కబీరు-1

 

k1

కబీర్ మీద నేను తెలుగులో చదివిన పుస్తకాల్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పారస్ నాథ్ తివారీ రాసిన మోనోగ్రాఫ్, సాహిత్య అకాదెమీ కోసం సరస్వతీ పుత్రులు చేసిన అనువాదం ‘కబీరు వచనావళి’ మరవలేనివి. ఎన్నో ఏళ్ళుగా నా కూడా వస్తున్నవీను. అందులోనూ సరస్వతీపుత్రుల అనువాదం కబీరే తెలుగులో రాసాడా అన్నట్టుంటుంది. ఆ అనువాదానికే ఆయనికి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వవచ్చు.

వారం దినాల కిందట ఆదిత్య ఫోన్ చేసి ఆ అనువాదానికి మూలం అయోధ్యాసింహ్ ఉపాధ్యాయ ‘హరి ఔధ్’ చేసిన సంకలనమనీ, ఎక్కడా లభ్యంగా లేని ఆ అరుదైన ప్రతిని తాను తెప్పించుకున్నాననీ చెప్పడంతో మళ్ళా నాలో కబీర్ అగ్ని రగిలింది.

తక్కిన ప్రపంచంతో పాటు నాకు కూడా కబీర్ ని ఇంగ్లిషులో పరిచయం చేసింది టాగోరే. ఆయన ఎంపిక చేసి అనువదించిన One Hundred Poems of Kabir (1915) ను చదివితే గీతాంజలి మొదటి వెర్షన్ చదివినట్టుంటుంది. నేను నా నిర్వికల్ప సంగీతంలో కబీర్ నుంచి చేసిన రెండు అనువాదాలూ టాగోర్ నుంచి తెలుగు చేసినవే.

ఆ తర్వాత చెప్పుకోదగ్గవి: ఛార్లెట్ వాడవిల్లి A Weaver Named Kabir (1997), వినయ్ ధార్వాడ్ కర్ The Weavers Songs (2003), ప్రభాకర్ మాచ్వే సాహిత్య అకాడెమీ కోసం రాసిన మోనోగ్రాఫ్ (1967) లతో పాటు అరవింద్ కృష్ణ మెహ్రోత్రా సంకలనం, అనువాదం Songs of Kabir (ఎవిరిమన్, 2011), లిండా హెస్, సుఖదేవ్ సింగ్ అనువదించిన The Bijak of Kabir ( ఆక్స్ ఫర్డ్, 2002) లు.

కాని వాటన్నిటికన్నా గొప్ప అనువాదాలు, రాధాస్వామి సత్సంగ్, బియాస్ వారి కోసం వి.కె.సేథి చేసిన సంకలనం, అనువాదం, Kabir, The Weaver of God’s Name (1984), ఇసాక్ ఎ ఎజికీల్ చేసిన సంకలనం, అనువాదం Kabir, The Great Mystic (2002) లతో పాటు కబీర్ పదావళినుంచి జి.ఎన్.దాస్ ఎంపిక చేసి అనువదించిన The Love Songs of Kabir (అభినవ్ పబ్లికేషన్స్, 1992) నన్ను గాఢంగా సమ్మోహితుణ్ణి చేస్తూనే ఉన్నాయి.

కాని ఆదిత్య హిందీ మూలం కోసం వెతుకుతున్నాడని తెలిసాక, నేను కూడా హిందీ మూలాన్నే ఎందుకు చదవకూడదనిపించింది. ముఖ్యంగా, హీరాలాల్ మాష్టారి దగ్గర చదువుకున్నందుకైనా, తాడికొండలో ఆయన నోటివెంట లలితమధురంగా కబీర్ దోహాల్ని విన్నందుకైనా, కబీర్ ని నేరుగా హిందీలోనే ఎందుకు చదవకూడదని, ఇప్పుడు శ్యామ్ సుందర్ దాస్ సంకలనం చేసిన కబీర్ గ్రంథావళి సటీకంగా పఠించడం మొదలుపెట్టాను.

ఈ వారం రోజులుగా కబీర్ నే తింటూ, తాగుతూ బతుకుతున్నాను. ముఖ్యంగా ఆయన ప్రేమగీతాలు. వాటిలో కొన్నింటినైనా పాటలుగా అనువదించాలని ఉంది. కానీ ఈ లోపు ఉండబట్టలేక, ఆయన దోహాల్లోంచి ఒకటి రెండు అనువాదాలు:

ఒక్కడూ కనబడలేదు

1

ఈ భవసాగరంలోంచి నన్ను జుట్టుపట్టుకు పైకి లేపగలినవాడు
నేను వినదగ్గ మాటలు చెప్పగలిగేవాడు, ఒక్కడూ కనబడలేదు.

2

నన్ను ప్రేమించేవాడు, ఇక్కణ్ణుంచి అక్కడికి దాటించేవాడు
నా అవసరమేదో తనే కనుక్కునేవాడు, ఒక్కడూ కనబడలేదు.

3

పాటవింటూనే వేటగాడికి లొంగిపొయ్యే జింకపిల్లలాగా
నన్నర్పించుకుందామంటే ఒక్కడూ కనబడలేదు.

4

నన్ను నేనర్పించుకుందామంటే ఒక్కడూ కనబడలేదు,
లోకమంతా ఎవరి చితుల్లో వాళ్ళు దగ్ధమవుతున్నారు.

5

నిస్సంకోచంగా మనసుపంచుకోడానికి ఒక్కడూ కనబడలేదు.
ఎవడి ముందు హృదయం విప్పితే వాడే కాటు వేస్తున్నాడు.

6

లోకం నశించడం నేను చూస్తున్నాను, నన్ను లోకం చూస్తున్నది.
దీన్నుంచి బయటపడవెయ్యగలవాడు, ఒక్కడూ కనబడలేదు.

7

ఎక్కడచూడు, మాయామోహమే, అవే పిచ్చిమాటలు,
ప్రేమశరం తగిలి గాయపడ్డవాడొక్కడూ కనబడలేదు

8

ఎవరిని చూడు, వీరులూ, శూరులే, గాయపడ్డవాడొక్కడూ లేడు
గాయపడ్డవాడికి గాయపడ్డవాడు దొరికితే కదా ప్రేమ బలపడేది.

9

ప్రేమ కోసం పిచ్చిగా తిరిగాను, ప్రేమించదగ్గవాడు కనబడనేలేదు
ఒక ప్రేమికి మరొక ప్రేమి దొరికితే కదా, విషం అమృతమయ్యేది.

10

నా ఇంటికి నిప్పు పెట్టుకుని కొరివి చేతపట్టుకున్నాను,
ఇప్పుడు నా వెంటనడిచే వాడి ఇంటికి నిప్పుపెడతాను.

(కబీర్ గ్రంథావళి, గురు శిష్ హేరా కౌ అంగ్, 1-3, 5-6, 8,10-13)

12-4-2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s