నేను తిరిగిన దారులు

v1

ఇండియా టుడే తెలుగు పత్రిక కోరికమీద వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలైన అరకులోయ, శ్రీశైలం, భద్రాచలం ప్రాంతాల యాత్రావర్ణనలు రాసారు. ఆ తర్వాత ఇంగ్లాండు సందర్శించినప్పుడు మరొక సమగ్రమైన యాత్రాకథనం వెలువరించారు. ఆ కథనాలకు, మరికొన్ని అనుభవకథనాలు జోడించి 2010 లో వెలువరించిన యాత్రాగ్రంథం ‘నేను తిరిగిన దారులు.’

కినిగె సంచాలకులు రాజన్ గారు ఇలా రాస్తున్నారు ఈ పుస్తకం గురించి:

మీరు జీవితంలో కనీసం ఒక్కసారైనా అరకు అందాలను చూడాలన్న కాంక్షతో ఉన్నట్లయితే ఈ పుస్తకం చదవొద్దు.

ఈ పుస్తకం చదివాక మీరింత వరకూ అరకు చూడలేదన్న నిజం అబద్దంగా అనిపిస్తుంటుంది. అరకులో చూడదగ్గ ప్రతీ ప్రదేశం చూసేశాం కదా! ఆ ప్రకృతి అందాలకు పరవశించిపోయాం కదా! అనే భావన మీ మనసులో స్థిరపడిపోతుంది.

మనం కూడా బొడ్డవార రైల్వే స్టేషన్‌లో ట్రైనెక్కి బొర్రా గుహల దాకా ప్రయాణం చేసినట్టు, రైలు కిటికీలోంచి చూస్తూ టన్నెల్స్ లెక్కపెడుతున్నట్టు, ఆకాశం అంచుల్లోంచి దూకుతున్న జలపాతం తనివితీరా చూడకుండానే దాటిపోతే బెంగపెట్టుకున్నట్టు, ఆ రాత్రి అరకులో గిరిజన పాఠశాల ప్రాంగణంలో పెద్ద నెగడు చుట్టూ ఆ పాఠశాల పిల్లలతో కలిసి కూర్చొని, వాళ్ళు పాడుతున్న పాటలు వింటూ పరవశించినట్టూ, పొరజా గిరిజన జనావాసంలో వారి ఆత్మీయత, ఆ సమయంలో వారు తింటున్న చల్లారిపోయిన సామబియ్యం అన్నం, పండు గుమ్మడికాయ కూర …ఇలా ప్రతీ అనుభూతి మన స్వీయానుభూతిలా మన మనసులో నిక్షిప్తమైపోతుంది.

బొర్రా గుహల దగ్గర ఆ కొండబిలం పృథ్వి ఆవులించినట్టుగా ఉందట, ఆ గుహల్లో అడుగు వెనక అడుగు వేస్తూ దిగుతూ ఉంటే మనిషి తన లోపల కప్పబడిపోయిన పూర్వయుగాలలోకి అడుగుపెడుతున్నట్టు ఉందట. రచయిత కవి కూడా అయితే పాఠకుడికి కలిగే ప్రత్యేకలాభం ఏమిటో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇది యాత్రా సాహిత్య విభాగంలోకి వచ్చే యాత్రా కవిత్వం.

ఇక శ్రీశైల యాత్ర చదువుతుంటే శిఖర దర్శనం చేసినంత ఆనందం కలుగుతుంది.’నిండుగా చిగురించిన మద్ది చెట్ల అడవిని తలదాల్చిన శ్రీపర్వతమంతా సాకార శివమహిమ్న స్తోత్రంగా కనిపిస్తుంది నాకు’ అన్న రచయిత మాట…భక్తిపారవశ్యంలో కొన్ని క్షణాలైన గడిపిన అనుభూతి కలిగిన వారందరికి ఒళ్ళు జలదరించేలా చేస్తుంది.

సూఫీ సాధువు నిరంజన్ వలీ షా, పాల్కురికి సోమనాథుడు, ఆది శంకరులు, కంచి పరమాచార్య ఇలా సందర్భానుసారంగా ఎందరో మహానుభావులు మన యాత్ర మధ్యలో వచ్చి మనల్ని కలిసి వెళుతున్నట్టుంటుంది. విష్ణుస్వరూపాన్ని ‘లార్డ్ ఆఫ్ ద సెంటర్’ అని, శివ స్వరూపాన్ని’ లార్డ్ ఆఫ్ ద పెరిఫెరీ’ అనీ విశ్లేషించడం కేవలం ఈయన ఒక రచయిత మాత్రమే అయ్యుంటే చేయలేడు.

టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ లో బయోడైవర్సిటీ ఆఫీసర్ తులసీరావు గారి మాటలు చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఉసిరిచెట్ల చుట్టూ లేళ్ల మందలు చేరినప్పుడు వాటికోసం కొండముచ్చులు చెట్లకొమ్మలు ఊపి కాయలు రాలుస్తాయట. అందుకు ప్రతిఫలంగా చిరుతపులులు వాటిమీద దాడి చేయకుండా దుప్పుల మందలు కాపుకాస్తాయట.

ఇక ఆదిమ గిరిజన జాతైన చెంచులు, రోడ్డు పక్కన పూసలమ్ముకునేవాని దగ్గర ఉన్న పద్మభూషణ్ ఆర్.కె.శర్మ రాసిన ‘ద ఐ ఆఫ్ రుద్రాక్ష’ పుస్తకం, పరమశివభక్తులు భక్తి పారవశ్యంలో తమ శరీరాంగాలను, చివరికి తమ శిరస్సులను కూడా శివార్పణ చేసుకున్న ప్రదేశమైన వీరశిరోమంటపం ఇలా ఎన్నో విశేషాలతో శ్రీశైల యాత్ర సాగుతుంది.

పాపికొండల యాత్ర మరొక మధురానుభూతి. గోదావరిలో ప్రయాణంతో పాటు, పేరంటంపల్లి బాలానంద సాధువు గిరిజన జాతైన కొండరెడ్లకోసం పడ్డ తపన, అనేకానేక సంవత్సరాల క్రితం వారైన తూము నరసింహదాసు, వరద రామదాసుల అద్భుత మైత్రి- వారు భద్రాచలం ఆలయానికి చేసిన సేవ, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ సాగే యాత్ర…పాపికొండల యాత్ర.

సాంచి స్థూపాల గురించి చదువుతున్నప్పుడు అక్కడ ఆశోకుడు స్థాపించిన స్తంభాన్ని తరువాత అనేక శతాబ్దాల తరువాత ఆ ప్రాంత జమిందారు ముక్కలు చేసి చెరుకుగానుగుగా మార్చుకున్నాడన్న విషయం హృదయాన్ని తొలిచేసింది. ఒకానొకప్పుడు సారిపుత్తుడు బుద్ధుడితో మీవలే జ్ఞానోదయం అయినవారు ఇదివరకూ లేరు, ఇప్పుడూ లేరు అన్నాడట. అందుకు బుద్ధుడు నవ్వుతూ”నీకు గతంలోను, భవిష్యత్తులోను ఉన్న బుద్ధులు కనిపించారా? లేదా కనీసం ఈ బుద్ధుడినైనా అర్థం చేసుకున్నావా” అని ప్రశ్నించాడట. దానికి సారిపుత్తుని సమాధానం చదివినప్పుడు ఏవో ఆధ్యాత్మిక తరంగాలు పులకింత కలగజేసాయి. “అయ్యా, నాకు నిజంగానే భూత భవిష్యత్ వర్తమానాలు తెలియవు. కానీ ధర్మాన్వయ జ్ఞానముంది. నేను ఒకే ఒక్క ద్వారమున్న పెద్ద కోట దగ్గర నిలబడ్డ ద్వారపాలకుని వంటి వాడిని. ఆ కోట గోడకుండే సందుల్లో నుండి ఏ ప్రాణులు బయటకొస్తున్నాయో, లోపలికి పోతున్నాయో తెలుసుకోలేను గానీ…ఆ మహాద్వారం నుండి ఎవరు లోపలికొస్తున్నా, బయటకి పోతున్నా స్పష్టంగా కనపడుతుంది.” ఇదీ సారిపుత్తుని సమాధానం.

అరుణాచలంలో చలం గారి సమాధికి, ఆయన స్మృతులకు పట్టిన దురవస్థకి రచయితతో పాటు నాక్కూడ కన్నీళ్ళొచ్చాయి. రమణ మహర్షికి ప్రొ.సయ్యద్ కి జరిగిన సంవాదం, ‘చలంగారికి రమణ మహర్షి ఒక అయస్కాంతమయితే, రమణమహర్షికి ఈ అరుణగిరే ఒక అయస్కాంతం’ లాంటి రచయిత మాటలు అరుణాచల యాత్ర చేస్తున్నంతసేపూ మన చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటాయి.

మనసు అణిగేదెట్లా అని శివప్రకాశం పిళ్ళై అనే జిజ్ఞాసువు అడిగిన ప్రశ్నకు రమణులు రాతపూర్వకంగా ఇచ్చిన జవాబు మనల్ని ఆధ్యాత్మిక భావనలో ముంచేస్తుంది.

శ్రావణబెళగొళ యాత్రలో గోమఠేశ్వర స్వరూప సందర్శనం, అక్కడ గిరిజనులైన తోడాల గ్రామం, వారి నమ్మకాలు, అలవాట్లు, ఒకప్పుడు హొయసల చక్రవర్తుల రాజధానిగా పేరొందిన ద్వారసముద్రం-ఇప్పుడు హళేబీడు అనే పాడుబడ్డ గ్రామంగా మారిన వైనం, అక్కడ అసంపూర్ణంగా ఉన్న అద్భుత దేవాలయ నిర్మాణాలు…మన కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.

‘నువ్వు చూస్తున్న సౌందర్యం, నువ్వు చూడలేకపోతున్న మహనీయసౌందర్యాన్ని దేన్నో గుర్తు చేస్తూ నీలో ఆ అసంపూర్ణతను జాగృతం చేస్తుందేమో. లేదా మనం ఆ దేవాలయం ఎదుట నిల్చుచున్నప్పుడు స్ఫురించేది అసంపూర్ణత్వం తాలూకు భావన కాక, అశాశ్వతత్వం తాలూకు భావనేమే’ అన్న రచయిత మాటలు ఆయనలోని వేదాంతతత్వాన్ని మనలోనికి ప్రసారం చేయిస్తాయి.

త్రయంబకేశ్వర యాత్రలో తుల్జాభవాని దేవాలయం, నాసిక్, కుశావర్తం, గోదావరి జనక స్థానమైన బ్రహ్మగిరి, నివృత్తినాథుని గుహ ఇలా ఎన్నో ప్రదేశాలు తిప్పుతూ ఆ ప్రాంత చరిత్రలు, అక్కడ పుట్టిన జ్ఞానదేవుని వంటి మహనీయుల దివ్యగాథలు, బోధలు వినిపిస్తూ పూర్తవుతుందా యాత్ర.

కృష్ణజన్మ స్థానమైన మధురని, ఆయన ఆడిపాడిన బృందావనాన్ని మనకు చూపించే బృందావన యాత్రా, ఆశ్చర్యం కలిగించే సంగతులెన్నో ఉన్న ఇంగ్లాండ్ యాత్రా… ఇలా ఇన్ని రకాల యాత్రలు మనతో చేయించి, ఈ యాత్రల పొడుగునా ఆధ్యాత్మిక, వేదాంత. చారిత్రక, భౌగోళిక విషయాలను వివరిస్తూ మనల్ని విజ్ఞానవంతులని చేసే విహారయాత్ర ఈ పుస్తకం.

‘బైలదిల్లా అడవుల్లో దగాపడ్డ చెల్లెళ్ళ పోరాటం’, ‘గోర్కీ మై యూనివర్సిటీస్’, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గోపీనాథ మహంతి రాసిన’పొరజా’ నవల, ఆయనదే మరో మహేతిహాసానికి తెలుగు అనువాదం ‘అమృతసంతానం’, ‘ది రెడ్డిస్ ఆఫ్ బైసన్ హిల్స్’, ‘కోనింగ్స్ బై’, ‘ది కన్ఫెషన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఓపియమ్ ఈటర్’, ఆంటోనియో రిగోపోలస్ అనే ఇటాలియన్ మేధావి రచించిన ‘దత్తాత్రేయ: ద ఇమ్మోర్టల్ గురు, యోగిన్ అండ్ అవతార’, జ్ఞానదేవుని ’అనుభవామృతం’, రమణ మహర్షి పదేపదే పారాయణం చేయించే ‘ఋభుగీత’ ఇలా ఎన్నో పుస్తకాలకోసం కూడా ఈ యాత్రలో మనం తెలుసుకుంటాం.

ఈ ‘నేను తిరిగిన దారులు’ ఆసాంతం చదివాక ‘మనకు తెలిసిన దారులు’ గా మారిపోతుంది.

http://kinige.com/book/nEnu+tirigina+daarulu

11-9-2018

 

 

Leave a Reply

%d bloggers like this: