కబీరు-6

Reading Time: 2 minutes

334

ఇంట్లో ఎవ్వరూ లేరు. మా ఇంటి గుమ్మం దగ్గర నిలుచుని ఆమెజాన్ వార్తాహరుడు పోన్ చేస్తున్నాడు. నేనింకా ఆఫీసులోనే ఉండిపోయాను. అతడి దగ్గర చార్లెట్ వాడవిల్లి A Weaver Named Kabir ఉంది. నేను అందుకోకపోతే వెళ్ళిపోతాడు. సంకేతస్థలానికి స్నేహితురాలు వచ్చేసినా కూడా ఇంకా ఆఫీసులోనే ఉండిపోయినవాడిలా ఉంది నా పరిస్థితి. వాడు హిందీలో మాట్లాడతాడు. నేను హిందీలో మాట్లాడలేను. నవ్వొచ్చింది నాకు. నేను ఎదురుచూస్తున్నదేమో హిందీలో సర్వోన్నతమైన కవిత్వం గురించి.

గత రెండు శతాబ్దాలుగా కబీర్ మీద ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాల్లో ఛార్లెట్ వాడవిల్లి రచన సర్వోత్కృష్టమైంది. ఆమె గత నలభయ్యేళ్ళుగా కబీర్ ని అధ్యయనం చేయడానికే తన జీవితాన్ని వినియోగిస్తూ వచ్చింది. అనేక శాఖలుగా, సంకలనాలుగా, విశ్వాసాలుగా అల్లుకుపోయిన, స్థిరపడిపోయిన కబీర్ కవిత్వమనే చిక్కుముడిని ఆమె విప్పుతూ వచ్చింది. అసలు కబీర్ రాసిందేదో, అతడి పేరుమీద ప్రచారమయినదేదో విడదీసి చూడటానికి, చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

కబీర్ పేరిట లభ్యమవుతున్న సంకలనాలన్నిటిలోనూ మూల కబీర్ ని విశ్వసనీయంగా మనకు పరిచయం చేసినవాడు డా. పారస్ నాథ్ తివారీనే అని ఆమె నిర్ధారించింది. ముఖ్యంగా కబీర్ పేరిట లభ్యమవుతున్న 809 దోహాల్లో అసలైన దోహాలు 118 మాత్రమేనని డా.తివారీ తేల్చగలిగాడని ఆమె రాసింది (ఇటువంటి పరిశోధన వేమన విషయంలో ఇంకా జరగవలసే ఉంది).

ఏమాశ్చర్యం! కబీర్ నాకు మొదట పరిచయమైంది డా.తివారీ రాసిన పుస్తకం ద్వారానే. తాడికొండ లైబ్రరీలో 1972-73 లో చదివిన పుస్తకం. అమరేంద్ర (చతుర్వేదుల నరసింహశాస్త్రి) అనువాదం. నా ప్రయాణంలో చివరికి మళ్ళా నేను తివారీ దగ్గరకే చేరుకున్నానన్నమాట.

మొదట్లో ఆమె డా.శ్యామ సుందర దాస్ సంకలనంలొ ఉన్న 809 దోహాల్నీ ఫ్రెంచిలోకి అనువదించింది. కాని తరువాత డా.తివారీ పరిశోధన చూసి, ఇప్పుడు వాటిని మాత్రమే ఇంగ్లీషులోకి అనువదించింది. వాటితో పాటు కొన్ని పదాలూ, రమైనీలు కూడా.

అందుకనే ఆ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అని నేనంతగా కొట్టుమిట్టాడేను.

ఆ దోహాల్లోంచి మీకోసం కొన్ని:

విరహభుజంగం

1

విరహభుజంగం తనువులో చొరబడ్డాక
ఏ మంత్రమూ దాన్ని మరిపించలేదు,
అతణ్ణుంచి దూరమయ్యాక బతకడం
కష్టం, బతికినా పిచ్చిపట్టడం ఖాయం.

2

విరహభుజంగం దేహంలో చొరబడింది
నా అంతరాంతరాన్ని తినేస్తోంది
అయినా సాధువు రవ్వంతైనాచలించడు
ఎట్లా నచ్చితే అట్లా కాటువెయ్యంటాడు.

3

హృదయం లోపల దావాగ్ని రగులుతున్నా
బయటకి పొగ కనిపించడం లేదు,
ఆ మంట ఎట్లాంటిదో రగిలించినవాడికి
తెలుసు, అనుభవిస్తున్నవాడికి తెలుసు.

4

భవసాగరం నుంచి బయటపడటానికి
తెప్పలాగా ఒక పాము దొరికింది,
వదిలిపెట్టానా, మునిగిపోతాను
పట్టుకున్నానా, కాటువేస్తుంది.

5

వైద్యుడా, ఇంక ఇంటికి బయల్దేరు
నువ్వు చెయ్యగలిదిందేమీలేదు,
ఎవడు ఈ వేదన రగిలించాడో
వాడే దీన్ని బాగుచేస్తాడు.

6

విరహం,విరహమని నిందించకు,
విరహం సులతాను,
విరహం లేని దేహం
మట్టి, మశానం.

29-4-2016

Leave a Reply

%d bloggers like this: