కబీరు-7

 

s1

మిస్ మాడలైన్ స్లేడ్ ఒక బ్రిటిష్ నావికాదళాధికారి కుమార్తె. పదిహేనేళ్ళ వయసులో ఒకసారి బితోవెన్ సొనాటా విని అపార పారవశ్యానికి లోనయింది. బితోవెన్ పుట్టిన కాలంలో తనెందుకు పుట్టలేదని విలపించింది. ఆ సంగీతం గురించి మరింత తెలుసుకోవాలన్న తపనతో ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత, మానవతావాది రొమే రోలా ను కలుసుకుంది. అతడి ద్వారా ఆమె గాంధీ గురించి వింది. తాను అన్వేషిస్తున్నదేదో గాంధీ సన్నిధిలో దొరుకుందనిపించిందామెకి. 1925 లో సబర్మతీ ఆశ్రమానికి వచ్చేసింది. అప్పణ్ణుంచి 1959 దాకా గాంధీజీకి, భారతదేశానికి అంటిపెట్టుకుపోయింది.

గాంధీజీతో ఆమె అనుబంధం ఆమెను ఆత్మాన్వేషణకీ,ఆత్మసంఘర్షణకీ రెండింటికీ లోను చేసింది. అపురూపమైన, ఆరాధనీయమైన ఆ అనుబంధ యాత్ర గురించి మరింత తెలుసుకోవాలనుకున్నవాళ్ళు Beloved Bapu, The Gandhi-Mirabehn Correspondence ( ఓరియెంట్ బ్లాక్ స్వాన్, 2014) చదవొచ్చు.

ఆ ఉత్తరాలన్నీ చదివితే, గాంధీవల్ల మీరాకి, మీరా వల్ల గాంధీకి లభించిన సంతోషమంటూ నిజంగా ఏదన్నా ఉందా అన్న ప్రశ్న మిగులుతుంది. కానీ ఆ అనుబంధం వల్ల భారతీయ సాహిత్యానికి మాత్రం ఊహించని మేలు జరిగింది.

ఉప్పు సత్యాగ్రహం తర్వాత గాంధీజిని అరెష్టు చేసి యెరవాడమందిరంలో బందీగా ఉంచినప్పుడు ఆయన మీరా బెన్ కోసం ‘ఆశ్రమ భజనావళి’ ని ఇంగ్లీషులోకి అనువదించారు.

అంతకు ముందు కూడా తొలిరోజుల్లో గాంధీజీ కొన్ని అనువాదాలు చెయ్యకపోలేదు. గుజరాతీ పాఠకులకోసం ఆయన గోర్కీని, టాల్ స్టాయిని అనువదించడంతో పాటు, ప్లేటో రాసిన The Apology ని కూడా అనువదించారు. కానీ, ఈ అనువాదం సర్వోత్కృష్టమైంది. ఇది భారతీయ భక్తి కవిత్వం నుంచి ఆణిముత్యాలనదగ్గ శ్లోకాల్నీ, కీర్తనల్నీ ఇంగ్లీషులోకి తెచ్చిన అనువాదం.

ప్రతి రోజూ ఒకటి రెండు చొప్పున మొత్తం 253 గీతాల్ని 7-5-1930 నుంచి 20-12-1930 దాకా ఆయన అనువదించారు. 8-12-1930 న మీరాకు రాసిన ఉత్తరంలో తాను చేస్తున్న పనిని ఒక act of love గా ఆయన పేర్కొన్నాడు.

వాటిని జాన్ హోలాండ్ అనే ఆయన Songs from Prison పేరిట ప్రచురించాడు. అందులో వాటిని ఆయన కవితల్లాగా కనిపించడం కోసం కొన్ని మార్పులు చేసాడు. కాని ఆ కవితలు యథాతథంగా ఇప్పుడు మనకి కలెక్టెడ్ వర్క్స్, 50 వ సంపుటంలో లభ్యమవుతున్నాయి.

గాంధీజీకి తెలియని కారణంవల్లనో, లేక ఆశ్రమభజనవాళిలో చేరనందువల్లనో దక్షిణభారత భక్తి కవులు అందులో లేరు. బెంగాలీ గీతాలు ఉన్నప్పటికీ, వాటిని టాగోర్ అనువదించాడని తెలియడంతో ఆయన వాటిని వదిలిపెట్టేసాడు. అది మన దురదృష్టం.

ఆ అనువాదాల్లో కబీర్ కవితలు కూడా 12 ఉన్నాయి. ఆ అనువాదాల్ని టాగోర్ అనువాదాల్తో పోల్చి చూడటం ఆసక్తి కరంగా ఉంటుంది. టాగోర్ కబీర్ కి మరింత రంగులద్దాలని చూస్తే, గాంధీ ఆ కవితల్ని రాట్నం మీద వడికిన దారంలాగా మరింత వినిర్మలం చేసేసాడు.

అపురూపమైన ఆ అనువాదాల్లోంచి ఒకటి, సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారికి ఎంతో ఇష్టమైన గీతం, మీ కోసం:

మన్ లాగో మేరో యార్ ఫకీరీ మేఁ  

మన్ లాగో మేరో యార్ ఫకీరీ మేఁ (టేక్)
జో సుఖ్ పావో నాం భజన్ మే, సో సుఖ్ నాహి అమీరీ మేఁ
భలా బురా సబ్ కో సున్ లీజై, కర్ గుజరాన్ గరీబీ మేఁ
ప్రేమ్ నగర్ మే రహని హమారీ, భలి బని ఆయీ సబూరీ మేఁ
హాథ మేఁ కూడీ, బగల్ మేఁ, సోటా చారో దిసా జగీరీ మేఁ
ఆఖిర్ యహ్ తన్ ఖాక్ మిలైగా కహా ఫిరత్ మగ రూరీ మేఁ
కహై కబీర్ సునో భాయి సాధో, సాహెబ్ మిలై సబూరీ మేఁ

O friend, my mind is fixed on a fakir’s life.
The happiness which one derives from meditation on God is not to be found in indulgences.
Bear whatever befalls thee-good and evil; live in poverty.
Let us live a life of long service. It will be well to cultivate patience.
When one goes about with a mere begging bowl and a staff, one has the whole world as one’s kingdom.
What is the use of pride when one realizes that the body is soon to be reduced to ashes?
Kabir says:Listen O ye all good men contentment is the pathway to self-realization.

( Tran. M K Gandhi, Ashram Bhajanavali, 121, 27-8-1930)

ఫకీరులాగా బతకాలని నాకు మనసుపుట్టింది

ఫకీరులాగా బతకాలని నాకు మనసుపుట్టింది
భజనలో ఏ సుఖముందో అది భోగాల్లో లేదనిపించింది
మంచి, చెడు ఎంతవిన్నా, పేదరికమే బతుకనిపించింది
ప్రేమనగరానికి కట్టుబడ్డాను, సంతోషంతో ఓపికపట్టాను
చేతిన చిప్ప, చంకన కర్ర, నలుదిక్కులూ నా జాగీరు
కడకు దుమ్ములో కలిసే తనువు, పటాటోపమెందుకు?
కబీరు అంటున్నాడు, సాధువులారా,వినండి
సాహేబు దొరికేది సబూరీలోనే.

1-5-2016

arrow

Painting: A baul singer by Nandalal Bose

Leave a Reply

%d bloggers like this: