కబీరు-4

Reading Time: 2 minutes

330

‘బీజక్’ కబీర్ రచనల్లో ఎక్కువ ప్రసిద్ధి చెందిన సంకలనం. అన్నిటికన్నా ముందు ముద్రణ పొందింది కూడా. పందొమ్మిదో శతాబ్దంలోనే మూడు సార్లు ముద్రణ పొందింది. ముఖ్యంగా ‘కబీర్ పంథీ’ లుగా పిలవబడే కబీర్ మార్గీయులు పాశ్చాత్యుల దృష్టిని ఎక్కువ ఆకర్షించినందువల్ల కూడా ఇరవయ్యవశతాబ్ది మొదటిరోజులదాకా బీజక్ సుప్రసిద్ధంగా ఉండింది. 1917 లోనే అహ్మద్ షా అనే ఆయన ఆ గ్రంథాన్ని ఇంగ్లీషులోకి మొదటిసారి అనువదించాడు.

అయితే దాదూ పంథ్ వారి సంకలనంగా చెప్పదగ్గ ‘కబీర్ గ్రంథావళి’ ని ఆచార్య శ్యామ సుందర దాస్ 1928 లో ప్రచురించేక, బీజక్ ప్రశస్తి కొద్దిగా వెనకబడింది. ఆ గ్రంథానికి ఉన్న ప్రాధాన్యతను పరిమితం చెయ్యడం కూడా మొదలయ్యింది.

ఆ పరిమితులనుంచి ‘బీజక్’ ని లేవనెత్తడానికి లిండా హెస్, సుఖదేవ్ సింగ్ లు 1983 లో మరొక ఇంగ్లీషు అనువాదాన్ని వెలువరించారు. తమ అనువాదంలో భాగంగా బీజక్ విశిష్టతను మరొకసారి విపులంగా చర్చకు తీసుకొచ్చారు.

బీజక్ లో కనబడే కబీర్ చాలా సూటి మనిషి. అందులో ఆయన తనతో తాను మాట్లాడుకోడు, లేదా దేవుడితోనో, రాముడితోనో మాట్లాడడు. నేరుగా తన కాలం నాటి సాధువుల్ని, సంతుల్ని, సజ్జనుల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. చాలాసార్లు పండితుల్ని, కాజీల్ని రెచ్చగొడతాడు, ప్రశ్నిస్తాడు, ఎండగడతాడు. ధార్మిక సంబంధమైన విషయాల్లో కనవచ్చే అనౌచిత్యాలకి మూలం సామాజిక అనాచారాల్లోనూ, అసమానతల్లోనూ ఉందని ఎత్తిచూపుతాడు.

బీజక్ కర్త కబీర్ స్పష్టంగా సామాజిక సుధారకుడు, తాను పొందిన సత్యాన్ని, శాంతిని మనకి కూడా ఇవ్వాలని తపించేవాడు, ఆ సంతోషం మనమెందుకు పొందట్లేదని ఆశ్చర్యపోయేవాడు, తన మాటలు వినమేమని మొత్తుకుంటాడు, వినకపోతే నష్టపోయేది మనమేనని బెదిరిస్తాడు.

అట్లాంటి కబీర్ వాణికి ఉదాహరణగా:

పండితుడా, నువ్వు ఆలోచిస్తున్నది మిథ్య.

పండితుడా, నువ్వు ఆలోచిస్తున్నది మిథ్య.
సృష్టి లేదు, సృజనహరుడు లేడు,
స్థూలమూ లేదు, అస్థూలమూలేదు
పవనం లేదు, పావకుడు లేడు
రవి, శశి, ధరణి, నీరు ఏదీ లేదు
జ్యోతిస్వరూపికాలం లేదు, వచనం లేదు
శరీరం లేదు, ధర్మం లేదు, కర్మ లేదు
మంత్రం లేదు, పూజ లేదు
సంయమ సహిత భావనలులేవు, వేదవిచారం లేదు
హరి, బ్రహ్మ, శివుడు, శక్తి లేవు
తీర్థం లేవు, ఆచారం లేదు
తల్లి, తండ్రి, గురువు లేరు
అక్కడున్నది ఒకడా ఇద్దరా?
కబీర్ చెప్తున్నాడు, నీకిది ఇప్పుడే అర్థమయిందా
నువ్వే గురుడివి, నేను శిష్యుణ్ణి.

( పండిత్ మిథ్యా కరహు బిచారా, బీజక్, శబ్ద్, 43)

ఇదంతా పెద్ద అయోమయం

ఇదంతా పెద్ద అయోమయం
వేదం, గ్రంథం, శౌచం, నరకం, నారి, నరుడు
శబ్దంతో, బిందువుతో నింపిన మట్టిపాత్ర
ఆ ఘటమే లేకపోతే ఏ పేరుపెట్టి పిలుస్తావు?
మూర్ఖుడా, నీ వెతుకులాట వదిలిపెట్టు.
ఇదంతా ఒకటే అస్థిచర్మం,
ఒకటే మలమూత్రం,
ఒకటే రక్తం, ఒకటే గుజ్జు.

ఒక్క బిందువునుంచే సమస్త సృష్టి రచన
ఎవరు బ్రాహ్మడు, ఎవరు శూద్రుడు?

రజోగుణం బ్రహ్మ, తమోగుణం శంకరుడు, సత్త్వగుణం హరి
కబీర్ చెప్తున్నాడు: రాముడిలో రమించండి,
అక్కడ హిందువు లేడు, తురక లేడు.

( ఐసో భరమ్ బిగుర్చన్ భారీ, బీజక్, శబ్ద్, 75)

మేల్కోండి, మేల్కొండి

నువ్వెప్పుడూ మంచివాళ్ళతో కలిసి బతకలేదు
నీ జీవితాన్ని నీ చేతుల్తో నువ్వే పారేసుకున్నావు
రేపు మళ్ళా నీకిట్లాంటి చోటు దొరకదు
మంచివాళ్ళ సాంగత్యం నీకు తెలియనే తెలియదు
ఇప్పుడింక నీకు మిగిలింది నరకమే
మిథ్యావాదులతో కలిసి తిరిగినదాని ఫలితం.

అందరూ ఇట్లానే నశించడం చూస్తూ
అరుస్తున్నాడు కబీర్:
మేల్కోండి, మేల్కొండి! పట్టపగలే
మిమ్మల్ని దోచుకుపోతున్నారు.

(బీజక్, కబహు న భయవు సంగ్ ఓ సాధా, రమైనీ, 44)

21-4-2016

Leave a Reply

%d bloggers like this: