కబీరు-9

Reading Time: 2 minutes

326

బెల్వెడేర్ ప్రింటింగ్ ప్రెస్, అలాహాబాదునుంచి పుస్తకాలు వచ్చాయి, ‘కబీర్ సాహిబ్ కీ శబ్దావలీ’ నాలుగు సంపుటాలు, ‘కబీర్ సాఖీ సంగ్రహ్’, ‘కబీర్ సాహెబ్ కా బీజక్’. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుస్తకాలు.

‘కబీర్ గ్రంథావళి’ ఆచార్య శ్యామసుందర దాస్, పారస్ నాథ తివారీ వంటి పండితుల పుస్తకాలైతే, ఈ ‘కబీర్ సాహిబ్ కీ పదావలీ’ ప్రజల పుస్తకాలు. ఈ సంపుటాల్లో కనవచ్చే ఎన్నో పదాలు కబీర్ గీతాలుగా ప్రజల నోళ్ళల్లో నానుతూన్నవి. కబీర్ పుస్తకాల్ని సాక్ష్యాలుగా నమ్మడు కాబట్టి బహుశా రాతప్రతుల మీద ఆధారపడ్డ కబీర్ గ్రంథావళిని పక్కనపెట్టి, ప్రజలు పాడుకుంటున్న ఈ పదావళినే తన పదాలుగా చెప్పుకుని ఉండేవాడేమో.

20 వ శతాబ్దపు మొదటిరోజుల్లో కబీర్ అంటే ఈ ప్రాచుర్యం పొందిన పదాల కర్తగానే అందరికీ తెలుసు. క్షితిమోహన్ సేన్ సంకలనం చేసిన పదాల్లో కనిపించేది కూడా ఈ కబీరే. ‘ఘూంఘట్ కా పట్ ఖోల్ రే’, ‘మన్ లాగో యార్ ఫకీరీ మే’, ‘కబీరా ఖడా బాజార్ మే’, ‘అవధూ భూలే కో ఘర్ లావై’ వంటి సుప్రసిద్ధ గీతాలు, కబీర్ గ్రంథావళిలో కనిపించనవి, ఈ పదావళిలో కనిపిస్తాయి.

కబీర్ సాఖీ సంగ్రహ్ కూడా గ్రంథావళిలో కనిపించే సాఖీలన్నిటికన్నా విస్తృతమైన సంకలనం. ఈ సంకలనాన్ని ఆధారం చేసుకుని ఇసాక్ ఎ ఎజెకీలు అనే ఆయన 1966 లో ఒక ఇంగ్లీషు అనువాదాన్ని వెలువరించాడు. రాధాసామి సత్సంగ్, బియాస్ వారి సంప్రదాయానికి చెందిన ఎజెకీలు చేసిన అనువాదాన్ని కొద్దిగా సవరించి సత్సంగ్ వారు తిరిగి 2002 లో Kabir, The Great Mystic అనే పేరిట ప్రచురించారు. నేను చూసినంతవరకూ, కబీర్ దోహావళికి ఇంగ్లీషులో ఇదే గొప్ప అనువాదం.

ఆ పుస్తకం చూసినప్పటినుంచీ కబీర్ సాఖీ సంగ్రహ్ మూలం చూడాలని ఉబలాటపడుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళకు ఆ మూల ప్రతి నా చేతుల్లోకి వచ్చింది. అందులోంచి కొన్ని దోహాలు:

సూక్ష్మమార్గం

1

అక్కణ్ణుంచి వచ్చినవాళ్ళెవరైనా ఉన్నారా
పరుగు పరుగున పోయి చూడాలని ఉంది.
ఇక్కణ్ణుంచి పోవడమైతే అందరూ పోతున్నారు
నెత్తిన మోయలేనంత బరువు పెట్టుకుని.

2

కబీర్, ఆ మార్గం చాలా కఠినం
ఎవరూ పోలేకున్నారు,
పోయినవాళ్ళు వెనక్కి రాకున్నారు
అక్కడికెలా పోవాలో ఎవరినడగడం?

3

నీకా ఊరి పేరే తెలీదు
ఎట్లా చేరగలవనుకుంటున్నావు?
ఇంతాచేసి పావుకోసు దూరం,
నడుస్తూనే యుగాలు గడిపేసావు.

4

కొండకొమ్ము మీద కబీర్ ఇల్లు,
చిన్న చీమ కూడా పాకడం కష్టం.
పండితులేమిటో, బళ్ళకొద్దీ
పుస్తకాలతో పైకెక్కాలనుకుంటారు.

5

మార్గం చాలా కఠినమంటాడు కబీరు,
పెద్దవాళ్ళెందరో ప్రయత్నించి వదిలేసారు.
కబీర్ దాటిపోగలిగాడు ఆ దారిన
ఒక స్నేహితుడి సాయంతో.

6

ఆ స్నేహితుడెంత దయాళువు
తానే వచ్చి తోడునిలబడ్డాడు.
యుగాలు పట్టే దారి,
క్షణంలో దాటించేసాడు.

18-5-2016

Leave a Reply

%d bloggers like this: