కబీరు-8

Reading Time: 2 minutes

336

నా జీవితంలో అడుగడుగునా దేవదూతల్ని చూస్తూనే ఉన్నాను. కాని ముఖ్యంగా ఇద్దరు దేవదూతల ఉనికి పదే పదే నాకు అనుభవానికొస్తూంటుంది. ఒకరు, లైబ్రరీ యాంజెల్, మరొకరు బుక్ షాప్ యాంజెల్.

కొన్ని వందల వేల పుస్తకాలుండే గ్రంథాలయంలో అడుగుపెడతానా, వరసలు వరసలు బీరువాలు నిశ్శబ్దంగా నిలబడిఉంటాయా, ఆ రెండో వరసలో నాలుగో బీరువా దగ్గరకే ఎందుకు వెళ్ళి ఆగుతాను, అక్కడ కిందనుంచి మూడో షెల్ఫులోనే ఎందుకు వెతుకుతాను, అక్కడ మాత్రమే ఒక ‘అమృత సంతానం’ ఎందుకుంటుంది, అక్కడ మాత్రమే ఒక బెర్టోల్డ్ బ్రెహ్ట్ కవిత్వమెందుకుంటుందంటే, అక్కడ లైబ్రరీ యాంజెల్ నిలబడి పిలుస్తుంది కాబట్టి.

అట్లానే పుస్తకాల దుకాణాల్లో. ఆ పుస్తకం అక్కడుందని తెలియకపోయినా, అది అక్కడే ఉన్నట్టు నాకెంతో కచ్చితంగా తెలిసినట్టు, చరచారా అటే నడిచి అక్కడే ఆగుతానెందుకంటే, అక్కడే బుక్ షాప్ యాంజెల్ నా కోసం వేచి ఉంటుంది కాబట్టి.

వారం రోజులకిందట ‘అక్షర’ పుస్తకాల దుకాణంలో ఆ దేవదూత Tagore vis-a-vis Kabir (2008) నా చేతులకట్లానే అందించింది.

ఆ పుస్తకం అద్భుతమైన పుస్తకమేమీ కాదు, కాని టాగోర్ కీ, కబీర్ కీ సంబంధించిన కొన్ని అద్భుతమైన విషయాల్ని నాకు మళ్ళా గుర్తు చేసింది.

‘వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరం లేదు’. గీతాంజలి లోని ఈ 73 వ కవితనే కదా నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు నలభయ్యేళ్ళ కిందట, నా జీవితపరమార్థమేమిటనే తలపు నాలో తలెత్తిన వేళ, మొదటిసారి గీతాంజలి చదివినప్పుడు, ఈ కవిత దగ్గరే కదా నేనాగిపోయాను.

మా ఊళ్ళో ఏటి ఒడ్డున గడ్డిమైదానంలో పడుకుని నీలాకాశాన్ని చూస్తూన్నప్పుడు, దూరంగా చెరకుతోటమీంచి శుభ్రగగనవీథిలోకి కొంగలబారు ఎగిరిపోతున్నప్పుడు, అనంతమైన స్వాతంత్ర్యం కోసం నాలో బలమైన కాంక్షాంచలాలు విప్పుకున్నదప్పుడే కదూ.

ఆ పూర్తి కవిత, చలంగారి వాక్యాల్లో మరొక్కసారి:

వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరం లేదు. సహస్ర ఆనంద బంధాలలో స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది. ఈ మృణ్మయపాత్రని అంచులదాకా నింపుతో వివిధ వర్ణ సురభిళ నూతన మధుధారని నాకై నువ్వు వర్షిస్తావు. నీ జ్వాలతో నా ప్రపంచం తన సహస్ర దీపాల్ని వెలిగించుకుని నీ ఆలయంలోని పూజాపీఠం ముందు అర్పిస్తుంది.నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను.  నా దృష్టి శ్రవణ స్పర్శానుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నాకిస్తాయి. నా భ్రమలన్నీ ఆనందహారతులుగా మండిపోతాయి. నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తాయి.

ఇంతకీ నా చేతుల్లోకి వచ్చిన పుస్తకంలో ఏముందంటే, టాగోర్ ఈ కవిత రాసినప్పటికి (1901) ఆయన దృష్టిలో స్వామి వివేకానందులున్నారని. వివేకానందుడు (1863) టాగోర్ (1861) దాదాపుగా సమవయస్కులే. 1893 లో చికాగో ప్రసంగం తర్వాత వివేకానందులు భెంగాల్లోనూ, భారతదేశంలోనూ కూడా ఒక రోల్ మోడల్ గా మారిపోయారు. ఎందరో యువకులు ఆయన దారిన సన్న్యాస దీక్ష స్వీకరించారు.

1901 నాటికి, టాగోర్ భార్య గతించింది. ఆయన సన్న్యాస దీక్ష స్వీకరించడానికి లోకం దృష్టిలో సరైన తరుణమది. కాని ఆయన సన్న్యాసమనే భావాన్ని స్వాగతించలేకపోయాడు.

వైరాగ్యంలోని మోక్షం నాకవసరం లేదు, సహస్ర ఆనంద బంధాలతో స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది’ అని రాసుకున్నాడాయన 1901 లో. ఆ ఏడాదే ఆయన శాంతినికేతనంలో ఒక పాఠశాల ప్రారంభించాడు. స్వాతంత్ర్యం తన సహస్ర బంధనాలతో తనని అల్లుకుంటుందంటే అర్థమదే.

ఆయనట్లా రాసుకోవడం వెనక, మహర్షి దేవేంద్రనాథ టాగోర్, బ్రహ్మసమాజ భావాలెంత బలంగా ఉన్నాయో, కబీర్ వాణి కూడా అంతే బలంగా పనిచేసిందనే ఆ పుస్తకం నాకు గుర్తు చేసింది.

6-5-2016

Leave a Reply

%d bloggers like this: