మరొకవందేళ్ళపాటు నిలిచే నాటకం

a1

కన్యాశుల్కం నాటకం రెండవకూర్పు 1909 లో వెలువడి ఇప్పటికి ఒక శతాబ్దం మీద అయిదేళ్ళు. ఇంతకాలంగా ఈ నాటకాన్ని పూర్తినిడివినాటకంగా 1939 లో ఆంధ్రవిశ్వవిద్యాలయంలోనూ, 1948 లో పర్లాకిమిడిలోనూ ప్రదర్శించారని చెప్తున్నా దానిలో ఎటువంటి సవరణలూ లేకుండా వేసారో లేదో మనకి తెలియదుగాని, నూరేళ్ళ పైబడ్డ ఈ నాటక చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తినిడివి నాటకాన్ని ఇవ్వాళ రవీంద్రభారతిలో ప్రదర్శించారు. నవయువ ఆర్ట్స్, విజయనగరం వారు 65 మంది కళాకారులతో ఎనిమిదిగంటలపాటు ప్రదర్శించిన ఈ నాటకాన్ని చూడటం ఒక జీవితకాలఅదృష్టంగా భావిస్తున్నాను.

నాటకం ముగిసిన తరువాత కళాకారుల పరిచయ సన్మానాలతో పాటు, ప్రేక్షక స్పందన కూడా చెప్పమని నన్ను మిత్రుడు కవితాప్రసాద్ వేదికమీదకి ఆహ్వానించాడు. నాటకం చూసిన పారవశ్యంలో నేనేం మాట్లాడానో గాని, ఇంతకాలం గురజాడ పండితుడిగా నన్ను నేను భావించుకుంటూ వస్తున్నాను గాని, ఈ రోజే ఆ నాటకాన్ని మొదటిసారి చదివినట్టు భావిస్తున్నానిచెప్పాను.

ఇంతకాలం కన్యాశుల్కనాటకాన్ని ప్రశంసించినవాళ్ళూ, విమర్శించినవాళ్ళూ కూడా అది శ్రవ్య కావ్యమే తప్ప దృశ్యకావ్యం కాదన్నారు. నాటకానికి అవసరమైన మూడురకాల ఏకతలూ, స్థలైక్యం, కాలైక్యం, వస్త్వైక్యం అందులో లేవన్నారు. కన్యాశుల్కాన్ని మొదటిసారి ఆధునిక దృష్టితో చూసిన శ్రీశ్రీ కూడా దాని ప్రదర్శనీయత గురించి ఏమీ చెప్పలేకపోయాడు. ఇక ఆ నాటకం నిడివి దానికొక లోపంగా భావించి నార్లవెంకటేశ్వరరావు సాహిత్య అకాడెమీ కోసం దాన్ని చాలా సంక్షిప్తం చేసాడు. పైగా ఆ సంక్షిప్తీకరణని సమర్థించుకుంటూ సుదీర్ఘమైన ముందుమాట కూడా రాసుకున్నాడు.

కాని ఈ రోజు పూర్తి నిడివి ప్రదర్శన చూసినప్పుడు ఆ విమర్శలన్నీ అపోహలని తేలిపోయింది. 21 వ శతాబ్దంలో కూడా హైదరాబాదులాంటి మెట్రొపాలిటన్ లో ఒక ఆదివారం కొన్ని వందలమంది కుర్చీలకు అతుక్కుపోయి ఎనిమిదిగంటలపాటు ఆ నాటకాన్ని చూసారంటే, అది గురజాడ మీద గౌరవంతోటో, ఒక చారిత్రకరచనని చూస్తున్నామన్న గౌరవంతోనో చేసిందికాదు. ఒక నాటకంగా ఆ రచన సజీవంగా ఉండటమే కాకుండా, ఆ పాత్రలు, ఆ కథ, ఆ వేదన చాలా సజీవంగా, ఉత్కంఠావహంగా గోచరించడమే అందుకు కారణం.

ఆ నాటకాన్ని ప్రశంసించిన తొలితరం సాహిత్యవేత్తలు ఆ నాటకంలో కొంతదూరం పోయాక, పాత్రలు గురజాడ చేయిదాటిపోయాయనీ, అవే కథని తమంతతాము నడుపుకుపోయాయనీ అందువల్ల ఆ కథ ఎక్కడెక్కడో తిరిగిందనీ, అందులో కథనకౌశల్యంకన్నా పాత్రోచిత భాషా, పాత్రచిత్రణా, సామజికవిమర్శలదే పెద్దపీట అని మనకి చెప్పారు. బహుశా ఆ నాటకాన్ని వారొక పూర్తినిడివి ప్రదర్శనగా చూసిఉంటే అట్లా రాసిఉండరని నేనిప్పుడు అనుకుంటున్నాను. ఒక నాటక ప్రదర్శనని మనం గొప్ప ప్రదర్శనగా ఎప్పుడు భావిస్తామంటే, ఆ ప్రదర్శన ఆ నాటకానికొక interpretation గా మారగలగాలి. అలా చూసినట్లయితే, ఈ పూర్తిప్రదర్శన తన interpretatitive capacity తో నాతో నాటకాన్ని మళ్ళా కొత్తగా చదివించినట్టనిపించింది.

కన్యాశుల్క దురాచారానికి వ్యతిరేకంగా ఒక నాటకం రాయాలని గురజాడ పూనుకున్నప్పుడు బాల్యవివాహాలూ, వేశ్యావృత్తీ, వితంతుసమస్యా ఒకదానికొకటి ముడిపడ్డవని గ్రహించినప్పుడు, వాటన్నిటినీ అల్లుకుంటూ రాసిన నాటకంలో పాత్రలు అప్పటి సంఘసంస్కర్తల ఆలోచనలకు భిన్నంగా నడవడం కన్యాశుల్కంలో విశేషం. గురజాడ మనస్తత్వంలోని ఈ విపరీతధోరణిని రా.రా చాలా సూక్ష్మంగా వివరించాడు. గిరీశాన్ని ఒక మోసగాడిగా మాత్రమే అర్థం చేసుకున్న కాలంలో, గిరీశం చెడ్డవాడుకాడనీ మంచిలో విశ్వాసం పాతుకోని వాడనీ సుదర్శనంగారు రాసిన వ్యాసం ఎంతో మెలకువ. 19వ శతాబ్ది భారతదేశ సాంఘిక పరిణామాల్ని మరే భారతీయ రచయితా ఇంత నిశితంగా అధ్యయనం చెయ్యలేదని యు.ఎ.నరసింహమూర్తిగారు చేసిన విశ్లేషణ గొప్ప అధ్యయనం. కాని వీరంతా పూర్తినిడివి నాటకాన్ని చూసిఉంటే, నాటకం మీద మరింత వెలుతురు ప్రసరింపచేసేవారని నేననుకుంటున్నాను.

ఒకసారి గురజాడ గురించి ఒక వ్యాసం రాయడానికి ఉపక్రమిస్తూ శ్రీ శ్రీ ‘గురజాడ గురించి ఇవాళ కొత్తగా ఏంరాయగలననుకున్నాను. కానీ కన్యాశుల్కం నాటకం తలచుకుంటేనే చాలు ఈ మానవజీవితం మీద ఎన్నో కొత్త వెలుగు ప్రసరిస్తాయి’ అనిరాసాడు. ఈ రోజు ఆ నాటకాన్ని చూస్తే ఎన్నో కొత్త విషయాలు స్ఫురించడమే కాదు, ఆ నాటకాన్ని మనమింతకాలం సరిగ్గానే చదివామా అన్న అనుమానం కలుగుతున్నది.

ఈ ప్రదర్శన చూసాక నాకు అనిపించిన మొదటివిషయం కన్యాశుల్కం అన్నిటికన్నా ముందు విద్యావ్యవస్థమీద ఒక విమర్శ అని. తన కాలం నాటి సమాజంలో రెండు రకాల విద్యల్ని చూసాడు గురజాడ. ఒకటి, వేదాలూ, ఉపనిషత్తులూ, కాళిదాసకావ్యాలతో కూడిన విద్య. మరొకటి పొట్టకూటికి పనికొచ్చే ఇంగ్లీషు విద్య. అయితే ఈ రెండు విద్యలూ మనుషుల్ని రూపొందించే విద్యలు కాలేకపోతున్నవని గుర్తించడమే గురజాడ వివేకం. విద్య, చదువు వేరువేరని గురజాడ భావించాడు. నిజంగా సమస్య ఎదట నిలబడ్డప్పుడు, సాంప్రదాయిక సమాజమూ, ఆధునిక సమాజమూ కూడా దాన్ని పరిష్కరించుకోలేకపోయినప్పుడు మధురవాణి వంటి సంస్కారవంతురాలు మాత్రమే ఆ చిక్కుముడి విప్పగలగడం నాటకసారాంశం.

అంతేనా? కన్యాశుల్కానికి నేటి పోస్ట్ మోడర్న్ సమాజంలో ఎంతో ప్రాసంగికత ఉంది. ఆధునిక యుగంలో పబ్లిక్ మాత్రమే పొలిటికల్ గా ఉండేది. కాని ఆధునికానంతర సమాజలో ప్రతి ఒక్కటీ , చివరికి ప్రైవేట్ కూడా పొలిటికలే. ఆ రకంగా కన్యాశుల్కం గొప్ప రాజకీయనాటకం. కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు అనే ఒకబ్రాహ్మడి ఇంటి సమస్య మొత్తం governance issue గా మారిపోవడం మనల్ని చకితుల్ని చేస్తుంది. పోలీసులు, అధికారులు, ప్లీడర్లు, మాజిస్ట్రేట్లు, నౌకర్లు, తాగుబోతులు, జూదర్లు, వితంతువులు, బైరాగులు-సమాజంలోని అన్ని వర్గాలవాళ్ళు ఆ సమస్యలో భాగమైపోతారు.

ఆ సమస్యని సాంప్రదాయిక సమాజమెలానూ పరిష్కరించలేదు, ఎందుకంటే, దేవుళ్ళూ, బ్రాహ్మలూ ఎప్పుడో నేరమయమైపోయారు, చివరికి, సభ్యనాగరిక సమాజానికి చిహ్నంగా ముందుకొస్తున్న గవర్నమెంటు కూడా ఆ గృహసమస్యని పరిష్కరించలేకపోవడం మరింత విషాదాత్మకం. గవర్నమెంటు కూడా నేరమయిపోవడం సరే, గురజాడ చెప్తున్నదేమిటంటే, ఈ అధునిక రాజ్యం న్యాయపరిష్కారానికి సాక్ష్యం మీద ఆధారపడుతున్నది తప్ప, సత్యం మీద ఆధారపడటం లేదని. ‘నిజవాడేవాడు సాక్ష్యానికి రాడు. సాక్ష్యానికొచ్చేవాడు నిజవాళ్ళేడు’ అంటాడు సౌజన్యారావుపంతులు గిరీశంతో. సాక్ష్యం వల్ల సత్యాన్ని ధ్రువపరచలేని పాలన ఏం పాలన? ఆ రకంగా సమస్యా పరిష్కారంలో సాంప్రదాయిక, ఆధునిక సమాజాలు రెండూ విఫలం చెందుతున్నాయన్నదే గురజాడ పొందిన మెలకువ.

తన డైరీల్లో ఒకచోట (9-8-1901)ఆయన ఇలా రాసుకున్నాడు:

‘పాశ్చాత్యనాగరికత కొన్ని అంధవిశ్వాసములని పొగొట్టుతున్నమాట యథార్థమే అయినప్పటికీ అది ప్రబోధించే స్వాతంత్ర్యం సాంఘిక ప్రగతి శూన్యమయింది. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు. నామమాత్రమైనది. ఇది అన్యుల్కకు చోటివ్వదు. మరోవైపు (జాతీయ) సంస్కృతి చివికి శల్యావిష్టమైనది. దీనికి ఇతరులతో సమాధానపడు తత్త్వం లేకపోయినప్పటికీ బహుదుర్బలమైనది. తనకు గల సంకుచితత్వమే దాని దుర్బలత్వమునకు హేతువు. ‘

సాక్ష్యం మీద ఆధారపడ్డ పాలన పరిష్కరించలేని సమస్యని అంతస్సాక్షి ప్రబోధం ప్రకారం నడుచుకునే మధురవాణి, సౌజన్యారావు వంటి వారే పరిష్కరించగలరని చెప్పడం వల్లనే కన్యాశుల్కం మహత్తరమానవత్వాన్ని సంతరించుకుంది.

ఒక పూర్తినిడివి నాటకంగా ఈ వైనమంతా రంగస్థలం మీద చూసినప్పుడు కన్యాశుల్కంలో త్రివిధ ఐక్యాలూ ఉండటమే కాక, ఆ unity ని భంగపరిచే ఒక్క పాత్రగానీ, సంభాషణగానీ, సన్నివేశంగానీ లేవనిపించింది. ఆ నాటక విషయపరిథిని, వివేచనా పరిథిని అందుకోలేకపోయినప్పుడు మాత్రమే మనమా నాటకం నిడివి పెరిగిందనీ, పాత్రలు రచయిత అదుపు తప్పాయనీ అనుకుంటాం.

నాటకంలో కొన్ని సన్నివేశాలు మరింత కొత్తగా బోధపడ్డాయి. 2వ అంకంలో రెండవస్థలంలో శిష్యుడి స్వగతం (ఈ స్వగతానికే మా మాష్టారు శరభయ్యగారు జీవితమంతా గురజాడని క్షమించలేదు), మూడవ స్థలంలో గిరీశం స్వగతం, 3వ అంకంలోనూ 4వ అంకంలోనూ గిరీశం, బుచ్చమ్మల సంభాషణా, మొత్తం 5వ అంకం, ఆరవ అంకంలో మధురవాణి, కరటకశాస్త్రిల సంభాషణ మళ్ళా కొత్తగా చదువుతున్నంత ఫ్రెష్ గా ఉనాయి. ఇక 7వ అంకంలోని ఆరవస్థలం, నాటకంలోని పతాక సన్నివేశం నిజంగా ప్రదర్శనకే పతాక. క్షణక్షణ ఉత్కంఠతో నడిచిన ఆ సన్నివేశం అక్కడున్న వెయ్యిమంది ప్రేక్షకుల్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

సౌజన్యారావుపంతులు మధురవాణితో కరచాలనం చేసినప్పుడు ప్రతి ఒక్క చూపరి హృదయంలోనూ సంభవించిన రససిద్ధి అసాధారణం, అపూర్వం.

ఈ రోజునుంచి కన్యాశుల్కం ఒక రచనగా మరొక వందేళ్ళ ప్రయాణం మొదలుపెట్టిందనిపించింది.

2-2-2014

3 Replies to “మరొకవందేళ్ళపాటు నిలిచే నాటకం”

  1. ఈ రోజు కన్యాశుల్కం నాటకం గురించి చదివాను. చాలా విన్నాను ఈ నాటకం గురించి. అయితే సినేమా చూసిన ,నాటకం చదివిన గుర్తులేదు. ఎనిమిది గంటల నాటకం అనగానే ఎంతో ఆశ్చర్యం ! ఒక్కొక్కరి పాత్ర ఏమిటని తెలియకపోయినా మీరు నాటకాన్ని విశ్లేషించినది చాలా బాగుంది. ఆ నాటకం గురించిఉన్నదంతా పూర్తిగా చదివి రాసే విశ్లేషణ!మహత్తర మానవత్వాన్ని సంతరించుకొన్న నాటకం! ఏ కాలాలలోనైన మానవత్వానికె ప్రధమ పీఠం!న్యాయపరిపాలన సాక్ష్యాల పై ఆధారపడినది సత్యం పై కాదు. సత్యాన్ని ధృవపరచలేని పాలన ఏం పాలనా!! సమాజంలోని రెండు విద్యలు మనుష్యుల్ని రూపొందించే విద్యలుకాకపోవటం.! ధన్యవాదాలు వీరభద్రుడుగారు 100 సంవత్సరాలైన మెరుగులుదిద్దుకొంటూ వస్తున్న నాటకాన్ని పరిచయం చేసినందుకు. !

  2. 1992 లో నేను విజయనగరం జిల్లాలో పనిచేసే రోజుల్లో ఈ నాటకాన్ని పూర్తి నిడివి తో ప్రదర్శించారు. చూసే అవకాశం నాకు కలిగింది. నా అభిప్రాయంలో వస్తువుతో పాటు రచయిత చూపించే నైపుణ్యం నాటకానికి జీవం పోస్తుంది. చిరకాలం నిలిచేట్టు చేస్తుంది. నిజానికి ఇవాళ సమాజంలో కన్యాశుల్కం అనే దురాచారం లేదు కానీ నాటకంలో జీవకళ చెక్కుచెదర లేదు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఈ నాటకం ఉంటుంది

Leave a Reply

%d bloggers like this: