కళాత్మక సత్యం

Reading Time: 5 minutes

s1

ఒక జాతి తన స్వాతంత్యం కోసం చేసే పోరాటాలు అన్నీ ఒక్కలానే ఉండనవసరం లేదు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో భారతదేశం ఒక జాతిగా రూపొందుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు గాంధీ రాట్నం వడికాడు, భగత్ సింగ్ బాంబు విసిరాడు, టాగోర్ పాటలు పాడాడు. కాని, రాధాకృష్ణన్ చేసిన పోరాటం వీటన్నిటికన్నా భిన్నమైంది, మరింత సూక్ష్మమైంది. ఆయన సత్యాగ్రహం చెయ్యలేదు, జైలుకు వెళ్ళలేదు, పైగా ఆ కాలమంతా పుస్తకాలు చదువుకుంటున్నాడు, పాఠాలు చెప్పుకుంటున్నాడు. కాని తక్కినవారు భారతదేశాన్ని రాజకీయంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన ఒక దార్శనిక భారతదేశాన్ని ప్రపంచపటం మీద ఆవిష్కరిస్తో ఉన్నాడు.

భారతదేశ విశ్వవిద్యాలయాల్లో భారతీయ దర్శనాలు పాఠ్యగ్రంథాలుగా లేని రోజుల్లో భారతీయ తత్త్వశాస్త్రమనే ఒక సరికొత్త శాఖను ఆయన ప్రపంచానికి పరిచయం చేసాడు. వివిధ తత్త్వశాస్త్రాలతో భారతీయ దర్శనాల్ని పోలుస్తూ ఆయన ప్రసంగం వెనక ప్రసంగం చేస్తూంటే, ప్రపంచం సవినయంగా సాష్టాంగపడింది.

ఆచార్య రఘురామరాజు తరచూ చెప్పే ఒక సంఘటనని ఇక్కడ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. 1909 లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి లో అసిస్టెంటు ప్రొఫెసరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి రాధాకృష్ణన్ వయస్సు ఇరవైమూడేళ్ళు. అప్పటికి భారతదేశంలో భారతీయులు ఐ.సి.ఎస్ కి ఎంపిక అయినవాళ్ళున్నారుగాని, ఫిలాసఫీ బోధించడానికి ఎంపిక అయినవాళ్ళు లేరు. ఆయనే మొదటి అభ్యర్థి. ఆ ఇంటర్వ్యూ బోర్డు ఆయన్నొక కొంటె ప్రశ్న అడిగారు. ‘నీ ఇష్టం, నీకు నచ్చిన ఏ భారతీయ తత్త్వవేత్తనయినా తీసుకుని, ఒక యూరోపియన్ తత్త్వవేత్తతో పోల్చి రెండు నిముషాలు మాకు వివరించు’ అని. యూరపియన్ తాత్త్వికులతో పోల్చదగ్గ భారతీయ తత్త్వవేత్త ఎక్కడుంటారనే హేళన లేకపోలేదందులో. రాధాకృష్ణన్ ఆ ప్రశ్నకు సులువుగా జవాబు చెప్పగలడు. కాంట్ నీ, శంకరాచార్యుణ్ణీ లేదా సోక్రటీస్ నీ, బుద్ధుణ్ణీ పోల్చి సమాధానం చెప్పగలడు. కాని, వివేకానందుడి స్ఫూర్తితో నిలువెల్లా రగిలిపోతున్న ఆ యువకుడు తన ముందు కూర్చున్న పండితుల్ని నిరుత్తరుల్ని చేయాలనుకున్నాడు. ‘ఇప్పుడు నేను పదార్థతత్త్వం మీద యాజ్ఞవల్క్యుణ్ణీ, స్పినోజానీ పోల్చి వివరిస్తాను’ అని అనర్గళంగా, అక్కడికక్కడే వివరించడం మొదలుపెట్టేడు. ఆ బోర్డులో ఉన్న పండితులకి స్పినోజానీ, బుద్ధుణ్ణీ పోల్చినా ఏ కొంతో అర్థమై ఉండేది, కాని ఈ యాజ్ఞవల్క్యుడెవరు? అసలు, స్పినోజా అనే పేరు వినగానే యాజ్ఞవల్క్యుడనే చింతనాశీలి స్ఫురించడమే ఒక మహాశ్చర్యం. అంతే, ఆ ఒక్క ప్రశ్నతోటే, ఇంటర్వ్యూ పూర్తయిపోయింది. తక్కిందంతా చరిత్ర.

రాధాకృష్ణన్ ని చదువుతుంటే, సాహిత్యం చదువుతున్నట్టు ఉంటుందని కృష్ణమూర్తి అన్నారని ఎక్కడో చదివాను.ఆ మాట ఎంత నిజమో మరోసారి తలుచుకుంటూ, An Idealist View of Life (1932) నుంచి కొన్ని పేరాలు మీతో పంచుకుంటున్నాను:

కళాత్మక సత్యం అంటే ఏమిటి?

వస్తుగతప్రపంచంలోని లోతైన సత్యాన్ని ఒక జ్ఞానంలాగా మనముందు విప్పి పరచడమే కళ. అరిస్టాటిల్ చెప్పినట్టు అది అనుకరణే, కాని అది అనుకరించేది బాహ్యప్రకృతిని కాదు, ఆంతరంగిక వాస్తవాన్ని. కవిత్వం చూపించే వస్తుగత సత్యం ఫొటోగ్రాఫుల్లో కనబడే వస్తుగతసత్యం లాంటిది కాదు. మనం వట్టి అనుకరణగా భావించే కళకూడా నిజానికి అనుకరణ కాదు. ఆ కృతివెనక కళాకారుడి మనస్సు ఉంది, ఏదో ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది. కంటికి కనిపిస్తున్న ప్రపంచంలో బయటికి కనిపిస్తున్న దాన్ని మించినదాన్ని మరేదో, ఒక సత్యాన్నో, ఒక మంచితనాన్నో, ఒక సౌందర్యాన్నో అతడు చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. అలా చూస్తున్నది బయటి ప్రపంచంకన్నా అతడి ఆంతరంగిక ప్రపంచానికి మరింత సన్నీహితమైంది. అలాగని, ఈ భావం అతడు చూస్తున్నదానికొక అదనపు అలంకారం కాదు. అతడు చూస్తున్న వస్తువులోనే అది ఇమిడిఉంది, దాన్ని మనం ఆ వస్తుగతసత్యం నుంచి లాగెయ్యలేం. కవిత్వం ద్వారా కవి ఆవిష్కరించే సత్యం అక్కడున్నదే, కవి దాన్ని ఆవిష్కరిస్తున్నాడే తప్ప, కొత్తగా సృష్టించడం లేదు.

కవిత్వం వాస్తవసత్యాని వెల్లడించగలదనే భావాన్ని క్రోసే ఒప్పుకోడు. కవి తన ధ్యానస్థితిలో సత్యాన్ని దర్శించాననీ, తన సృజనస్థితిలో దాన్ని ప్రకటిస్తునాననీ అనుకుంటే తనని తాను మోసగించుకున్నట్టేననీ, కవిత్వం ప్రధానంగా ఆత్మవ్యక్తీకరణ మటుకేననీ అంటాడతడు. కాని, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తీకరణని తక్కిన ప్రపంచం ఎందుకు పట్టించుకోవాలనే ప్రశ్నకి అతడి దగ్గర సమాధానం లేదు. మళ్ళా క్రోసేనే కళ అంటే అంతఃస్ఫురణ అనీ, అంతఃస్ఫురణ ఎల్లప్పుడూ వాస్తవాన్నిగాని, వ్యక్తిని గాని ప్రతిబింబించేదిగా ఉంటుందంటాడు. దానర్థం కవితాత్మక అంతఃస్ఫురణ కూడా మనకేదో ఒక జ్ఞానాన్ని అందిస్తున్నట్టే కదా. కళ మనకి వ్యక్తిగత సంవేదనలని అందిస్తుంది. అంటే వస్తుగతసత్యం గురించి మనకి అంతదాకా తెలిసినదానికన్నా భిన్నామైనదాన్ని దేన్నో మనకు తెలియచెప్తుంది. అలా చూసినట్టయితే, కళ ద్వారా మనకి లభించే జ్ఞానం సైన్సూ, కామన్ సెన్సూ కూడా ఇవ్వలేనిదే. ఇంద్రియజ్ఞానాన్నే మనం పూర్తివాస్తవంగా భావించలేం. కళ్ళు లేనివాడికన్నా కళ్ళున్నవాడు బయటి ప్రపంచాన్ని ఎక్కువ చూడగలుగుతాడు. వోల్టేర్ ఊహించినట్టుగా మనకి వెయ్యి ఇంద్రియాలు సమకూరినా కూడా మనం ఆ ఇంద్రియాలద్వారా గ్రహించగలిగే వాస్తవమే పూర్ణజ్ఞానమని నమ్మలేం. ఇంద్రియాలద్వారా సమకూరే జ్ఞానం ఆ ఇంద్రియశరీరంకన్నా భిన్నం కాదు.

ఒక గులాబి రంగు మానవనేత్రాలకు మాత్రమే దృగ్గోచర సత్యం. అలాగే ఈ విశ్వం గురించి సైన్సు నిర్మించే చిత్రం కూడా మన వైజ్ఞానిక ఉపకరణాలని బట్టే ఆధారపడుతుంది. రంగులు చూసేవాడికి మటుకే రంగులకు సంబంధించిన సంవేదనలు కలుగుతాయి. ఇంద్రియాల ద్వారా గ్రహించేదీ, తార్కికంగా నిర్మించుకునేదీ, మొత్తం జ్ఞానం అంతా కూడా చూసేవాడూ, చూడబడేదాని కలయికలోంచే ప్రభవిస్తుంది. కాని కళ ద్వారా మనకు లభించే జ్ఞానం ఇటువంటిది కాదు. అక్కడ వస్తుగత సత్యం పట్ల సుకుమారమైన సంవేదనల ప్రతిఫలనం ఉంటుంది. ఈ అర్థంలో వైజ్ఞానిక సత్యం కన్నా కవితాత్మక సత్యం వేరే. ఎందుకంటే, అది సార్వత్రికంగా మనం తెలుసుకోగల రాశిగత సత్యంకన్నా భిన్నంగా, వైయక్తికంగా మటుకే తెలుసుకోగల, వాసిగత సత్యాన్ని అనుభవంలోకి తెస్తుంది. మనం కొలిచి పరీక్షించగల వస్తుగత లక్షణాల గురించి కాక, మనం ఆంతరంగికంగా అనుభూతి చెందగల అనుగ్రహం గురించి మాత్రమే కళ మాట్లాడుతుంది. కవిత్వం చెప్పే సత్యాలు విస్తారంగా వాదోపవాదాలతో నిరూపించగలిగేవి కావు, అవి అత్యంత సూక్ష్మంగా అనుభూతి చెందగలిగేవి మాత్రమే. ఆ దర్శనం మనం చూడగలగడం దానికదే ఒక నిరూపణ.

ఒకవేళ కవిత్వం ఆత్మవ్యక్తీకరణ నే అనుకున్నా కూడా ఆ కవిత్వంలో ప్రకటితమయ్యే ఆత్మ ఏదో ఒక వ్యక్తితాలూకు సంకుచితాత్మ కాదు. సౌందర్యం ఎదట మనం పొందే సంతోషం ఒక వ్యక్తిగా మాత్రమే పొందుతామనీ, అందుకని అది వైయక్తికమనీ తన ‘క్రిటిక్ ఆఫ్ జడ్జ్ మెంట్’ లో కాంట్ వాదిస్తాడు. అయితే ఆ సంతోషానికి ప్రత్యేకప్రయోజనమేమీ ఉండదని కూడా మనం గ్రహించాలి. ఆ సౌందర్యం గురించిన మన నిర్ణయం అందరికీ వర్తిస్తుంది కూడా. అందుకనే కవిత్వం ఎంత లోతుగా ఉంటే అంత విశ్వవ్యాప్తంగా అలరిస్తుంది.

విశ్వాన్ని నడిపే ఒక సూత్రాన్ని కనుగొన్నప్పుడు శాస్త్రవేత్త తాను గమనించిన యథార్థాలను ఒక పద్ధతిలో అమర్చి మనముందు ప్రతిపాదిస్తాడు. కళాకారుడు చేసేది కూడా అటువంటిదే. అతడు వస్తుగత ప్రపంచానికి చెందిన సూక్ష్మవిషయాల్ని తన అనుభవంద్వారా మనకన్నా ప్రత్యేకంగా గమనించి, వాటిని తనకై తాను తిరిగి అమర్చుకుని మనముందుంచుతాడు. తద్వారా జీవితం గురించిన మన అవగాహనని మరింత పెంపొందించి, వాస్తవాన్ని మరింత సుస్పష్టంగా మనకు ఎరుకపరుస్తాడు. వివిధ వస్తుగతవాస్తవాల్ని మరింత లోతుగా అనుసంధానించడం ద్వారా అతడు వాటిని మనం మరింత బాగా అవగాహన చేసుకునేట్టుగా చేస్తాడు. ‘అన్నిట్లోకీ అత్యంత పవిత్రమయిందేది?’ అని ప్రశ్నించి గొథే, ఇట్లా జవాబిచ్చాడు: ‘ఇప్పుడు గాని, మరెప్పుడన్నా గాని, మనం గాఢంగా, దేన్ని లోతుగా అనుభూతి చెందుతామో, తద్వారా దేనిలో లోతుగా కుదురుకుంటామో అదే’ అని.

కళాసృష్టి మానవజాతికి ఇవ్వగల అత్యంత విలువైన బహుమానాలు శాంతి, సమాధానమూను. ఒక సుందరగీతం విన్నప్పుడో, లేదా గొప్ప కళాకృతిని చూసినప్పుడో, ఆ అరుదైన క్షణాల్లో మనం దాని ప్రభావానికి లోనవడమే కాక, ఆ క్షణాల్లో మన మనస్సు సాధారణ ఇంద్రియజ్ఞానాన్నీ, తర్కాన్నీ దాటి ఒకింత ఎత్తుకి చేరుకుంటుంది. ప్రతి సుందరశిల్పంలోనూ ఒకింత విశ్రాంతి, ప్రతి సుందరపద్యంలోనూ ఒకింత శాంతి ద్యోతకమవుతూ ఉంటాయి. మన తెలివితేటల్ని బట్టి ఒక కళాకృతిని నిగ్గుతేల్చడానికి ప్రయత్నించి ఉపయోగం లేదు. ఆ పాత్రల్నీ, ఆ సంఘటనల్నీ కేవలం ఊహాగానమని కొట్టి పారెయ్యడానికి లేదు. ఒక నాటకంలోని పాత్రలూ, సంఘటనలూ వాస్తవాలు కాకపోవచ్చు కాని వాస్తవంగా ఉనికిలో ఉన్న విషయాలకన్నా మరింత ఉన్నతతరమైన అస్తిత్వం, సత్యం ఆ పాత్రలు సముపార్జించుకుంటాయి, తద్వారా మరింత అర్థవంతంగా మారతాయి. ఆ పాత్రలూ, ఆ సంఘటనలూ కలల్లాగే కల్పనలే కావచ్చు, కాని, వాస్తవాన్ని అర్థం చేసుకోడానికి అవి మనకి మరింత ఉపకరిస్తాయి. ఆ అభూతకల్పనల్లోంచే సత్యం సాక్షాత్కరిస్తుంది. నిజానికి అక్కడ ఆ నాటకమే ‘వస్తువు’, తక్కినవన్నీ నీడలు మటుకే. జీవితప్రాముఖ్యం పట్ల మనకొక జాగృతి కలిగించడమే కళాకారుడి ముఖ్యధర్మం. కాంట్ చెప్పినట్టుగా, ‘ఏ ఒక్క ప్రత్యేక ప్రయోజనానికీ పెద్దపీట వెయ్యకుండానే’ కళ ప్రయోజనవంతమైన జీవితం పట్ల మనకొక మెలకువ కలిగిస్తుంది. విడివిడి సంఘటనలు ఎందుకు జరిగాయో, ఎలా జరిగాయో వివరించడం కళాధర్మం కాదు. జీవితం ఎంత అర్థవంతమో తెలియపరచడం, ఈ విశ్వం తాలూకు మరింత సౌందర్యం, మరింత న్యాయం, మరింత ఔదార్యం గురించి మనలో ఆలోచనలు రేకెత్తించడమే దాని లక్ష్యం.

ప్రపంచంలోని నిష్ఠురవాస్తవాలకు కళాకారుడు ముఖం చాటెయ్యడు. అతడికి ప్రపంచం తాలూకు దుఃఖాలు, వేదనలతో పాటు, దాని విజయాలూ, సద్గుణాలూ కూడా తెలుసు. నిజమే, ప్రపంచంలో దుర్మార్గాలూ, క్రూరత్వాలూ ఉన్నాయి, కాని అంతమాత్రాన మనం భీతిల్లవలసిన పనిలేదు. ఈ విశ్వం లోపలి గుజ్జు ఆస్వాదయోగ్యమైందే. ఈ ప్రపంచంలోని చీకటి పార్శ్వాన్ని కళాకారుడు చిత్రిస్తాడు కాని, ఆ దృశ్యం మనల్ని కుంగదీయదు. హామ్లెట్, కింగ్ లియర్ లాంటి మహానాటకాలు చదువుతున్నప్పుడు మనకీ ప్రపంచరహస్యమేదో కొంత చేజిక్కినట్టే అనిపిస్తుంది. జీవితపు పునాదుల గురించి తాను గ్రహించిన జ్ఞానాన్ని కవి మనతో పంచుకుంటాడు. బయటి సంఘటనలు ఉత్పాతకారకాలుగా కనిపించవచ్చుగాని లోపల అంతరంగం ప్రశాంతంగానే ఉంటుంది. జూలియట్ మరణిస్తుంది, నిజమే, కాని ప్రేమప్రతిష్ఠను నిలబెట్టాకనే మరణిస్తుంది. తనను తాను పొడుచుకున్న తక్షణమే ఒథెలో మరణించి ఉండవచ్చుగాని, అప్పుడతడింకా ఈ ప్రపంచం పట్ల ఒక ఫిర్యాదు తీరకుండానే మరణించినట్టవుతుంది. కాని, అతడు డెస్డెమోనా నిష్కల్మషత్వాన్ని గుర్తుపట్టినతరువాతనే మరణిస్తాడు, ఇంక అప్పుడు మృత్యువేమంత పెద్దవిషయంకాకుండా పోతుంది.

బయటి వైఫల్యాలు, పరాజయాలు జీవితం తాలూకు అంతరార్థాన్ని మసకబరచలేవు. వస్తువుల్లో, సంగతుల్లో ఉండే పారమార్థిక మర్యాద ఆ క్షణాల్లో తళుక్కుమంటుంది. పాతనిబంధనలో, సృష్టికాండం లోని దేవుడిలాగా, మనం కూడా మన సృష్టినొకసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు, అది మొత్తం మీద బాగానే అనిపిస్తుంది. అప్పుడు మనమీ ప్రపంచాన్ని అంగీకరించగలగడమే కాకుండా, దీన్ని మన సొంత ఇంటిగా కూడా భావించగలుగుతాం. అలాగని అదప్పుడు చెక్కుచెదరని పరిపూర్ణతకు చిహ్నంగా కనిపించదు. అందుకు బదులు, అందులో మనం పెరుగుదల, కొనసాగింపు, ఓపికపట్టడాలతో పాటు మరింత వేదన, మరింత విషాదాన్ని చూస్తుంటాం. అయినప్పటికీ, ఈ ప్రపంచగమనంలో మనవంతు పాత్ర మనం నిర్వహించి దాన్ని ఎంతొకోంత ముందుకు నెట్టడమే మన ధర్మం. ఒంటరివాడై పోయిన మనిషికి ప్రపంచాన్ని తిరిగి బహూకరిస్తుంది కళ.

అదొక కెథార్సిస్, ఒక భావావేశ ప్రక్షాళన, ఒక సాఫల్యానుభూతి. కళ మనలో ప్రేరేపించే ప్రాణశక్తులే లేకపోతే జీవితం వట్టి జమాకర్చుల లెక్కగానే మిగిలిపోతుంది. ఈ ప్రపంచంలోని సుఖదుఃఖాలను అనుభవిస్తూనే అవి తనను అంటకుండా జీవించగలినవాడే మహాత్ముడని భగవద్గీతాకర్త అంటున్నాడు. అటువంటి మహితాత్ములు మాత్రమే జీవితాన్ని నిగ్గుతేల్చడమే కాకుండా, తమని కూడా జీవితం నిగ్గు తేల్చేటట్టు చూసుకుంటారు. అటువంటి వారి సన్నిధిలో మనం కూడా జీవితాన్ని కనీసం కొన్ని క్షణాలేనా ఆ విధంగా పరికించగలుగుతాం. మన అత్యంత విషాదభరితక్షణాలే మన మహామధురమయ గీతాలు కూడా. మనం వేదనద్వారా ఏది తెలుసుకుంటామో దాన్నే తిరిగి పాటకట్టి ప్రపంచానికి కానుక చేస్తాం.

ఒక కళాకృతిలోని సౌందర్యాన్ని ప్రశంసించడమంటే మొత్తం మనసుతో చేపట్టవలసిన పని. కేవలం తార్కిక వివేచన సరిపోదుదానికి. కవిత్వాన్ని ఆనందించాలంటే సహృదయుడు, సమానధర్ముడు కావాలి. కళాకారులు మనకి వాళ్ళ నేత్రాలిస్తారనీ, అప్పుడు మనం ఆ కళ్ళతో వాళ్ళని చూస్తామనీ షోపెన్ హోవర్ అన్నాడు. కళని ఆనందించడానికి కావలసింది నమ్మకమూ, ఒప్పందమూ కాదు, సానుభూతీ, సహానుభూతీను. కనీసం ఆ క్షణానికేనా మనం తక్కిన ఆలోచనలన్నీ వదిలిపెట్టి ధ్యానమగ్నులం కావాలి. ష్లీగెల్ ఒకవేళ యురిపిడిస్ ని విమర్శించవలసివస్తే, విమర్శించవచ్చుగానీ, మోకాళ్ళ మీద వాలి మటుకే విమర్శకు పూనుకోవాలని గొథే హితవు చెప్పాడు. అంటే ముందు అతడు తనని తాను పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కళాకృతిని అర్థం చేసుకోవాలంటే అదొకటే మార్గం. సౌందర్యసృష్టీ, సౌందర్య దృష్టీ రెండూ కూడా బుద్ధికి అందే విషయాలు కానేకావు.

( యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, పే.152-55)

5-9-2018

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

 

Leave a Reply

%d bloggers like this: