కొండగాలి, కడలినీలిమ

m1
‘హరీన్ ఛటో, గిరాం మూర్తీ ఇటీవలి మా ఇన్ స్పిరేషన్’ అని రాసాడు శ్రీ శ్రీ ఒకచోట. వాళ్ళిద్దరూ రాజకీయ విప్లవకారులో, సామాజికసంస్కర్తలో కారు. అప్పటికింకా, భారతదేశానికి స్వతంత్రమూ రాలేదు, కవి కలగన్న మరోప్రపంచమూ రాలేదు. అయినా అతడు వాళ్ళనెందుకు తనకి స్ఫూర్తిప్రదాతలుగా చెప్పుకున్నాడు?
 
ఎందుకంటే, ప్రతి మనిషి జీవితంలోనూ, ఒక గడియ వస్తుంది. అన్నింటికన్నా ముందు జీవితాన్ని ఉన్నదున్నట్టుగా నువ్వు చూడవలసిన తరుణం. నిన్ను నువ్వు ముఖాముఖి కలుసుకోగలిగే ఒక సాహస క్షణం. ఆ అత్యంత మౌలిక క్షణాలే మనం నిజంగా ‘బతికిన క్షణాలు.’ ఆ క్షణాల్ని మనకి ఎవరు సన్నిహితంగా తీసుకురాగలరో వారే మన అసలైన స్ఫూర్తిప్రదాతలు.
 
నా వరకూ నాకు నా నవయవ్వన కాలానికే సామాజిక, రాజకీయ విప్లవకారులు స్ఫూర్తిప్రదాతలు కావడం మానేసారు. నన్ను బతికించుకోగల, అరుదైన ప్రేమవిద్యని, మహాకవి అన్నట్టుగా, ‘నేను నేర్చితి, భాగ్యవశమున, కవుల కృపగొని.’ అప్పణ్ణుంచీ, జీవితపు ప్రతి మలుపులోనూ, ఎవరో ఒక కవి నాకు ఎదురై నన్ను తను అక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు. నిజమైన విముక్తి, ముందు నువ్వు నీ వాసనలనుంచీ, నీ రహస్యప్రలోభాలనుంచీ బయట పడటంలోనే ఉంటుందనీ, నువ్వు నీనుంచి విడుదల కాకుండా, ఎన్ని సంస్కరణలు చేపట్టినా, ఎన్ని పోరాటాలు సాగించినా, అంతిమంగా, లోకానికికి ఒరిగేదేమీ లేదనే ఆ కవులు నాకు చెప్తూ వచ్చారు.
 
మనుషుల్ని ప్రేమించడంటే, మనుషుల్ని వదులుకోవడమనీ, లోకం నుంచి ఒక అడుగు పక్కకు జరిగినవాడే నిజంగా లోకాన్ని దగ్గరగా తీసుకోగలడనీ చెప్తున్నారు వాళ్ళు. అందుకనే, ఈ భూమ్మీద పుట్టినందుకూ, జీవించినందుకూ, నేను నిజంగా ఋణపడేది వాళ్ళకే.
 
అటువంటి స్ఫూర్తిప్రదాతల కోవలో, ఇటీవలి నా ఇన్ స్పిరేషన్ ‘సంటొక తనేద’. మరీ ముఖ్యంగా, ఈ మాటలు చెప్పినందుకు:
 
పడమటి దేశాలవాళ్ళు కొండల్ని జయించాలనుకుంటారు
తూర్పుదేశాల వాళ్ళు కొండల్ని ధ్యానించాలంటారు,
నేను మటుకు కొండల్ని రుచిచూస్తుంటాను.
 
కొండల్ని రుచిచూసిన కవి కాబట్టే, అతణ్ణి మొదటిసారి తక్కిన ప్రపంచానికి పరిచయం చేసిన జాన్ స్టీవెన్స్, తనేద కవిత్వానువాదానికి Mountain Tasting (1980) అని పేరుపెట్టాడు.
 
సంటొక తనేద (1882-1940) ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సైగ్యో, ర్యోకాన్, బషొ అని చెప్పవలసి ఉంటుంది. ఆ పూర్వజపాన్ మహాకవుల దారిలోనే అతడు కూడా ఒక పరివ్రాజక కవిగా జీవించాడు. మొత్తం జపాన్ అంతా, ముఖ్యంగా గ్రామీణ జపాన్ అంతా కాలినడకన, సంచరించాడు. పదిహేడో శతాబ్దంలో బషొ కాలినడకన సంచరించాడంలో ఆశ్చర్యం లేదు. కాని, ఇరవయ్యవశతాబ్దంలో బస్సు, రైలు, ఆటో, మోటారు సైకిలు ప్రవేశించిన తర్వాత కూడా ఒక మనిషి కాలినడకన భిక్షాయాత్రలు చేయ్యడం మన ఊహకి కూడా అందని విషయం.
 
తనేద అసలు పేరు షోయిచి. తుర్జనీవ్ రచన ఒకటి అనువదిస్తుండగా అతడికి ‘సంటొక’ అనే పదం స్ఫురించింది. దాని అర్థం ‘కొండమీద చితి’ అని. అది అన్వర్థ నామధేయం. అతడు తాను జీవించిన 58 ఏళ్ళ పాటూ తన ప్రాపంచిక జీవితాన్ని నలుగురూ చూసేటట్టుగా తగలబెట్టుకుంటూనే ఉన్నాడు.
 
తండ్రి యమగుచిలో ఒక సంపన్న భూస్వామి. విలాసపురుషుడు. అతడి తిరుగుళ్ళు భరించలేక, భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో నూతిలో దూకి చచ్చిపోయిన తల్లి మృతదేహాన్ని పైకి తీస్తున్న దృశ్యం తనేదని జీవితమంతా వెన్నాడింది. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చివరికి సంసారంలో కూడా అతడు కుదుటపడలేకపోయాడు. భార్య విడాకులు తీసుకుంది. తన కొడుకుని కూడా తనతో తీసుకుపోయింది. 1923 లో జపాన్ లో ఒక భూకంపం సంభవించినప్పుడు, పోలీసులు అతణ్ణి సోషలిస్టుగా భావించి అరెస్టు చేసారు. బయటికొచ్చాక అతడికి బతకడం మీద ఇచ్ఛ పోయింది.ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుడతణ్ణి సోటో శాఖకి చెందిన ఒక జెన్ దేవాలయానికి అప్పగించారు. అది అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత, అతడు మరణించేదాకా, 17 సంవత్సరాల పాటు,ఒక పరివ్రాజకుడిగా, యాచనతో పొట్టపోషించుకుంటో, కవిత్వం చెప్తో గడిపాడు. చిట్టచివర ఒక రాత్రి ఒంటరిగా, నిద్రలో ఈ లోకాన్ని విడిచిపెట్టేసాడు.
 
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో జపాన్ లో సై సెన్ సుయి అనే కవి హైకూని సంప్రదాయపద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలొ రాసే ఒక ప్రక్రియ మొదలుపెట్టాడు. మూడు పంక్తుల్లో 5-7-5 మాత్రలతోనూ, ఒక పాదవిరామం, ఒక ఋతుసంకేతం ఉండే సంప్రదాయ హైకూ స్థానంలో 8 నుంచి ఇరవయ్యారు అక్షరాల దాకా ఒక్క గుక్కలో చెప్పగలిగే రెండు వాక్యాల కవితావాక్యాన్ని అతడు నిజమైన హైకూగా ప్రతిపాదించాడు. గొథే, షిల్లర్ ల ఎపిగ్రాం ల ప్రభావంతో అతడు చేపట్టిన ఉద్యమాన్ని ఒజకి హోసై అనే కవితో పాటు, తనేద కూడా మనస్ఫూర్తిగా అనుసరించాడు. అందుకనే, ‘హైకూలల్లాంటి హైకూలేమంత తీసిపారెయ్యదగ్గవి కావు. కాని, హైకూల్లాగా కనిపించని హైకూలు-ప్రస్తుతం నేను అన్వేషిస్తున్నవి వాటిగురించే’ అని తన డైరీల్లో ఒకచోట రాసుకున్నాడు.
 
అతడి జీవితకాలంలో 68 వేల హైకూలు రాసాడంటారు. తొలినాళ్ళలో రాసుకున్న డైరీల్ని, హైకూల్ని తగలబెట్టేసాక కూడా 15 వేల హైకూలదాకా అతడి దగ్గరుండేవంటారు. కాని, తన చివరిదినాల్లో, తన హైకూల్ని ఏడు సంపుటాలుగా వెలువరించనప్పుడు 701 హైకూలు మాత్రమే ఎంపిక చేసాడు. వాటిలో దాదాపు 400 పైనే మనకి మూడు అనువాదాల్లో లభ్యమవు తున్నాయి. ఒకటి, పైన పేర్కొన్న స్టీవెన్స్ పుస్తకం, మరొకటి, Santoka: Grass and Tree Cairn అనే పేరిట 2002లో వచ్చిన అనువాదం, మూడవది, బర్టన్ వాట్సన్ చేసిన అనువాదం For All My Walking (2003).ఇందులో వాట్సన్ హైకూలతో పాటు, తనేద డైరీల్లోని కొన్ని భాగాలు కూడా అనువదించాడు.
 
చివరిరోజుల్లో తనేద తానొక జెన్ సన్యాసిగా తిరగడానికి కూడా అర్హత లేదనుకుని తన సన్యాసి దుస్తుల్ని, భిక్షాపాత్రని ఎవరికో ఇచ్చేసి,వట్టి బిచ్చగాడిగా మాత్రమే సంచరించాడట. తననీ, ప్రపంచాన్నీ మోసగించలేని ఆ కవి కవితలు కొన్ని:

కొండగాలి, కడలినీలిమ

1
మండుతున్న సూర్యుడు
ఈరోజుకిదే భిక్ష.
 
2
పైన్ చెట్లలో మందపవనం
ఉదయాస్తమయాలు
దేవాలయంలోగంటలచప్పుడు.
 
2
బకెటునిండా వాన
ఈ రోజుకిది చాలు.
 
4
కాళ్ళు బారచాపుకున్నాను
ఇంకా రోజు మిగిలే ఉంది.
 
5
నా భిక్షాపాత్రలో
వడగళ్ళు కూడా.
 
6
ఆకుపచ్చటికొండల్లోకి-
మరింత లోతుగా
ఇంకా మరింత లోతుగా.
 
7
చెయ్యగలిగింది మరేమీ లేదు
నడుస్తూపోడమే.
 
8
నడుస్తూపోతుంటే
నా టోపీమీద
గొల్లభామలు.
 
9
పిడికెడు బూడిద
ఇంతేనా
నా మొత్తం డైరీలంతా.
 
10
 
నేనూహించినట్టే ఉంది
ఎటు చూడు వెన్నెల
ఈ రాత్రి చిమ్మెటలది.
 
11
కొండల మీద మబ్బులు
ఇంక అడుక్కోడానికి ఇళ్ళు లేవు.
 
12
పెద్ద కర్పూరవృక్షమూ
నేనూ, ఓ కుక్కా
వానకి చివికిపోతూ.
 
13
జీవన్మరణాల మధ్య
నిర్విరామంగా మంచు.
 
14
వరసగా సమాధులు
వెచ్చని సూర్యరశ్మి.
 
15
వెలుగొచ్చిందా-మే మే అంటుంది
మబ్బు పట్టిందా-మే మే అంటుంది
ఒంటరి మేక.
 
16
ఇక్కడ ఆగుతాను
అంతులేని
సాగరనీలిమ.
 
17
చిన్ని కునుకుతీసి లేచాను
ఎటు చూడు: కొండలు.
 
18
చక్కటి దారి చివర
చక్కటి భవనం
క్రెమటోరియం.
 
19
మెత్తటిబొంత మీద పడుకుంటే
మా ఊరు కల్లోకొచ్చింది.
 
20
చాలా పొడవైన వంతెన
దాటగలిగానా
మా ఊళ్ళో ఉంటాను.
 
21
నేను పుట్టిన ఇంటిదగ్గర
ఇప్పుడే గుర్తూ మిగల్లేదు-
మిణుగురుపురుగులు.
 
22
నా చుట్టూ
మా ఊరి యాస.
 
23
వానాకాలపు చద్దన్నం
ఇది కూడా తడిసిపోయినట్టుంది.
 
24
ఇక్కడ మిగిలిన కొన్ని ఈగలకీ
నేను గుర్తున్నట్టే ఉన్నాను.
 
25
చిన్న బుద్ధ విగ్రహం
మనుషులకోసం తడుస్తూనే ఉంది.
 
25
సూర్యాస్తమయం
దుక్కిదున్నేవాడి నీడ పొడుగ్గా.
 
26
కొండల్లో రోజంతా
చీమలు కూడా నడుస్తూనే ఉన్నాయి.
 
27
పొద్దుటివాన వెలిసాక
కొత్తగా మెరుస్తున్నాయి
తూనీగలు.
 
28
ఈ చుట్టుపక్కల
బౌద్ధసూత్రాలు ఎంత బిగ్గరగా పఠించినా
జాజ్ మూజిక్ వినబడుతూనే ఉంది.
 
29
నా మీదకు విసిరిన
పైసానాణెం తళుకుమంది.
 
30
రోజూ కలుస్తూనే ఉన్నాం
రాక్షసుల్నీ, బుద్ధుల్నీ.
 
31
కూడలిమధ్య దేవతా విగ్రహం
రంగు వెలిసిపోయింది
ఆయన చిరునవ్వుతూనే ఉన్నాడు.
 
32
వెదురుమొలకకూడా
వెదురుగా పెరుగుతోంది
ఎంత నిజాయితీ!
 
33
ఆకుపచ్చటి అడవిలో అడుగిడుతూ
ర్యోకాన్ ని తలుచుకున్నాను
ఆయన కూడా ఇటే నడిచాడు.
 
34
ఎట్టకేలకు నేనూ చంద్రుడూ కూడా
టోక్యోలో అడుగు పెట్టాం.
 
35
విప్పారిన వెన్నెల
దానికి తెలుసా
నేడెక్కడ బాంబులు పడనున్నాయో
 
36
కాళ్ళూ చేతులూ
చైనాలో వదిలిపెట్టి
ఆ సైనికులు జపాన్ తిరిగొచ్చారు.
 
36
వానకి తడుస్తూ
మౌనంగా ఇంటిదారిపట్టాయి
ఆరువందల యాభైమంది అవశేషాలు.
 
37
ఆ ఎముకలు
ఈ సారి చప్పుడులేకుండా
సముద్రాలు దాటి వచాయి.
 
38
నా పూరిగుడిసె కూలిపోయిన చోట
పూలతీగెలూ, గడ్డీ.
 
39
సీతాకోక-
ఎగురుతూ, తేలుతూ
గుడి శిఖరం మీద.
 
40
నిర్విరామప్రవాహ
మర్మరధ్వనిలో
బుద్ధుడున్నాడు.
 
41
యాత్రకి ముందు రాసుకున్నవి
మళ్ళీ తిరిగిరాసుకున్నాను
దాచుకున్నాను
 
42
రాతినొక తలగడచేసుకుని
మేఘాల్లోకి జారుకున్నాను.
 
43
వానకి తడుస్తున్న పిట్టలు
వాటికి తినడానికేమీ లేదు.
 
44
ఈరోజు, ఇంకా బతికే ఉన్నందుకు
కాళ్ళు బారచాపుకుంటాను.
 
45
నిశ్చలంగా ఉన్న కొండల మీద
నిశ్చలంగా వాన.
 
46
ఈ దీర్ఘరాత్రి
మరింత సుదీర్ఘమైంది
ఆ కుక్క అరుపుల్తో
 
47
సూర్యాస్తమయ సౌందర్యం
వార్థక్యానికి చింతించదు.
 
48
పొలాలు ఊడ్చడం మొదలవ్వాలే గాని
పాటలకి కొదవే ఉండదు.
 
49
పుట్టడం ఎంత సంతోషం
ఆ చిన్నారి శిశువు
తన బుల్లి పిడికిళ్ళు తెరుస్తోంది.
 
50
కిటికీ తెరిచాను
కిటికీ నిండా వసంతం.
 
51
కొండ చిక్కనవుతోంది
నాకు దాని మాటలు వినిపిస్తున్నాయి.
 
52
ఈ రోజు మధ్యాహ్నభోజనం
పట్టెడు నీళ్ళు.
 
53
బండమీద తూనీగ
మధ్యాహ్నస్వప్నాలు.
 
54
బొద్దింకలకి కూడా
తిండి ఉన్నట్టులేదు
అవి నా పుస్తకాలు తింటున్నాయా?
 
55
మగత నిద్ర
నా పిల్లవాడు
కల్లోకొచ్చాడు.
 
56
ఆకులు రాలడం మొదలయ్యింది
ఇకనుంచి నీళ్ళు
మరింత రుచిగా ఉంటాయి.
 
57
తాగి, ఈ రాత్రి
చిమ్మెటల్తో కలిసి నిద్రపోయాను.
 
58
ఎట్లాంటి మజిలీ!
రెండు దిక్కులా కొండలు
మధ్యలో మద్యశాల.
 
59
ఒక్కోసారి అడుక్కోడం మానేసి
ఆ కొండల్నే చూస్తూండిపోతాను.
 
60
పాత మితుణ్ణి కలిసినప్పుడు
రెండు పాతమొహాలు
మౌనం.
 
61
మంచుకూడా మంచిమంచు కాలేకపోతున్నది
ఫాక్టరీల పొగ.
 
62
నిజంగా కొండదేశమే
కేవలం కొండలు, మరిన్ని కొండలు
ప్రకాశిస్తూ చంద్రుడు
 
63
ఆకలికి పిల్లి మూలుగుతోంది
దానికి పెట్టడానికేమీ లేదు.
 
64
కెరటాల చప్పుడు
ఇంతలో దూరంగా, ఇంతలో దగ్గరా
నాకింకెన్నాళ్ళ ఆయువు మిగిలి ఉంది?
 
65
వెన్నెల నా ఖాళీకడుపును
కోసేస్తోంది.
 
66
వానచినుకుల చప్పుడు కూడా
ముసలిదవుతోంది.
 
67
కొండగాలి
గంటలచప్పుడు
నాకు బతకాలనిపిస్తోంది.
 
68
ఒకటే ఎక్కిళ్ళు
వెన్ను నిమిరేవాళ్ళు లేరు.
 
69
నా హృదయం అలిసిపోయింది
కడలీ,కొండలూ
మరీ అందంగా ఉన్నాయి.
 
70
నేను మరణించినప్పుడు
కలుపుమొక్కలు, కురిసే వాన.
23-9-2018

2 Replies to “కొండగాలి, కడలినీలిమ”

  1. అవేపూలు
    రోజంతా యేరుకుంటానే ఉన్నా
    ఇంకా తరగటంలేదు

  2. అవేపూలు
    రోజంతా కోసుకుంటూనే ఉన్నా
    మళ్ళీ మొగ్గతొడుగుతూనే ఉంది

Leave a Reply to Dr.PBDVPrasadCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading