అనుకృతి

Reading Time: < 1 minute

c15

After Van Gogh’ s ‘ Noon: Rest’ (1890). వాన్ గో చిత్రించిన ఒక కళాకృతికి అత్యంత బలహీనమైన నా అనుకృతి. యూరోప్ లో అయినా, ప్రాచీన చైనా లో అయినా, చిత్రకారులు కావాలనుకునేవాళ్ళకి పూర్వ చిత్రకారుల కృతుల్ని అనుకరించడమే మొదటి సాధనా, ముఖ్యసాధనా కూడా. ఆ చిత్రకారులు తమదైన సొంత గొంతు వెతుక్కున్నాక కూడా పూర్వచిత్రకారుల మీద గౌరవంతోటో, వాళ్ళ కొన్ని చిత్రాల పట్ల పట్టలేని మోహంతోనో వాటిని తాము మళ్ళా చిత్రిస్తూండటం పరిపాటి. ఫ్రెంచి చిత్రకారుల్లో బార్బిజాన్ స్కూలు కి చెందిన జీన ఫ్రాంకోయీ మియే (1814-1875) చిత్రించిన కొన్ని చిత్రాల్ని విన్సెంట్ వాన్ గో (1853-1890) అట్లా చిత్రించేడు. వాటిల్లో Two Harvesters at Rest (1886) ఒకటి. దీన్ని మళ్ళా వాన్ గో Noon:Rest (1890) అనే పేరిట చిత్రించేడు. కాని దీన్ని కేవలం అనుకృతి అని చెప్పలేం. మియే వాస్తవికాతావాదానికి చెందిన చిత్రకారుడు. వాస్తవికతావాదం (రియలిజం) దైనందిన ప్రపంచానికి పెద్దపీట వేసిన కళా ఉద్యమం. అందులో కూడా ఆ కళాకారులకి దృష్టి ఎంతసేపూ సాధారణ జీవితాలని చిత్రించడం పట్లనే. ఎక్స్ ప్రెషనిజం అట్లా కాక చిత్రకారుడి ఆంతరంగిక ఉద్వేగాన్ని వ్యక్తం చెయ్యడానికి తలెత్తిన ఉద్యమం. వాన్ గో ఆ తరహా చిత్రకారుడు. కాబట్టి, పంటకోతల మధ్య మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు శ్రామికుల్ని మియే రియలిస్టు ధోరణిలో చిత్రిస్తే, వాన్ గో దాన్ని ఎక్స్ ప్రెషనిస్టు ధోరణిలోకి అనువాదం చేసాడనాలి. ఇందులో మరొక రహస్యం కూడా ఉంది. మియే వాస్తవికతను సెక్యులర్ తరహాలో చూపిస్తున్నట్టు పైకి కనిపించినా అతడి చిత్రాలు చాలావరకు బైబిలు నుంచి తీసుకున్న ఇతివృత్తాలే. మధ్యాహ్నం పూట సేదతీరుతున్న ఈ ఇద్దరు స్త్రీపురుషులూ పాతనిబంధనలోని రూతు కథలో రూతూ, బోవాస్ లు కూడా!

25-9-2016

Leave a Reply

%d bloggers like this: