ఒక మనిషిని కలుసుకున్న వేళ

Reading Time: 3 minutes

kv

కాశీభట్ల వేణుగోపాల్ పేరు విన్నాను. కాని ఇన్నేళ్ళుగా చదవలేదు, చూడలేదు. చూడకపోవడం సరే, చదవకపోవడం క్షమించదగ్గ విషయం కాదు.

(కాని, చాలా వాటికి క్షమించాలి చెలాన్ని!)

మా హీరాలాల్ మాష్టారి స్మృత్యంజలి సభ పూర్తయ్యాక తీసుకువెళ్ళింది మా అక్క నన్ను వేణుగోపాల్ దగ్గరికి. ఆమెకి అతడు చాలా కాలంగా తమ్ముడు. ‘వాణ్ణి నా దగ్గరకు తీసుకు రామ్మా’ అన్నాడట ఒకసారి. ఆ రోజుమాత్రం పొద్దుణ్ణించీ రెండుమూడుసార్లేనా ఫోన్ చేసి ఉంటాడు, ఎప్పుడొస్తున్నారని.

రాత్రికి మళ్ళా నా బాల్యమిత్రుడు రాజేంద్రప్రసాద్ చిన్నకూతురి పెళ్ళికి వెళ్ళి తీరాలి. ఎలా చూసినా వేణుగోపాల్ ని చూడటం నాకు కుదిరే పనికాదని చెప్పాను.

‘అలా చూసి ఇలా వచ్చేద్దాం’ అంది అక్క. మనుషుల్నీ, రచయితల్నీ కలవాలనీ, చూడాలనీ, వాళ్ళతో మాట్లాడాలనీ అనుకుంటుంది అక్క. ఆమె జీవితోత్సాహం అట్లాంటిది. నాకెవర్నీ కలవాలని ఉండదు, మరీ ముఖ్యంగా, రచయితల్ని.

ఆయన ఎవరో, ఏమి రాసాడో, ఆయన చిత్త ప్రవృత్తి ఏమిటో తెలియకుండా పోయి ఎట్లా కలిసేది? కలిసినా ఏం మాట్లాడగలను? నేను మీ రచనలేమీ చదవలేదని ఆయనతో చెప్పేసాక, ఇంక సంభాషణ ఎట్లా ముందుకు నడుస్తుంది?

ఏమైతేనేం వెళ్ళాం. పదిహేను నిముషాలు. అంతకన్నా ఎక్కువ సమయం లేదు మనకి అన్నాను, ఆ ఇంటిగుమ్మం దగ్గర కారు దిగుతూ.

కర్నూల్లో మరొక కవిమిత్రుడు, వేణుగోపాల్ ఆప్తుడు వెంకటేష్ మాకు దారి చూపిస్తూ ఉన్నాడు.

మేం లోపల అడుగుపెడుతూనే వేణుగోపాల్ బయటకి వచ్చాడు రెండు చేతులూ సాదరంగా చాపుతూ. మొదటిసారి చూడటం ఆయన్ని, ఎక్కడో ఏదో ఫొటోలో చూసానుగాని, ఆ ఫొటో ఆయనది కాదేమో అనిపించింది, ఇప్పుడు మొదటిసారి, ఆ నిండైన మనిషిని నా ముందు చూస్తుంటే.

‘లోపల కూచుందాం నా గదిలో’ అన్నాడాయన.

చిన్నప్పణ్ణుంచీ ఎప్పటికప్పుడు కొత్తస్థలాల్లో జీవించవలసి వచ్చినందున, నాకు తెలీకుండానే, నా ఇన్ స్టింక్స్ ఎక్కువ బలంగా పనిచేస్తూ ఉంటాయి. కొత్త చోట అడుగుపెట్టగానే, నాకేదో స్ఫురిస్తూ ఉంటుంది. నేనొక నిర్మలమైన స్థలంలో అడుగుపెట్టానని నాలోపలనుంచి నాకు సంకేతాలు అందడం మొదలయ్యింది.

కూచున్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. ఆయన గదిని కలయచూసాను. పక్కన చిన్న స్టూలు మీద కొన్ని పుస్తకాలు, ఒక మాగ్నిఫైయింగ్ గ్లాస్. ఆ పుస్తకాలు చూసాను- ‘తాళ్ళపాకవారి పలుకుబళ్ళు ‘, సామ్యూల్ బెకెట్, జ్యా పాల్ సార్త్ర్.

కొద్దిగా అర్థమవుతోంది. ఒకప్పుడు, చాలా ఏళ్ళ కిందట, మొదటిసారి మోహనప్రసాద్ నో, అజంతానో, త్రిపురనో చూసిన, కలుసుకున్న క్షణాలు గుర్తొస్తున్నాయి.

మొదటి మాటలు, పొడిపొడిగా. ఆ అనార్ద్రత నాది. ఆయనది కాదు.

‘నువ్వు అడుగుపెట్టినప్పటినుంచీ ఆయన నిలువెల్లా ప్రేమార్ద్రుడైపోయి ఉన్నాడు’ అంది అక్క, ఆ తర్వాత.

‘మీరు ఏమి చదువుకున్నారు?’ అడిగాను, అంటే, విద్యార్హతలేమిటని.

రచయితల్ని అడగకూడని ప్రశ్న. కానీ, ఏమి చెయ్యను? నా కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాంటివి!

‘తన డిగ్రీ సర్టిఫికేటు తగలబెట్టేసాడు’ అంటో లోపల అడుగుపెట్టారు ఆయన అక్కయ్య. ఉలిక్కిపడ్డాను. సర్టిఫికెట్లు తగలబెట్టేసుకునేవాళ్ళూ, రాసిన రచనలు చింపేసేవాళ్ళూ, 1980 ముందు తారసపడ వలసిన వ్యక్తులు కదా, ఈ దేశంలో!

అవును, నేను వేణుగోపాల్ ని 1980 కి ముందు కలిసి ఉండవలసింది. ఇంకా చెప్పాలంటే, 1960 కి ముందు. ఒకసారి ఫణికుమార్ అన్నారు నాతో ’60ల్తో భారతదేశంలో innocence అదృశ్యమైపోయింది’ అని.

ఆ, ఇప్పటికి, నాకు సరైన tag దొరికింది, వేణుగోపాల్ మూర్తీభవించిన innocence.

అజ్ఞానం వల్ల మనుషుల్లో కనిపించే అమాయికత్వం కాదు, లోకాన్ని దాని నిష్టుర పార్శ్వాలన్నింటిలోనూ చూసి, తలపడి, మానసికంగా ఓడించి, క్షమించిన తరువాత, ఆ విజేత కళ్ళల్లో కనిపించే ఇన్నొసెన్స్.

‘ఏం చెయ్యమంటారు చెప్పండి? ఆ డిగ్రీ నాకు దేనికి పనికొస్తుంది? ఏ ఉద్యోగం దొరుకుతుంది? ఏం చేసి నన్ను నేను పోషించుకోగలను?’

‘అలాగని ఆయన చెయ్యని ఉద్యోగం లేదు సార్. మొత్తం దేశమంతా మూడుసార్లు తిరిగొచ్చారు. ఎన్ని రకాల పనులు చెయ్యొచ్చో అన్ని రకాల పనులూ చేసారు. నాకు తెలిసే ఆయన ఫొటోగ్రాఫులు లామినేషన్ చేస్తుండే పనిలో ఉండగా చూసాను.చిన్న షెడ్డులో. ఊరికి దూరంగా. లామినేషన్ చేస్తుంటే ఆ కెమికల్స్ భరించలేనంత వాసన కొట్టేవి..’

అన్నాడు వెంకట కృష్ణ, మరొక 24 కారెట్ల కర్నూలు గోల్డ్, అప్పుడే ఆ గోష్ఠిలో చేరుతూ.

ఇటువంటి జీవితాల గురించి గోర్కీ, రావూరి భరద్వాజల తర్వాత మళ్ళా ఇదే వినడం.

‘నేను కర్నూల్లో ఉన్నప్పుడు మనమెందుకు కలుసుకోలేదు?’ అనడిగాను. పాతికేళ్ళ కిందటి జీవితాన్ని గుర్తుతెచ్చుకుంటూ.

‘అదే నాకూ అర్థంకావడం లేదు’ అన్నాడాయన.

‘లేదు సార్, ఆయన బయటికి వస్తే కదా, ఎవరితోనైనా కలిస్తే కదా. అసలు ఆయన రచనలు చేస్తాడనే మాకు చాలాకాలం దాకా తెలీదు’ అన్నాడు వెంకట కృష్ణ.

‘ఎవర్నీ కలవకు బాబూ, ఎవరితోటీ మాటాడకు, రచయిత అన్నవాణ్ణి అసలు కలవద్దు’ అన్నాడు అజంతా, నేనాయన్ను చూడటానికి వెళ్ళిన మొదటిసారే.

కానీ, ఎవరితోటీ ప్రేమలో పడకూడదనీ, ఏ రచయితనీ కలవకూడదనీ ఎన్ని సార్లు చెప్పుకున్నా ఈ మనసు వినదే అని అనుకున్నాను, మరోసారి.

మరికొంత సేపు నడిచింది సంభాషణ. అందులో సాహిత్యం గురించి ఏమీ లేదు. కానీ ఒకమాటన్నాను, ‘చండీదాస్ తర్వాత తెలుగు సాహిత్యంలో ఒక cult figure గా మారిన రచయిత మీరే.’

‘మీరు నన్ను పొగుడుతున్నారో, విమర్శిస్తున్నారో తెలియడం లేదు’ అన్నాడు కళ్ళతోనే నవ్వుతూ.

ఆ కళ్ళకేసి చూసాను.

‘అతడి కళ్ళు సెయింట్ వి..’

త్రిపురగారి కథలో వాక్యం. త్రిపురగారిలాగా వేణుగోపాల్ లో కూడా రచయితని మించిందేదో ఉంది.

‘మీరు కవిత్వం కూడా రాసారా?’

వెంకట కృష్ణ వివరాలు చెప్తున్నాడు. కాని వేణుగోపాల్ దృష్టి అక్కడ లేదు.

‘నాకు దేవుడూ, పూజలూ అవేవీ తెలీదు. ఇదిగో మా అక్క సాయంకాలం పూజచేసుకుని హారతి పట్టుకొస్తుంది. కళ్ళకి అద్దుకుంటాను. అదే నా పూజ. కాని మా పెద్దక్క ఒకసారి అడిగింది. నేను కొలిచే చిన్నికృష్ణుడిమీద ఏవైనా పాటలు రాయొచ్చుకదా అని. చాలా పాటలు రాసాను. కాని చింపేసాను’

‘ఏదన్నా ఒక్క పాట గుర్తుందా?’ అడిగాను, కానీ, అప్పటికే ఆ కళ్ళల్లో ఏదో చరణం కదలాడుతోంది.

‘ఒకటి గుర్తొస్తోంది ‘

ఒక పదం వినిపించాడు. దాని అర్థం ఇలా ఉంది:

చిన్ని కృష్ణుడొకరోజు యశోదమ్మని అడిగాడు, అమ్మా, నేను ఊళ్ళో ఏ స్నేహితుణ్ణి కలిసినా ప్రతి ఒక్కడూ ఏదో ఒక చేపలకూర తిన్నామనే చెప్తున్నారు. మరి నువ్వెందుకు వండలేదు నా కోసం ఇప్పటిదాకా?

గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. అవును, చిన్నికృష్ణుడు చేపలకూరమీద మనసు పడ్డాడని ఏ కృష్ణభక్తి కవికీ ఎందుకు తట్టలేదబ్బా అనుకున్నాను. తక్కినవాళ్ళు మరీ భాగవతోత్తములనుకో, కనీసం ‘సూర్ సాగర్’ లో నైనా చేపలు కనిపించి ఉండవచ్చుకదా!’

‘మరి యశోద ఏమి చేసింది?’

‘ఆమె అంది కదా, నాన్నా, నీకోసం చేపలు వండుదామనే అనుకున్నానురా. కాని ఎప్పుడు తీసుకొచ్చి కొయ్యబోయినా, ప్రతి మీనులోనూ నీ కళ్ళే కనిపిస్తున్నాయిరా, ఎట్లా వండేదీ అంది.’

హటాత్తుగా ఎదురయ్యింది ఆ క్షణం.

కథల్లోనో, కవితల్లోనో మనం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తామే, ఒక epiphanous moment కోసం. ఆ రసోద్భవ క్షణం.

వేణుగోపాలుడు యశోదగా మారిపోయాడు.

ఆయన కళ్ళల్లో సన్నని నీటిపొర. ఒకప్పుడు మా మాష్టారు రాముడి అగ్నిప్రవేశం గురించి చెప్తున్నప్పుడు చూసాను, అటువంటి సాశ్రు నయనాల్ని, గద్గదస్వరాన్ని.

నేను కరిగిపోయాను, నిలువెల్లా. నా ముందు కూచున్నతడు మామూలు తెలుగు రచయిత కాడు.

ఆయన ఏమి రాసాడో, ఆ రచనల్లో ఏమి చెప్పదలుచుకున్నాడో నాకు అక్కర్లేదనిపించింది. చాలా ఏళ్ళ తరువాత, ఒక నిజమైన మానవుడి ముందు నిలబడ్డాననిపించింది.

ఇంకా చెప్పాలంటే, ఒక ఋషి ముందు.

ఇంకా మరికొన్ని మాటలు నడిచాయి, కాని, ఇక్కడితో ఆగుతాను.

సమయం ఎంత గడిచిపోయిందో ధ్యాసలేదు. వెళ్ళొస్తామని లేచాం. కాని, ఆయనింకా తన భావనామయ ప్రపంచంలోనే ఉన్నాడు. చిన్నపిల్లల్ని ఊరికే నాల్గు నిముషాలు ఎత్తుకుని వదిలేసినట్టు, అట్లాంటి రచయితల్ని, గంటో అరగంటో మాట్లాడి వదిలిపెట్టేసి రావడం అపరాధం.

తన ఇటీవలి పుస్తకం ‘చీకటీగలు’ తీసి దానిమీద రాసాడు; ‘నా ఇంటికొచ్చిన అక్షరం’ అని .

‘ఈ పుస్తకం చదివితే నేనేమిటో తెలుస్తుంది’ అన్నాడు.

ఇంటికొచ్చాక చదివాను. 150 పేజీల పుస్తకం. రెండువారాలు పట్టింది. ఆ పుస్తకం గురించి మరోసారి ఎప్పుడేనా.

*

(వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారో అనుకున్న మరొక సోదరి శ్రుతకీర్తికి కానుకగా)

7-9-2018

Leave a Reply

%d bloggers like this: