హైకూ యాత్ర

Bhasoo

సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.

ఎమెస్కో ‘పొరుగునుంచి తెలుగులోకి’ పుస్తకమాలిక లో భాగంగా వెలువడ్డ ఈ రచన అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ లభ్యమవుతున్నది.

ఎలక్ట్రానిక్ ప్రతి ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Haiku Yaatra

~

అరుదైన, అసలైన యాత్రీకురాలు జయతి లోహితాక్షణ్ ఈ పుస్తకం గురించి తమ వాల్ మీద ఇలా రాసుకున్నారు:

ఒక తరువు నీడన
విసనకర్రను పానపాత్రగా మార్చాను-
రాలుతున్న చెర్రీపూలు

‘గాలీ మంచువానలకి ఎదురీదుతూ.. ప్రాచీన కాలం నుండీ ఎందరు ప్రపంచాన్ని పరిత్యజించి ఈ కొండలలో అడుగుపెట్టి చీనా కవితలోకి జారుకున్నారో, జపనీయ కవితలో శరణార్థులై తలదాచుకున్నారో!’

ఇప్పుడెక్కడున్నావని అడుగుతున్నారు నన్ను. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించానని అడిగారొకరు మొన్న. నేనెక్కడికి చేరుకున్నానో తెలుసుకుంటారా. నేనెక్కడ ప్రయాణిస్తున్నానో తెలుసుకోవాలని ఉందా. సైగ్యో, మత్సువొ బషో, ర్యోకాన్, హాన్ షాన్ నడిచిన దారుల్లో నడుస్తున్నాను. ఆ పర్వతాలలో ఈ ప్రాచీన చైనా, జపనీయ కవుల అడుగుల్లో అడుగులేస్తున్నాను. బషో చేసిన ప్రయాణం హృదయమప్పగించి చదువుతూ అప్పుడప్పుడు హాన్ షాన్ని, ర్యోకాన్ని వింటున్నాను.

బషో కూడా కవితల్ని కలుసుకుంటూ పర్వతాలనెక్కి దిగుతూ, కోకిలపాట విని మైదానాలకడ్డంపడి నడుస్తూ ప్రయాణం చేస్తున్నాడు. చెట్టు నీడ కనిపించింది. చెర్రీపూల వికాసం. విసనకర్రకిక పనిలేదు. గాలి వీస్తున్నది. చెర్రీపూలు రాలుతున్నాయి. విసనకర్రను పాన పాత్రగా మార్చాడు. రాలుతున్న పూలల్లో మధువింకా మిగిలి ఉంటుందా. పూలు రాలటంలోని సౌందర్యాన్ని మధువని భావించిందా కవి హృదయం. ఈ హైకూ చదివి పానపాత్రలో పడి నేను మత్తులో మునుగుతూ తేలుతూ బైటపడలేకుండా ఉన్నాను. నేనిప్పుడు ఏమి మాట్లాడబోయినా అది బషో అన్నట్లు, తాగుబోతు వ్యక్తావ్యక్త ఆలాపనగానో , నిద్రపోతున్నవాడి కలవరింతగానో ఉండబోవచ్చు.

పూసిన చేలలో,
పూలను ప్రేమిస్తున్న ముఖాలతో
పిచుకలు.

మేము సైకిళ్ళమీద ప్రయాణిస్తూ తెలంగాణలో ఝరాసంఘం చేరుకుంటుండగా పొద్దుటి ఎండలో ఎదురుపడ్డ నీలాకాశం, అక్కడ భూమి ఎత్తూ పల్లాలమీద, పండుబారుతూ ఉన్న గడ్డిమైదానాలు, వాటి మధ్యనుంచి మెలికలు తిరిగిపోతున్న దారి, దూరంగా కోతకొచ్చిన శనగపంటనుంచి గాలి మోసుకొస్తున్న సువాసన, అది ఫోటోగా తియ్యలేక, వర్ణించి చెప్పలేక నాలో కొట్లాడుతుండేది. ఈ హైకూలు చదివాక ఆ దిగులు తీరిపోయింది.

అప్పుడు మాముందు తెలుపురంగు గడ్డిపూల మధ్య తీతువు నిలబడి ఉంది. అప్పుడు, ‘మత్సువొ బషో హైకూ యాత్రా పుస్తకం ఇచ్చానా’ అన్నారు వీరభద్రుడు గారు. ఇంకా నెల రోజులు నిండలేదు, ఆ రోజు ఆ చెట్టువద్ద కూర్చున్నప్పుడు వీరభద్రుడు గారు బషో చేసిన ప్రయాణం గురించి చెపుతుంటే, ఎవరు బషో, హైకూ కవి అని వినిఉంటానని నాలోపలొక అస్పష్టమైన ఎరుక. ఇవ్వలేదన్నాను.

‘ఆయన మీలానే ప్రయాణించారు’. (మేము ఆయనలా ప్రయాణించామా!)

‘ఆయన కవితల కోసం ప్రయాణించారు మీరు ఫోటోలకోసం ప్రయాణించినట్లు ‘ అన్నారు ఇంకా.

తరువాత బషో చేసిన ప్రయాణం పుస్తకం నా చేతికొచ్చింది కానీ నా యాత్రారచనలు పూర్తిచేయడంలో ఇది చదవడం ఆలస్యమే అయిపోయింది. తక్కినవన్నీ అటుంచి ఎందుకిది నేను చదవాలనుకున్నారు. అది నాకు ప్రతిపేజీలోనూ, ప్రతి వాక్యంలోనూ అర్ధమవుతూ వచ్చింది. అవునూ, బషో చేసిన ఈ ప్రయాణానికి మేము చేసిన ప్రయాణానికి అన్నిట్లో పోలిక. ఆయన ఇల్లు విడిచిపెట్టాడు. మేము ఇల్లు విడిచిపెట్టాము. ఆయన ప్రయాణానికవసరైనవేవో కొన్ని మాత్రం తీసుకుపోయాడు. మేమంతే. ఆయన రెండే కోరుకున్నాడు. రాత్రికి ఎక్కడో ఒకచోట శుభ్రమైన బస దొరకాలనీ, తన పాదాలకు సరిపోయే చెప్పులు దొరకాలనీ. నేనేదీ కోరుకోలేదు. ఎందుకంటే నాకు నమ్మకం. ఆయనలాంటి వాళ్ళు ఎందరో నడిచిన ఈనేలమీద నాలాటి వాళ్లకి రాత్రయ్యేసరికి ఎదోచోట ఒక బస ఏర్పాటయే ఉంటుందని.

వేసవి దుస్తులు:
ఇంకా ఒకటి రెండు
వదలని యాత్రాగుర్తులు

‘పయనించే మేఘమాల ఆకాశంలో కనబడుతూనే అంతులేని భ్రమణకాంక్ష నన్ను వేగిరపరచడం మొదలవుతుంది. ఏవేవో ప్రయాణాలు చేపట్టాలని ఊహించుకుంటూ ఎన్నాళ్లుగా కలలు కంటూ వస్తున్నానని. కానీ సన్నాహం మొదలుపెట్టింది మాత్రం క్రిందటేడే. సుమిద నది వొడ్డున హేమంతం వచ్చి వాలగానే నా రెల్లుపాక బూజు దులిపాను. అప్పణ్నుంచి ఏడాది ముగిసేదాకా సాగిపోతున్న కాలాన్ని చూస్తూ గడిపేశాను. వసంతమేఘాలు ఆకాశం మీద ఉదయించగానే నా పురాతనకాంక్షాదేవతలు నన్ను మళ్ళా ఆవహించారు. శిరకావా సరిహద్దు దాటి ముందుకు ప్రయాణించాలన్న లాలసతో నా మనసు రగిలిపోయింది. పథదేవతల నుండి వినవస్తున్న పిలుపులు మరి దేనిమీదా దృష్టి పెట్టనివ్వలేదు. నా గుడ్డలు సర్దుకున్నాను. టోపీ బిగించాను. నా కుటీరాన్ని వేరెవరికో అమ్మేశాను’. (బషో).

మరి నేను విన్న పిలుపది కదా. ఎంత దిగులు, ఎన్ని ప్రయత్నాలు, అన్ని వేడుకోలులు..

శిరాకవా సరిహద్దు దాటినప్పుడు,

సంస్కృతి ప్రారంభం-
ఉత్తర భూముల్లో
ఊడ్పులపాటలు

‘సంస్కృతి అంటే హృదయాన్ని మెత్తపరుచుకోవటం’ అన్నారు వీరభద్రుడుగారు ఇందులో మనకి ముందు బషో చేసిన ప్రయాణాన్ని గురించి చెపుతూ. ఇంకా ఇలా అన్నారు. ‘ఇది చదివితే తెలిసేది సంస్కృతి. అది కూడా కేవలం జపనీయసంస్కృతి కాదు, ఏ మానవుడైనా ఈ ప్రపంచంలో అభిలషించదగ్గ అత్యున్నత సంస్కృతి అది. అటువంటి సంస్కృతిని గురించిన అస్పష్టమైన ఊహ మనందరికీ ఉంది. ఈ రచనలు మనలోని సంస్కృతీసంస్కారాన్ని మేల్కొల్పుతాయి.. చదవటం పూర్తయ్యేటప్పటికీ మనం కూడా మనలో నిశబ్దంగా నిద్రిస్తున్న అత్యున్నత మానవీయ సంస్కారమేదో మేల్కొనడం గుర్తిస్తాం’.

హృదయాన్ని మెత్తపరుచుకోవటమంటే ఈ హైకూ ఎత్తి చెప్పాలనిపిస్తోంది. ఒకచోట బషో రాసుకున్నాడు. షోడయిజి దేవాలయ పురోహితుడు గంజిన్ చైనానుండి జపాన్ రావటానికి డెబ్భైసార్లైనా ప్రయాణించాడంటారు. ఆ ప్రయత్నంలో ఒకసారి అతడి కళ్ళలోకి ఉప్పుగాలి వీచి చూపు పోగొట్టుకున్నాడని కూడా చెప్తారు. ఆయన పవిత్రప్రతిమ దగ్గర అర్చనచేస్తూ,

నీ కళ్ళనుండి జారుతున్న
ఆశ్రువులొక చిగురుటాకుతో
తుడవనివ్వు

నగర జీవితంనుంచి దూరంగా వెళ్లిపోవాలనే ఆకాంక్ష మొదలైన తరువాత అతడొక జెన్ గురువును ఆశ్రయించాడట. అప్పుడే రెండు ముఖ్య సంఘటనలు సంభవించాయి. ఇందులోనూ పోలికే బషో ప్రయాణానికీ నా ప్రయాణానికి. ఒకటి తల్లి మరణం. నేను కూడా నా ప్రయాణంలో నా పుట్టిన ఊరు చేరుకున్నాను. అక్కడ ఒకప్పుడు అమ్మ ఇంటిముందు నాటిన జామమొక్క ఒక్కటీ, పెద్దదైపోయి ఇప్పుడు నాలుగడుగుల మోడు మాత్రం మిగిలి ఉంది.

ఇది బషో గతంలోనికి చేసిన ప్రయాణం. వర్తమానంలో ప్రయాణిస్తున్నప్పటికీ, వెయ్యేళ్ళ ముందుకూ చేసిన ప్రయాణం. చూస్తే బైట ప్రయాణంచేసినట్టుంటుందికాని అతడు ఇది తనలోనికి తాను చేసిన ప్రయాణం. ఆ మహారణ్యాలలో, మంచువానల్లో, కఠిన పర్వత దారుల్లో ప్రాచీన కవుల అడుగుజాడల్ని పోల్చుకుంటూ, కవితలు ఏరుకుంటూ తాను హైకూలు రాసుకుంటూ చేసిన ప్రయాణం. వీరభద్రుడుగారు చెప్పినట్లు ఇది అతడు తన అంతరాంతర జ్యోతిసీమల్లోకి చేసిన ప్రయాణం కూడా.

నస్సు అనే ఒకచోటికి చేరుకున్నప్పుడు ఇట్లా రాసుకున్నాడు బషో.

‘పూర్వకాలాల్లో ఈ పర్వతాన్ని ని – కొ అని పిలిచేవారు. అంటే రెండు తుఫానులు చూసిన పర్వతమని. కానీ మహాయోగి కుకై ఇక్కడొక దేవాలయం నిర్మించి దాని పేరు నిక్కొ అని మార్చాడు. దానర్ధం సూర్యకాంతి. అతడు బహుశా తన కాలం కన్నా వెయ్యేళ్ళు ముందుకి చూడగలిగిన శక్తిమంతుడై ఉండాలి. ఎందుకంటే ఈ ఆలయ కాంతి ఇప్పుడు పధ్నాలుగు లోకాల దాకా ప్రకాశిస్తూ ఉంది. అష్టదిక్కుల్లో ఈ ఆలయం ఆశీర్వాదాలు వర్షిస్తూనే ఉంది. రైతులూ, యోధులు, చేతపనివాళ్ళు, వర్తకులు అన్ని తరగతులవాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు వర్షిస్తూనే ఉంది. ఆ శోభను మాటల్లో వర్ణించలేక నేను నిశ్చేషుణ్ణైపోయాను.’

ఎంత పవిత్రం:
పచ్చనాకులు, చిగురుటాకులు
పెల్లుబికిన సూర్యకాంతి

చిత్రకారుల్నీ కలిశాడు బషో. ఆ ఊళ్ళోనే కేమాన్ అనే చిత్రకారుడున్నాడు. అతని సౌందర్యాభిరుచి చెప్పుకోదగ్గదని విన్నాడు. అతన్ని పరిచయం చేసుకోవాలనుకున్నాడు . ఒకప్పుడు కవిత్వంలో బాగా ప్రస్తుతించబడి, తరువాత రోజుల్లో ప్రజలు మర్చిపోయిన ప్రసిద్ధ స్థలాలకు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తూ ఉన్నాను’ అన్నాడాయన. కేమాన్ నారచెప్పుల జతని కానుకగా ఇచ్చాడు. ఆ చెప్పుల తాళ్లు నీలిపూలరంగులో ఉన్నాయి. ఆ కానుకలు చూడగానే అతని సౌందర్యసంస్కృతి ఎటువంటిదో అర్ధమయింది. అప్పుడిలా రాసుకున్నాడు.

నా పాదాల చుట్టూ
నీలి పూలు చుట్టుకుంటాను:
నార జోళ్ళు.

‘ఆ మర్నాడు పొద్దున్నే ఆ అపరిచిత మార్గాలమీద అనిశ్చయప్రయాణం మొదలుపెట్టాం.’ (ఓహ్!)

‘ఇచికవా గ్రామంలో తగాజొ వద్ద త్సుబొ శిలాస్మారకం ముందు నిలబడ్డాం. ఆ రాతిమీద నాచు పరుచుకొని ఉంది. ప్రాచీనకాలంలోంచి కవిత్వంలో ప్రస్తుతించబడ్డ ఎన్నో స్థలాల్లో చాలా ప్రదేశాలు కనుమరుగైపోయాయి. పర్వతాలు కూలిపోయాయి. నదులు కొత్తదారులు తీసుకున్నాయి. జానపథాలు కొత్తతోవలకు తరలిపోయాయి. ప్రాచీనశిలలు మట్టితో కప్పబడి భూగర్భంలోకి చేరిపోయాయి. పాతచెట్ల స్థానంలో కొత్త మొలకలు తలెత్తుతున్నాయి. కాలం గడిచిపోతూ ఉంది. ప్రపంచం మారిపోతూ ఉంది. కానీ ఇక్కడ నాకాళ్ళ ముందట వెయ్యేళ్లుగా చెక్కుచెదరని చిహ్నమొకటి నిలబడి ఉంది. ఈ సమయాన నేను నా ప్రాచీన మానవుల భావేద్వేగాలను అర్ధం చేసుకోగలిగాననిపించింది. ఒక యాత్రికుడికి లభించవలసిన కానుక ఏదన్నా ఉంటే అది ఇదేననుకున్నాను. నా మార్గాయాసం మొత్తం మర్చిపోయాను. కన్నీళ్లు పొంగిపొర్లాయి.’

ఇంకా రాయాలనే అనిపిస్తోంది. చెప్పవలసింది ఎంతో, ఎన్నో. బషో అంటున్నాడు, ఈ పర్వత విశేషాలు, రహస్యాలు తక్కినవాళ్ళకి బహిరంగపర్చకూడదనే నియమం పెట్టుకుంటున్నానని. నేను కూడా ఇంతటితో ఆపివేస్తున్నాను. ఇక ఈ ప్రయాణం ఎవరికీ వారు చెయ్యవలసింది. నేను పక్కన పెట్టిన మరికొన్ని బషో వర్ణనలు, చెర్రీవికాసాలను ఇక్కడ మీముందుంచుతున్నాను.

చెర్రీపూలు చూడటానికి
రోజు పన్నెండు మైళ్ళు నడిచినా
సంతోషమే !

ఈ జలపాతం మీద
ఊగుతున్న పూల గురించి
పానగోష్ఠిలో ప్రస్తావిస్తాను.

ప్రేమించదగ్గ చల్లదనం-
హగొరొ పర్వతంపై
పేల నెలవంక.

‘నాకూలానే నా శిష్యుడు గాలికి , మబ్బుకీ తూలిపోయే హృదయమున్నమనిషి.’

‘మంచువానతో లోయ నిండిపోయింది.’

‘అప్పటిదాకా అతడు ఏ చంద్రకాంతివైపు నా దృష్టి చొరకుండా అడ్డుపడ్డాడో ఆ కాంతి రేఖ బయటచెట్లమీంచి, గోడ కంతలగుండా గదిలోపలికి ప్రవేశించింది. అప్పుడప్పుడూ పక్షుల కూతలూ, దూరంగా అడవిలో అడవి దుప్పుల్ని తరుముతున్న గ్రామస్థుల అరుపులూ వినవస్తున్నాయి. పొద్దుణ్ణుంచీ నా హృదయంలో రగులుతూ వస్తున్న హేమంత వ్యాకులత అప్పటికి పరాకాష్టకి చేరుకుంది.’

మరొకటి,

ఈ కొండదిగువ పల్లెలో
నువ్వెవరికోసం పిలుస్తున్నావు
చిన్ని కోయిలా!
నేనిక్కడకు వచ్చిందే
ఒక్కణ్ణి గడుపుదామని.

1-9-2018

2 Replies to “హైకూ యాత్ర”

  1. నీ అక్షరానవ్వులు చూడటానికి
    రోజూ పన్నెండు మైళ్ళు ⌚ నడిచిన
    సంతోషమే 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading