సీతారామశాస్త్రి

c8

‘కవిత్వం మనోరంజకంగా ఉండాలని ఎవరన్నారో గాని, వాళ్ళకి కవిత్వం గురించి ఏమీ తెలియదనే అనుకోవాలి. మనోరంజనం వేరు, మనోహరం వేరు. కవిత్వం మనో ‘హరం’ చెయ్యాలి. అట్లా మనసుని హరించడం ఒక దైవీ లక్షణం’ అంటున్నాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. హోటల్ గదిలో గాఢంగా పొగ వదుల్తూ. బయట కోనసీమ కొబ్బరి చెట్లు ఆ మాటలకి తలలూపుతున్నాయి.

మొన్న ఆదివారం రాజోలులో ఎమ్మెస్ సూర్యనారాయణ కవిత్వం ‘శబ్దభేది’ ఆవిష్కరణ జరిగింది. ఆ రోజు హైదరాబాదునుంచి తనికెళ్ళ భరణి, సిరివెన్నెల సీతారామశాస్త్రితో పాటు నేను కూడా వెళ్ళాను. రాజమండ్రినుంచి ముఫ్ఫై ఏళ్ళ కిందటి జ్ఞాపకాలు కొంగున కట్టుకుని చాగంటి శరత్ బాబు, పి.వి.ఎస్. శాస్త్రి వచ్చారు. తణుకు నుంచి కొప్పర్తి, బి.వి.వి. ప్రసాద్ వచ్చారు. ఇంతమంది వచ్చాక, అంబాజీపేటనుంచి నామాడి శ్రీధర్ రాకుండా ఎలా ఉంటాడు?

ఆ కలయిక నా వరకూ 80 ల మొదట్లో రాజమండ్రిలోనో, కాకినాడలోనో నిన్న కలుసుకుని విడిపోయాక ఇవ్వాళ మళ్ళా కలుసుకున్నట్టే ఉంది. ఎన్ని కబుర్లు, ఎన్ని జ్ఞాపకాలు! శరభయ్యగారు, సుబ్రహ్మణ్యం, గోపీచంద్, మహేశ్, సావిత్రిగారు మళ్ళా మా మధ్య కూచున్నట్టే ఉంది.

తాటిపాకలో మేం దిగిన ‘సోమిసెట్టి లాండ్ మార్క్’ అంత కవిత్వం ఎప్పుడూ వినిఉండదు. బయట కారుమబ్బులు, ఆగీ ఆగీ కుండపోత. ఎదట పొలాల్లో కలువల కొలనులు. కోనసీమ వీథుల్లో ఆ పూర్వకాలపు పెంకుటిళ్ళమీద వాన పడుతుండే దృశ్యం చూసి ఎన్నాళ్ళయింది!

అట్లాంటి వేళల్లో ప్రతి కవీ ఆశపడ్డట్టే, ఉండబట్టలేనట్టే, నేను కూడా నా కవితలు వినిపించకుండా ఉండలేకపోయాను. కాని అంతకన్నా కూడా మేమంతా ‘భరణి’ అని పిలుచుకునే సిరివెన్నెల కవిత్వం వినడానికే ఎక్కువ మోహపడ్డాను. అది కూడా, కేవలం ఆయన పాడితే వినడం కాదు. తాను పాడుతున్న పాటల మధ్య,ఎదుటివాళ్ళు వినిపిస్తున్న కవితల మధ్య, మధ్యమధ్యలో కవిత్వం గురించి ఆయన వివశత్వంతో మాట్లాడే మాటలు.

సీతారామశాస్త్రి నాకు 76 నుంచి తెలిసినప్పటికీ, ఆయనతో నా అనుబంధం 80-82 సంవత్సరాల మధ్యకాలం నాటిది. నేను పెద్దాపురంలోనూ, కాకినాడలోనూ డిగ్రీలో చేరినా ఒక్క రోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా కవిత్వపిపాసిగా బతికిన కాలం నాటిది. అప్పుడాయన కాకినాడ టెలిఫోన్స్ లో పనిచేస్తుండేవారు. ఆయన సహోద్యోగీ, గొప్ప భావుక సౌకుమార్యం కలిగిన సి.ఎస్ మా ఇంటిపక్కనే ఉండేవాడు. నా తాడికొండ మిత్రుడు రాజేంద్రప్రసాద్ సీతారామశాస్త్రితో కలిసి ఒకే ఆఫీసులో పనిచేసేవాడు.

అప్పట్లో నేను ‘అసంపూర్ణ మథనం’ అనే నవల రాసాను. దాన్ని ప్రసాద్ తీసుకెళ్ళి భరణికి ఇచ్చాడు. ఆయన దాన్ని ఎంతగా ఇష్టపడ్డాడంటే, ఒక పెద్ద బైండు నోటుపుస్తకం కొని దానిమీద ఒక యాభై పేజీల వ్యాఖ్యానం రాసేసాడు ( ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గరుంది తెలుసా అంటున్నాడు భరణి వాళ్ళబ్బాయితో).

అట్లా పరస్పర సంభ్రమంతో, ఆదరాతిశయంతో మేమట్లా రెండేళ్ళు సాహిత్యమే ప్రపంచంగా మునకలేసాం. ప్రతి సాయంకాలం మల్లయ్య అగ్రహారంలో ఆ ఇంటికి వెళ్ళకపోతే నాకు జీవించినట్టే ఉండేది కాదు. ఎంతో ఆర్తితో, ప్రపంచానికి అర్థంకాని వేదనతో ఆయన మాట్లాడే మాటలు, కట్టే ఆ పాటలు, ఆయన దగ్గర కూచున్నంతసేపూ నాకు జ్వలిస్తున్న ఒక అగ్నిపర్వతం సన్నిధిలో ఉన్నట్టుండేది. కాని ఆ అగ్ని చందనచర్చ చేస్తున్నట్టుండేది. (అట్లాంటి అనుభవం మళ్ళా నాకు రాజమండ్రి సావిత్రిగారి సన్నిధిలో మటుకే కలిగింది)

‘నీకు తెలుసా నాగరాజూ, (అది మా అక్కచెల్లెళ్ళూ,నా చిన్నప్పటి మిత్రులూ నన్ను పిలిచే పేరు), నేనొక సారి రాజమండ్రి వచ్చినప్పుడు, అప్పటికింకా నేను సినిమాల్లో అడుగుపెట్టలేదు,నువ్వు నామీద సమాచారంలో ఒక వ్యాసం రాస్తూ భరణి మనతరంలోని గొప్ప సాంగ్ మేకర్ అని రాసావు. నువ్వు రాసిన ఆ వాక్యాలు భవిష్యవాణిలాగా అనిపిస్తాయి ఇప్పటికీ’ అన్నాడు భరణి, మేం పాలకొల్లు రైల్వే స్టేషన్లో దిగి కార్లో కూచున్న మొదటి నిమిషాల్లోనే.

అప్పణ్ణుంచి రాత్రి మళ్ళా మేం భీమవరం స్టేషన్లో రైలెక్కినదాకా ఆయన పాటలు పాడుతూనే ఉన్నారు. ఆ పాటల వెనక ఆ కంఠంలో ఒక జీర, యుగాలుగా వాగర్థ స్వరూపమేమిటో తెలుసుకోవాలన్న తపన ఒక్కటే తపస్సుగా జీవిస్తోన్న మానవుడి హృదయమర్మరధ్వని ఆ గొంతులో.

నాకెంతో ఇష్టమైన ఆ పాట: ‘ఏమి లీల నీ వినోదము, మాయామతివి నీవు, తెలియరాదు నీ విలాసము’. నా మిత్రులకోసం ఈ పాట రికార్డు చేసుకుంటానన్నాను. వినండి, ఆ పాటతో పాటు, ఆయన తన మనమరాలు మీద రాసిన పాట కూడా. సీతారామశాస్త్రి సినీకవి కాదు, మన తరంలోని గొప్ప వాగ్గేయకారుడని మనకి బోధపడుతుంది.

కొత్త తరం యువతీ యువకులకి స్వదేశంలోనో, విదేశాల్లోనో ఉర్దూ గజల్లాగా, రవీంద్రసంగీత్ లాగా తమదంటూ చెప్పుకోదగిన సాహిత్యగౌరవం కలిగిన పాటలేమిటని వెతుక్కోవలసిన అవసరం లేకపోయింది సీతారామశాస్త్రి వల్ల.

కొన్నేళ్ళ కిందట ఒక స్నేహితురాలు తన ప్రేమానుభవం గురించి చెప్తూ తనని వదిలిపెట్టివెళ్ళిపోయిన తన స్నేహితుడి గురించి ఎప్పుడు తలుచుకున్నా ‘ఇవాళలో నువ్వు ఏం చేస్తు ఉంటావు’ అన్న వాక్యమే స్ఫురిస్తుందనీ, ఆ వాక్యం మదిలో మెదలగానే తన భావాలన్నీ ఎవరో సులువుగా చెప్పేస్తున్నట్టుంటుందనీ అంది.

ఆ రాత్రి మేం భీమవరం స్టేషన్లో వెయిటింగ్ రూంలో కూచున్నప్పుడు పదిపదిహేనుమంది నవతరం యువతీ యువకులు బిలబిల్లాడుతూ ఆ గదిలోకొచ్చారు. ఒకటి రెండు క్షణాల శీతలనిశ్శబ్దం తరువాత వాళ్ళంతా ఆయన్ను అల్లుకుపోయారు, మళ్ళా పాటలు, ఫోటోలు.

ఇలాంటి కవులే లేకపోయిఉంటే ఈ ప్రపంచం ఎంత పేదదై పోయిఉండేది!

22-8-2015

6 Replies to “సీతారామశాస్త్రి”

  1. సర్, ఏమి లీల వినోదం పాట ఉంటే ఆడియో పెట్టండి. Fb లో పెట్టండి.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading