ఆకాశఃపరాయణమ్

c9

మండే ఎండల్లో ఒక మిత్రురాలు ముస్సోరీ నుంచి నాకో పుస్తకం తెచ్చింది. ‘మీకు అంతగా నచ్చదేమో ‘అంటూ బయటికి తీస్తూ, ‘రస్కిన్ బాండ్’ అంది.

రస్కిన్ బాండ్ తెలుసు, కాని ఈ పుస్తకం.

A Book of Simple Living (2015). ఇప్పుడిప్పుడే తాజాగా బయటికి వచ్చినట్టుంది. ఆకుపచ్చని అట్టమీద రెండు పిచుకలు. ఆ ఎండల్లో ఆ ఆకుపచ్చదనాన్నట్లా చేతుల్తో తడిమి మొదటి పేజీ తిరగేసాను.

రెండు కోట్స్, మొదటిది, టాల్ స్టాయి వాక్యం:

‘దేవుడి పేరుమీద, ఒక్క క్షణం ఆగి, చేస్తున్న పని పక్కన పెట్టి, చుట్టూ పరికించి చూడు.’

ఆఫీసులో నా పని పక్కన పెట్టేసాను, అప్పుడు రెండవ వాక్యం చదివాను.

జాన్ డ్రైడెన్ వాక్యం:

‘ఏమైతేనేం, హాయిగా నవ్వుకోవడం మంచిదేకదా.. ఒక వేళ ఒక గడ్డిపోచ ఒక మనిషికి గిలిగింతలు పెడితే, అది కూడా ఒక సంతోషసాధనమే కదా.’

అర్థమయింది.

ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు, ఈ మనిషి ఏదో రాయడం లేదు.

ఆ తర్వాత పేజీల్లో మూడు నాలుగు పేరాల చిన్న ముందుమాట.

మొదటి పేరాలో ఇట్లా రాసాడు:

‘ఈ భూగోళమ్మీద ఎనభయ్యేళ్ళు బతికాక నేనేం నేర్చుకున్నట్టు? నిజం చెప్పాలంటే, చాలా స్వల్పం. ప్రియమైన పాఠకుడా, పెద్దమనుషుల్నీ, వేదాంతుల్నీ నమ్మకు. వివేకం వయసుతో పైబడితే వచ్చేది కాదు. బహుశా నీతోపాటే ఊయెలతొట్టిలోనే పుట్టివుండవచ్చు. ఏమో, ఇది కూడా ఒట్టి ఊహ మటుకే కావచ్చు. నా వరకూ నేను జీవితంలో అధికభాగం నా తెలివితేటలు చెప్పినట్టుకాక, నా అంతరంగ ప్రేరణలెట్లా నడిపిస్తే అట్లానే నడిచాను. దీనివల్ల నేను ఎంతోకొంత ఆనందానికి నోచుకున్నాననే చెప్పాలి.. ఇట్లాంటి సంతోషాన్ని మీరు కోరుకుంటే మీక్కూడా ఒక దారి దొరక్కపోదు. జీవితకాలం జీవించాక నిజంగా మనం ఆశించగల నిజమైన సంతోషమంటూ ఏదన్నా ఉంటే ఇది తప్ప మరేమీ కాదు. ఈ పుస్తకం చెయ్యగలిగేదంతా ఒక తోటి యాత్రీకుడిలా మీక్కూడా ఆ దారి చూపించడమే’

అవును. ఈ పుస్తకం అటువంటి నిర్మలజీవితానందాన్ని చూపించే యాత్రాపటమే.

ఆశ్చర్యమేమిటంటే, తావో-కియాన్, హాన్-షాన్ లాంటి ప్రాచీన చీనాకవులో, లేదా సైగ్యొ, బషొ వంటి జపనీయ కవులో, డోజెన్, ర్యోకన్ వంటి జెన్ సాధువులో కనుక్కోగలిగిన ఈ దారి మన సమకాలికుడైన ఒక రచయిత కనుక్కోగలడం, వాళ్ళలానే జీవించడం, అట్లాంటి సంతోషంలోనే ఎనభయ్యేళ్ళుగా ఈ భూమ్మీద మసులుతూండటం.

పుస్తకం కొంత చదివేటప్పటికే ఇతడిలో డావోయిస్టు ధోరణులు కనబడటం మొదలయ్యింది. నేనింకా అనుమానిస్తుండగానే, ఒకచోట ఇట్లా రాసుకున్నాడు:

‘ఒక డావోయిస్టుని కావాలన్నది నా కోరిక. పెద్దవాణ్ణయిపోయాను, అయినా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా ముఫ్ఫైల్లో నేను రాసుకున్న ఒక పేజీ చూడండి:

‘నిన్న రాత్రి పెద్ద గాలివాన, ఆ ప్రచండఝుంఝూమారుతంలో ఈ కొండలన్నీ కొట్టుకుపోతాయా అనిపించింది. కానీ అంతసేపూ ప్రేమ్ సంతోషంగా నవ్వుతూ కితకితలు పోతూనే ఉన్నాడు. కొన్నిసార్లు అది నాకు చికాకు తెప్పిస్తుందికానీ, తన చుట్టూ ఏం జరుగుతోందో అసలు పట్టించుకోవడం లేదతడు, బయట చూద్దామా మా ఇంటి పైకప్పు గాలివానలో ఎగిరిపోయే పరిస్థితి. కాని నేను డావోయిస్టుని, సరైన క్షణం కోసం కాచుకు కూచునేవాణ్ణి. అదీకాక మరొకరి సంతోషానికి అడ్డుపడటం నేరమనే నా నమ్మకం. ఇది చదివాక-వయసుతో పాటు వివేకం పెరుగుతుందని ఎలా అనుకోను?’

నిజమైన డావోయిస్టుగా జీవించడంలో ఎంత సంతోషముందో తెలియదుగాని వాళ్ళ భావాలు వినడంలో, వాళ్ళ వాక్యాలు చదవడంలో అద్వితీయమైన సంతోషముంది.

కృష్ణమూర్తి నోట్ బుక్ చదివినప్పుడూ, సంజీవ్ దేవ్ అనుభవాలు చదువుతున్నప్పుడూ మనకు కలిగే ఆనందం ఇటువంటి ఆనందం.

ఈ వాక్యాలు చూడండి.

‘పెద్ద వడగళ్ళ వాన. బలంగా ఈదురుగాలులు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అది నిన్నటి పరిస్థితి. ఇప్పుడు అకాశం మేఘావృతంగా ఉంది, చల్లగా, చిరుజల్లు. ఋతుపవనాలు దరిదాపులకి వచ్చినట్టే ఉంది. కాని దీన్నింకా ఋతుపవనమనుకోలేకపోతున్నాను.

ఈ చల్లటివేల పక్షులు సేదతీరుతున్నాయి. వాననీళ్ళ పడెల్లో వాటి రెక్కలు చల్లబడుతున్నాయి.ఒక జెముడుకాకి గాల్లో బాణంలాగా దూసుకుపొతూంది. అట్లా ఎగురుతూనే ఒక తూనీగని నోటచిక్కించుకుంది. ఇంటి చూరులో గూడు కట్టుకోడానికి గోరువంకలు కాకిరెక్కలు ఏరితెచ్చుకున్నాయి.నేను కిటికీ అంచున ఎంత నిశ్చలంగా కూచున్నానంటే ఒక చిన్న పిచుక నా తలకి అల్లంతదూరాన వచ్చి వాలింది. అది చిన్ని రెక్కలపురుగుని ఎగిరేలోపల్నే పటాయించించేసింది.

సాయంసంధ్యవేళ నేనిట్లా కిటికీ పక్కన కూచుని చెట్లని చూస్తూ, వాటి శాఖాగ్రాలతో గాలిచేసే గుసగుసలు వింటూంటాను. రాత్రి గూళ్ళకి చేరుకునే పక్షుల రెక్కల తపతప. కానీ ఒక పెద్ద గబ్బిలానికి ఇప్పుడే తెల్లారింది. అది కొమ్మల గుబుర్లలోంచి బయటికొస్తూ పోతూ ఉంది. ఆ గబ్బిలాన్నీ,చెట్ల స్థులాకృతుల్నీ చూసేపాటి కనువెలుతురు మటుకే ఆకాశంలో అలుముకుంది. కింద రోడ్డుమీద ఎవరో పాత పాట ఈలవేసుకుంటూ పోతున్నారు. చెయ్యాల్సిందేదో కొంత పనిలేకపోలేదు. కాని నాకు మరికొంతసేపు ఇక్కణ్ణే కూచోవాలని ఉంది.’

ఈ వాక్యాలు మదనపల్లిలో కృష్ణమూర్తి రాసుకున్న వాక్యాల్లా లేవూ!

ఈ వాక్యాలు చూడండి:

‘జెరేనియాలు చాలా మంచి స్నేహితులు. నేనో జెరేనియాన్ని ధ్యానిస్తూ ఉండిపోగలను. అంటే, దాన్నట్లా కన్నార్పకుండా చూస్తూ ఎంతసేపైనా ఉండగలన్నమాట. వేసంకాలంగానీ, శీతాకాలంగానీ, సూర్యకాంతి పడే నా పడగ్గదిలో ఈ జెరేనియాలు ఎప్పుడైనా పుష్పిస్తాయి కాబట్టి, నాకు ఎప్పటికీ ధ్యానానికి అవకాశమున్నట్టే..నా శయ్యమీంచో, రాతబల్లదగ్గర్నుంచో దాన్నట్లా చూస్తూంటే నా మనసులో ఆహ్లాద భావనలు కలుగుతూ ఉంటాయి. దాన్నేనా ధ్యానమంటారు? లేదా మననమా? బహుశా మననమే అయుంటుంది. నేను మననశీలమానవుణ్ణి.’

‘కాని ఇప్పుడంతా ధ్యానం గురించి మాట్లాడుతున్న కాలం. ధ్యానం మీద కోర్సులు నడుపుతున్నారు.తీసుకుంటున్నారు. కాని మననం మీద కోర్సు నడిపేవాళ్ళెవరూ నాకింతదాకా తారసపడలేదు. నేననుకుంటాను, ధ్యానం మనం ఎంతో కొంత మెలకువ తో చేసే పని అని. అందుకనే అక్కడ సాధన అవసరమవుతుంది. కాని మననమట్లా కాదు. అది చాలా సహజంగా జరిగిపోయే ప్రక్రియ.’

‘మననం చేసుకుంటున్నప్పుడు మనం మనలోపలకి చూసుకుంటాం. బహుశా అక్కడేదో కనిపిస్తుండనే ఆశతోనే అనుకుంటాను.’

ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకెందుకో పోయిన్ సెటియా మొక్క గురించి సంజీవ్ దేవ్ రాసుకున్నదంతా జ్ఞాపకం వచ్చింది. ఆ వాక్యాల్ని పదే పదే గుర్తు చేసుకోవడం కోసం రెండు పోయిన్ సెటియా మొక్కలు తెచ్చుకున్నాను. ఇక ఇప్పుడీ వాక్యాలు చదివాక, జిరేనియాల మీద కూడ కొత్త ఆసక్తి అంకురిస్తూంది.

ఇంతకీ ఈ పుస్తకం మొక్కలగురించీ, పూలగురించీ, పిట్టలగురించీ కానేకాదని మీరు గ్రహించే ఉంటారు.
ఇది ప్రేమగురించి, ఆంతరంగిక ప్రశాంతి గురించి, అనవసరమైన వాటిని మరో ఆలోచనలేకుండా త్యజించగలగడం గురించి, సాదాసీదాగా, సరళంగా జీవించడం గురించి.

ఈ వాక్యాలు చూడండి:

‘ప్రేమ కూడా సంతోషంలానే ఒక పట్టాన అంతుబట్టనిది. అది మన ఇంటితలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. ఆ తలుపు దగ్గరే ఆగిపోతుందా, ముందుకు వెళ్ళిపోతుందా, లేక లోపలకి వచ్చి ఉండిపోవాలనుకుంటుందా చెప్పలేం. అసలు ప్రేమ ఎప్పుడూ చంచలంగా తేలిపోతూనే ఉంటుందని చెప్పడానికి కూడా నాకు సంకోచం లేదు. పిట్టలాగా ఎప్పుడూ గాల్లో తేలుతూనే ఉంటుంది… నీ ఆశలన్నీ చితికిపోయినవేళ ఒక ప్రేమాన్విత కరస్పర్శకన్నా గొప్ప సౌకర్యాన్ని ఊహించలేం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరితోనో ప్రేమలో పడ్డాను. మరెవరో నాతో ప్రేమలో పడ్డారు. రెండు ప్రేమలకీ జవాబు దొరక్కుండానే జీవితం ముందుకు సాగిపోయింది.’

‘ఒకసారి ప్రేమలో పడ్డాక, జీవితం సంతోషంగా ముగుస్తుందని చెప్పలేం. కాని నీ ఒంటరితనం నీకు తప్పదని నీకు గ్రహింపుకొచ్చినప్పుడు , ఆశ్చర్యంగా, సరిగ్గా, అట్లాంటి వేళల్లోనే ఒక స్నేహితుడో, స్నేహితురాలో తారసపడకపోరు. స్నేహం కూడా ప్రేమేనని వేరే చెప్పాలా?’

ఇట్లా ఈ పుస్తకమంతా తెలుగులో రాసేస్తానేమోనని అనుమానంగా ఉంది.

కాని ప్రతి ఒక్క వాక్యమూ అట్లా తెలుగులో తిరిగి రాసుకుంటే మరింతగా నా శ్వాసలో కలిసిపోతున్నట్టుంది.

ఈ వాక్యాలు చూడండి:

‘ఈ ప్రపంచంలో అతి చిన్న కీటకం ఒక తరహా మిణుగురుపురుగు, దాని మొత్తం దేహం మిల్లిమీటర్లో అయిదో వంతు వుంటుంది. చూడ్డానికి అదొక ధూళికణంలాగా కనిపిస్తుంది. కాని ఎంతో సంపూర్ణంగా వికసించిన రెక్కలు దానివి. ఆ రెక్కలు దులుపుకోడానికి దాని కాళ్ళమీద చిన్ని చిన్ని దువ్వెనలు. పరిపూర్ణత అంటే అది.’

జీవితమంతా అవిశ్రాంతంగా అంతర్ బహిర్ యుద్ధం చేసిన చలంగారు ‘బుజ్జిగాడు’ రాసేటప్పటికి చేరుకున్నదిట్లాంటి దర్శనానికే.

ఈ వాక్యాలు:

‘(కిటికీలోంచి) చూస్తూండటానికి ఏది మంచి దృశ్యం? కొందరేమో కొండలంటారు. కాని కొండలెప్పటికీమారవు. కొందరు రోడ్డుని చూడమంటారు. ఎందుకంటే బాట ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అనుక్షణం మారుతూంటుంది. -అమ్మేవాళ్ళు, కుట్టేవాళ్ళూ, తిరిగేవాళ్ళూ, కార్లూ, ట్రక్కులూ, మోటారుసైకిళ్ళూ, గుర్రాలూ, గాడిదలూ, ఒక్కోసారి ఏనుగు కూడా.’

‘రోడ్డు ఎప్పుడూ మూగబోదు. నిజమే, కాని నేను ఆకాశాన్ని చూడటానికే ఇష్టపడతాను. ఆకాశం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. మేఘాల్లేనప్పుడు కూడా ఆకాశం రంగులు మారుతూనే ఉంటుంది. ప్రభాతగగనం, పట్టపగటి నింగి, వెన్నెల్లో తారాతీరం, ఇవ్వన్నీ వేర్వేరు ఆకాశాలు. ఎప్పుడూ ఏదో ఒక పక్షి ఆకాశంలో తారట్లాడుతూనే ఉంటుంది.. వేసవి రాత్రుల్లో పెద్దపెద్ద రెక్కలపురుగులు కిటికీలోంచి నేను చదువుకునే దీపం చుట్టూ గిరికీలు కొడుతుంటాయి. అవి ఆ దీపంలో ఎక్కడ రెక్కలు కాల్చుకుంటాయోనని జాగ్రత్తగా పట్టుకుని బయట పెట్టేస్తుంటాను.’

‘ఇక ఋతుపవనవర్షాలు రాగానే కిటికీ మూసెయ్యాల్సిఉంటుంది. లేదంటే నా గదినిండా వానతుంపరా, నీటి ఆవిరీ నిండిపోతాయి, పుస్తకాలు పాడైపోతాయి. కాని అప్పుడే, ఏడాది మొత్తంలోనూ, ఆకాశం అత్యంత సమ్మోహశీలంగా ఉండేది. ఇక్కడ నా రాతబల్లముందట కూచుని, లోయమీంచి కొండలమీదకు ఎగబాకుతూ మరింత ఉన్నత పర్వతశ్రేణులమీదుగా ప్రయాణించే మేఘాల్ని చూస్తుంటాను. కిటికీ అద్దాలమీద వానచినుకులు చప్పుడు చేస్తుంటాయి. వాన ఆగినప్పుడే ఆ చప్పుడు కూడా ఆగేది.ఇక వాన వెలిసి, మేఘాలు విచ్చుకున్నాక, ఆకాశమంతా ఒకటే ప్రగాఢ నీలం.’

ఉపనిషదృషులు ‘ఆకాశః పరాయణం’ అన్నారంటే ఎవరో ఇట్లాంటి ఋషినే కదా అట్లాంటి మాట అనిఉంటాడు!

20-6-2015

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading