నిర్వికల్ప సంగీతం

p1

‘అద్భుతం, అంతే, మరొకమాట లేదు’ అని రాసారు అజంతాగారు ఈ పుస్తకం అందుకోగానే. వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరించిన తొలికవితాసంపుటి. 1986లో ప్రచురించిన ఈ కవితాసంపుటిని దాశరథి కృష్ణమాచార్య, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటివారి సమీక్షలు, ఆర్.ఎస్.సుదర్శనం, మోహనప్రసాద్, ఇస్మాయిల్, చండీదాస్, జ్యేష్ఠ వంటి వారి ప్రశంసలు లభించాయి. నూతలపాటిగంగాధరం పురస్కారం లభించింది. ప్రస్తుతం ముద్రణలోలేని ఈ పుస్తకం త్వరలోనే అందుబాటులోకి రానున్నది.

ఈ రచన వెలువడ్డాక ప్రసిద్ధ కవి సౌభాగ్య ఇలా రాసారు:

చినవీరభద్రుడి చిన్మయగానం

1985 తర్వాత తెలుగు కవిత్వంలో తోకచుక్కలా దూసుకొచ్చి అపురూపమైన,అసాధారణమయిన కవిత్వంతో ఆకర్షించిన కవి చినవీరభద్రుడు. పదాలకి పారిజాత పరిమళానివ్వడం ఆయనకు తెలుసు. తన స్వకీయమైన స్వరమంజరితో మన మనసుల్ని ఉల్లాసపరుస్తూభావోద్వేగంతో సాగిపోతాడు. వీరభద్రుడి విశ్వం అద్భుతాల నిలయం. ఆయన మనం నిత్యం తిరిగే చోటులోనే అడుగుపెడతాడు. మొగలివాన మొలిపిస్తాడు. చినవీరభద్రుడు జీవితాన్ని నిరంతరప్రవాహంగా జిడ్డు కృష్ణమూర్తిలా భావిస్తాడు. తనకు జన్మనిచ్చినందుకు తల్లికి నమస్కరిస్తాడు. తన కవితాగానగుణం వెనకనున్న కారణాల్ని ఆవిష్కరిస్తాడు:

ఆకులు రాలిన అరణ్యంలోకి

కోకిల ప్రవేశించే కాలంలో

నన్నుకన్నది మా అమ్మ

ఆమెకు నా అనేక నమస్కారాలు

హిమాలయంలాంటి మా అమ్మ

గంగా ప్రవాహం లాంటి నను కన్నాది

ఓహో, ఈ ప్రవాహం అనుక్షణం

జీవనసంగమానికై ఉన్ముఖమవుతున్నాది

అంటాడు.

వీరభద్రుడి కవిత ప్రకృతికి వేరుగా యాంత్రికమయింది కాదు. తల్లి పర్వతం, తాను ప్రవాహం. నిరంతర సాహిత్య సంచారం వీరభద్రుడి మౌలిక లక్షణం. ఏదో ఒక సిద్ధాంతానికో,సెంటిమెంటుకో, ఆఘాతానికో ఆగిపోయి రొటీన్ చర్చలు చేస్తూ కూచునే కవి కాడు వీరభద్రుడు. అతని ప్రపంచం విచ్చుకుంటున్న వినువీథి!

జన్మిస్తున్నాను కాంతినై, కాలాన్నై, వేదాన్నై, వేదననై, అనలమై, అద్భుతమై

ప్రపంచం కోసం ఈ భూమిపై ఒక మనిషిపై

అంటాడు.

ఈ ప్రపంచంలో వీరభద్రుడిది కానిదేమీ లేదు. అందరి ఆనందం అతనిది. అందరి దుఃఖం అతనిది. మానవజాతికి తాను ప్రాతినిధ్యం వహిస్తానంటాడు.

ధ్వనిస్తున్నాను నేను జగజ్జన హృదయస్పందనాన్ని

పరింఅళిస్తున్నాను నేను తత్త్వకాంతి కమలాన్ని, కళల్ని, కవితార్తిగీతికల్ని

ఆలపిస్తున్నాను హృదయాల ఐక్యాన్ని, కరుణామయుల ప్రేమ వచనాల్ని

చిత్రిస్తున్నాను పసిపాపల నేత్రాల్ని, స్త్రీల మనసుల్ని, మానవసంబంధాల స్వర్ణయుగాల్ని

ప్రవచిస్తున్నాను పూల ఆశల్ని, కలకూజితాల్ని, ఈశ్వరీయ నిశ్శబ్ద వేదనా ప్రకంపనల్ని

స్పర్శిస్తున్నాను పార్థివదేహాన్ని, ఋతులీలాలోలితారణ్యాల్ని, పునరుత్థానమందే ఆత్మల్ని

రూపొందుతున్నాను నేను నేనుగా

ఇదే ఆసన్న అత్యావశ్యక క్షణం.

ఈ భూమండల క్షణక్షణ స్పందనలు తనేనంటున్నాడు. మెత్తటి భావనలు, మృదువైన భాష, ప్రేమపూరితమయిన తన్మయ తరంగం అల్లుకున్న ఈ గంధర్వుడు నిత్యనిరంతర స్వప్నలోక సంచారి. సందేహాలు లేని అమందానంద కందళిత హృదయారవిందుడు. అతనికంటూ ఏమీ లేదు. అతనిది కానిది ఏదీ లేదు. కవిగా మాట్లాడ్డటం, రాయడం,జీవితం యివన్నీ ఏవో పురాకృత ఆశీర్వాదాల్లా అనిపిస్తాయతనికి. కవిత్వం అన్న శబ్దానికే సన్నజాజి తీగలా సంచలించి మనపై పూలవాన కురిపిస్తాడు. అతనికి ‘జీవించడం ఒక లీల.’ అతను లౌకిక వ్యవహారాలకు చిక్కడు. దేన్నీ కాదనడు. ఏ వలకూ చిక్కడు. రంగులపిట్టలా నీలాల గగనంలో తేలిపోతాడు. కవిత్వానికి ఒక ఆదిమ అచుంబిత స్వచ్ఛతని అతను ఆపాదించాడు. వీరభద్రుడు ‘అనూన కిసలయం.’అతని భావనాలోకం ‘భావస్థిరాణి జననాంతర సౌహృదాని’ గా పరవశం పొంగిపొర్లేది. భూలోకాన్ని పిల్లగాలిలా చుట్టుముట్టి తను పట్టి తెచ్చిన సీతాకోకచిలుకల్ని మనపై వొదుల్తాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. తన నిత్యకార్యక్రమాల్ని వివరిస్తాడు.

‘వానాకాలపు పల్చని ఎండల్లో ఎగిరే తూనీగల స్వేచ్ఛా ప్రపంచంలోకి నాకూ ఆహ్వానం వచ్చింది. హోరు పెడ్తున్న ఈ జీవనసాగరం ఎదుట కళ్ళు తిరిగేటట్టు ఇలా ఎంతసేపని చూస్తో? అర్థరాత్రి పల్చటి సెలయేటి అద్దంలో బృహత్తారకల గగనం ప్రైతిఫలించే దృశ్యాన్ని ఎంతసేపైనా చూడగలను. ఆ పైన మంచు తెరల వెనుక సింగారించుకునే ఉషాకుమారికి నలుదిక్కులూ తెరిచి ఆనందగీతికల్తో స్వాగతిస్తాను’.

అంటాడు.

రోజువారీ జీవితంతో విసుగెత్తి, విరక్తి చెంది అలసిపోయినవాళ్ళు యితనింత ఆనందంగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు.

‘వెళ్ళిపోతున్న మిత్రులు, బృందాల్లో శ్రుతి కలుపుతున్న కొత్త గళాలు,పసిపాపల కేరింతలు, రాలిపోతున్న తారలు, ఈ వెలుగునీడల రసరమ్య రూపకాన్ని యిష్టంగా నేత్రమందిరంలో ఆవిష్కరించుకుంటాను. దారితెన్నూ తెలియకుండా తుపాను ప్రపంచాన్ని వూగిస్తోన్న వేళ తడిసిన చంద్రకాంతల పరిమళాన్ని నమ్ముకుని ఏ సహృదయ సన్నిధిలోనో కాలం దేశం లేకుండా నిలిచిపోతాను. ఎప్పుడయినా, ఎక్కడయినా నాకు జీవించడం ఒక రహస్య లీల, రసమయ ఖేల.’

అంటాడు.

వీరభద్రుడికి దుఃఖం అలీనం కాదు. సుఖం దాటలేని నది కాదు. కానీసుఖదుఃఖాధిక ద్వంద్వాతీత బ్రహ్మానందానుభావమేదో అతను స్వర్గం నుంచీ అరువుతెచ్చుకున్నాడు. ఆ రహస్యలీల మనకు ‘అందీ అందని చేలాంచలం’లా ఊరిస్తుంది. మనం అతని బావుకతను భావించి పరవశించినందుకు సంతృప్తి పడాలి.

ప్రతిభావంతుడయిన ప్రతి కవీ తన కవిత్వ పూర్వరంగం గురించి చెప్తాడు. తన బలాన్ని, బలహీనతను వివరిస్తాడు. వీరభద్రుడు తన కవిత్వమంటే ఏమిటో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వివరించాడు. సాధారణంగాఆధునిక కవులు ‘ప్రపంచ సమస్యల్ని’పరిష్కరించడానికి ‘గళం, కలం’విప్పడం గురించి వింటూ వుంటాం. తమ వర్గాలనో, తెగల్నో ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవడం గురించి వింటూ వుంటాం. తన కవిత్వం అట్లాంటి బృహత్తర, మహత్తర వ్యవహారాల్లోతలదూర్చడం లేదని తన కవిత్వమంటే ఏమిటో వివరించాడు.

తన కవిత్వం జనం కోసం,విమర్శకుల కోసం,కీర్తి కోసం కాదని కచ్చితంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. సమాజాన్ని మార్చాలనీ, జనాల్ని ఓదార్చాలనీ కొందరు కవులు తపిస్తూ పరితపిస్తూ కవిత్వం రాస్తూ వుంటారు. కవిత్వ ప్రయోజనమది కాదు. జీవితాన్వేషణే కవితకు పరమావధి అంటాడు వీరభద్రుడు.

ఎవడన్నాడో గాని అవును మనిషి దారి తప్పిన మృగమే

లక్ష్యానికి మార్గమే ఆటంకమా?

రహస్యం చెప్తున్నాను

ఆటంకాన్వేషణే మన అసలైన లక్ష్యం

అంటాడు.

వీరభద్రుడు విచిత్ర కవి.

కవులు రూపకాలు, ఉపమానాలు, ప్రతీకలు, పదచిత్రాలు పనిగట్టుకుని చక్కగా చెక్కి మెరుపులు మెరిపించి ఆకర్షించడామికి ప్రయత్నిస్తారు. వీరభద్రుడిలో అవేవీ ఉండవు, వుంటే వుంటాయి. పాడుకుంటూ వెళ్ళే స్వప్నం, పరిమళ ప్రవాహం మనల్ని తాకి వెళుతుంది. అది మనల్ని వెలిగిస్తుంది. వీరభద్రుడిలో ఉన్నది విశ్వచైతన్యం. అతని కవిత్వం చదివితే మనలో వుత్సాహం వురకలేస్తుంది. జీవించడం పట్ల నమ్మకం, బతకడం లోని ఆనందం అనుభూతి చెందుతాం. మాటలకు అర్థాలు వెతికే వాడు మందమతి. పదలలో ప్రాపంచిక అర్థాలు లాగేవాడు బండగాడో,పండితుడో అవుతాడు.

ఈ భాష శూన్య ఉష

చెప్పాలనుకుంటే నిజంగా మొదటి ప్రతిబంధకం శబ్దం

అంటాడు వీరభద్రుడు. సంగీత తరంగాల్లో తరంగితమయిన తన్మయునికి మాత్రమే వీరభద్రుడి కవిత అర్థమవుతుంది. తన్మయానికి మాటలు రావు కదా!

రవీంద్రుడి గీతాంజలి, జయదేవుడి అష్టపదులు, నన్నయ ప్రసన్న కథాకలితార్థయుక్తి, వేదగానం, ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యపవనం, వీటి వర్షంలో మొలకెత్తిన చేమంతిపువ్వు చినవీరభద్రుడు. ఆ పువ్వు గాఢజీవనపరిమళంలో తాత్త్విక పరాగం కూడా కలిసి వుంది.

ఇంకా ఎన్ని పనులు చేయాలి

పెళ్ళాడి, పిల్లల్ని కని, చదివించి

వాళ్ళకి మొగుళ్ళనీ,ఆఫీసు కుర్చీల్నీ

డబ్బులు పోసి కొని తగిలించి

పర్వాలేదు

జీవితం ఇలానే ఇంకా బహుకాలం వేలాడుతుంది

పెద్దప్రమాదాలేం ఉండబోవు!

ఒక తాత్త్విక కెరటం మన చెంపని ఛెళ్ళుమనిపించిపోతుంది. వీరభద్రుడు తాత్త్విక కవి. అంటే ఏదో ఒక ఫిలాసఫీని సృష్టించి దానికి వ్యాఖ్యానాలిస్తూపోయే కవి అని కాదు. జీవితంలో ఒక అనుభవం వచ్చినపుడు, జీవితాన్ని క్షణకాలం దూరం నుంచీ, దగ్గరనుంచీ, ‘డిటాచ్డ్’ గా చూసినప్పుడు వీరభద్రుడిలో ఒక కెరటం లేచి మనపై వాలుతుంది. ఇంత మధురగీతాలు, ఆనందరాగాలాలపించే ఈ స్వాప్నికుడిలో ఎంత గాఢ, గంభీర చింతన వుంది అని మ్రాన్పడిపోతాం.

ఆ సంశయం మనల్ని సంభ్రమాశ్చర్యుల్ని చేస్తుంది.

భలే! ఎంతకాలమయినా ఇలా

కాని యీ ప్రవాహం తీరాన ఇలానే.

స్పష్టంగా తెలుస్తోంది,

అది అంచూ అవధీ లేని మహాప్రవాహమని.

ఒక షెల్లీ, ఒక కీట్స్, ఒక రింబో, ఒక లోర్కా, ఒక ఋగ్వేద ఋషి, ఒక సూఫీ కవి, ఒక జెన్, ఒక తావో, ఒక విరాగి, ఒక అనురాగి, ఒక చినవీరభద్రుడు.

 

Leave a Reply

%d