ఒక పేగుబంధం

lata

నీ జీవితంలో నువ్వు గడిపిన గొప్ప క్షణాలు ఎప్పుడు, ఏ స్నేహంలో, ఏ ప్రేమలో,మర్చిపోలేని ఏ సందర్భాల్లో అని అడిగితే, నేను తలుచుకోగలిగేవి అన్నిటికన్నా ముందు రెండే, నా పసితనంలో మా ఊళ్ళో గడిపినవీ, గానకోకిల స్వరం వింటూండగా గడిచిపోయినవీను.

లతామంగేష్కర్ ఈ రోజు తన 89 వ ఏట అడుగుపెడుతున్నది. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఈ జీవితంలో ఆమె ఈ దేశంలో ప్రాంతాలతో, భాషలతో, కులాలతో, మతాలతో సంబంధంలేకుండా కోట్లాదిమంది జీవితంలో భాగమైపోయింది. వాళ్ళ సంతోషసమయాల్లో, బాధానుభవాల్లో, ఏకాంతంలో,ఉల్లాసంలో ఆమె వాళ్ళకి అత్యంత సన్నిహితురాలిగా మారిపోయింది. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని కావడం నా భాగ్యం. ఇంతదాకా గడిచిన నా జీవితంలో ఎన్నో రోజులు, రాత్రులు తలపుకు వస్తే ముందు రజనీగంధ పూల పరిమళంలాంటి ఆ స్వరం గుర్తొచ్చి, ఆ తర్వాతే,అప్పటి మనుషులూ, ఆ కొండలూ, ఆ నదులూ గుర్తొస్తాయి.

ఎప్పుడు వినిఉంటాను మొదటిసారి లతని? ఏ పాట? చెప్పలేను. కాని లతామంగేష్కర్ అనే మాట ఎప్పుడు వినబడిందో మటుకు చెప్పగలను. అది 1971, కొత్త విజయచిత్ర పత్రిక మా ఇంటికొచ్చింది. అందులో లతామంగేష్కర్ బొమ్మ, ఒక వ్యాసం. అ వ్యాసం చదివి మా అక్క ఆమె గురించి చెప్పింది నాకు. కాని , ఆమె పాటలు వినడానికి మరికొన్నేళ్ళు పట్టింది.

మా ఇళ్ళల్లోకి మొదటిసారి టేప్ రికార్డరు ప్రవేశించింది 1980లో. అప్పుడే లత కూడా ఒక ఋతుపవనమేఘంలాగా మా మనోగగాన్ని ఆవరించడం మొదలుపెట్టింది. 82 నుంచి 87 దాకా నేను రాజమండ్రిలో గడిపిన కాలమంతటా గోదావరిని చూడని రోజూ, లత పాటలు వినని రోజూ లేనే లేవు. మరీ ముఖ్యంగా, మా మిత్రుడు, వంక బాలసుబ్రహ్మణ్యం ఏ ముహూర్తాన పరిచయమయ్యాడోగాని, అతడి సన్నిధి అనే విశ్వవిద్యాలయంలో సినిమాపాటలు వినడమనే గ్రాడ్యుయేషన్ కోర్సులో సంతోషంగా చేరిపోయాం. ఆ రోజుల్లో నేను కాలేజి చదువు డిస్కంటిన్యూ చేసి టెలికమ్యూనికేషన్స్ లో ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ప్రైవేటుగా నా డిగ్రీ పూర్తిచేసానుగాని, ఆ పాఠాలు ఒక్కరోజు కూడా చదివింది లేదు. లత పాటలు వినడమే అన్నిటికన్నా ముఖ్యమైన చదువుగా భావించాను. రాజమండ్రి నాకు కవిత్వాన్ని, తత్త్వశాస్త్రాన్ని, సాహిత్య అధ్యయనాన్ని, గొప్ప గురువుల్నీ, మిత్రుల్నీ ప్రసాదించింది. కానీ, అదంతా ఒక ఎత్తూ, లతామంగేష్కర్ గానప్రపంచంలోకి లభించిన ఆహ్వానం మరొక ఎత్తూ.

సాయంకాలం కాగానే గోదావరి గట్టుమీద, కొవ్వూరు లాంచీల రేవుదగ్గరో, శ్రద్ధానంద ఘాట్ దగ్గరో, గోదావరి మాత విగ్రహం దగ్గరో టేప్ రికార్డర్ తెచ్చుకుని వచ్చి కూచునే వాడు బాల సుబ్రహ్మణ్యం. అసలు పేరులో ‘బాల ‘అని ఉంటే వాళ్ళు పూర్వజన్మలో గంధర్వులై ఉంటారని మనం ఇట్టే చెప్పేవచ్చు. ఈ బాలసుబ్రహ్మణ్యం కూడా ఏ గంధర్వలోకానికో చెందినవాడే, అభిశప్తుడిగా, ఆ రాజమండ్రి వీథుల్లో తిరిగేవాడు. అతడిచుట్టూ తిరిగుతుంటే, నాకు ఆ సాయంకాలాలు, ఏథెన్సులో ఎవరో శోఫిస్టులచుట్టూ తిరుగుతున్నట్టే ఉండేది. మా పక్కన అఖండ గోదావరి అన్ని ఋతువుల్లో, అన్ని వేళల్లో నిండుగా, ప్రేమగా, తల్లిలాగా ప్రవహించేది. ఆ ఒడ్డున, అతడు, ‘ఈ రోజు మీకు లత-మదన్ మోహన్’ ని పరిచయం చేస్తాను అనేవాడు. అప్పుడు ఆ రికార్డరులో ముందే లోడ్ చేసిపెట్టిన కాసెట్ బటన్ నొక్కేవాడు. కొన్ని క్షణాలు రీలు తిరిగే నిశ్శబ్దం భరించలేనంత ఉత్కంఠ సృష్టించేది. అప్పుడు ‘ఆప్ కీ నజరోన్ఁ నే సం ఝా ప్యార్ కి కాబిల్ ముఝే ..’ అనే మొదటి వాక్యం వినిపించేది. ఆ పల్లవి పూర్తయ్యేదాకా ఆగి, అప్పుడు పాజ్ బటన్ నొక్కి, ఆ పాట ఎప్పుడు స్వరపరిచాడు, ఏ సినిమాలోది, ఏ రాగం.. పాఠం మొదలయ్యేది. నాకు వాటిమీద ఆసక్తి ఉండేది కాదు, తొందరగా ఆ పాట మొదటిచరణం వినాలని ఉండేది. కాని, ఇప్పుడు, ఆ పాట, ఆ వాక్యాలు కూడా పక్కకు తప్పుకున్నాయి, ఇన్నేళ్ళ తరువాత, మళ్ళా గుర్తుచేసుకుంటూంటే, అవిరతంగా ఆకాశం మీంచి ఆ క్షణాల్లో మా మీద కురిసిన గంధపు పొడి ఒక్కడే గుర్తొస్తోంది.

అతడట్లా మాకోసం ఎందరో సంగీత దర్శకులు, ముఖ్యంగా అతడు ప్రాణాధికంగా ప్రేమించిన అయిదుగురు స్వరమాంత్రికులు, సి.రామచంద్ర, నౌషాద్, మదన్ మోహన్, శంకర్-జై కిషన్, ఎస్.డి.బర్మన్, వాళ్ళ కోసం పాటలు పాడిన గాయకులెందరినో పరిచయం చేసినప్పటికీ, అందరికన్నా ముఖ్యంగా లతనే మా హృదయాల్లో కుట్టిపెట్టేసాడు. లత కాకుండా అతడు మాకు పరిచయం చేసినవాళ్ళల్లో మళ్ళా మా హృదయానికి ఎంతోకొంత చేరువ కాగలిగింది, ఓ.పి.నయ్యర్, గీతా దత్ లు మాత్రమే. బాల సుబ్రమణ్యం పరిచయం చెయ్యకుండానే నా హృదయంలో వచ్చి తిష్టవేసినవాళ్ళల్లో నూర్ జహా్, సురయ్యా, సంషాద్ బేగం లు ఎలానూ నన్ను వెన్నంటే ఉన్నారు.

ఆ రోజుల్లో హెచ్.ఎం.వి వాళ్ళ కాసెట్లు నేను కొనుక్కోలేనంత ఖరీదు. నేను కొనుక్కోగలిగేది టి సిరీస్ కాసెట్లు మాత్రమే. ఒక కాసెటు ఎనిమిది రూపాయలుండేది. అంటే, రెండు భోజనం టికెట్లు. వారంలో నాలుగు రాత్రులు హోటలు మానేయగలిగితే, రెండు లతామంగేష్కర్లు. అవును, అట్లానే, విన్నాను, ఆ పాటలు, ఆమె పాడిన వేలాదిగీతాల్ని నేను సినిమాల పేర్లమీదా, సంవత్సరాల లెక్క మీదా గుర్తుపట్టలేను. నేను గుర్తుపట్టగలిగేది ‘రేర్ జెమ్స్ ఆఫ్ లతా మంగేష్కర్ ‘, ‘లతా ఇన్ వేరియస్ మూడ్స్ ‘, ‘క్లాసికల్ హిట్స్ ఆఫ్ లతా మంగేష్కర్ ‘, ‘లతా-రఫీ ‘, ‘లతా-ముఖేష్ ‘-లాంటి కాసెట్లూ, ఆ కాసెట్ల అట్టలమీద ఉండే బొమ్మల్ని బట్టీ మటుకే.

నా జీవితంలో నేను ఆర్థికంగా నిలదొక్కుకున్నాను అనడానికి నాకు కొలమానం లతా పాటలు హెచ్ ఎం వి కాసెట్లు కొనుక్కోగలిగే స్థితికి చేరుకోగలగడమే. అట్లా ఒక కొత్త కాసెటు కొనుక్కున్నప్పుడల్లా వాడని పూలగుత్తి ఒకటి నాతో తీసుకుపోతున్నట్టే ఉండేది. అట్లా ఎన్ని కాసెట్లు కొనుక్కున్నానో, ఎన్ని పాటలు విన్నానో చెప్పలేనుగాని, అన్నిటిలోకీ, నేను మరవలేని ఒక కాసెట్లు ‘మూడ్ ఇండిగో ‘, శ్రద్ధాంజలి’. ‘లతా మంగేష్కర్-ద గ్లోరియస్ ఫిఫ్టీ ఇయర్స్ ‘..

రాజమండ్రి వదిలిపెట్టి అడవుల్లో ఉద్యోగం మొదలుపెట్టాక, నేను తిరిగిన ప్రతి దారిలోనూ, ప్రతి మలుపులోనూ లత పాటలతోటే ప్రయాణిస్తో వచ్చాను. ఆ అడవుల్లో, ఆ కొండల్లో, ఆ వెన్నెల రాత్రుల్లో లత స్వరం ఒక్కటే నాకు తోడుగా ఉండేది. ఏ జన్మలోనో అమె నా అక్క, నేనామె తమ్ముణ్ణి. మేము ఏ పల్లెటూరిలోనో, ఏ చింతచెట్టునీడనో కలిసి మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకున్నాం. పీటని పల్లకీ చేసి, పెళ్ళిపెద్దలుగా, బొమ్మలు పెళ్ళిళ్ళు చేసి, ఉత్తుత్తి వంటలు చేసి ఊరంతటికీ దగ్గరుండి వడ్డించాం. ఆ పాటలు విన్నప్పుడల్లా ఒక పేగుబంధం నన్ను పట్టిలాగుతూండేది అందువల్లనే అనుకుంటాను.

అవి ప్రేమపాటలా, విరహగీతాలా, దుఃఖగీతాలా, దేశ, దైవభక్తి గీతాలా- ఆ భేదం నాకు తెలీదు, చాలా పాటలకి అర్థమేమిటో కూడా తెలుసుకోవాలన్న యోచన కలగలేదు. నాకు కావలసిందల్లా ఆ స్వరం, కొండలమీంచి కురిసే వెన్నెల్లాగా, సాయంకాలపు సంధ్యచీకటిలాగా, ఉషఃకాలంలో నదీజలాలమీద పరుచుకునే ప్రభాతరశ్మిలాగా, ఆ స్వరం చెవులు మటుకే చూడగల అపారమైన వెలుతురు.

నాకు వసంత ఋతువు అంటే, ‘ఓ నిర్దయీ ప్రీతమ్’ నే. నల్లమల అడవులంటే, ఆ వెన్నెల రాత్రుల్లో ‘చల్ దిల్ దార్ చలో’ నే . రాజమండ్రిలో ఆ రూములో గడిపిన ఒంటరిరాత్రులంటే ‘ముఝ్ భూల్ గయా సావరియాఁ ‘ నే. కాకినాడలో మా అక్క దగ్గర మేమంతా గడిపిన రోజులంటే ‘ఎక్ పల్ హి రోనా, ఎక్ పల్ హీ హసనా, జీవన్ హై దో దిన్ కా మేలా ‘ నే. ఎప్పుడన్నా, ఈ నగరాకాశం మీద చంద్రుడుదయించగానే చంద్రబింబంకన్నా ముందు ‘చాంద్ ఫిర్ నికలా’ అని ఎవరో నా పక్కన హమ్ చేస్తున్నట్టే ఉంటుంది. నా హృదయాన్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయిన నా ఒకప్పటి మిత్రురాళ్ళని తలుచుకుంటే, కోపం రాదు , అందుకు బదులు, ఆ తలపులు తచ్చాడినప్పుడల్లా, ‘తూ అబ్ సే పహలే సితారోం మే బస్ రహీ థీ కహీ తుఝే జమీ పే బులాయా గయా హై మేరే లియే ‘ అని ఒక పాట ప్లే అవుతూనే ఉంటూంది. తెల్లవారి తొలి సూర్యకాంతి కిటికీలోంచి ఇంటిగదుల్లో పడుతున్నప్పుడల్లా ‘జ్యోతి కలశ్ చలకే’ అని మది పాడుకోకుండా ఉండదు. ఏ వెన్నెల రాత్రి అయినా ‘దాదుర్ మొర్ పపీహ బొలె కొయెల్ సబద్ సునావె’ అంటో ఒక మీరా ఏ రెల్లుపొదలచెంతనో పాడుతున్నట్టుంటుంది. లేదా ఆమె సుస్వరం పండిట్ భీమ్ సేన్ జోషి గంభీరస్వరంతో కలిసి ‘రామ్ కా గుణ్ గాన్ కరియే’ అని ఒక సంకీర్తనకు ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంటుంది. ఇట్లానే గుర్తుపట్టగలను, నా జీవితంలో ఎన్నో క్షణాల్ని, ప్రతి క్షణానికీ, ఒక్కొక్క లత పాట ఒక్కో లేబుల్లాగా తగిలించుకుని.

ఒకరోజు, పుల్లలచెరువునుంచి ఎర్రగొండపాలెం వస్తున్నాం. వేసవి మధ్యాహ్నం. మా జిప్సీ నాన్ ఏసి వెహికిల్. ఆ రోజు ఆ బండిలో ముందుసీట్లో మా కమిషనర్ కూర్చుని ఉన్నారు. ఆయన మా ప్రాజెక్టు పర్యవేక్షణకి వచ్చారు. కొంతసేపయ్యాక ఆయన దృష్టి ఆ జిప్సీలో ఉన్న సాంగ్ ప్లేయర్ మీద పడింది. దాన్ని ఆన్ చేసారు. నీ స్నేహితురాలు ఫోన్ చేసి ‘ హలో’ అన్నట్టుగా లతా స్వరం వినబడింది. ఆయన ఉలిక్కిపడి ఆ ప్లేయర్ ఆఫ్ చేసేసారు. ‘ఇదేమిటి? లతామంగేష్కర్ ని వింటున్నారా ఈ దారుల్లో?’ అనడిగాడు నా వేపు తిరిగి. ‘ఈ పాటలు రాత్రి పూట, ప్రశాంతంగా పక్కమీద పడుకుని వినాల్సినవి, ఇట్లా ఈ దుమ్ములోనూ, ఈ గతుకులదారిలోనూ కాదుకదా’ అన్నాడాయన. నిజమా? నాకేమి చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే, నేను లతని వినడం మొదలుపెట్టగానే, అది పగలా, రాత్రా, వసంతమా, హేమంతమా, అడవిదారినా, నగరకాశమా అన్న స్పృహపక్కకు పోతుంది నాకు. ఎక్కడగానీ, ఎప్పుడుగానీ, ఆ స్వరం నా ప్రపంచాన్ని అత్యంత అలౌకిక ఆత్మీయం లోకంగా మార్చేస్తుంది.

లత శతాయుష్కురాలు కావాలి, ఆ గానకోకిల సహస్రవసంతాలు ఈ భారతీయాకాశాన్ని మేల్కొల్పుతూనే ఉండాలి.

28-9-2018

3 Replies to “ఒక పేగుబంధం”

  1. ఆమె ఈ దేశంలో ప్రాంతాలతో, భాషలతో, కులాలతో, మతాలతో సంబంధంలేకుండా కోట్లాదిమంది జీవితంలో భాగమైపోయింది.

  2. వానలో తడవని వారు లతా జీ గళం వినని వారూ వుండరు. పాటతో మీకు బంధమై చేతనై వున్నారు. ప్రతి వ్రాతని మనసు పెట్టి వ్రాస్తారు. ఇందులో హృదయం కనబడింది. నిజంగా భావనే భాగ్యం.

  3. చాలా శ్రమ పడ్డారు మా లాంటి వారికోసం ధనువాదాలు మీకు… చక్కటి సంతోషాన్ని తృప్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలి…

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading