అక్షరప్రేమికుడు

nv

మొన్న పొద్దున్నే సోమయ్యగారు ఫోన్ చేసి ఎన్.వి.రమణయ్యగారు పరమపదించారు అని చెప్పగానే నా మనసంతా వికలమైపోయింది. నిరాడంబరుడు, సాత్త్వికుడు, సజ్జనుడు అయిన ఒక మనిషి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడం ఒక లోటయితే, అటువంటి అక్షరప్రేమికుడు, జీవితాన్ని అంతగా వాజ్మయసేవకు అంకితం చేసినవాడు మరొకర్ని ఇప్పట్లో నేను మళ్ళా చూడగలననుకోను.

సోమయ్యగారి ద్వారా నా ‘సహృదయునికి ప్రేమలేఖ’ పుస్తకం ఏ ముహూర్తాన రమణయ్యగారు అందుకున్నారోగాని, ఆ రోజునుంచీ ఆయన అపారమైన వాత్య్సల్యధార నా పైన వర్షిస్తూనే ఉంది. ఆ పుస్తకం చూడగానే ఆయన నన్ను కావలి ఆహ్వానించేరు. 2001 లో వి.ఆర్ కళాశాలలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి స్మారక ప్రసంగం నాతో చేయించారు. ఆ రోజు వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఆ ఆ రోజునుంచీ దాదాపుగా పదిహేడేళ్ళ పాటు మా మధ్య అనుబంధం నానాటికీ బలపడుతూనే వచ్చింది.

2005 లో ఆయన వెలువరించిన ‘అక్షర’ వంటి సంచిక తెలుగువాజ్మయానికి ఇంతవరకూ ఎవరూ అందించలేనికానుక. కావలి జవహర్ భారతి వ్యవస్థాపకులు దొడ్ల రామచంద్రారెడ్డిగారి సంస్మరణసంచికగా వెలువరించిన ఆ సంచిక సాహిత్యం, కళలు, పరిశోధన, విద్య,తత్త్వశాస్త్రం వంటి రంగాలకు చెందిన అపురూపమైన ఎన్నో మహనీయవ్యాసాల మేలిమి కూర్పు. సుమారు రెండువేల పేజీల ఆ సంపుటిలో ఒక్క అచ్చుతప్పు కూడా మనకు కనిపించదు. వ్యక్తిగతంగా తన దుస్తులు ఎలా ఉన్నాయో పట్టించుకునే శ్రద్ధ లేని ఆ మానవుడు ఆ పుస్తకాన్ని ఎంత సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాడో ఊహించలేం.

ఆ పుస్తకం వెలువరించాలని అనుకున్నప్పణ్ణుంచీ అందులో నా రచన ఒకటైనా ఉండాలని మరీ మరీ అడుగుతూ వచ్చారు. ఎప్పట్లానే నేను సకాలంలో స్పందించక, చాలా ఆలస్యంగా ‘సంగం కవిత్వం’ మీద ఒక వ్యాసం రాసి పంపితే, ఆ వ్యాసం అందేదాకా ఆ పుస్తకాన్ని అట్లానే ఆపిపెట్టారు. నా రచన గురించి అంతగా ఎదురు చూసిన మనిషి నాకు మరెవరూ కనిపించలేదు.

2012 లో ఆయన వెలువరించిన ‘శంకరన్’ (2012) అద్వితీయమైన వ్యాససంపుటి. రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రిగా, గవర్నర్లుగా, దేశనాయకులుగా ప్రసిద్ధి చెందిన తెలుగువాళ్ళెందరో ఉన్నారు. కాని వారెవరూ కూడా ఆ భాగ్యానికి నోచుకోలేదు. ఎస్.ఆర్.శంకరన్ వంటి నిస్వార్థ ప్రజాసేవకుడి గురించి మరొక నిస్వార్థ సాహిత్యసేవకుడు మటుకే వెలువరించగల అపురూపమైన, అపూర్వమైన సంపుటమది. అటువంటి పుస్తకం ఒకటి తెస్తున్నానని ఆయన చెప్పినప్పుడు శంకరన్ గారి గురించి నాకు తెలిసిన విషయాలు ముచ్చటిస్తే, వాటినొక వ్యాసంగా రాసే దాకా ఆయన నా వెంట పడుతూనే ఉన్నాడు. ‘ఎస్.ఆర్.శంకరన్: ఒక జ్ఞాపకం’ అనే ఆ వ్యాసాన్ని ఆయనకు పంపిన రోజు ఆయన ఎంత ఆనందపరవశుడయ్యాడని!

అట్లానే సామల సదాశివ స్మృతి సంచిక ‘పరిశోధన’ (2014) కూడా. ‘దేశికోత్తముడు’ అని సదాశివగారి మీద రాసిన నా వ్యాసాన్ని కూడా ఆయన అందులో చేర్చకుండా ఉండలేకపోయారు.

ఎంపికలో, రూపకల్పనలో, ముద్రణలో అత్యున్నత ప్రమాణాల్తో వెలువడ్డ ఈ పుస్తకపరంపరలో భాగంగా, ఆయన పద్మభూషణ్ పి.ఆర్.రావు మీదా, బాలమురళి మీద కూడా రెండు సంపుటాలు వెలువరించారు.

అసలు తెలుగులో అందరు పరిశోధకులున్నారని, సాహిత్య విద్వన్మూర్తులున్నారని, వాళ్ళట్లాంటి మహనీయమైన వ్యాసాలు రాసారని ఆయనకు మటుకే తెలుసనుకుంటాను. ఆయన ఒక సజీవ వ్యాససూచి.

‘భారతి’ లాంటి పత్రికలు రావడంలేదనీ, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలు వంటి సంపుటాలు ఇప్పుడు రావడంలేదనీ వాపోయేవాళ్ళను నేను చాలామందినే చూసాను. కాని, వాళ్ళు ఈ పుస్తకాల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ పుస్తకాల గురించిన ప్రసక్తి ఎక్కడేనా ఉందా అని గూగుల్ మొత్తం వెతికి చూసాను. రమణయ్యగారి ఫొటోగాని, ఈ పుస్తకాల కవర్ పేజీలు గాని నాకు నెట్ లో ఎక్కడా కనబడలేదు. తెలుగు సాహిత్యానికి అపారమైన సేవచేస్తున్నామని చెప్పుకునే కొన్ని ఎన్నారై సంస్థల వెబ్ సైట్లు కూడా గాలించాను. ఎన్.వి. రమణయ్య అనే పేరు లేకుండానే తమ వేలాది వెబ్ పేజీలు కొనసాగుతుండటం ఎంత సిగ్గుపడవలసిన విషయమో వాళ్ళిప్పటికేనా గ్రహించాలి. తామిస్తున్న పురస్కారాల్ని చూసుకుని వాళ్ళకెంత గర్వం! కాని రమణయ్యగారిని గుర్తించని ఆ పురస్కారాలు నా దృష్టిలో తమ విలువ నెప్పుడో పోగొట్టుకున్నాయి. తెలుగు వాజ్మయానికీ, సాహిత్యానికీ విశేష సేవలందించినవారికి ప్రతి ఏడాదీ తెలుగు విశ్వవిద్యాలయం ఎన్నో పురస్కారాలు అందిస్తూంటుంది. కాని రమణయ్యగారివంటి అద్వితీయ భాషాసాహిత్య సేవకుడికి ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వలేకపోయినందుకు తెలుగువిశ్వవిద్యాలయం ఇప్పుడు నా కళ్ళకి చాలా బీదగా కనిపిస్తోంది.

ఒకప్పుడు శ్రీ శ్రీ కొంపెల్ల జనార్దనరావుని తలచుకుంటూ ఇట్లా రాసుకున్నాడు:

‘..జనార్దన రావు చిరిగిపోయిన మురికి ఖద్దరు దుస్తులు ధరించేవాడు. కాని తన పత్రికను మాత్రం ఫెదర్ వెయిట్ కాగితం మీదనే అచ్చువేయించేవాడు. అతడే మరికొన్నేళ్ళు బతికి ఉంటే, తెలుగు సాహిత్యానికి పదిహేనంతస్తుల భవనం నిర్మించేవాడేమో.’

‘..ఉదయిని ప్రారంభంతోనే జనార్దన రావుకు బాధ్యతలూ, భారాలూ హెచ్చిపోయాయి. సాహాయ్యం దొరకలేదనడం కంటే అది చాలనే లేదనడం యథార్థం. ఉన్నత వాజ్మయానికి పోషణ ఎప్పుడూ పరిమితంగానే ఉండటం చూస్తున్నాము. ఆంధ్రదేశంలో అది కనిష్టంగా కనిపించుతుంది. ఇంతట్లో తెలుగువారు ఈ ‘సిగ్గు’ తొలగించుకోలేరేమో అని తోస్తోంది.’

రమణయ్యగారు మనల్ని వదిలివెళ్ళిపోయిన ఈ వేళ ఈ మాటలు నా చెవిలో గీపెట్టకుండా ఎట్లా ఉంటాయి!

19-1-2018

Leave a Reply

%d bloggers like this: