ఆఫ్రికా కవిత

Reading Time: 8 minutes

m1

1963 మే 25 వ తేదీన ఆర్గనైజేషన్ ఫర్ ఆఫ్రికన్ యూనిటీ ఏర్పడిన సందర్భం పురస్కరించుకుని ప్రతి ఏటా మే 25 వ తేదీ ఆఫ్రికా దినోత్సవంగా జరుపుతూ వస్తున్నారు. 2002 లో ఆఫ్రిక యూనియన్ ఏర్పడిన తర్వాత కూడా ఆఫ్రికన్ దినోత్సవంలో మార్పు లేదు. ఈ సందర్భం పురస్కరించుకుని ఆఫ్రికన్ కవిత్వాన్ని స్థూలంగా పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆఫ్రికన్ కవిత్వం ఆఫ్రికన్ మానవుడి భయలనూ, బాధలనూ, వేదననీ, విషాదాన్నీ ఏదో ఒక మేరకు తక్కిన ప్రపంచానికి తెలియచేసే ఒక మాధ్యమం. దాని ఆసరగా ఈ ప్రపంచంలోని రెండవ పెద్ద భూఖండమైన ఆఫ్రికా గురించీ, దాని చరిత్ర గురించీ, దాని భవిష్యత్ గురించీ ఏదో ఒక మేరకు తెలుసుకోగలుగుతాం.

ఆఫ్రికా గురించి తెలుసుకోవడమంటే ఆదిమానవుడి గురించి, ఆదిమమానవుడి గురించి తెలుసుకోవడం. ఆఫ్రికా గురించి తెలుసుకోవడమంటే అత్యాధునిక ఆలోచనాధోరణుల గురించి తెలుసుకోవడం. ఆఫ్రికా గురించి తెలుసుకోవడంటే సతతహరితారణ్యాలగురించీ, మండుటెండల గురించీ తెలుసుకోవడం. ఆఫ్రికా గురించి తెలుసుకోవడమంటే ఆకలి గురించీ, అంతర్యుద్ధం గురించీ తెలుసుకోవడం. రోగం గురించి, క్షామం గురించి తెలుసుకోవడం, జీవితం గురించి, మృత్యువు గురించి తెలుసుకోవడం.

2

మూడుకోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఆఫ్రికాలో మొత్తం అమెరికా సంయుక్తరాష్ట్రాల్ని మూడుసార్లు పరిచినా కూడా ఇంకా చోటు మిగిలే ఉంటుంది. మొత్తం ప్రపంచ భూభాగంలో ఆరవవంతు ఆఫ్రికాదే. మొత్తం ప్రపంచ జనాభాలో 14 శాతం మంది, అంటే, ప్రతి ఏడుగురిలోనూ ఒకరు ఆఫ్రికావాసుడే. సుమారు వెయ్యి తెగలకు చెందిన 61 భౌగోళిక విభాగాలకు చెందిన ప్రహలతో ఆఫ్రికా మానవజాతుల ఒక ప్రదర్శనశాల. సృష్టిలో ఈనాడు మనం మానవులుగా పిలుస్తున్న హోమో సెపియన్స్ జాతికి చెందిన మొదటి ప్రాణి తూర్పు ఆఫ్రికాలోనే ప్రభవించాడంటున్నారు. అలా చూసినప్పుడు మానవజాతి పొత్తిళ్ళు ఆఫ్రికాలో ఉన్నాయనవచ్చు. ఆఫ్రికాలోని 90 కోట్ల జనాభా ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అంచనా వెయ్యలేకపోయారు. ఒక లెక్క ప్రకారం రెండువేలభాషలదాకా మాట్లాడుతున్నారని. అయితే వీటిలో హౌసా, సోమాలీ, స్వాహిలి, యొరుబా, మారియా, గికుయు, జూలూ వంటి కొన్ని భాషలు తప్ప తక్కినవేవీ లిఖిత సాహిత్యాలుగా వృద్ధి చెందలేదు. కానీ మౌఖిక సాహిత్యాలుగా కొనసాగుతున్న ఆ వందలాదిభాషల్లోనే నిజమైన ఆఫ్రికా దాగిఉంది.

3

ఆఫ్రికా భౌగోళిక రూపమే విచిత్రమైన నిర్మాణం. భూమధ్యరేఖ ఆఫ్రికా మధ్యగుండా పోతూంది. ఆ రేఖకు కింద ఉన్న ఆఫ్రికా పైనున్న ఆఫ్రికాకు అచ్చం ప్రతిబింబంలాగా ఉంటుంది.  భూమధ్యరేఖకు అటూ, ఇటూ సతతహరితారణ్యాలు విస్తరించి ఉంటాయి. కాంగోనదీ పరీవాహకప్రాంతంలోని సతతహరిరాణ్యాలు సూర్యరశ్మిని నేలకు సోకనివ్వందున అక్కడంతా అసంఖ్యాకమైన పశుపక్షి జలచర, వనచర క్రిమికీటకాదులతో నిండి ఉంటుంది. ఆ సతత హరితారణ్యాలకు అటూ, ఇటూ సవానా గడ్డిభూములు విస్తరించి ఉంటాయి. ఆ గడ్డిభూములకు అటూ ఇటూ ఉత్తరాన సహారా ఎడారి, దక్షిణాన కలహారి ఎడారి ఉన్నాయి. వేలకు వేల చదరపు మైళ్ళ భూభాగం విస్తరించి ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. సహారా అనే పదం ప్రాచీన ఆరబిక్ భాషలో దప్పిగొన్న మనిషి నిట్టూరుపును సూచిస్తుంది. ఆ ఎడారులకు ఆవల, అంటే, ఉత్తరపు కొసన, దక్షిణపు కొసన మధ్యధరా ప్రాంతపు వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంత వైవిధ్యమంతమయిన భూభాగం మీద అక్కడక్కడా చీమలపుట్టల్లాగా మానవసముదాయాలు పుట్టిపెరుగుతుంటాయి.

4

భౌగోళికంగా నెలకొన్న ఈ విపరీతవ్యత్యాసాల వల్ల ,అపరిమితమైన విస్తీర్ణం వల్ల ఆఫ్రికా తక్కిన ప్రపంచానికి చాలాకాలంపాటు అపరిచితంగా ఉండిపోయింది. అలాగని మొత్తం ఖండమంతా అజ్ఞాతంగా ఉండిపోలేదు. ఉత్తరభూభాగానికి చెందిన ఈజిప్టులో నైలు నది ఒడ్డున ఇప్పటికి అయిదువేల ఏళ్ళ కిందటనే శక్తివంతమైన ఒక నదీనాగరికత వర్థిల్లింది. ప్రాచీన గ్రీసులో తత్త్వశాస్త్రం వికసించడానికి ఎన్నో శతాబ్దాల పూర్వమే ఈజిప్టులో జీవితం గురించి, మృత్యువు గురించి, మరణానంతర జీవితం గురించి వివేచన జరిగింది. ప్రాచీన రోములో పాలనావ్యవస్థకు పునాదులు పడటానికి వెయ్యేళ్ళ ముందే ఈజిప్టులో ఫారోలు సువ్యవస్థిత పరిపాలన ఏర్పరచుకున్నారు. ఈజిప్టును ఆనుకుని ఉన్న ఇథియోపియా అబిసీనియాగా తక్కిన ప్రపంచానికి ఎప్పణ్ణుంచో తెలుసు. ఆఫ్రికా ఉత్తరతీరాన ఉన్న అలెగ్జాండ్రియా రేవుపట్టణం ఒకప్పుడు ప్రపంచపు తాత్త్విక రాజధాని. ఆఫ్రికా దక్షిణభూభాగం ఇప్పటికి అయిదు శతాబ్దాలకు ముందునుంచే నావిక సమూహాలకు సుపరిచతమయ్యింది. కానీ, విస్తృత భూభాగం, లోతట్టు ఆఫ్రికా మాత్రం గత రెండు శతాబ్దాలుగా మాత్రమే ప్రపంచానికి తెలుస్తూ వచ్చింది.

5

భావతీవ్రతలోనూ, నాగరికతలోనూ, భాషానిర్మాణంలోనూ ఎంతో అభివృద్ధి చెందిన ఈజిప్షియన్ సాహిత్యాన్ని పక్కన పెడితే ప్రాచీన,మధ్యయుగాల ఆఫ్రికన్ సాహిత్యం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఇప్పటికి కూడా వలసవాదుల పాలనకు లోబడి వారి భాషలు నేర్చుకుని ఆ భాషలలోనే సాహిత్యం సృష్టిస్తూన్న రచయితల్ని పక్కన పెడితే, పూర్తి దేశిభాషల్లో మౌఖికంగా ప్రభవిస్తున్న కథలు, కవిత్వం ప్రపంచానికింకా చెప్పుకోదగ్గట్టుగా పరిచయం కావలసి ఉంది. జానపద కథలు మినహాయించి, ఆఫ్రికన్ మౌఖిక సాహిత్యానికి వారి ఆరాధనాసంస్కృతికన్నా ప్రత్యేకమైన అస్తిత్వం లేదు.అది ఏ తెగకు ఆ తెగ జరుపుకునే కర్మకాండలో, క్రతువుల్లో, పండగల్లో భాగంగా వికసించే సామూహిక గీతాలాపన. ఒక ప్రార్థన. ఒక సామాజిక సంతోషానికి అభివ్యక్తి. అదొక సామూహిక నినాదం, కేక. దాన్లో వ్యక్తి విడిగా ఉండడు. వ్యక్తి, సమూహం ఒకటైపోయిన సృజన అది. తక్కిన ప్రపంచంలో వ్యక్తి సమాజం నుంచి ఎంతో కాలం కిందటే వేరుపడ్డాడు, కాని ఆఫ్రికాలో ఇంకా ఆ పేగుబంధం పచ్చిగానే ఉంది.

6

ఆఫ్రికా అనేమాట వినగానే మనకు సాధారంగా దుర్భరమైన దారిద్ర్యం, ఆకలి, శిశుమరణాలు, అంతర్యుద్ధాలు కళ్ళముందు కదుల్తాయి. రవీంద్రుడు కూడా ఆఫ్రికాని ఉద్దేశిస్తూ ఒక కవిత రాసినప్పుడు ఈ మాటలే రాసాడు:

సంక్షుభితమైన ఆ మహాయుగంలో

సృష్టికర్త తాను చేస్తున్న సృష్టిపట్ల తనకే తృప్తి లేక

తన సృజనను తానే పదేపదే ధ్వంసమొనర్చుకుంటున్నప్పుడు

కోపోద్రిక్త సాగరమొకటి

ఓ ఆఫ్రికా

నిన్ను పురాతన పృథ్వి వక్షస్థలంనుండి విడదీసింది

అప్పుడు నిన్ను సృష్టికర్త

వెలుతురు సోకని దట్టమైన అడవుల్లో

దాచిపెట్టేసాడు.

అక్కడ నీ అగాంధ ఆంతర్యంలో

అర్థంకాని ఏ మహారహస్యాల్నో నువ్వు పోగుపరుచుకున్నావు,

భూమి,ఆకాశం,అపార జలరాశుల చిక్కుముడి విప్పుకున్నావు,

మానవనేత్రానికి అందని ప్రకృతి ఇంద్రజాలమేదో

నీ చైతన్యపు లోతుల్లోపల

తన సందేశం శ్రుతి చేసుకుంటున్నది.

ఆఫ్రికా ఒక అర్థంకాని రహస్యంగా, ఒక చీకటి భూఖండంగా, ఒక బాధామయ ప్రపంచంగా స్ఫురించడం ఆధునిక యుగం ప్రపంచానికిచ్చిన ఒక కల్పన. ఒక మిత్. పైపైన కాకుండా లోపలకీ పోయి ఆఫ్రికాని అధ్యయనం చేసేకొద్దీ అది ఒక పరాజితగా కాక, విజేతగా మనకు కనిపించడం మొదలవుతుంది.

7

ఈ ప్రపంచంలో అయిదువేల ఏళ్ళ కిందట విలసిల్లిన సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్ నాగరికలు ఆ రూపంలో నేడు మిగిలి లేవు. పాశ్చాత్యమానవుడు అడుగుపెట్టిన ఎన్నో భూఖండాలూ, ద్వీపకల్పాలూ, దీవులూ అయిదారువందల ఏళ్ళకు ముందున్నట్టుగా ఇప్పుడు లేవు. అమెరికాలో, ఆస్ట్రేలియాలొ వేల ఏళ్ళ పాటు జీవించిన ఎన్నో ఆదిమతెగలకు నేడు చివరిమనుషులు కూడా మిగల్లేదు. ఈ రోజు ఆమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెక్సికో వంటి దేశాలు పాశ్చాత్యసంతతితో  నిండి పూర్తిస్థాయి పాశ్చాత్యదేశాలుగా కొనసాగుతున్నాయి. కాని, ఒక్క ఆఫ్రికా మాత్రమే అత్యంత కిరాతమైన వలసపాలనను ఏళ్ళ తరబడి సహించి కూడా తన సంస్కృతినీ, తన సంప్రదాయాన్నీ, తన మతాచారాల్నీ, తన కర్మకాండల్నీ పోగొట్టుకోలేదు. నిన్నమొన్న దక్షిణాఫ్రికా విముక్తి చెందటంతో  ఈ నాడు ఆఫ్రికా మొత్తం ఆఫ్రికా దేశీయుల పాలనలో, ఆఫ్రికన్ తెగల సంస్కృతిగానే కొనసాగుతూ ఉంది. అందుకనే ఆఫ్రికన్ చరిత్రకారుడు రోలాండ్ ఒలీవర్ అన్నట్టుగా ఆఫ్రికా గురించి మనకు తెలిసింది ఇప్పటికీ చాలా తక్కువ, తెలుసుకోవలసిందే ఎక్కువ.

8

వలసపాలనకు పూర్వం కూడా ఆఫ్రికా అనేక ఉపద్రవాలకు లోనవుతూనే ఉంది. ముఖ్యంగా మూడు కీటకాలు, అనాఫిలిస్ దోమ,సెట్సే ఈగ, మిడత ఆఫ్రికా సస్యాలమీదా, పశుసంపదమీదా దాడులు చేస్తూనే ఉన్నాయి. తమ ప్రాకృతిక శత్రువులతో సహజీవనానికి కూడా ఆఫ్రికా వాసి అలవాటుపడగలిగాడుగాని, 15 వశతాబ్దం నుంచి తన భూభాగంలోకి చొచ్చుకు రావడం మొదలుపెట్టిన అన్యమానవుల తో సమాధానపడలేకపోయాడు. వజ్రాలకోసం, బంగారం కోసం ఆఫ్రికాలోకి ప్రవేశించిన వలసవాదులు కొంతకాలానికే అత్యంత హీనమైన బానిసవ్యాపారం మొదలుపెట్టారు. 1800 నాటికే కనీసం కోటిమంది ఆఫ్రికన్లు బానిసలుగా అమ్ముడుపోయారు. బ్రిటన్ నుంచి బ్రెజిల్ దాకా, ముఖ్యంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సాధ్యపడ్డ అభివృద్ధి అభాగ్యులైన ఆఫ్రికన్ బానిసల రక్తస్వేదాలమీంచి పోగుపడిందే. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం,ఇటలీ, పోర్చుగల్,స్పెయిన్ దేశాల వ్యాపారులు, మతప్రచారకులు, సైకాధికారులు ఆఫ్రికాను కిరాతకంగా కొల్లగొట్టారు,చెరిచారు. టాగోర్ అన్నట్టుగా, ఆ దోపిడీదారులు ముళ్ళబూట్లు ఆఫ్రికచరిత్రమీద చెరగని నెత్తుటిమరకలు విడిచిపెట్టాయి.

9

తన తోటిమానవుడు తుపాకుల్తో, ఫిరంగుల్తో, మందుల్తో, మతప్రచారంతో తమ జీవితాన్నెందుకు అల్లకల్లోలం చేస్తున్నాడో తెలుసుకోడానికీ, అర్థం చేసుకోడానికే ఆఫ్రికాకు ఎంతో కాలం పట్టింది. తన శరీరం, తన వంటి రంగు, పెదాలు, వెంట్రుకలు, తన నిర్దోషనగ్నత్వం ప్రతి ఒక్కటీ అవమానానికీ, అపహాస్యానికీ గురవుతూ ఉంటే దాన్నెట్లా ప్రతిఘటించాలో ఆఫ్రికా మానవుడు తెలుసుకోలేకపోయాడు. రెండు ప్రాంపంచిక దృక్పథాల మధ్య జరిగిన ఈ సంఘర్షణలో ఒక ప్రపంచం తుపాకుల్తో మరొకప్రపంచాన్ని నిర్లజ్జగా లొంగదీసుకున్న వైనం అది. దాన్ని సెనగల్ దేశపు కవి డేవిడ్ డియోప్ రక్తాక్షరాలతో ఇలా లిఖించాడు:

ఆ తెల్లవాడు మా నాన్నని చంపేసాడు

మా నాన్న స్వాభిమానం కల పెద్దమనిషి.

ఆ తెల్లవాడు మా అమ్మని చెరిచాడు

మా అమ్మ ఎంతో అందంగా ఉండేది.

ఆ తెల్లవాడు మధ్యాహ్నపు మండుటెండలో

మా అన్నను సజీవంగా తగలబెట్టేసాడు

మా అన్న చాలా బలమైన మనిషి.

నల్లని రక్తంతో ఎరుపెక్కిన చేతుల్తో

లొంగదీసుకున్నవాడి మదోద్రేకంతో

ఆ తెల్లవాడు నా వైపు తిరిగి

‘అబ్బాయీ, ఆ కుర్చీ వెయ్యి, చేతి గుడ్డ పట్టుకురా,

మద్యం సిద్ధం చెయ్యి’ అన్నాడు

.

10

మనిషి మనిషిని వేటాడిన జ్ఞాపకాలకన్నా ముందు ప్రాచీన ఆఫ్రికాలో ప్రకృతి ఒడిలో ఆదిమతెగల సంతోషాలూ, కేరింతలూ, బృందగానాలూ, పొడుపుకథలూ మాత్రమే ఉండేవి. ప్రేమలుండేవి, పరాచికాలుండేవి, ఛలోక్తులుండేవి, సామెతలుండేవి. ప్రాచీన ఆఫ్రికా ప్రాపంచిక దృక్పథంలో భవిష్యత్తుకి ఏమంత ప్రాముఖ్యత లేదు. ఆ క్రతుకాండలో పరలోకం ప్రస్తావనే లేదు. ఉన్నదల్లా గతం మాత్రమే. దాన్ని జమానీ అనేవారు. అలాగని జమానీ కేవలం గడిచిపోయిన కాలం కాదు. కొనసాగుతున్న గతం కూడా. అందులో మొత్తం చరిత్ర, తాతలు, తండ్రులు వారందరి ఆశీస్సులూ కూడా సజీవంగా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి మానవుడు తన వర్తమాన క్షణాల్ని జమానీగా మార్చుకునే ప్రక్రియలో నిమగ్నుడై ఉంటాడు. కొన్నాళ్ళకు తాను కూడా తన పితృదేవతల పంక్తిన చేరడానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఇప్పుడు జీవించే క్షణాన్ని సాసా అంటారు. ఈ క్షణం గడవగానే, సాసా జమానీగా మారిపోతుంది. ప్రతి మానవుడికీ తను జీవించవలసిన జీవితం ఎప్పటికప్పుడు వర్తమానక్షణాలుగా అనుభవానికి వచ్చి తర్వాత అనంతమైన భూతకాలంగా మారిపోతుంది. తరతరాల పితృదేవతల అనుభవాల్తో నిండిపోయిన ఆ భూతకాలంలోనే తన భద్రత కూడా ఉంది. తన తాతలు ఇక్కడే జీవించారు. తన తండ్రులు జీవించారు. తాను కూడా జీవించగలడు. ఇదే సాధారణ ఆఫ్రికన్ వాసి నమ్మే మతం, తత్త్వశాస్త్రం.

11

ఆఫ్రికా మౌఖిక వాజ్ఞ్మయంలో తక్కిన మౌఖిక వాజ్ఞ్మయాల్లోలానే ప్రేమ,ఎడబాటు, స్నేహం,వైరం, దైవం,భయం వంటి ఇతివృత్తాలే ఉన్నాయి. కాని వాటిలో చాలావరకు సంగీతం, సామూహిక శబ్దాలు నిండి ఉంటాయి. మన ప్రాకృత సాహిత్యంలానే ఆఫ్రికా ప్రాకృత సాహిత్యం కూడా సరళం, సులభం, ప్రేమాస్పదం. ఉదాహరణకి, సోమాలీ భాషకి చెందిన ఒక పాట, ఒంటెలకు నీళ్ళు తాగించే వేళల పాట చూద్దాం:

ఒంటెలన్నీ ఉన్నాయిక్కడే

సిద్ధంగా, స్థిరంగా

బంగారంలాంటి ఒంటెలు

బలంగా, భద్రంగా!

బావి దగ్గర నిలబడ్డాను

వాటికి నీళ్ళు తోడతాను

అలిసిపోయిన ఒంటెలకి

చల్లటి నీడ, చల్లార్చే తేమ.

భగవంతుణ్ణి స్తుతిస్తూ నోరానించండి

అశుభానికి చోటులేదిక్కడ

అలిసిపోయిన మీ ఎముకలకి

సాంత్వన, సజల పోషణ.

ఎక్కడున్నా వాటి సొంతదారులు

ఇక్కడున్నట్టే వచ్చి చేరండి,

అవి కడుపారా నీళ్ళుతాగేదాకా

క్షణమేనా పక్కకు జరక్కండి.

12

ఇప్పుడు మనం ఆఫ్రికా సాహిత్యంగా పేర్కొంటున్నది చాలావరకు ఆఫ్రికాకి పాశ్చాత్యప్రపంచంతో ఏర్పడ్డ సంపర్కం లోంచి, సంఘర్షణలోంచి వికసించిందే. ఆఫ్రికా యువతీయువకులు తమమీద విధించబడ్డ వలసపాలనను ధిక్కరిస్తూ చేసిన రచనలన్నింటినీ కలిపి ఆఫ్రికా సాహిత్యంగా చదువుకుంటున్నాం. ఈ రచనల్లో అధికభాగం ఆయా వలసప్రాంతాల్లోని వలసపాలకుల భాషల్లో వచ్చినవే. ఇంగ్లీషు, ఫ్రెంచి, స్పానిష్, పోర్చుగీస్ లాంటి భాషల్లో వచ్చిన సాహిత్యం. వీటన్నిటితోపాటు ఆఫ్రికాదేశీయ పదజాలాన్ని విదేశీ పదజాలాన్నీ కలుపుకుంటూ వికసించిన ఆఫ్రికాన్స్ అనే భాషలో కూడా విస్తారమైన సాహిత్యం వచ్చింది. ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యం ప్రధానంగా సామాజిక-రాజకీయ అసమ్మతి సాహిత్యం, నిరసన సాహిత్యం, కోపోద్రిక్త సాహిత్యం. తన పురాతన ఆఫ్రికన్ గతానికీ, దారుణమైన వర్తమానానికీ మధ్య ఆధునికమానవుడు పడిన సంక్షోభానికి, సంఘర్షణకి వ్యక్తీకరణ ఇది. తనెవరో, తన అస్తిత్వం ఏమిటో వెతుక్కుంటూ, గుర్తుపట్టుకుంటూ చేసిన ప్రయాణం అది.

13

ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య వికాసం అన్ని చోట్ల ఒకే తీరులో ఒకే క్రమంలో జరగలేదు. భాషాపరంగా ఆఫ్రికాను నాలుగు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఉత్తరాఫ్రికా ప్రాంతంలో తెగలు మాట్లాడే సుమారు 240 భాషలు ఆఫ్రో-ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినవి. సుమారు 30 కోట్లమంది ఈ భాషలు మాట్లాడుతున్నారు. వీటికి దిగువగా, దాదాపు 3 కోట్ల మంది నైలో-సహార్ అనే భాషా కుటుంబానికి చెందిన వందభాషల దాకా మాట్లాడుతున్నారు. మధ్య ఆఫ్రికా అంతా నైజర్-కాంగో భాషా కుటుంబానికి చెందిన భాషలున్నాయి. దక్షిణభాగంలో కొయిసాన్ కుటుంబానికి చెందిన యాభై భాషలదాకా ఉన్నాయి. ఇన్ని భాషలున్నప్పటికీ, ఆఫ్రికా సాహిత్యం పేరిట మనకి లభ్యమవుతున్నది ఏ కొద్దిపాటి జీవితచిత్రణ మాత్రమే. కాని, ఆ కొద్దిపాటి సాహిత్యం కూడా మాటలకందని మౌన వేదనను, మానవాక్రందనను మనకేదో మేరకు తెలియపరుస్తూనే ఉంది. అంతేకాక, తక్కిన ఆఫ్రికాభాషలకు కూడా దారిచూపిస్తూ ఉంది.

14

పాశ్చ్యాత్య ప్రపంచంతో సంపర్కం వల్ల తమ అనుభవాన్ని అర్థం చేసుకుని దానికొక అభివ్యక్తినివ్వడంలో అందరికన్నా ముందు పశ్చిమాఫ్రికాకు చెందిన సెనగల్, మారుటేనియా, ఫ్రెంచి గినియా, గాంబియా వంటి దేశాల కవులు ముందున్నారు. వారిలో సెనగల్ దేశానికి చెందిన లీయోపాల్డ్ సెంఘార్, మార్టినిక్ కు చెందిన ఐమే సెషైర్ తో కలిసి నెగ్రిట్యూడ్ భావజాలాన్ని ప్రతిపాదించాడు. నెగ్రిట్యూడ్ నల్లవాడిగా ఉండటానికి సంబంధించిన ఒక విలక్షణ అనుభవం. ప్రపంచంలో మరే మానవుడికీ అర్థం కాని అనుభవం. తమ మీద అంతదాకా జరుగుతూ వచ్చిన పీడననీ, హింసనీ ధిక్కరించే క్రమంలో నల్లజాతిమనిషి ఒక కొత్త విషయం తెలుసుకున్నాడు. అఏమంటే, తాను నల్లగా ఉండటమే కాదు, తెల్లగా లేడని కూడా. అంతదాకా నల్లగా ఉండవలసి వచ్చినందుకు తమ వంటి నలుపును ఏ విధంగా స్వీకరించాలో, అంగీకరించాలో తెలియని నల్లజాతిమానవుడు ఒక్కసారిగా ఆ ఆందోళననుంచి బయటపడి తన నలుపునొక గుణంగా భావించడం, తెల్లజాతిసంస్కృతితో మేళవింపుని నిరాకరించడం నెగ్రిట్యూడ్ దృక్పథం. తాము తెల్లగా ఉండకపోవడం లోపం కాదు సరికదా, ఆ అవసరం కూడా లేదని వాళ్ళు గ్రహించారు. ఐమె సెషైర్ మాటల్లో ‘Blackness is not absence, but refusal’. ఈ నిరాకరణ కొన్నాళ్ళకు celebration of blackness గా కూడా మారిపోయింది.

15

పశ్చిమాఫ్రికా కవుల్లో అగ్రగణ్యుడని చెప్పదగ్గ సెంఘార్ సెనగల్ దేశాధ్యక్షుడిగా కూడా పనిచేసాడు. ఫ్రెంచి భాషలో కవిత్వం చెప్పాడు. అతడి పైన ఫ్రెంచి సింబలిస్టుల ప్రభావం పడింది. ఆఫ్రికన్ సంగీతానికి అనుగుణంగా స్వాతంత్రోద్యమ గీతాలు పాడిన సెంఘార్ కవిత్వంలో ఆధునిక ఆఫ్రికన్ మానవుడి ఒంటరితనం, గతం పట్ల బెంగ ప్రధాన ఇతివృత్తాలు. ఈ కవిత చూడండి.

నిర్ఘాంతపడకు ప్రియతమా

నిర్ఘాంతపడకు ప్రియతమా

అప్పుడప్పుడు నా పాట మరింత చిక్కబడుతుంటే,

లలితస్వరాలూదే పిల్లంగోవి బదులు

తుత్తార ఊదితే, తుడుం మోగిస్తే

సస్యకేదారాల సుమసుగంధాల బదులు

యుద్ధభేరీనినాదాలు దౌడు తీయిస్తే.

ఇప్పుడు నేను మనపూర్వదేవతల హెచ్చరికలు వింటున్నాను

భగవంతుడి ఆగ్రహోపేత శరసంధానం చవిచూస్తున్నాను.

ఏమో, బహుశా, రేపు నీ ప్రియకవీంద్రుడి

ఊదారంగు గీతాలు శాశ్వతంగా మూగబోవచ్చు.

అందుకనే నా లయ మరింత త్వరపడుతోంది

ప్రాచీనతంత్రులమీద అంగుళులు రక్తమోడుతున్నాయి.

రగులుతున్న మందుగుండు బాజాభజంత్రీలమధ్య

నీ దృక్కులకోసం పరితపిస్తూ, ఈ అశాంతధరణిమీద

ప్రియా, బహుశా, రేపు నేను కూలిపోవచ్చు.

నీ కాటుకరంగుసౌందర్యాన్ని పాటలు కట్టిన

మహోజ్జ్వలకంఠాన్ని తలుచుకుంటూ

ఆ సంధ్యవేళ ఎంతకీ నీ శోకం తీరకపోవచ్చు.

16

పశ్చిమాఫ్రికా కవుల్లో సెంఘార్ తరువాత చెప్పుకోదగ్గ కవి డేవిడ్ డియోప్, ఆఫ్రికా మీద అతడి సుప్రసిద్ధ కవి.

ఆఫ్రికా

ఆఫ్రికా, నా ఆఫ్రికా!

ప్రాచీన సవానా భూముల్లో

తిరుగాడిన మేటియోధుల ఆఫ్రికా!

దూరనదీతీరగ్రామంలో

నా నాయనమ్మ పాటలు పాడిన ఆఫ్రికా!

నేనెప్పుడూ నిన్నెరగలేదు,

కానీ, నీ రక్తం నా సిరల్లో ప్రవహిస్తోంది,

ఈ భూముల్ని పండించే అందమైన నీ నల్లని రక్తం

నీ స్వేదం నుంచి పుట్టిన రక్తం

నీ కష్టం నుంచి స్రవించిన స్వేదం

నీ దాస్యం నుంచి పుట్టిన కష్టం

తరతరాల నీ సంతతి దాస్యం.

ఆఫ్రికా, చెప్పు ఆఫ్రికా

వంగిపోయిన ఈ నడుం ఇది నీదేనా?

పీడనాభారం కింద నలిగిచిట్లిపోయిన నడుం

మధ్యాహ్నమార్తాండుడికింద కొరడాదెబ్బలకు తలొగ్గిన నీ వీపు

నెత్తుటిచారికల్లో మగ్గిపోతున్న వీపు.

కాని ఒక వేగాకుల స్వరం నాకు జవాబిస్తోంది

పచ్చగా పాలుపోసుకుంటున్న వృక్షంలాంటి ఒక బిడ్డడు

ఉద్వేగచిత్తుడు

పాలిపోయిన పేల పూలమధ్య

అద్భుతమైన ఏకాంతం లో అక్కడ నిలబడ్డ వృక్షం

అదీ ఆఫ్రికా! నీ ఆఫ్రికా!

పెరుగుతున్నది మళ్ళా మొండిగా, ఓపిగ్గా

నెమ్మదిగా దాని ఫలాల్లో వచ్చి చేరుతుంది

స్వాతంత్ర్యభావనల తిక్తమాధుర్యం.

17

పశ్చిమాఫ్రికా కవుల నెగ్రిట్యూడ్ ని దాటి మరింత బలంగా ఆఫ్రికా హృదయాన్ని వ్యక్తం చెయ్యడానికి పశ్చిమాఫ్రికాకే చెందిన నైజీరియన్ కవులు ప్రయత్నించారు. ప్రసిద్ధ నైజీరియన్ కవి, నాటక కర్త, నోబెల్ బహుమతి స్వీకర్త వోలె సోయింకా దృష్టిలో ఒక నీగ్రో తన నెగ్రిట్యూడ్ ను ప్రకటించుకోవడం ఒక పులి తన టైగ్రిట్యూడ్ ను ప్రకటించుకోవడం లాంటిదే. నైజీరియన్ కవులు ఐరోపీయ సాహిత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసారు. తమ దేశంలోని పెట్టుబడిదారీ విధానాన్నీ, దోపిడీని ప్రతిఘటిస్తూ సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్య ఉద్యమాలను చేపట్టారు. అటువంటి స్ఫూర్తితో వోలె సోయింకా రాసిన ఒక కవిత:

పంట పక్వానికొచ్చినప్పుడు

కంకికి బూజుపట్టిందంటే పంట పక్వానికొచ్చినట్టు
కంకుల్లో బూజు, తలవాల్చిన జొన్నచేలు.
పక్షులు పొలాలచుట్టూ నాట్యం అల్లుతున్నప్పుడు
పరాగం ఒక సంగమశుభసంకేతం.
జొన్నకంకుల చుట్టూ పక్షుల రెక్కల
వెలుతురు దారపు పోగులు.
అవును, సరిగ్గా అలాంటి వేళల్లోనే
పొలాల్లో గాలి ఊసుల్నీ,
వెదురుపొదల్లాంటి జొన్నచేలల్లో
ఈలపాటల్నీ వినాలనుకుంటాం.
మేమెలాగూ పంటపోగుచేసుకోవలసినవాళ్ళం
కంకి కుచ్చులమీద బూజుపట్టేదాకా వేచిఉంటాం.
సంధ్యాఛాయలు చిక్కబట్టుకుని
కార్చిచ్చుల్ని చుట్టుముడతాం
నవధాన్యభారంతో బిరుసెక్కిన
సస్యాలు వినాశనానికి ఎదురీదతాయి
పంట ఇస్తున్న వాగ్దానం
ఫలించేదాకా ఓపికపడతాం.

18

పశ్చిమాఫ్రికాలో మొదలైన నెగ్రిట్యూడ్ మీద ఆఫ్రికా ప్రధానభూభాగం కనా పశ్చిమ ఇండియా దీవుల ప్రభావమే ఎక్కువ. కానీ ఆ కవిత్వస్ఫూర్తిని నైజీరియా కవులు ప్రధాన భూభాగానికి అందచేయడంలో కొత్త తరం ఆఫ్రికా కవిత్వం పుట్టుకొచ్చింది. కాంగో, అంగోలా వంటి మధ్య ఆఫ్రికా దేశాలు కెన్యా, మొజాంబిక్ వంటి తూర్పు ఆఫ్రికా దేశాలు ఈ పిలుపునందిపుచ్చుకుని అద్భుతమైన కవిత్వం చెప్పాయి. ఉదాహరణకు అంగోలా కి చెందిన అగస్టినొ నెటొ రాసిన ఒక కవిత.

వీడ్కోలు చెప్పేవేళ

అమ్మా, నా తల్లీ

(తమ పిల్లలకు దూరమైన అమ్మల్లారా, అందరు నల్లతల్లుల్లారా)

మీరు నాకు ఓపికపట్టడమెలానో నేర్పారు

విపత్కరవేళలెన్నిటిమధ్యనో మీరు చేసినట్టే

నాక్కూడా ఆశపెట్టుకోడమెలానో అలవాటు చేసారు.

కానీ నాలో ఆ రహస్యాశల్ని

జీవితం తునిమేసింది.

ఇంక నేను ఎదురుచూడలేను

నా కోసం మీరే ఎదురుచూడాలి.

ఇప్పుడు మిగిలిఉన్న ఆశ మేమే

మీ పిల్లలం,

జీవితానికి ప్రాణంపోసే

నమ్మకందిక్కు సాగేవాళ్ళం.

బానిసశిబిరాల్లో

దిసమొలతో తిరుగాడే పిల్లలం

అపరాహ్ణక్షేత్రాల్లో

గుడ్డపీలికలతో బంతులాడుకునే

చదువుసంధ్య ల్లేని పిల్లలం

కాఫీతోటల్లో

కూలీకి బతుకులు తగలబెట్టుకునేవాళ్ళం

అజ్ఞా నులం, నల్లవాళ్ళం

తెల్లవాళ్ళని గౌరవించకతప్పనివాళ్ళం

సంపన్నులకి భయపడటం సాధనచేస్తున్నవాళ్ళం

కరెంటు చొరరాని గ్రా మాలనుంచి వచ్చినవాళ్ళం

తప్ప తాగి చచ్చిపోతున్న మనుషులం

అనాథలం, మృత్యువుచప్పుడు తప్ప మరేమీ లేనివాళ్ళం

మీ పిల్లలం

అన్నార్తులం

దప్పిగొన్నవాళ్ళం

అమ్మా అని పిలవడానికి సిగ్గుపడేవాళ్ళం

నడివీథి దాటలేనివాళ్ళం

మనుషులంటే భయపడిచచ్చేవాళ్ళం.

కాని, మేమే,

జీవితం తిరిగి చేజిక్కుతుందన్న

ఆశ చావనివాళ్ళం.

 19

ఆఫ్రికన్ సాహిత్యంలో కవిత్వంలో దక్షిణాఫ్రికాది ప్రత్యేకమైన స్థానం. దక్షిణభాగానికి చెందిన జింబాబ్వే వంటి దేశాల్లో వర్ణవివక్ష చాలా కాలమే కొనసాగింది. తక్కిన ఆఫ్రికా దేశాలు వలసపాలననుంచి విడుదలైన ఎన్నో ఏళ్ళదాకా కూడా దక్షిణాఫ్రికా నల్లజాతి కవులు తాము కూడా మనుషులమేనని చెప్పుకోడానికే కవిత్వం చెప్పవలసి వచ్చింది. తక్కిన ప్రపంచంలో మనుషులు సమానత్వం కోసం పోరాడుతూ ఉండగా, దక్షిణాఫ్రికా కవులు, అన్నిటికన్నా ముందు తాము కూడా మనుషులమేననీ, తమ శరీరాలకు కూడా తక్కిన మనుషుల్లాంటి మానవానుభవాలే కలుగుతాయని పదే పదే చెప్పుకోవలసి వచ్చింది. జింబాబ్వేకు చెందిన డెనిస్ బ్రూటస్, దక్షిణాఫ్రికాకి చెందిన బ్రేటన్ బ్రేటన్ బాక్ కవితల్లో ఈ ఆవేదన మరీ స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు బ్రేటన్ బాక్ రాసిన కవితలోంచి కొన్ని వాక్యాలు:

మా జీవితాలు మృత్యువులోనే సార్థకమవుతున్న మాట నిజమే కానీ

ప్రభూ, మా దేహాలు తాజా కాబేజీ పువ్వుల్లాగా నవనవలాడే మార్గం చూడు

ఎర్రని గండుమీనుల్లాగా మేం ఒకరినొకరం మరింత బలంగా మోహించుకునేలా చూడు

మా కళ్ళు చిక్కని సీతాకోకచిలుకయ్యేలా చూడు

మా నోళ్ళమీద, పేగులమీద, మా మెదడుమీద ఒకింత దయచూపు

సాయంసంధ్యాదిగంతమాధుర్యాన్ని మమ్మల్నీ కొంత చవిచూడనివ్వు.

20

తొంభై కోట్ల ఆఫ్రికా ప్రజలు నేడు తొంభై కోట్ల కంఠాలు సవరించవలసిఉంది. వారిలో తమ పురాతన సంప్రదాయాలను ఇంకా సజీవంగా నిలుపుకుంటూ తమ గీతాల్ని సంగీతం కొన సాగిస్తున్న సామూహిక కవులున్నారు. ప్రవాసంలో, ఏకాంతంలో, చెరసాలల్లో, ఎయిడ్స్ కోరల్లో చిక్కినలుగుతున్న ఒంటరి కవులున్నారు. కానీ వారందరిలోనూ  తాము నల్లవారిమనే స్పృహ ఉంది. తమకొక ప్రగాఢమైన గతం ఉందనే ఎరుక ఉంది. యుగాల కిందటి తమ పూర్వుల ప్రశాంత జీవితం, శతాబ్దాలకిందటి తమ తండ్రితాతలు అనుభవించిన దాస్యం, తామింకా సమగ్రంగా అర్థం చేసుకోవలసి ఉంది. వారిప్పుడిప్పుడే ఇంతదాకా కాలం అల్లిన చిక్కుముళ్ళను విప్పుకోవడం మొదలుపెట్టారు. నిజమే, బ్రేటన్ బ్రేటన్ బాక్ అన్నట్టుగా ఆ గాయాలు అంత తొందరగా మానేవి కావు. వాటిని కొన్ని కలల్తో, కొన్ని పాటల్తో, పువ్వుల్తో ఏమార్చలేం. అయినప్పటికీ, అలిసిపోయిన ఒంటెలకి నీళ్ళు తాపించినట్టే తమ తప్త హృదయాలకు కూడా ఆఫ్రికా కవులు కవిత్వంతో సాంత్వన పరుచుకోడం మానటం లేదు.

2007

Leave a Reply

%d bloggers like this: