కబీరు-5

 

328

‘ఆదిగ్రంథం’ శిక్కుల అయిదవ గురువు అర్జనదేవ్ సంకలనం చేసి స్థిరపరిచిన కీర్తనల సంపుటి. అందులో అర్జనదేవ్ తో సహా, అయిదుగురు సిక్కు గురువుల కీర్తనలతో పాటు కబీర్, నామదేవ్, జయదేవ్, రైదాస్ వంటి భక్తకవుల కవితలు కూడా ఉన్నాయి.

ఆ భక్తి కవుల కవితల్ని మొదటగా ఎవరు సంకలనం చేసారో తెలియదు. కాని గురు అమర దాస్ వాటిని సేకరించి ఉండవచ్చునని ఒక ఊహ. కాని వాటిలో కబీర్ కవితలు గురునానక్ దేవులే సేకరించి ఉండవచ్చుననడానికి కూడా అంతర్గత సాక్ష్యముంది. ‘ఆదిగ్రంథం’ లోని కబీర్ కవితలను పోలిన కీర్తనలు కొన్ని నానక్ కూడా రాసి ఉన్నట్టు కనిపిస్తున్నది.

1604-05 నాటికి సంకలితమైన ఆదిగ్రంథం లో కబీర్ పేరు మీద 228 పదాలు, 243 దోహాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కబీర్ గ్రంథావళిలోగాని, బీజక్ లో గాని కనిపించడం లేదు. కాని ఆదిగ్రంథం 1604 నుంచి ఇప్పటిదాకా ఎటువంటి మార్పులకు లోను కాకుండా ఉన్నందువల్ల, ఈ కవితల్లో కనబడే కబీర్ మరింత విశ్వసనీయుడని చాలమంది పండితులు భావిస్తూ ఉన్నారు.

కాని నాకేమనిపించిందంటే, ‘కబీర్ గ్రంథావళి’ (శ్యామ సుందర దాస్, పారస్ నాథ్ తివారి మొదలైన వారి సేకరణలు), ‘బీజక్’, ఆదిగ్రంథం, ‘కబీర్ సాహెబ్ శబ్దావళి’, క్షితిమోహన్ సేన్ సంకలనం (ఇందులో కవితలే టాగోర్ అనువదించాడు) వంటిసంకలనాల్లో కనిపిస్తున్న కబీర్ కన్నా మూల కబీర్ మరింత విస్తృతమైనవాడూ, మరింత విశ్వమానవుడూనని. ఆయనలో తమకు నచ్చిన ఒక్కొక్క పార్శ్వాన్ని పట్టుకుని, ఆయన కవితలు కొన్ని, ఆ ధోరణిలోమరి కొందరు అజ్ఞాతకవులు కబీర్ పేరిట రాసినవి కొన్ని ఆయా సంకలనకర్తలు సేకరించి ఉంటారని.

ఉదాహరణకి, రాజస్థాన్ ప్రాంతంలో కృష్ణభక్తి తీవ్రత ఎక్కువ కాబట్టి, అక్కడ సేకరించిన కబీర్ గ్రంథావళిలో కబీర్ ప్రేమోద్రిక్తమానవుడిగా కనిపిస్తాడు. హిందూ, మహ్మదీయ ధర్మాల్లోని అనౌచిత్యాల్ని ఎత్తిచూపి, వాటికన్నా భిన్నమైన గురుశిష్య సంప్రదాయం నుంచి వచ్చిన బీజక్ లో కబీర్ మరొక విధంగా కనిపిస్తాడు. అలాగే, హిందూ, మహ్మదీయ మతాచరణలకన్నా భిన్నమైన ఆధ్యాత్మిక అన్వేషణను సాగించిన శిక్కు గురువులు సేకరించిన కబీర్ మరొక రీతిలో కనబడతాడు.

ఆదిగ్రంథంలో కనబడే కబీర్ మూడు విషయాల గురించి పదేపదే మాట్లాడతాడు. మొదటిది, శబ్దం. అది అనాహతం. అది అవినాశి. అది నీలోపలే వినిపిస్తున్నది. నువ్వు దాన్ని వినగలిగితే, బాహ్యాచరణ, తీర్థయాత్రలు, ఉపవాసాలు, జపతపాలు ఏవీ అవసరం లేదు. రెండవది, నీ ఇంటిలోనే (ఇల్లు ఇక్కడ దేహమనే అర్థం లో కూడా) నీ ముక్తి. మూడవది, నిన్ను అహర్నిశం వెంటాడుతున్న మృత్యువునుంచి నిన్ను కాపాడగలిగేది ఆ శబ్దం మాత్రమే. దాన్నే అతడు గురువు, హరి, సారంగపాణి,మధుసూధనుడు లాంటి పదాలతో సూచిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రాముడు. ఈ రాముడు దశరథ తనయుడు కాడు. ఇతడు సర్వాంతర్యామి కాగా దశరథ రాముడు ఒక దేహధారి మాత్రమే. (దోహా. 191).

ఈ దర్శనానికి ఉదాహరణగా:

అది రాముడి అంశ

అది మనిషి కాదు, దేవుడూ కాదు
బ్రహ్మచారికాదు, శివారాధకుడూ కాదు
యోగికాదు, అవధూత కాదు
దానికి తల్లిలేదు, అదెవరి కొడుకూ కాదు.

ఈ మందిరంలోనే నివసిస్తున్నది, అదేమిటది?
దాని ఎల్లలు తెలిసినవారు లేరు.

అది గృహస్థు కాదు, సన్యాసి కాదు,
రాజు కాదు, భిక్కు కాదు,
పిండదేహం కాదు, రక్తబిందువుకాదు,
బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు.

అది తపస్వి కాదు, షేకు కాదు
జీవించేది కాదు, మరణించేది కాదు
అది మరణించిందని ఎవరైనా దుఃఖిస్తే
వాళ్ళకే అమర్యాద.

గురుప్రసాదంవల్ల నాకు దారి దొరికింది
జీవన్మరణాలు చెరిగిపొయ్యాయి.
కబీర్ అంటున్నాడు, అది రాముడి అంశ,
కాగితం మీద సిరా చుక్కలాగా  చెరిగిపోదు.

(గౌండ్ రాగకీర్తన: నా ఎహూ మానస్, నా ఎహూ ధేయో..)

ఆకలితో నీ ప్రార్థన చెయ్యలేను

ఆకలితో నీ ప్రార్థన చెయ్యలేను
ఈ జపమాల నువ్వే తీసేసుకో.

నాకు కావలసింది సాధుపాదధూళి
నేనెవరికీ ఋణపడిందేమీ లేదు.

మధూ, నేను నీతో ఉండేదెట్లా?
నీ అంతట నువ్వివ్వకపోతే నేనిట్లా అడుక్కుంటూనే ఉంటాను.

నాకు కావలసింది రెండు శేర్లు పిండి
గిన్నెడు నెయ్యి, కొంచెం ఉప్పు.
కాసింత పప్పు.
దాంతో రెండు రోజులు గడుస్తాయి.

నేను కోరుకునేదొక నులకమంచం
తలగడ, బొంత,
కప్పుకోడానికి కంబళి,
అప్పుడు ఈ సేవకుడు తన్మయుడై నీ గానం చేస్తాడు.

నాకు పేరాస లేదు
నీ నామమే నా సంపద.
కబీర్ అంటున్నాడు, నా మనసు తుష్టి చెందింది
తృప్తి చెందిన మనస్సుతో హరిని తెలుసుకున్నాను.

( సురటి రాగ కీర్తన, భూకా భగత్ న కీజై..)

24-4-2016

Leave a Reply

%d bloggers like this: