కబీరు-3

Reading Time: 2 minutes

329

కబీర్ కవిత్వానికి సంబంధించిన సంకలనాల్లో అన్నిటికన్నా ఇప్పుడు విశిష్టంగా భావించబడుతున్నది ఆచార్య శ్యామ్ సుందర దాస్ ద్వివేదీ సేకరించిన ‘కబీర్ గ్రంథావళి’ (1928).

వారణాసిలోని నాగరి ప్రచారణసభ వారిదగ్గర 1922 లో బయటపడ్డ లిఖితప్రతి ఆధారంగా పరిష్కరించిన సంకలనమది. క్రీ.శ. 1504 నాటిదిగా భావించబడుతున్న ఆ రాతప్రతి, ఒక విధంగా, కబీర్ జీవించి ఉండగానే అతడి అభిమానులు సేకరించిన సంకలనంగా చెప్పవచ్చు. అటువంటి రాతప్రతి క్రీ.శ.1824 నాటిది మరొకటి కూడా దొరికింది. రాజస్థాన్ ప్రాంతంలో లభ్యమైన కబీర్ సంకలనాల్లో 1504, 1824 రాత ప్రతుల్లోని కవితలన్నీ కూడా కనబడటంతో ‘కబీర్ గ్రంథావళి’ ని అన్నిటికనా అత్యంత పురాతనమైన, ప్రామాణికమైన ఆధారంగా పరిగణిస్తున్నారు. ఈ రెండు ప్రతుల్లోనూ కలిపి 408 పదాలు, 941 దోహాలు, 7 రమైనీలు లభ్యమవుతున్నాయి.

‘ఆదిగ్రంథం’ లో లభ్యమవుతున్న కబీర్ కవిత్వం 1604 నుంచీ చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, బీహార్ లో లభిస్తున్న ‘బీజక్’ పవిత్రగ్రంథంగా పరిగణింప బడుతున్నప్పటికీ, కబీర్ స్ఫూర్తిని సమగ్రంగా ప్రతిబింబించే సంకలనం ‘కబీర్ గ్రంథావళి’ అనే చెప్పవలసి ఉంటుంది.

అందులో కనిపిస్తున్న పదకర్త కబీర్ ప్రేమశరాఘాతానికి గురయినవాడు. రాముణ్ణీ, రహీముణ్ణీ ఒకటిగా భావించి పూర్తిగా హృదయానికి హత్తుకున్నవాడు.

పదావళిలో కనిపించే ప్రేమ సరికొత్త ప్రేమ. దాన్ని వ్యాఖ్యాతలు రాస్తున్నట్టుగా జీవాత్మ, పరమాత్మ ల ప్రేమగా వివరించడం ఆ కవిత్వాన్ని చాలా స్థూలంగానూ, బాధ్యతారహితంగానూ సమీపించడమే.

అది అన్నిటికన్నా ముందు ప్రేమ. ప్రేమావస్థ, మనుషుల మధ్యనైనా, మనిషికీ, భగవంతుడికీ మధ్యనైనా ఒక్కలానే ఉంటుంది. కాకపోతే మనుషుల మధ్య ప్రేమ స్థిరం కాకపోవచ్చు. కానీ, ఆ ప్రేమ కలిగిన క్షణాన, ఒక మనిషి మరొక మనిషి పట్ల లోనుకాగల పారవశ్యానికీ, భగవత్ప్రణయ పారవశ్యానికీ మధ్య తేడా ఏమీ ఉండదు. ఆ మాటకొస్తే, మనుచరిత్రలో ‘ఏ విహంగమ కన్న ఎలుగిచ్చుచును.. ‘ అనే చక్రవాకి విరహం గురించిన పద్యం గురించి చెప్తూ మా మాష్టారు ‘విరహం తిర్యగ్గతం అయితే ఏమిటి? మనుష్య గతం అయితే ఏమిటి? భావం ప్రధానం, జాతి కాదు’ అని అన్నారు.

కబీర్ పదాల్లో కనవచ్చే ప్రేమానుభవ వర్ణన, ప్రణయానుభూతి, మానసిక సంచలనం, స్తిమితం నుండి ఉన్మాదందాకా కనవచ్చే సకలావస్థలూ మానవానుభవ వర్ణనలో విశ్వసాహిత్యంలో ఒక విశేషమైన అధ్యాయంగా నిలబడతాయి.

ప్రవక్త వాక్యం ‘ఒక విశ్వాసికి మరొక విశ్వాసి దర్పణం’ అన్న మాటని రూమీ అనుసరించి షమ్స్ లో తనని తాను చూసుకుని ప్రేమ కవిత్వం చెప్పాడు. ఆ ప్రేమను మానవీయ ప్రేమగా దర్శించడానికి ఖుస్రో మధ్యాసియా అంతా కలయదిరిగాడు. మరొకవైపు, తన సోదరుడు నివృత్తినాథుడినే తన గురువుగా భావిస్తూ జ్ఞానేశ్వరుడు కవిత్వం చెప్పాడు. అటువంటి గురువును అన్వేషిస్తూ నామదేవుడు ఉత్తరభారతదేశమంతా సంచరించాడు. అటు రూమీ, ఇటు జ్ఞానదేవుడూ-ఇద్దరూ కబీర్ కి దారి చూపించారనుకోవాలి.

ఆ దారిన నడిచిన వాడి ప్రేమ కవిత్వమెట్లా ఉంటుందో రెండు ఉదాహరణలు:

అమ్మా, ఆ రోజులెప్పుడొస్తాయే?

అమ్మా, ఆ రోజులెప్పుడొస్తాయే?

ఎవరికోసం ధరించేనో ఈ దేహం
దీన్నివాడెప్పుడు హత్తుకుంటాడే?

నా తనుమనప్రాణాలతో వాడు
ఆడుకునే ఆ రోజు రానుందని తెలుసు.

రాజా, నా కోరికతీర్చగలిగే వాడివి
సమర్థుడివి, నువ్వు మటుకే.

ఉదాసీనాలు నువ్వు లేని రోజులు
రెప్పవాల్చకుండా రేయిగడుపుతున్నాను.

మేను వాల్చానా ఆకలిగొన్న పులిలాగా
నా శయ్య నన్ను తినేస్తోంది.

నా మొరాలకించు
నా తపన చల్లార్చు

కబీర్ చెప్తున్నాడు, వాడొస్తూనే మేమిద్దరం
కలిసి చక్కటి పాటలు పాడుకుంటాం

(వే దిన్ కబ్ ఆవేంగే మాయి. కబీర్ గ్రంథావళి,306)

జనులారా నన్ను నిందించండి

జనులారా నన్ను నిందించండి
నిందించండి, నిందించండి
నా తనువూ, మనసూ
రాముడితో పెనవైచుకున్నాయి

పిచ్చిదాన్ని, రాముడు నా భర్త
అతడికోసమే ఈ శృంగార రచన.

చాకివాడు చీర పిండిపిండి
మురికి వదలగొట్టినట్టు
నన్ను నిందిస్తున్నవాడు
నా మరకలు చెరుపుతున్నాడు.

నన్ను నిందిస్తున్నవాడు
తల్లిలాగా, తండ్రిలాగా హితైషి,
ప్రాణసమానుడు, నా వికారాలు
తుడిచిపెడుతున్నాడు.

కబీర్ చెప్తున్నాడు, నిందించేవాడెంత త్యాగి!
వాడు మునుగుతూ నన్ను దాటిస్తున్నాడు.

( భలై నీందౌ, భలై నీందౌ. కబీర్ గ్రంథావళి.342)

17-4-2016

Leave a Reply

%d bloggers like this: