వాజ్ పేయి కవిత

v

సుప్రసిద్ధులైన చాలామంది కవులూ, వారి ప్రభావంతో కవిత్వం రాసే యువతీయువకులూ కూడా చాలాసార్లు వకృత్వాన్నే కవిత్వంగా తాము నమ్ముతూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూంటారు. కాని కవిత్వానికీ, వక్తృత్వానికీ మధ్య సన్నని సరిహద్దు రేఖ ఉంది. ఆ వ్యత్యాసం నాకు స్టువర్ట్ మిల్ కవిత్వం మీద రాసిన వ్యాసం చదివిందాకా అర్థం కాలేదు.

జాన్ స్టువర్ట్ మిల్ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, దీర్ఘకాలం ఈస్టిండియా కంపెనీలో పనిచేసాడు, తర్వాత రోజుల్లో బ్రిటిష్ పార్లమెంటేరియన్ గా రాణించాడు. అతడు రాసిన పుస్తకం On Liberty సుప్రసిద్ధం. కాని, గొప్ప సాహిత్య ఆలంకారికులు కూడా పట్టుకోలేని విషయం మిల్ వంటి యుటిలిటేరియన్ పట్టుకోడం నాకు ఆశ్చర్యం కలిగించింది. What is poetry (1833) అనే వ్యాసంలో అతడిట్లా అంటున్నాడు:

‘మనిషి తన అనుభూతిని వ్యక్తం చెయ్యడంలో కవిత్వమూ, వక్తృత్వమూ కూడా ఒక్కలాంటివే. కాని,మనం కొద్దిగా లోతుగా పోయి చూస్తే, వక్తృత్వమంటే వినేదనీ, కవిత్వమంటే పొంచివినేదనీ తెలుస్తుంది. వక్తృత్వం శ్రోతల్ని ఉద్దేశించి వెలువడేది, కాని, కవిత్వం అసలు తనముందొక శ్రోత ఉన్నాడనే పట్టించుకోనిది..’

వక్తృత్వం ఎదుటి మనిషి ఆమోదాన్ని కోరుతుంది. అతణ్ణి మురిపించాలనుకుంటుంది, అతడి మీద స్పష్టంగా తన ప్రభావాన్ని వదలాలనుకుంటుంది. కాని, సరిగ్గా, ఈ అంశంలోనే కవిత్వం పక్కకు తప్పుకుంటుంది. కవిత్వం ప్రధానంగా కవి తనతోతాను చేసుకునే సంభాషణ. నిజమైన కవికి శ్రోతలమీదా, గాలరీని రంజింపచెయ్యడం మీదా ఆసక్తి ఉండదు. అతడు తనకోసం తాను పాడుకుంటూ ఉంటాడు. మనం అతడికి అల్లంత దూరంలో ఒక పక్కగా నిలబడి అతణ్ణి ఆలిస్తుంటాం. తన మాటలు మనల్నెట్లా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకునే ధ్యాస కవికి ఉండదు, ఇంకా చెప్పాలంటే, ఉండకూడదు.

అటల్ బిహారీ వాజ్ పేయి వక్తగా సుప్రసిద్ధుడు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎవరేనా వాడే మొదటి విశేషణం వక్త అనే. ఆయన కవి అని కూడా చెప్తారుగాని, కవిగా ఆయన్ను జాతి గుర్తించిందీ, గుర్తుపెట్టుకున్నదీ ఏమంత ప్రముఖం కాదనే చెప్పాలి. కాని, నా మటుకు నాకు, వాజ్ పేయి వక్తగా కన్నా కవిగానే ఎక్కువ ప్రతిభావంతుడనీ, విశ్వసనీయుడనీ అనిపిస్తున్నది.

ఆ మాటే చెప్పాను, నిన్న సాయంకాలం గుంటూరులో. సాహితీసమాఖ్య తరఫున మిత్రుడు ఎస్.వి.ఎస్ లక్ష్మీనారాయణ ‘కావ్యాంజలి’ పేరిట ఏర్పాటు చేసిన సభలో. నిన్న ఆ సభలో కస్తూరి రాకా సుధాకర్ రావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, రవూఫ్, అనంత్ శ్రీరాం, రావి రంగారావు వంటి కవులతో పాటు నాకు కూడా వాజ్ పేయిని కవిగా తలుచుకునే అవకాశం కలిగింది. ఆయన జీవించి ఉండగా, ఇటువంటి సభ ఎవరేనా ఎక్కడేనా నిర్వహించారో లేదో తెలీదుగాని, కవి, మరణించిన తరువాత కూడా జీవించడం మొదలుపెడతాడు అనడానికి నిన్నటి సభనే ఒక సాక్ష్యం.

తనలోని వక్తకీ, తనలోని కవికీ మధ్య ఒక సున్నితమైన సరిహద్దు రేఖ ఉందని అందరికన్నా ముందు వాజ్ పేయినే గుర్తుపట్టాడు, పెట్టుకున్నాడు. తన కవితల ఇంగ్లీషు అనువాదానికి రాసిన ముందుమాటలో ఆయనిలా అంటున్నాడు:

‘నేను రాజకీయాల్లో చేరకపోయి ఉంటే అత్యున్నతస్థాయి కవిని అయిఉండేవాణ్ణని కొందరు మిత్రులంటూంటారు. అత్యున్నతస్థాయి, అతితక్కువ స్థాయి లాంటి పదాల మీద నాకు నమ్మకం లేదుగానీ, నా కవితాయాత్ర సజావుగా సాగకపోడానికి రాజకీయాలు అడ్డుపడ్డాయని మాత్రం ఒప్పుకోక తప్పదు .. కవిత్వం చెప్పాలంటే సమయం మాత్రమే కాదు, తగిన వాతావరణం కూడా సమకూరాలి..నిజానికి, కవిత్వమూ, రాజకీయాలు కలిసిపోగలిగేవి కావు. రాజకీయాల్లో చేరాక నువ్వు ప్రతిరోజూ ప్రసంగాలు చెయ్యవలసి ఉంటుంది. ప్రజల్ని ఆకట్టుకునే భాషలోనూ, ఆకర్షించే పద్ధతిలోనూ, వాళ్ళపైన బలంగా ముద్రవేయడంకోసమూ ప్రసంగించవలసి ఉంటుంది. అక్కడ కవిత్వం రాయడానికి అవసరమైన ఏకాంతం, నీకై నువ్వు జీవించగల క్షణాలు తక్కువై పోతుంటాయి, అందుకవసరమైన వాతావరణం కూడా అందకుండాపోతూంటుంది..’

కవిత్వం ప్రజలకోసం, సమాజం కోసం రాసేదికదా, దానికీ, ఏకాంతానికీ సంబంధమేమిటి అనవచ్చు. కవిత్వం ఒక మౌలికశాస్త్రవేత్త లాబరేటరీలో ప్రయోగాలు చేయడం లాంటిది. ఒక కంప్యూటరు ప్రోగ్రామరు ఒక కొత్త సాఫ్ట్ వేరు రూపొందించడం లాంటిది. ఆ ప్రయోగాల, పరికల్పనల ఫలితాలు సమాజమంతటివీను. కలిగి ఎప్పుడూ తెరవెనక పాత్రనే. ‘ఆకులందున అణగిమణగీ’ పాడవలసిన పాటనే. రాజకీయవేదికల మీద చేసే ప్రసంగాల్లోంచి కవిత్వం రాదు. కవిత్వం ప్రధానంగా అనుభూతిని, ఆవేశాన్ని భాషాపరంగా మనకి అందించే ప్రక్రియ. స్వర్ణకారుడు బంగారాన్ని నగగా మార్చినట్టు కవి భాషని కవిత్వంగా మారుస్తాడు. అది అత్యంతశ్రద్ధతోనూ, అవిచలిత మనఃస్థితిలోనూ జరిగే ప్రక్రియ. అప్పుడు కవి దృష్టి ఎంతసేపూ తన ప్రయోగం మీద ఉండాలి తప్ప దాన్ని నలుగురికీ చూపించాలన్న ఉత్సుకతలో కాదు. ఆ మెలకువ చూపించినందువల్లనే వాజ్ పేయి విస్తారంగా కవిత్వం రాయలేదని నాకు అర్థమయింది.

వాజ్ పేయి కవిత్వం ఒక రాజకీయవాది చేసే ప్రసంగంలాగా ఎక్కడా వినిపించదు. అది చాలా సన్నిహితంగా, ఒక సాధారణమానవుడు తన సందేహాల్నీ, సంఘర్షణనీ తనతోతాను సంభాషించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సంభాషణలో ఒక సత్యసంధత ఉంది. తనకీ లోకానికీ సమాధానం కుదరని ఒక నవయువకుడు తానేం చెయ్యాలో తెలీక, ఎవరితో పంచుకోవాలో తెలీక , ‘తన కుటిలో, చీకటిలో ‘ ఒక్కడుగా మగ్గిన అనుభవమే వాజ్ పేయి కవిత్వంలో కూడా కనిపించడం నన్ను నివ్వెరపరిచింది.

కవి పండితుల కుటుంబంలోంచి వచ్చిన వాడు కాబట్టి, అతడిది సుశిక్షిత శ్రవణం. పదాల బరువు,రంగు, సుగంధం తెలిసినవాడని అతడి పదప్రయోగాలు మనకి సాక్ష్యమిస్తాయి. హిందీ కవులు, హిందీ కవిత్వ శ్రోతలు ప్రధానంగా కోరుకునే ధార ఆయన కవిత్వంలో కొన్నిసార్లు ప్రవాహంలానూ, కొన్నిసార్లూ జలపాతంలానూ కనిపించడం అతడిలోని కవి నిర్లక్ష్యం చేయదగ్గవాడు కాడని మనని హెచ్చరిస్తుంది.

ఉదాహరణకి, ఈ కవిత చూడండి, అర్థం సరే, ముందు ఆ సంగీతం, ఆ లయ, ఆ సునాదమాధురి చూడండి:

కదమ్ మిలాకర్ చలనా హోగా

బాధాయేఁ, ఆతీ హైఁ ఆయేఁ
ఘిరేఁ ప్రలయ్ కీ ఘోర్ ఘటాయేఁ
పావోఁ కే నీచే అంగారే
సిర పర్ బరసేఁ యది జ్వాలాయేఁ
నిజ్ హాథోఁ సే హసతే, హసతే
ఆగ్ లగాకర్ జల్నా హోగా
కదమ్ మిలాకర్ చల్నా హోగా

హాస్య రుదన్ మేఁ, తూఫానోం మేఁ
అమర్ అసంఖ్యక్ బలిదానోం మేఁ
ఉద్యానోం మేఁ, వీరానోం మేఁ
అపమానోం మే, సమ్మానోం మేఁ
ఉన్నత్ మస్తక్, ఉభరా సీనా
పీడావోం మే పలనా హోగా
కదమ్ మిలాకర్ చల్నా హోగా

ఉజియారే మేఁ, అంధకార్ మేఁ
కళ్ కఛార్ మేఁ, బీచ్ ధార్ మేఁ
ఘోర్ ఘృణా మేఁ, పూత్ ప్యార్ మేఁ
క్షణిక్ జీత్ మేఁ, దీర్ఘ హార్ మేఁ
జీవన్ కే శత్ శత్ కార్షక్
అరమానోం కో దలనా హోగా
కదమ్ మిలాకర్ చల్నా హోగా

సమ్ముఖ్ ఫైలా అమర్ ధ్యేయ పథ్
ప్రతి చిరంతన్ కైస ఇతి అథ్
సుస్మిత్ హర్షిత్ కైసా శ్రమ శ్లథ్
అసఫల్, సఫల్ సమాన్ మనోరథ్
సబ్ కుఛ్ దేకర్ కుఛ్ న మాంగతే
పావస్ బన్ కర్, ఢలనా హోగా
కదమ్ మిలాకర్ చల్నా హోగా

కుశ్ కాంటోమేఁ సే సజ్జిత జీవన్
ప్రఖర్ ప్యార్ సే వంచిత్ యౌవన్
నీరవతా సే ముఖరిత్ మధువన్
పర్ హిత్ అర్పిత్ అపనా తన్-మన్
జీవన్ కో శత్ శత్ ఆహుతిమేఁ
జల్నా హోగా, గల్నా హోగా
కదమ్ మిలాకర్ చల్నా హోగా

ఈ కవిత చదవడం, వినడం దానికదే అనుభవం. సుశిక్షితుడైన సాహిత్యవిద్యార్థి మాత్రమే చెయ్యగల పదప్రయోగాలు- ఉదాహరణకి, ఆ ‘శ్లధ ‘ అన్న మాటనే చూడండి, ‘అంతేలే పేదల చేతులు/ శ్లథ శైశిర పలాశ రీతులు’ అనే మహాకవి వాక్యాలు చెవిలో గింగురుమనడం లేదూ!

వక్తగా ప్రబోధానికీ, ప్రసంగాలకీ పూనుకోనందువల్లా, తన ముందు తాను నిజాయితీగా నిలబడటానికి సిద్ధపడ్డందువల్లా, ఆయన కవిత్వం ఎంత విశ్వసనీయం కాగలిగిందో ఈ చిన్న కవితలు రెండూ చూడండి. మొదటిది, జైల్లో ఉండగా రాసుకున్న కవిత:

ఆందోళన

ఒంటరి చెరసాల
ఆందోళిత స్వరాలు.
కీచురాళ్ళ చప్పుడు.
గుండెల్ని చీల్చే సవ్వడి.
ఇప్పుడు నాకు ఊపిరాడనివ్వకుండా
ఆకాశం కూడా కిందకుదిగినట్టుంది

క్షమార్పణ

క్షమించు బాపూ, అపరాధులం
మాటనిలబెట్టుకోలేకపోయాం
రాజ్ ఘాట్ ని అపవిత్రం చేసాం
సగందారిలోనే గమ్యం మరిచాం.

జయప్రకాశ్, నమ్ము మమ్మల్ని
పగిలినకలలు తిరిగి అతుకుతాం
చితాభస్మపు చిరుకణికలతో
చీకటికోటను బద్దలుకొడతాం.

కవితాసాధనకే ఈ కవి జీవితం అంకితం చేసి ఉంటే, సర్వశ్రేష్ఠ కవుల్లో ఒకడిగా మిగిలిఉండేవాడనుకోడంలో అతిశయోక్తిలేదు.

17-9-2018

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d