ప్రసిద్ధ ప్రచురణ కర్త ఎమెస్కో విజయకుమార్ వారి అబ్బాయి నరేన్ పెళ్ళివేడుక సందర్భంగా బాపు వేసిన కొన్ని బొమ్మల్ని కూడా ఒక గుత్తిగా పెళ్ళిపత్రికతో అందించాలనుకున్నాడు. ఆ బొమ్మల్ని చూస్తే భారతీయ కవులూ, యుగాలుగా ప్రవహిస్తున్న భారతీయ కవితాస్రోతస్వినీ కనిపించాయి. అందుకని ఆ బొమ్మలకోసం 5000 ఏళ్ళ భారతీయ కవిత్వం నుంచి కొన్ని మేలిమి కవితల్ని ఎంచి కూర్చిన సంకలనమే ‘మనసున మనసై’. ప్రస్తుతం ఈ పుస్తకం ముద్రణలో లేదు.
ఎలక్ట్రానిక్ ప్రతి ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
~
అందులోంచి ఒక కవిత:
జీవనానంద దాస్
వనలతాసేన్
సింహళ సముద్రాలనుండి మలయా జలసంధి దాకా
యుగాలుగా నేనీ పృథ్వీమార్గాలమ్మట సంచరించాను,
అర్ధరాత్రులు ఏకాకిగా ప్రయాణించాను.
బింబిసార అశోకుల మసకజ్ఞాపకాల్లోంచి
నీడలు కమ్మిన విదర్భ గుండా
అంధకారకాలప్రాంగణంలో సంచరించాను.
అలసిన నా ఆత్మచుట్టూ ఇంకా ఘోషిస్తున్న
కోపోద్రిక్తతరంగాల మధ్య నా ఏకైకశాంతి నాటోర్ వనలతాసేన్.విదిశలో కమ్ముకునే అర్ధరాత్రి లాంటి కేశపాశం.
శ్రావస్తి శిల్పంలాంటి వదనం.
తుపాను వెలిసిన తరువాత సముద్రం మీద చుక్కాని లేని నావికుడు
దాల్చినచెక్కల దీవిలో పచ్చికబయలు కనుగొన్నట్టు నేనామెను చూశాను.
పక్షిగూళ్లలాంటి నేత్రాలతో నన్ను చూస్తూ,
‘ఇన్నాళ్లుగా ఎక్కడున్నావు?’ అంటూ,
మరేమో అడిగింది నాటోర్ వనలతాసేన్.సాయంకాలపు మంచు రాలుతున్న వేళ
మహాశకుంతం తన రెక్కలమీంచి
సూర్యబింబసుగంధాన్ని తుడిచేసుకుంటున్న వేళ
ప్రపంచపు చప్పుళ్లన్నీ అణగిపోయేవేళ
మిణుగురుపురుగుల కాంతిలో
ప్రాచీన తాళపత్రమొకటి మాంత్రికరాత్రి కథలు
వినిపించడానికి సమాయత్తమవుతున్నది.
ప్రతి పక్షీ గూడు చేరుకున్నది. నదులన్నీ సాగరానికి చేరుకున్నవి.
చీకటి చిక్కబడింది. ఇదీ సమయం వనలతా సేన్ కి.