హామ్లెట్ సమస్య

Reading Time: 2 minutes

h.jpg

‘తీగలు తెంచిన తుపాను తగ్గిన తరువాత నేడు
తెలుస్తున్నది విధ్వంసపు రాలుటాకుల పూలమధ్య
వేసిన ప్రశ్న ఒప్పైనా ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని..’

1980లో చదివాను ఈ వాక్యాలు. గోదావరి శర్మగారి దగ్గర తీసుకున్న ‘నూతిలో గొంతుకలు’ లోంచి. అది మొదలు అశాంతికి.

హామ్లెట్ ఎవరు? అతడి సమస్య ఏమిటి?

బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ ఆ అగ్నికి ఆజ్యం పోసింది. షేక్ స్పియర్ ను స్వయంగా చదువుకుని అర్థం చేసుకునే సామర్థ్యం లేని వయసు. ఎవరిదగ్గరయినా పాఠం చెప్పించుకుంటే బాగుణ్ణు. కాని ఎవరు చెప్తారు?

కాని అటువంటి ఉదారమనస్కుడు ఆర్. ఎస్.సుదర్శనంగారి రూపంలో లభించాడు. నాలాంటి మరొక నలుగురు విద్యార్థులకోసం ఆయన వారం రోజుల పాటు రోజూ సాయంకాలం గౌతమీ గ్రంథాలయానికి వచ్చి హామ్లెట్ నాటకం మాకు పాఠం చెప్పారు.

మళ్ళా ఇన్నాళ్ళకు, 34 ఏళ్ళ తరువాత మరొక ఆచార్యుడు ఇదిగో, పాఠం చెప్పడమే కాదు, మనకోసం నోట్సు కూడా రాసి అందిస్తున్నారు.

తాను ప్రసంగిస్తేనూ, పాఠం చెప్తేనూ చాలదని, సవివరంగా ఒక గైడు రాసిపెడితే తప్ప సరిపోదని గుర్తించిన నిజమైన friend, philosopher and guide.

సూరపరాజు రాధాకృష్ణమూర్తి.

ఇది షేక్ స్పియర్ నాటకాలమీద తను అనుశీలనలో చివరిదంటున్నారు ఆయన. ఇప్పటికే 300 పేజీల పైచిలుకు దాటిపోయిన పుటలు. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం మనం!

హామ్లెట్ లో షేక్ స్పియర్ మానవజాతి రక్తచరిత్రను తిరిగి రాసాడంటున్నారు రాధాకృష్ణమూర్తి. షేక్ స్పియర్ మాటల్ని ఆయనకే అన్వయిస్తూ he devised a new commission అంటున్నారు. ఈ నాటకం ద్వారా మానవ భావావేశాల పర్యవసానాన్ని షేక్ స్పియర్ wrote it fair అని కూడా అంటున్నారు.

ఈ మాటల్ని రాధాకృష్ణమూర్తిగారి ఈ అనుశీలనకు కూడా వర్తింపచేయవచ్చు. He devised a new commission and wrote it fair.

ఒక వేదాంతి, ఒక భారతీయ సాహిత్యదార్శనికుడు హామ్లెట్ ని చదివిన పద్ధతి ఇది. సుదర్శనంగారు కూడా అద్వైతి. కాబట్టి, ఆయన ఆ రోజు హామ్లెట్ గురించి తన పాఠాన్ని ఈ మాటల్తో ముగించారు:

there’s a special
providence in teh fall of a sparrow. If it be now
’tis not to come, if it be not to come, it will be
now, if it be not now, yet it will be come: the readiness is all:..’

ఈ ప్రపంచంలో క్రీస్తు తర్వాత అంత విస్తారంగా రాసింది హామ్లెట్ గురించేనని బుచ్చిబాబు అన్నట్టు గుర్తు. రాధాకృష్ణమూర్తిగారు హామ్లెట్ గురించి ఎలానూ రాస్తారనే అనుకున్నాం. కాని ఏమి చెప్తారా, నాలుగువందల ఏళ్ళ సాహిత్యచర్చకు అదనంగా, అన్నదే మా ఉత్కంఠ. కాని, ఆయన రాసిన ఈ వాక్యాలతో అన్నిటికన్నా ముందు ఇంగ్లీషు సాహిత్యమే సుసంపన్నమైంది.

ముఖ్యంగా, నాటకంలో మూడు ప్రతీకార ఇతివృత్తాలున్నాయని చెప్పడం, ఆద్యంతాల్లోని ప్రతీకారాలకి, హామ్లెట్ ప్రతీకారానికీ మధ్య ఉన్న తేడా చెప్తూ, హామ్లెట్ ది అహింసాత్మక ప్రతీకారమనీ, అతడి ధార్మిక స్వభావమే అతణ్ణి హింసనుంచి పదేపదే విముఖుణ్ణి చేస్తూ వచ్చిందనీ చెప్పిన తీరు, నిస్సందేహంగా, సరికొత్తది.

వ్యాసం మొదట్లోని ఈ వాక్యమే నన్ను చాలాసేపటిదాకా ముందడుగు వెయ్యనివ్వలేదు:

‘హింసను నింపుకున్న పాశ్చాత్య సాహిత్యం, హామ్లెట్ తో ఒక మానవీయమైన మలుపు తిరిగింది. హింస గర్జించినప్పుడల్లా, చిరుదీపం చుట్టూ అరచేతులు అడ్డం పెడుతుంది సాహిత్యం.’

అవును, ఒక యురిపిడెస్ Agamemnon నుంచి ఒక Hamlet ను వేరుచేసే ఆ మహత్త్వమేమిటో ఇప్పటికి, నాకు స్పష్టంగా బోధపడింది.

ఇదే అనుకున్నాం ఆ మధ్య. భారతీయ సృజనకారుడు విషాదాంత నాటకమెప్పటికీ రాయలేడని. ఎందుకంటే, అతడి దృష్టిలో మానవవిషాదంలో కూడా ఒక దైవానుశాసనం ఉంటుంది. నాటకం మరణాంతమయినప్పటికీ మంగళాంతమే అతడి దృష్టిలో. అందుకనే ఇప్పుడు రాధాకృష్ణమూర్తిగారు హామ్లెట్ నాటకాన్ని కూడా ఒక మంగళాశంస గా మార్చేస్తే నాకు ఆశ్చర్యమనిపించలేదు.

బహుశా, తెలుగు జాతి, ఎప్పుడో ఒకరోజు ఈ ఆన్ లైన్ తాళపత్రాలు తిరగేస్తూ తనకి స్వస్థత చేకూర్చే ఔషధమొకటి ఇక్కడుందని గుర్తుపడుతుందనుకుంటాను.

ఈ లోపు జీవితజ్వరం నుంచి ఉపశమనం కోరుకునేవాళ్ళు ఈ లంకె తెరవొచ్చు.

https://drive.google.com/…/1xNOi8JeDV0hRiBUn3rzE5ceV4X…/view

15-9-2018

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: