‘నిన్ను నలుగురూ దేనికోసం గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నావు? నువ్వు సమర్పించిన పి.ఎచ్.డి సిద్ధాంత వ్యాసం కోసమా? నీ ప్రయోగశీల భావనలకోసమా? నిన్నూ, నీ జీవితాన్నీ నువ్వే తీర్చిదిద్దుకోవాలి. దాన్ని నువ్వొక పుటపై లిఖించుకోవాలి. మానవ చరిత్ర అనే గ్రంథంలో ఆ పుట బహుశా అతిముఖ్య పుటగా మారవచ్చు. అది ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి సంబంధించిన పుట కావచ్చు, కొత్త పుంత తొక్కడం గురించి కావచ్చు. కొత్త అన్వేషణకు సంబంధించిన పుట కావచ్చు లేదా ఏదో ఒక అన్యాయాన్ని ఎదిరించడం గురించి కావచ్చు. కాని నీ జాతి చరిత్రలో అటువంటిదేదో ఒక పుటను రూపొందించినందుకు మాత్రమే నువ్వు శాశ్వత స్మరణీయుడవుతావు..’ అంటున్నారు కలాం ఈ పుస్తకంలో.
సరాసరి తన హృదయాని చీల్చుకు వచ్చే సరళవాక్యాలతో జాతి జీవితం పట్ల తన మమేకత్వాన్ని మనతో కలాం పంచుకోవడం ఈ పుస్తకం సారాంశం. మానవ, జాతీయ, గ్లోబల్ అంశాలెన్నిటిపైనో కలాం మదిలో చెలరేగిన భావాల సమాహారం ఈ పుస్తకం. సరాసరి మన ఎదురుగా నిలబడి మన కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుండే మంత్రమయవాక్యాల సంపుటం ఈ పుస్తకం.
ఇంగ్లీషులో Indomitable Spirit పేరిట వెలువడ్డ ఈ పుస్తకాన్ని రీమ్ పబ్లికేషన్స్ కోసం వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగు చేసారు.
ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.