గోపీప్రేమ

gopi

భారతీయ భాషల్లో భక్తి సాహిత్యం ఒక దేశపరిమళం. సంపూర్ణ సమ్యక్ దర్శనం. అపూర్వ సంగీతం. విడివడి ఉండే మనుషుల్ని ఒక్కటిచెయ్యటంలో భక్తిసాహిత్యంలో ఒక మానవత్వ మంత్రశక్తి ఉంది. ఇప్పుడు పోస్ట్ మాడరన్ ఆలోచనాధార మనుషుల ఆలోచనలొ దర్శనంలో బహుళత్వం ఉంటుందనీ, ప్రతి మనిషీ తను కాక ఇతరులు కూడా ఉంటారని గ్రహించి వారు చెబుతున్న దానిని వినగలిగే సహనం చూపించాలనీ అంటున్నది. కానీ విషాదకరమైన సంగతేమిటంటే నేటి ప్రపంచంలో ఒక జాతి మరొక జాతినీ, ఒక మతం మరొక మతాన్నీ, ఒక ప్రాంతం మరొక ప్రాంతాన్నీ, ఒక సమూహం మరొక సమూహం తాలూకు చిహ్నాలనూ సహించలేకపోతున్నారు. ఒకరినొకరు ద్వేషిస్తున్నారు. నిర్మూలించుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి విద్వేష మేఘాలావరించిన భూమిపైన భక్తి కవుల వాణిని స్మరించుకోవడం ఏదో ఒక మేరకు వాతావరణాన్ని శుభ్రపరిచినట్టు అవుతుందనిపిస్తోంది.

ఎందుకంటే భక్తికవులు నిజమైన వర్గరహిత, వర్ణరహిత సమాజాన్ని కోరుకున్నారు. తాము సంచరించిన మేరకు అటువంటి సమాజాన్ని ఏ మేరకో మానసికంగా సమసమాజంగా తయారుచేసారు. వారి ప్రభావానికి లోనయినవారంతా వారి వారి కుల మత జాతి, లింగ, ప్రాంత భేదాలేమయినప్పటికీ, ఒక సత్సంగంగా మసిలారు. ఆ మేరకు ప్రపంచం తన అంతర్గతవిద్వేషం నుండి విడుదలయింది. అటువంటి భక్తి సాహిత్యంనుంచి కొందరు కవులనూ, వారి కవిత్వాన్నీ పరిచయం చెయ్యాలన్న ఒక సంకల్పం ఈ ప్రయత్నానికి కారణం.

శ్రీమద్భాగవతం

భక్తిభావానికి బీజాలు వేదసూక్తాల్లోనే ఉన్నాయి. కాని తొలినుంచీ వివిధ ఆరాధనావిశ్వాసాలు తారసపడి ఒక సంగమంగా, ఒక సమన్వయంగా రూపొందినపుడల్లా భక్తి కూడా బలపడుతూ వచ్చింది. ఆ విధంగా తొలిమలి వేదకాలాల్లో బీజ రూపంలో ఉన్న భక్తి భాగవతపురాణంలో శాఖోపశాఖలుగా విస్తరించడం మనం చూడవచ్చు. దీనికి సమర్థనగా నారయణీయం, భగవద్గీత, శాండిల్య భక్తిసూత్రాలూ, నారదపాంచరాత్రమూ, నారదభక్తిసూత్రాలూ ఉన్నాయి. నారదభక్తిసూత్రాలు భక్తిని పరమప్రేమగానూ, అమృతరూపంగానూ నిర్వచించాయి (1-2,3). ఇక్కడ పరమ అన్న పదంలో మూడు సూచనలు ఉన్నాయి. అవి: లోకంలోని అన్ని అంశాలనూ మించిన అంకితభావాన్ని భగవంతుడి పట్ల కలిగి ఉండటం, అన్ని రకాల జ్ఞానాలను, కర్మలను మించి భక్తి దానికదే ఒక లక్ష్యంగా, చరమభావంగా నిలుపుకోవడం, మనోవాక్కాయకర్మలు ఆ అంకితభావాన్ని వ్యక్తం చెయ్యడం. కనుక శాండిల్య భక్తిసూత్రాలు పరాభక్తిని పరా అనురక్తి అన్నాయి. ఈ పరమప్రేమను, ఈ పరా అనురక్తిని, ఒక అహైతుకీ భావంగా చూపించడమే భాగవతం పరమార్థం. ఏ కారణం లేకుండా, ఏ స్వార్థప్రయోజనాన్ని ఆశించకుండా, ఏ పరిమిత లక్ష్యంతోనూ కాకుండా భగవంతుని ప్రేమించడం అహైతుకీ భక్తి అనిపించుకుంటుంది.

భక్తినిభాగవతం అయిదు విధాలుగా చూపించింది. అవి శాంత, సఖ్య, దాస్య, వాత్స్యల్య, మధుర భావాలు. భగవంతుడి పట్ల భక్తుడు ఈ ఐదుభావాల్లో ఏ మార్గంలోనైనా తన ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇందుకు భాగవతం ఉదాహరణలను చూపించింది. శాంతభావానికి భీష్ముడు, సఖ్యభావానికి సుదాముడు, దాస్యభావానికి మధురానగరిలోని కుబ్జ, వాత్సల్యభావానికి యశోద ఉదాహరణలు కాగా, గోపికలు మూర్తీభవించిన మధురభక్తి రూపాలు.

గోపికలు: మధురభక్తి

శ్రీకృష్ణుడిపట్ల రేపల్లెలోని గోపికలు చూపించిన భక్తికి, తక్కిన అన్ని భక్తిభావాలకన్న భాగవతం అత్యంత విశిష్ఠ స్థానాన్ని ఇచ్చింది. అటువంటి ప్రేమకు అత్యున్నత గౌరవాన్ని, వారి ప్రేమకు ఇవ్వడం పట్ల భాగవతం ఎంతో స్పష్టతను కలిగి ఉండటమే కాకుండా వీలైన చోటల్లా దాన్ని వివరించే ప్రయత్నం చేసింది.

భాగవతం దశమస్కంధంలో రాసలీల మధ్యలో శ్రీకృష్ణుని కానక శోకంలో మునిగిన గోపికలను ఆయన పునర్దర్శనంతో ఊరడించినప్పుడు వారు ఆయనను ఒక ప్రశ్న అడిగారు: ‘కొందరు తమనెవరో ప్రేమిస్తారో వరినే ప్రేమిస్తారు. కొందరు తమను ఎదటివాళ్ళు ప్రేమిస్తున్నా లేకపోయినా తాము ప్రేమిస్తూనే ఉంటారు. కొందరసలు ప్రేమించనే ప్రేమించరు. ప్రభూ, ఈ అంశాన్ని కొద్దిగా విశదీకరించు’ (10:32:16) అని.

దానికి కృష్ణుడిచ్చిన జవాబు ఒక మధురభక్తిశాస్త్రం.

ఆయనన్నాడు కదా. ఒకరినొకరు ప్రేమించుకునేవారు తమ సంతోషంకోసం చేరువవుతారు కాబట్టి అందులో విశేషమేమీ లేదు. తనను ప్రేమించనివారిని కూడా ప్రేమిచేవారిలో ఉండేది తల్లిదండ్రుల్లో కనవచ్చే కరుణలాంటిది. అందులోనూ విశేషమేమీ లేదు. ఇక అసలు ప్రేమించనివారంటారా, అయితే వాళ్ళు తమను తాము ప్రేమించే ఆత్మారాములైనా అయి ఉండాలి, లేదా తమ ఆకాంక్షలు నెరవేరి ఇక కోరుకోవలసిందేమీ లేనివాళ్ళన్నా అయి ఉండాలి. లేదా తమకు అందిన శుభాన్ని గుర్తించలేని మూఢులైనా అయుండాలి. ఇవేమీ కాకపోతే దుర్మార్గులైనా అయుండాలి. కాని మీ ప్రేమ వీటన్నిటికన్నా వేరైనది. మీరు నా మీద ప్రేమకోసం మీ వాళ్ళందరినీ, చివరకి శాస్త్రవాక్యాలను కూడా పక్కన పెట్టేసారు. మీ ప్రేమఋణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మీ ప్రేమకు మీ ప్రేమనే సాటి.'(10:32:17-22)

గోపికల భక్తిని ప్రశంసించిన శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన కృష్ణుడికన్నా భిన్నమైన మూర్తి. గీతాకృష్ణుడు కర్మజ్ఞానసమన్వయం గురించి మాట్లాడాడు. జ్ఞానాన్వేషణా, కర్మాధికారమూ కొందరికే పరిమితమైన సామాజికవ్యవస్థలో అత్యధిక సంఖ్యాకుల ఆధ్యాత్మిక అవసరాలు శాస్త్రాలు తీర్చలేవని గీతాకారుడికి తెలియనిది కాదు. పరిశీలనగా చూసినట్లయితే గీతాకృష్ణుడిలో బృందావనకృష్ణుడు కనిపించకపోడు. ముఖ్యంగా ఈ శ్లోకం చూడండి:

వేదేషు, యజ్ఞేషు, తపస్సు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరంస్థాన ముపైతి చాద్యమ్  (8:28)

కానీ గీతాకృష్ణుడు తనలోని ఈ విప్లవాత్మకతను చూడగలిగినవాళ్ళకి తప్ప తక్కినవాళ్ళనుంచి గోప్యంగానే ఉంచుకుంటాడు. బృందావనకృష్ణుడలా కాదు. ఆయన తనలోని ఈ సామాన్య జనపక్షపాతాన్ని వీలైనంత ప్రకటించుకుంటాడు. వివిధ ఆశ్రమాలుగా, వర్ణాలుగా, అంతస్తులుగా, తరతమభేదాలతో చీలి ఉన్న సమాజంలో ముక్తికి అందరికన్నా ఎక్కువ సన్నిహితులు బృందావన గోపికలేనని ఆయన చెప్పడంలోని పరమపురుష తత్త్వాన్ని మనం చూడాలి.

భారతీయ సమాజం తదనంతర యుగాల్లో ఒక ధార్మిక, నైతిక, సాంఘిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా గోపీ ప్రేమ ఒక్కటే దారిచూపుతూ వచ్చింది. ధర్మసంస్థాపనకు తనను తిరిగి తిరిగి పునఃసృజించుకుంటానని గీతాకృష్ణుడు ఒక వాగ్దానం చేసాడు. కాని సమాజం అటువంటి ఒక నవీన ధర్మాన్ని కోరుకున్నప్పుడల్లా తనను కొత్త కొత్త రూపాల్లో పునః పునః సృజించుకుంటూ వచ్చింది కృష్ణుడని అనడం కన్నా గోపీప్రేమేననడం సమంజసంగా ఉంటుంది. రామానుజుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు, చైతన్యుడు, మీరా, సూర్ దాస్, జయదేవుడు, ఆళ్వార్లు, మహారాష్ట్ర విఠలభక్తి కవులు, నరసీ మెహతా లు మొదలుకుని రామకృష్ణ, వివేకానంద, టాగోర్ లదాకా   ప్రతి ఒక్క కవినీ, ప్రవక్తనీ గోపికలు మేల్కొల్పి వారిని తమ కాలం నాటి సామాన్యప్రజలకు సన్నిహితులను చేసారు.

గోపికల ప్రేమలోని మాధుర్యలక్షణాన్ని నారదభక్తిసూత్రాలు చక్కగా వివరించాయి. భక్తి అంటే కాయిక వాచిక మానసిక వ్యాపారమే కాదని, తన సమస్తాన్ని భగవంతుడికి అర్పించడమూ, ఒకవేళ ఆయన మరపునకు వస్తే అది దుస్సహం  కావడమూ నిజమైన భక్తిలక్షణాలని నారదసూత్రాలు నిర్వచించాయి. అటువంటి భక్తులెవరైనా ఉంటారా అని మహర్షి తనే ప్రశ్నించి ‘అటువంటి శంక వద్దు, వ్రజభూమి గోపికలే అందుకు తార్కాణం’ (1-20,21) అన్నారు.

గోపికలభక్తిలోని మాధుర్యం వారు శ్రీకృష్ణుడితో అనుభవించిన అనన్యత్వంలో ఉంది. తక్కిన భక్తి భూమికల్లో ఈ అనన్యత్వం సాధ్యం కాదు. ఈ తాదాత్మ్యం వల్ల, పారవశ్యం వల్ల పువ్వులో తేనెలా మధురభక్తిలో మరింత తీయదనం వచ్చిచేరింది.

భాగవతం: మందారమకరంద మాధుర్యం

శ్రీ మద్భాగవతం ముఖ్యంగా దశమస్కంధం ఇటువంటి ఒక మకరంద మాధుర్యంతో ఎన్నో ఏళ్ళుగా భాతరీయ సంస్కారాన్ని పోషిస్తూ ఉండీ. ఋగ్వేదంలో, అలాగే వాల్మీకంలో కనిపించే రామణీయకతకూ, భాగవత రామణీయకానికీ ఒక తేడా ఉంది. భారతం, భాగవతం రెండూ వ్యాసకృతాలే అయినప్పటికీ, భారతభాషకీ,భాగవత సంస్కృతానికీ మధ్య సన్నని వ్యత్యాసం ఉంది. భాగవతసంస్కృతంలో సామాన్యజీవితానికి చెందిన దైనందిన అంశాలే అద్భుతమైన ప్రతీకలుగ మారాయి. సాధారణభాష కావ్యభాషగా మారడం మనకు భాగవతంలోనే మొదటగా కనిపిస్తుంది. అ భాషలో సంగీత మర్మరధ్వని, వర్ణశబలత కనిపిస్తాయి. భాగవత శ్లోకం ప్రభావం మనం ఆ శ్లోకాన్ని చదవడం ముగించిన తరువాతనే ప్రారంభమవుతుంది. అంతేకాక,ఆ శ్లోకం నిర్మాణంలోనే సాధారణశ్రోత పట్ల మరే పురాణకవీ కనబరచని ఒక మెలకువ కనిపిస్తుంది. ప్రతి శ్లోకం మొదటిపాదంలో ఒక ప్రతిపాదనా, రెండవ పాదంలో ఆ ప్రతిపాదన సులభంగా అర్థమయ్యేట్లు చేసే ఒక సరళ ఉపమానమూ ఉంటాయి. తరువాత రోజుల్లో భక్తికవులు దోహాల్లో వాడుకున్న నిర్మాణం ఇటువంటిదే. భాగవతం తన శ్లోకాల ద్వారా సాధించిన ఇటువంటి ప్రయోజనం వల్ల భక్తి కూడా ఒక రసంగా ఆలంకారికుల సాహిత్య రసజ్ఞుల మన్నన పొందగలిగింది. అటువంటి రసరమ్య రమణీయాత్మకమైన శ్లోకాల అనువాదాలు మచ్చుకు కొన్ని:

మా మనసుల్లో అలజడి ఎలాంటిదని చెప్పేది?

1

ఇంతదాకా మా ఇళ్ళల్లో నిశ్చింతగా ఉండేవాళ్ళం. నువ్వా శాంతిని చెదరగొట్టావు.  ఇంటిపనుల్లో మునిగి ఉండే మా చేతుల్లో ఇంక ఆ బలం పోయింది. ఇప్పుడవే పనీ చెయ్యలేవు.

నువ్వున్న చోటు వదిలిపెట్టి మా పాదాలు ఒక్కడుగు కూడా ముందుకెయ్యలేవు. ఇంక వ్రజభూమికెట్లా పోయేది? పోయినా అక్కడేం చెయ్యగలిగేది?

2

ఎటువంటివి నీ చూపులు! శరత్కాల సరసిలో నిండారా విరిసిన తామరపూల గర్భంలోని మధువుని కూడ తాగేసేట్టుంటాయవి.

ఇక మా వంటివాళ్ళ గురించి ఏం చెప్పేది? నీకెప్పుడో బానిసలమైపోయాం. మమ్మెందుకింకా ఆ చూపుల్తో చంపుతావు?

3

నీ ప్రేమ పొంగే చూపులు, మెత్తటి నీ చిరునవ్వులు, నీతో తిరుగాడటాలు తలుచుకుంటే చాలు, సంతోషం ముంచెత్తుతుంది.

నువ్వు రహస్యంగా మాట్లాడిన ఊసులు హృదయాన్నొకటే రాపాడుతుంటాయి. ఒరే తుంటరోడా, మమ్మల్నెందుకిట్లా హింసిస్తున్నావురా?

4

దినం ముగిసిపోతూంటుంది. అప్పుడు కనిపిస్తావు నువ్వు. గోధూళి ఆవరించిన నీ వదనాన్ని నల్లటి నీ ముంగురులు మరింత కప్పేస్తుంటాయి.

కొలనులో తేనెటీగలు ముసురుకున్న పువ్వులాంటి ఆ ముఖం , ఒరే మొనగాడా, మా మనసుల్లో లేవనెత్తే అలజడి ఎలాంటిదని చెప్పేది?

5

పగటిపూట నువ్వేమో ఆవులు మేపుకోడానికి అడవికి వెళ్ళిపోతావు. అప్పుడు నిన్ను చూడక అరక్షణమైనా సరే ఒక యుగంలాగా గడుస్తుంది.

పోనీ రాత్రులేనా నిన్ను కన్నారా చూద్దామా అంటే, ఎవడో క్రూరుడు, ఇదేమిటిట్లా మా కళ్ళకీ రెప్పలడ్డం పెట్టాడు!

(శ్రీమద్భాగవతం: 10:29:34, 10:31:2,10,12,15)

Leave a Reply

%d bloggers like this: