కబీర్ కవిత్వం ప్రధానంగా మూడు ఆధారాలనుంచి లభించింది. ఒకటి, నానక్ సేకరించి ‘ఆదిగ్రంథం’ లో సంకలనం చేసిన కొన్ని దోహాలు, పదాలు. మరొకటి తూర్పు ప్రాంతాల్లో కబీర్ పంథీయులు ఒక పవిత్రగ్రంథంగా పరిగణిచే ‘బీజక్’, మూడవది, రాజస్థాన్ ప్రాంతం నుంచి సేకరించిన కబీర్ రచనావళి.
మూడింటిలోనూ కబీర్ రచనల్ని మూడు భాగాలుగా గుర్తిస్తున్నారు. ‘సాఖీ’ గా పిలవబడే దోహాలసముచ్చయం, ‘సబద్’ గా పిలవబడే శబ్దావళి లేదా పదావళి, ‘రమైనీ’ లు. కబీర్ పుస్తకజ్ఞానాన్ని ఇష్టపడలేదు కాబట్టి, తానేమి చూసాడో దాన్నే ఒక సాక్షిగా, అంటే సాఖీగా మనకు వినిపించాడు. మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న నీతిపద్యాలు ఆ దోహాల్లోంచి పరిచయం చేసినవే. కాని వేమన పద్యాల్లానే దోహాలన్నీ నీతిపద్యాలు కావు.
జీవితసత్య సూక్ష్మప్రకటనలవి.
కాని కవిగా కబీర్ లోని భావావేశం, హృదయావేదన ఆయన పదావళిలో కనిపిస్తాయి. ఈశ్వరుణ్ణి చేరుకునే దారి (ఇష్క్ హఖీకీ) ఈ లోకం లోంచే (ఇష్క్ మజాజీ) ఉందనే సూఫీ తత్త్వమూ, ‘ఈసావాస్య మిదం సర్వమ్’ అనే ఉపనిషన్మతమూ మేలవించిన ఆ ప్రేమ పారవశ్యానికి స్ఫూర్తి ఎక్కడిదో చెప్పడం కష్టం. జ్ఞానేశ్వరుడు మహారాష్ట్రీ ప్రాకృతంలో చెప్పిన విరహిణి అభంగాలు నామదేవుడి సంకీర్తనల ద్వారా కబీర్ కు దారి చూపాయా లేక ఖుస్రో నుంచి రూమీదాకా సూఫీ కవుల భగవద్ప్రణయగానం ఆయన్ను ప్రేరేపించిందా?
ఏమైనా ఆయన్నుండి మనకు లభించిన ఆ పదాలు విశ్వసాహిత్యంలోనే అత్యున్నతస్థాయి గీతాలు. ఇరవయ్యవ శతాబ్దం మొదలుకాగానే, ఆ గీతాలే ఒక టాగోర్ నీ, ఒక గాంధీనీ ఉత్తేజితుల్ని చేసి మళ్ళా మనకొక తోవ చూపించేయి.
అపురూపమైన ఆ గీతమాధుర్యాన్ని, ఆ సంగీతాన్ని ఎలానూ మూటగట్టలేను, కనీసం ఆ భావాలైనా నా పొడి పొడి మాటల్లో చూడండి:
చెప్పలేనిది ప్రేమ కథ
చెప్పలేనిది ప్రేమ కథ
చెప్పగలిగే వాళ్ళూ లేరు
అది మూగవాడు తిన్న చక్కెర, ఆ
రుచికి చిరునవ్వు ఒక్కటే వివరణ.
ప్రేమ తరువు వికసించడానికి
భూమీ, బీజమూ అక్కర్లేదు
అంతులేని పండ్ల వెలుగు, నా
స్నేహితుడే నాకు రుచి చూపించాడు.
మనసు పడి నేనతణ్ణి తలచుకోగానే
ఊహలన్నీఊకలాగా చెదిరిపోయాయి
కబీర్ అంటున్నాడు, ఆ శక్తి నాది కాదు
నాకు తోడు నిలబడ్డవాడిది.
మనసు మనసుని చేరుకుంది,
ఊగిసలాట ముగిసిపోయింది.
(అకథ్ కహానీ ప్రేమ్ కీ, కబీర్ గ్రంథావళి. 156)
ఎన్నాళ్ళైనా వెలిసిపోని రంగు
అతడి పేరు నా వంటికద్దుకున్నాను
అది ఎన్నాళ్ళైనా వెలిసిపోని రంగు
వందరంగులైనా
సాటిరాని రంగు.
ఈ రంగు వంటికద్దుకోగానే
అన్ని రంగులూ చెరిగిపొయ్యాయి
ఒక్కసారి పూసుకున్నాక ఆ వన్నె
ఎన్నటికీ చెరగదని తెలుసుకున్నాను
కబీర్ అంటున్నాడు, అతడే
ఒక రంగై నన్ను హత్తుకున్నాక
మరే రంగులూ వంటబట్టవు.
(రామ్ నామ్ రంగ్ లాగో, కబీర్ గ్రంథావళి. 215)
రాముడు లేక ఈ ప్రపంచమంతా
రాముడు లేక ఈ ప్రపంచమంతా పొగ, మంచు.
నెత్తిపైన వేలాడుతున్నది కాలం విసిరిన పాశం.
దేవపూజ చేస్తూ చేస్తూ హిందువు మరణిస్తున్నాడు
హజ్ యాత్ర చేస్తూ చేస్తూ తురక మరణిస్తున్నాడు
అట్టకట్టిన జడలు పెంచి యోగి మరణిస్తున్నాడు
ఒక్కడు కూడా అతడెక్కడున్నాడో చూడకున్నారు
కవితలు రాసి రాసి కవులు మరణిస్తున్నారు
యాత్రలు చేసి చేసి యాత్రికులు మరణిస్తున్నారు
జుట్టు పీక్కుని పీక్కుని తాపసులు మరణిస్తున్నారు
అయినా ఒక్కరూ అతడెక్కడున్నాడో చూడకున్నారు
డబ్బు పోగుచేసి పోగుచేసి రాజు మరణిస్తున్నాడు
వేదాలు చదివి చదివి పండితుడు మరణిస్తున్నాడు
ఒంటిని సింగారించి సింగారించి వనిత మరణిస్తున్నది
వారిలో ఒక్కరూ అతడెక్కడున్నాడో తెలియకున్నారు
బీదనేతకాడు కబీర్ చెప్తున్నాడు, వినండి, తమని
తామెవరు గుర్తుపడతారోవారే బయటపడతారు.
(రామ్ బినా సంసార్ ధంధ్ కుహేరా, కబీర్ గ్రంథావళి. 317)
15-4-2016