వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన దీర్ఘకావ్యం ‘పునర్యానం ‘ కు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచనకవితా పురస్కారం లభించింది.
ఎమెస్కో ప్రచురించిన ఈ కావ్యం ప్రస్తుతం ముద్రణలో లేదు.
‘మిసిమి’ (జూలై, 2011) పత్రికలో తెలుగు కావ్యాలను సమీక్షిస్తూ, ప్రసిద్ధ తెలుగు కవి, సాహితీవేత్త వేగుంట మోహన ప్రసాద్ ఈ కావ్యం గురించి ఇలా రాసారు:
ఆధునిక జనజీవితపు తొక్కిడిలో, అలజడిలో, ఆందోళనలొ, అస్తిమితంలో ఓ మహాకావ్యనిర్మాణం జరగటమనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. దాన్ని నిజం చేసింది పునర్యానం. ఈ నిర్మాత చినవీరభద్రుడు. ఈయన రచనలన్నీ సహృదయునికి ప్రేమలేఖలే.
పునర్యానం కావ్యనిర్మాణంలో ఎంపిక లక్ష్యలక్షణాలన్నీ నిర్మాణపరంగా, శైలీపరంగా పరిపుష్టినొందాయి. ఈ కావ్యం కేవలం నేల విడిచి చేసిన సాము కాదు. లోకవృత్తమే దీని ఇతివృత్తం. ఎన్నెన్ని ప్రాంతాలు, ప్రదేశాలు, పట్టణాలు, గ్రామాలు ప్రవేశిస్తామో దీని పఠనంలో-హరిద్వార, అరకులోయ, పత్తికొండసీమ, నల్లమల అడవి, శ్రీరంగపట్టణం,కెరమెరి ఘాట్, లేపాక్షి, అనంతగిరి, రాజమండ్రి, గోదావరీ, కూనేరు లోయలు, సవరగూడలు, కొదమగ్రామం,మహానంది, ఆళ్ళగడ్డ, ఇంద్రవెల్లి!ఎన్నెన్ని వృత్తులతో కవికి పరిచయాలు, ఆత్మీయ బాంధవ్యాలు ఉన్నవో వాటన్నిటితో సహానుభూతిని పొందుతాం. ఆదివాసులు, కొండరెడ్లు, సవరకవి, కోయవనిత, కుమ్మరులు, గౌడ్లు, తెలుకులాళ్ళు, కోదుపిల్లవాడు, నేతవాళ్ళు, జాలర్లు మాత్రమే కాక వాళ్ళ వాళ్ళ సంపూర్ణ సజీవముఖచిత్రాలుగా కంసాలి సోమలింగం, మంగలి వీరస్వామి, చెంచుబాలుడు, సవరపూజారి,మూకదొర, మన్నెదొర, గోండు, వడ్డెర, గదబ యువతీయువకులు, వృద్ధులు ఎందరెందరో!!
ఈ కావ్యంలోని పంచభూతాల ప్రపంచంలో(పృథ్వి, అగ్ని, రసః, మరుత్, ఆకాశ) మొత్తం 19 సర్గలుండగా, పృథివిలో 101, అగ్నిలో 95, రసఃలో 31, మరుత్ లో 24, ఆకాశంలో 197 పద్యాలున్నై. తైత్తిరీయోపనిషత్తు భూమికగా ఈ ఆధునిక కవి ఏం ప్రవచిస్తున్నాడిందులో అని తెలుసుకోవాలంటే ఈ కావ్యాన్ని చాలా నిదానంగా, శ్రద్ధగా, భక్తితో, ప్రేమతో, రసైక్యభావనతో మాత్రమే చదువుకోవాలి. ఈ ఆధునిక కవి చెప్పే సత్యాలు-పరమసత్యాలు ఇవీ: అన్నం, ప్రాణం, మనసూ, విజ్ఞానం, ఆనందం అన్నీ పరమసత్యాలు. కాని వేటికవే పాక్షిక సత్యాలు. అన్నీ కలిస్తేనే పరమసత్యాలు. 264 పుటల ఈ సుదీర్ఘకావ్యంలోనించే ఒకే ఒక పంక్తినుదహరిస్తూ కావ్యపఠనం ఎలా ఉంటుందో చూపిస్తాను.
బత్తాయి పండు వలుస్తుంటే చేతుల్లోకి
చిమ్ముతుంది చూడు ఆవిరి సుగంధంఅలా ఉంటుంది.