వాడ్రేవు చినవీరభద్రుడు ఇంతవరకు వెలువరించిన కవితాసంపుటాల్లో ఆరవది. 2014 నుంచి 2018 మధ్యకాలంలో రాసిన యాభై కవితల సంపుటి. ఈ పుస్తకం ఆత్మీయుడు రాళ్ళబండి కవితాప్రసాద్ స్మృతికి అంకితం.
పుస్తకం చదవాలనుకునేవారు ఈ లింక్ తెరవండి:
మహనీయ సాహిత్యవేత్త, రసజ్ఞులు శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి ఈ పుస్తకాన్ని తమ వాల్ మీద సమీక్షిస్తూ ఇలా రాసారు:
ముందు నా గొడవ.
నేనెప్పుడూ క్లాసుకు లేటే,కాలేజీలో చదువుకునే రోజుల్లో.ఎప్పుడూ క్లాసుకు వెళ్ళడమా ఎగ్గొట్టడమా అన్న సందిగ్ధత. వెళ్ళడానికే ఓటుపడి, వెళ్ళికూచున్న తరువాత, ఏ పాఠమో తెలిసేటప్పటికి గంట మోగేది. ఈ సందిగ్ధత నాతో ఉండిపోయింది. కొంతకాలం చదవడం ఒక వ్యసనం, ఏది దొరికితే అది, అడ్డదిడ్డంగా చదివేశాను.హఠాత్తుగా ఒక వైరాగ్యభ్రాంతి కలిగేది. కొన్ని సంవత్సరాలు పుస్తకం తాకేవాణ్ణి కాదు. ఉన్న పుస్తకాలు విసిరి వీథిలో వేసేవాణ్ణి. (ఈ పనిలో అప్పడప్పుడు దొంగలు కూడా సహకరించేవాళ్ళు.) కొంతకాలం కావ్యాలాపం వర్జించేవాణ్ణి. అప్పుడంతా వేదాంతమే. మళ్లీ ఎప్పుడో చేతిలోకి ఏ ఎలియటో, దోస్తోవ్ స్కీనో వచ్చి ఉండేవాడు.తెలుగుసాహిత్యంలో, రిప్ వాన్ వింకిల్ లాగా నిద్రలేచి, ‘ఆ, యిప్పుడు ఎక్కడున్నాం మనం? ఆంధ్రమహాభారతం?’ తెలుగు సాహిత్యంలోకి మేలుకున్న తరువాత ఈ కాలపు తెలుగుసాహిత్యం కొంత చదివి, యిక చదవకూడదని నిశ్చయించుకున్నాను. ఈసారి వైరాగ్యం కాదు. చదవలేక. కాని, నా పరిస్థితి, ‘మందు చాలాసార్లు మానేశాను’, అన్నట్టే ఉంది.
ఇప్పుడు మరొకసారి నిద్రలేచి వస్తున్నాను, వీరభద్రుడు ఎక్కించిన కొండ దిగి.
‘మంకెనల ఎదుట మూర్ఛ(న)లు’.
కావ్యం లోకాన్ని మరామత్తు చేయడానికి అన్నారు పూర్వాలంకారికులు. ఈ కాలం వాళ్ళు అనకుండానే ఆ పని చేయిస్తున్నారు వారి కావ్యకన్యకలచేత. వీరభద్రుడు తనను తాను ఎండగట్టుకోవడానికి రాస్తున్నానంటాడు. (నా లోని అధికార వాంఛను ఎండగట్టడంలోను నన్ను నేను నిరాయుధుణ్ణి చేసుకోవడంలోను…) ఆయన రాసిన “ప్రశ్నభూమి”లో వస్తువు యీ ఎండగట్టడమే. అందుకే ఆ నవలిక తెలుగుసాహిత్యంలో నిలిచిపోగలిగినది.
రచయిత తనను తాను ఎండగట్టుకోవడం ఎలియట్ చెప్పే ఆత్మాపాకరణం (extinction of personality)కాదు. ఎలియట్ చెప్పేది శిల్పవిషయం. వీరభద్రుడు చెప్పేది వస్తువిషయం. (కావ్యం వస్త్వాశ్రయమా ఆత్మాశ్రయమా అన్నది కూడా శిల్పవిషయమే.వస్తువు ఎప్పుడూ ఆత్మాశ్రయమే.)ఇటీవల కాలంలో తమను తాము ‘నిలదీసుకునే ‘ ప్రయత్నంలో కావ్యాన్ని సాధనంగా చేసుకున్న కవులున్నట్టు నాకు తెలియదు. (చెప్పానుకదా, నేను లేట్ కమర్ అని.)కాని ఆ ప్రయత్నం చేయగలగడం అరుదైన వ్యక్తిలక్షణం, దానికి సఫలకావ్యరూపం యివ్వగలగడం యింకా అరుదైన కవిప్రతిభ. భద్రుడు అరుదైన కవి.
ఆ ఎండగట్టడంలో a way of smashing the image that he was supposed to have .రేంబో , వెర్లేన్ లకు ‘smash’ చేసుకోవడం అలవాటే.)వీరభద్రుడు పద్ధతి వేరు,
‘హోటల్లో సర్వర్ ఎంగిలిబల్ల తుడిచినట్టు’
బలప్రయోగం ఉండదు.మురికి ఉండదు.ఈ కవిలో ప్రధానంగా కనిపించే ప్రయత్నం సమత్వసాధన. ‘సమత్వం యోగ ఉచ్యతే.’ (గీత) ఏమిటా యోగం?
‘మీరు కోరుకోవలసింది స్వర్గంకాదు
భూమి కాదు, ఆ రెంటినీ సమంగా నిభాయించడం.’స్వర్గనరకాలు మనిషి జీవితంలోని అన్ని అనుభవాలకు ఉపలక్షకాలు. ప్రేమ:
‘ఇద్దరు …నలుగురవుతారు,ఇద్దరు
ఈ లోకం మనుషులు,మరొక యిద్ద రు నెమలి
పింఛాలు ధరించి హంసరెక్కల్తో ఎగిరి వస్తారు….’
‘ప్రేమ పరిణామక్రమంలో పువ్వు పండతుంది
……
బంగారు వన్నె తిరిగిన ఫలంలో అప్పటికే ఒక క్రిమి.’జీవితంలో ఏ ఫలమూ సైతానునో తక్షకుడినో లోపలదాచుకోకుండా రాదు. ఈ రెంటినీ ‘సమంగా నిభాయించడం’ చెబుతున్నాడు కవి. ప్రతి విషయము జీవితంలో యీ ద్వంద్వరూపంలోనే దొరుకుతుంది.
పండు క్రిమి, పట్టు విడుపు, స్వర్గనరకాలు, మంటిని మింటిని వింటినారితో రెండు కొనలను సంధించడం చెబుతున్నాడు కవి. అయితే పిడుగుకూ పిండానికి ఒకే మంత్రం కాదు. ప్రతి సందర్భంలోను విల్లు సంధించలేవు. అతి సున్నితమైన సన్నివేశాలుంటాయి:
‘నువ్వు పట్టుకున్నప్పుడల్లా
ఒక సీతాకోకచిలుక నీవేళ్ళమధ్య
గిలగిల కొట్టుకొంటూనే ఉంది.
ఒక తూనీగ విలవిల్లాడుతూనే ఉంది’.పట్టుకుంటావా? వదిలేస్తావా? (ఈ యిమెజ్ నన్ను పట్టుకుని వదలడం లేదు. ‘నిభాయించడం’ తేలికేమీ కాదు.)
ఈ సంపుటిలో కుంచెకు అందని అనుభూతి చిత్రాలు అనేకం:
‘దిసమొల పిల్లవాడు వీటిలో
బూరావూదుకుంటున్నట్టు కోకిలపిలుపు.’‘ఆకాశాన్ని వడగట్టి చైత్రమాసపువాన
రాత్రంతా పిండిన పూల తావి.’‘ఎక్కడో ఒక పక్షి కిలకిలతో ఆకాశం తలుపు
తెలుస్తుంది.’‘ఆకుపచ్చ కుండ పోత’.
కవులు కొందరు ముందుకు చూస్తారు.కొందరు వెనక్కు . ఈ కవి చూపు ఎక్కువగా వెనక్కే.తెలియనిది చూడడం కంటే తెలిసినది చూడడం మెరుగు కదా!
‘ఎన్ని గ్రంథాలతో తుడి చెయ్యాలని చూసినా
ఎన్నటికీ చెరగని
నీ బాల్యపు మరక’.మరక మంచిదే అంటున్నాడు కవి. నిజానికి, యిది నోస్టాల్జియా కాదు. ‘ఎండగట్టడం’లో భాగమే.ఎండిపోయిన మనసును పచ్చని పసితనంతో నింపడం.
రాష్ట్రవిభజన చూడండి,యిలా పసిపిల్లాడయిపోయినవాడున్నాడా?
‘వస్తువులు భవనాలు కాగితాలు మనుషులు
ప్రతి ఒక్కటీ పంచేసుకుంటున్న తరుణం.
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పారేసిన
రంగుకాగితాలో రిబ్బన్లో ఏరుకునే పిల్లాడిలా’రాజకీయాలను కూడా, ప్రకృతినిలాగ, తనలో అనుభవించి కసిని మింగి పసితనం పలుకుతుంది యీ కవిలో.
ఈ కవి రెండు కొనలను సంధించాడనడానికి యీ వాక్యాలు చాలు:
‘అర్జంటుగా మొబైల్ లో ఆదేశాలు పంపేవాళ్ళూ’ పంపుతూనే ఉంటారు, వంటింటి నుండి మంత్రిగారింటినుండి. కాని యీయన ఏం చేస్తుంటాడు?
‘ఫాల్గుణ మాసపు వేపచెట్టు కింద నేను పరవశిస్తూ’!
కొన్ని కావ్యాలకు విశ్లేషణలు అవసరం లేదు.వీరభద్రుడి కవిత అటువంటిదే.పాఠకుడు యిదిగో యిలా ఆ ఆకాశాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాడు:
అనార్ద్రలోహశకలంలాంటి నన్ను
అయస్కాంత శిలలాగా అతడు తాకగానే
చేతుల్లాగా ప్రాణాలు చాపి
రాత్రంతా ఆకాశాన్ని పట్టుకు వేలాడుతుంటాను.ఈ కవిపై మార్క్స్ ముద్రో మరో అధికారముద్రో వేయక్కర లేదు, తన ముద్ర వేసేసుకున్నాడు తెలుగు సాహిత్యచరిత్ర పుటల్లో.
28-3-2018