స్పష్టంగా చెప్పగలిగేనా?

323

ఒక మిత్రుడు నాకొక మెసేజి పెట్టాడు: ‘మీ విశ్లేషణలు చాలా బావుంటాయి, చదువుతుంటే ఒక తన్మయత్వం లాంటిది కలుగుతూంటుంది. కాని వాటి తక్షణ, దీర్ఘకాల ప్రయోజనాలేమిటో అర్థం కావడం లేదు. వాటిని రాయడం వెనక మీ దృక్పథమేమిటో తెలిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది’ అని.

అతడికి వెంటనే నాలుగు మాటలు జవాబురాస్తే సరిపోదనిపించింది. స్పష్టంగా చెప్పకపోయినా చాలామందికి నా పట్ల ఇటువంటి ప్రశ్న ఉందని నాకు తెలుస్తూ ఉంది. కొన్నేళ్ళ కిందట, ఒక ప్రచురణ కర్త, వామపక్షవాది ఇట్లాంటి ప్రశ్ననే అడిగాడు.’ఈ మధ్య రచయితలం చాలామందిమి కలుసుకున్నాం. ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకున్నాం. వాళ్ళంతా నాకు చాలా బాగా అర్థమయ్యారు. కాని మీరే నాకిప్పటికీ అర్థం కావడం లేదు, ఎందుకని’ అని.

ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, నేను చేసే విశ్లేషణలు, రాసే కవితలు, కథలు నా కోసం నేను చేసుకుంటున్నవి. లోపల్లోపల మథనపడి, సమాధానం ఒకటి వెతికిపట్టుకుని, ఆ తెలుసుకున్న విషయాన్ని మాత్రమే తక్కిన ప్రపంచంతో పంచుకునేవాళ్ళుంటారు, గురజాడలాగా. వాళ్ళ అంతస్సంగ్రామం ఏమిటో మనకి తెలియదు. కాని తమ సంఘర్షణ తాము పడి వాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక బుద్ధవాక్యంలాగా తేటగా, స్పష్టంగా, దిక్సూచిగా ఉంటుంది. కాని నాలాంటివాళ్ళు వేరు. నా నలుగులాట నేను నలుగురినుంచీ దాచుకోవాలనుకోలేను, చలంలాగా, బైరాగిలాగా, నేను రాసుకునేదంతా ఒక interior monologue. కాబట్టి, అందులో చాలా సంకీర్ణతా, సంక్లిష్టతా తప్పని సరి.

ఇక రెండవకారణం మరింత ముఖ్యమైంది. అదేమంటే, ఏదైనా విషయం గురించి ఆలోచించడంలో, నలుగురితో చర్చించడంలో మూడు దశలుంటాయనిపిస్తుంది.

మొదటి దశలో, ఆ చర్చకొక తక్షణత (immediacy) ఉంటుంది. అక్కడ స్పష్టమైన దృక్పథం ఏర్పడటం కన్నా ముందు, ఆ విషయం పట్ల సద్యఃస్పందన ప్రకటించడమే ముఖ్యంగా ఉంటుంది. ఉదాహరణకి పెద్ద నోట్ల రద్దునే తీసుకుందాం. ఈ విషయమ్మీద, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో, సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ చాలావరకు ఈ స్థాయిలోనే నడుస్తున్నది. తక్కిన పౌరుల్లానే నేను కూడా పెద్దనోట్ల రద్దువల్ల చిల్లరకరెన్సీ చేతికందక ఇబ్బందులు పడుతున్నవాణ్ణే. కరెన్సీ రేషన్ కోసం ప్రజలు పగలూ రాత్రీ క్యూలు కట్టడం చూస్తున్నవాణ్ణే. కాని, ఈ విషయం మీద ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పరచుకోకుండా ఏదో ఒకటి మాట్లాడటం నాకు సాధ్యం కాదు. అయితే దీనిగురించి మాట్లాడుతున్నవాళ్ళందరికీ స్పష్టమైన దృక్పథం లేదని కాదు. నిజానికి ఈ అంశం మీద తక్షణ స్పందనలు ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా, ఈ విషయం మీద నా దృక్పథం crystallize కావడానికి తోడ్పడుతున్నవాళ్ళే.

ఇటువంటి అంశాల్లో తక్షణ పరిశీలనల్ని దాటి, దీనిలో ఉన్న సామాజిక-రాజకీయ అంశాల్ని గుర్తించి వివేచించడం చర్చలో రెండవ దశ. పెద్దనోట్ల రద్దు-దాని వెనక ఉన్న ఆర్థిక వివేకం లేదా అవివేకం, దాని వల్ల సంభవించగల క్రమశిక్షణ లేదా కల్లోలం మొదలైన విషయాలతో మొదలుపెట్టి, గ్లోబలైజేషన్ కాలంలో ఆధునిక జాతీయ రాజ్యం బలహీనపడటం, కాని modern nation state మళ్ళా బలాన్ని సంతరించుకోవాలని జాతీయవాదులూ, వామపక్షవాదులూ కూడా ఒక్కలానే కోరుకోవడం, ఆర్థికవ్యవస్థ మీద రాజ్యానికి నియంత్రణ ఉందని చెప్పడానికి ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం చేసిందనో, లేదా, అర్థికవ్యవస్థ మీద రాజ్యం నియంత్రణ కోల్పోయిందని ఈ చర్యతో పూర్తిగా అర్థమయిందనో-ఇట్లా మరింత లోతుగానూ, మరింత ఉపపత్తులతోనూ చేసే చర్చలో తక్షణ-దీర్ఘకాల ప్రయోజనాలు రెండూ స్పష్టంగా ఉంటాయి.

కాని, నా ఆసక్తి ఇక్కడ లేదు. అది ఇంతకన్నా కూడా మరింత సూక్ష్మ స్థాయిలో సంచరిస్తూ ఉంటుంది. ఏ విషయం మీదనైనా చర్చ మూడవ దశకి చేరుకున్నప్పుడు, అది ఆర్థిక-రాజకీయ-సామాజిక పార్శ్వాల్ని దాటి ఒక తాత్త్విక కోణాన్ని సంతరించుకుంటుంది. ఒక విషయం తాలూకు manifestations నుంచి దాని మూలాల్లోకి ప్రయాణించడం తాత్త్వికవివేచనగా మారుతుంది.

ఉదాహరణకి, ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త జాతీయతాధోరణిని సంతరించుకుంటున్న రాజకీయవాతావరణం ఏర్పడుతున్నది. ఇది కొత్త పరిణామంగా కనిపించవచ్చుగాని, ఆదినుంచీ భారతదేశ చరిత్రని నిశితంగా పరిశీలించినవాళ్ళకి, ఈ పరిణామంలో చరిత్ర పునరావృత్తి కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో ఒకసారి కేంద్రంనుంచి అంచులదాకా (centrifugal), మరొకసారి అంచులనుంచి కేంద్రందాకా (centripetal)రాజకీయ-సాంస్కృతిక నిర్మాణాలు సంభవిస్తూ కనిపిస్తాయి. ఒకసారి బలమైన కేంద్రం కోసం, మనమంతా ఒకే జాతి అనే ధోరణి ప్రబలమవుతుంది. అది మతపరంగా ఏకేశ్వరోపాసనగా, రాజకీయంగా totalitarian గా వ్యక్తమవుతుంది. దాన్ని unity గా ప్రతిపాదించడం జరుగుతుంది. మరొకసారి బలమైన ప్రాంతాలూ, అంచులూ ముఖ్యమై మనమంతా వివిధ సంస్కృతులూ, వివిధ భాషలూ, వివిధ ఆరాధనా సమూహాలూ అనే జాగృతి బలంగా వ్యక్తమవుతుంది. దాన్ని diversity అంటుంటారు.

ఉదాహరణకి పద్ధెనిమిదో శతాబ్దం చివరి రోజులనుంచి ఇరవయ్యవశతాబ్దంలో స్వాతంత్ర్యం వచ్చేదాకా మనమంతా ఒక జాతి, మనదొకటే దేశం అనే జాతీయతావాదం బలంగా ఏర్పడింది. 1950 తర్వాత, మళ్ళా వివిధ ప్రాంతాలూ, వివిధ కులాలూ, వివిధ భాషలూ ఇంతదాకా అప్రధానీకరణకు లోనయ్యాయనీ, ఇంతదాకా జాతీయరాజ్యం పేరుమీద కొన్ని ప్రాంతాలూ, కొన్ని కులాలు, కొన్ని మతాలూ మాత్రమే లభ్ధి పొందాయనే ఆందోళన మొదలయ్యింది.

ఇవన్నీ మనకు తెలిసినవే. కాని నేను చూసేదేమిటంటే,భారతదేశ చరిత్రలో ఈ alternation ఎందుకు సంభవిస్తూ ఉంది, దీనికీ ప్రపంచ పరిణామాలకీ ఏమైనా సంబంధం వుందా అని. చాలా కాలంగా చేస్తూ వచ్చిన అధ్యయనం మీద నేను చేసుకుంటున్న ఊహాగానం (hypothesis) ఏమిటంటే, భారతదేశానికీ, అంతర్జాతీయ విపణికీ మధ్య సంబంధాలు బలంగా ఉన్నప్పుడు, ప్రపంచవిపణిలో భారతదేశం ముఖ్యపాత్ర పోషించగలదనుకున్నప్పుడు బలమైన కేంద్రం గురించి ఆరాటం నడుస్తుందనీ, ప్రపంచ విపణితో సంబంధాలు బలహీనపడ్డప్పుడు అంచులు (periphery) బలపడుతున్నాయనీ. ఒకప్పుడు అంచులే కేంద్రంగా మారవచ్చు కూడా. ఉదాహరణకి డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇంగ్లీషు వలసలు భారతదేశంలో అంచులతోనే మొదలైనట్టు.

ఈ క్రమంలో భారతదేశంలో నా కళ్ళముందు సంభవిస్తున్న పరిణామాల్ని చరిత్ర, తత్త్వశాస్త్రం, సాహిత్యం ఆసరాగా మరింత లోతుగా అధ్యయనం చేయాలనేది నా కోరిక.

ఉదాహరణకి నేను ఈ ఏడాది పొడుగునా కబీర్ గురించి మాట్లాడుతూ (మాట్లాడుకుంటూ) ఉన్నాను. పైకి చూడటానికి, ఆ విశ్లేషణకి ఎటువంటి తక్షణ, దీర్ఘకాల ప్రయోజనాలు లేవనిపించవచ్చు. కాని, నేడు భారతదేశమంతా రెండు శిబిరాలుగా చీలి పోయి ఉంది, హిందుత్వవాదమూ, హిందుత్వవాదాన్ని వ్యతిరేకించేవాదాలూ అని. కాని రెండు దృక్పథాల్లోనూ కూడా లోతులేదనీ, వాళ్ళకి సంబంధించని విశాలభారతదేశమొకటి ఉందనీ, దాని గురించి రెండు వర్గాలవాళ్ళకీ తెలిసింది చాలా స్వల్పమనేననీ నా అభిప్రాయం. కాని భారతదేశానికి తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఇట్లా మాట్లాడేవాళ్ళు ఇప్పుడే కొత్తగా రాలేదు. కబీరు కాలంలో కూడా ఈ సమస్య ఇంత బలంగానూ ఉంది. ఆయన ఆ రెండువర్గాల సంకుచితత్త్వాన్నీ ఎట్లా పసిగట్టాడో, ఎత్తి చూపాడో తెలుసుకోవడంలో ఒక మెలకువ ఉంది. అది ఇప్పటి నా చుట్టూ ఉన్న భారతీయ సమాజంలో నా పాత్ర ఏమిటో నాకై నేను స్పష్టం చేసుకోవడానికి నాకు చాలా ఉపకరిస్తుందనిపిస్తుంది.

నా సమకాలిక భారతదేశం గురించి కబీరువల్ల నాకు కలుగుతున్న స్పష్టత, జె.ఎన్.యు ప్రొఫెసర్లవల్లగానీ, ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ రచయితలవల్లగానీ, పత్రికాసంపాదకులవల్లగానీ, వివిధ పార్టీల అధికారప్రతినిధులవల్లగానీ కలగడం లేదు.

కాబట్టి నేను చదువుతున్న, చర్చిస్తున్న కబీరు పదిహేనో శతాబ్దానికి చెందిన ఒక నిర్గుణభక్తి కవి కాడు, నా ఆధ్యాత్మిక విశ్వాసాలకూ, నా సామాజిక బాధ్యతలకూ మధ్య నా సమకాలిక భారతదేశం రేకెత్తిస్తున్న సంఘర్షణలో నాకు దారి చూపించే నా సమకాలికుడు.

మిత్రుడా, మీకు స్పష్టంగా చెప్పగలిగేనా?

22-12-2016

arrow

Painting: M.F. Husain, Three Dynasties, 2008-2011

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading