ఒంటరి చేలమధ్య ఒక్కత్తే మన అమ్మ

Reading Time: < 1 minute

s5

చాలాకాలంగా మిత్రుడు వాసు నా రెండవ కవితా సంపుటి ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ (1995) మళ్ళీ ప్రచురించమని అడుగుతూ ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడూ ఆ పుస్తకం గురించి రాస్తూ వచ్చిన ప్రస్తావనలు చదివి మరికొంత మంది మిత్రులు కూడా ఆ పుస్తకం కోసం అడుగుతూ ఉన్నారు.

అందుకని వారందరికీ కానుకగా, ఇదిగో, ఇప్పుడు ఇ-బుక్ రూపంలో ఇక్కడ అందిస్తున్నాను.

1987 లో నాకు గ్రూప్-1 కింద జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగం వచ్చింది. అప్పటిదాకా రాజమండ్రిలో టెలిపోన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసులో అకౌంటెంటుగా పనిచేసేవాణ్ణి. దాదాపు అయిదేళ్ళు రాజమండ్రిలో ఉన్నాను. కొత్త ఉద్యోగంకోసం విజయనగరం జిల్లా వెళ్ళవలసి వచ్చింది. అక్కడే 1990 దాకా పార్వతీపురం ఐ.టి.డి.ఏ లో పనిచేసాను. ఆ తర్వాత రెండేళ్ళ పాటు కర్నూల్లో, ఆ తర్వాత ఉట్నూరులోనూ, పాడేరులోనూ పనిచేసాను. 1995 లో రాష్ట్ర ప్రధానకార్యాలయంలో పనిచేయడానికి హైదరాబాదులో అడుగుపెట్టాను. ఇందులో ఉన్న ముప్పై కవితలూ 1987-92 మధ్యకాలంలో రాసినవి. పుస్తకం 95 లో ప్రచురించానుగాని, 1993 నుంచి 2003 దాకా మధ్యలొ పదేళ్ళ పాటు కవిత్వం రాయలేకపోయాను.

ఈ కవితాసంపుటి గురించి ఎక్కడా ఏ సమీక్షలూ రాలేదు. పూజ్యులు శ్రీ వడలిమందేశ్వరరావుగారు తప్ప ఏ విమర్శకుడూ ఈ కవితల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రేవతీదేవి తన ‘శిలాలోలిత’ సంపుటి వెలువరిస్తూ డేవిడ్ హ్యూమ్ కూడా ఒకప్పుడు అతని పుస్తకాన్ని still-born from press అని అనుకున్నాడని రాసుకున్నది. బహుశా నేను కూడా ఈ పుస్తకం గురించి ఆ మాటనే అనవలసి ఉంది, కాని వాసు నాకు అడ్డుపడుతున్నాడు.

కాని ఒకందుకు ఈ పుస్తకం నాకు చాలా విలువైనది. దీన్ని నేను నా మిత్రుడు కవులూరి గోపీచంద్ కి కానుక చేసాను. చేసినట్టు ఆయనకి తెలీదు, ఎందుకంటే, ఆయన అప్పటికే తన కుటుంబాన్నీ, మమ్మల్నీ వదిలిపెట్టి సన్యసించి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏ హిమాలయాలకు వెళ్ళిపోయాడో తెలియదు. బహుశా తెలుగు సాహిత్యంలో కొడవటిగంటి వెంకటసుబ్బయ్య తర్వాత అలా అదృశ్యమైపోయిన సాహిత్యవేత్త గోపీచంద్ అనే అనుకుంటాను. అతడి గురించి మరోసారి వివరంగా రాస్తాను. ఈ పుస్తకాన్ని ఇట్లా ఆన్ లైన్లో పెడుతుంటే అతడు నా తలపులు ముందుకు సాగనివ్వడం లేదు.

ontarichelamadhya okkatte mana amma

Leave a Reply

%d bloggers like this: