadrudu garu. Yes these vibes are the ones which will echo in all of us. Thanku

  2. చదువుతోంటే … మీతోపాటు ప్రయాణిస్తూ అక్కడివన్నీ నా కళ్శతో చూస్తున్న, ఆయా వ్యక్తుల మాటలను విన్న అనుభూతి కలిగిస్తోంది సర్ మీ రచన.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading